వారి ఆర్భాటమంతా సామాజిక మాధ్యమాల్లోనే
ఏడాదిలో సంక్షేమ కార్యక్రమాలకు రూ.61,194 కోట్లు ఖర్చు చేశాం
ఉద్యోగుల జీతాలు, పెన్షన్ కోసం మరో రూ.60 వేల కోట్లు వెచ్చించాం
మా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజల విజయాలుగానే భావిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష పార్టీలు కనికట్టు ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. వారి ఆర్భాటమంతా సామాజిక మాధ్యమాల్లోనే కనిపిస్తుందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేశారని, వారు చేసిన అప్పులకు ఇప్పుడున్న ప్రభుత్వం వడ్డీలు కట్టాల్సివస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం కావొస్తున్న నేపథ్యంలో ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖల పురోగతిపై శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.64,516 కోట్లు వడ్డీ, రీపేమెంట్ల కింద చెల్లింపులు చేశామన్నారు. రాష్ట్రంలోని 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఏడాది కాలంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ కోసం రూ.60 వేల కోట్లు వెచ్చించామన్నారు. ఇప్పటి వరకు వివిధ పథకాల కింద రూ.61,194 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ నిరుద్యోగులను నట్టేట ముంచిందని, కానీ ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలో దాదాపు 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది...
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగు తోందని భట్టి విక్రమార్క చెప్పారు. రానున్న పదే ళ్లలో ప్రస్తుతం కంటే రెట్టింపు డిమాండ్ ఉంటుంద ని, ఫ్యూచర్‌సిటీ, రీజినల్ రింగురోడ్డు చుట్టూ పరిశ్ర మలు, పారిశ్రామిక పార్కులతో డిమాండ్ పెరుగు తుందని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు తీసుకురాకుండా గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఆ తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రానికి దశాదిశా నిర్దేశించే విధంగా 2047 నాటికి కావాల్సిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రణాళికా విభాగం తయారు చేస్తోందన్నారు.
ప్రజాపాలన ద్వారా వారం రోజులుగా గ్రామసభలు పెట్టి తీసుకున్న 1.28 కోట్ల దరఖాస్తులను డిజిటలైజ్ చేశామని, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి, రాయితీ సిలిండర్ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రజాపాలన డిజిటలైజేషన్ నుంచి సమాచారం తీసుకున్నామని చెప్పారు. ప్రణాళిక శాఖ ద్వారా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా 1.11 కోట్ల ఇళ్లను సర్వే చేశామని, ఈ సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment