సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వరుస ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ లో మహానాడు ఉత్సాహాన్ని నింపుతుందా? ఓటమితో కుంగిపోయిన కేడర్‌లో నైరాశ్యం తొలుగుతుందా? రెండు రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించే మహానాడుకు జిల్లా నుంచి నియోజకవర్గానికి 60 మంది చొప్పున 540 మందికి ఆహ్వానం అందింది. మిగిలిన నేతలు, కార్యకర్తల సంగతేంటి? గతం లో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కోటలకు బీటలు బారిన వైనంపై ఏం చర్చిం చనున్నారు? ఓటమితో నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన కార్యకర్తల్లో మహానాడు స్ఫూర్తి నింపుతుందా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోం ది.
జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2014 సంవత్సరం జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సహా.. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నామ రూపాల్లేకుండా పోయింది. దయనీయ స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో 27, 28 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే మహానాడుకు జిల్లా నేతలకు ఆహ్వానం రావడం చర్చనీయాంశంగా మారింది.
మున్సిపల్, జడ్‌పీటీసీ ఎన్నికలలో
మున్సిపల్ ఎన్నికలలో ఇందూరు ఓటర్ల విలక్షణ తీర్పుకు టీడీపీ చిత్తయ్యింది. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది. గత ఎన్నికలలో నగరంలో ఏడు డివిజన్లను కైవసం చేసుకున్న టీడీపీ ఈ సారి బోణి కొట్టలేని స్థితికి దిగజారి పురపోరులో పూర్తిగా ఉనికి కోల్పోయింది. జిల్లాలో పార్టీ కనిపించకుండా పోయింది. పార్టీ బ్యానర్‌పై పోటీ చేసిన పలువురు ఓటమిని చవిచూడగా.. వ్యక్తిగతంగా ప్రజల్లో పేరున్న నేతలు కౌన్సిలర్లుగా గెలుపొందారు. జిల్లాలో మొత్తం డివిజన్లు, వార్డులు కులుపుకుని 141 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో 35 చోట్ల గెలుపొందింది.
ఈ సారి కేవలం రెండు చోట్లే కౌన్సిలర్లుగా విజయం సాధించారు. అర్మూరు, బోధన్‌లో ఒక్కొక్కరు కౌన్సిలర్లుగా నెగ్గారు. ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన అభ్యర్థులు ఓటమిని ఇప్పటికీ జీర్ణించు కోలేక పోతున్నారు. జిల్లాలో మొత్తం 583 ఎంపీటీసీ స్థానాలలో కేవలం 31కే పరిమితమై బీజేపీ కంటే వెనుకబడింది. జడ్‌పీటీసీ ఎన్నికల్లో 36 మండలాలలో ఒక్క అభ్యర్థిని కూడా గెలుపించుకోలేకపోయింది. ఓటమిపై ఇటీవలే జిల్లా కేంద్రంలో టీడీపీ సమీక్ష జరిపినా.. కార్యకర్తలు ఇంకా నైరాశ్యం నుంచి బయట పడలేదు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో
దివంగత ఎన్‌టీ రామారావు పార్టీని స్థాపించిన సమయంలో అందలమెక్కించిన జిల్లా ప్రజలు, ఆ తర్వాత కూడ టీడీపీకి జిల్లాలో బ్రహ్మరథం పట్టారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే ఇప్పుడా పార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. 1985 నాటి తొలి ఎన్నికలలో 9 స్థానాలకు ఏడుచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలవగా.. 2014 ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీ ఒక్క స్థానాన్ని కూడ గెలుచుకోలేక పోయింది. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 9 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ కూటమి చిత్తయి పోయింది. 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్లపై ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే, 2014 ఎన్నికల నాటికి ఇద్దరే మిగిలారు.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోగా ఐదు స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ, నాలుగు చోట్ల కూటమిలో భాగంగా బరిలో నిలిచిన బీజేపీలు ఓటమి చెందాయి. మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు కామారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండేలు టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఈసారి టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందగా, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను ముందే ఊహించిన మండవ వెంకటేశ్వర్‌రావు, ఏలేటి అన్నపూర్ణమ్మలు పోటీ నుంచి తప్పుకున్నారు. జిల్లాలో రెండు లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందగా.. కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కస్థానం దక్కలేదు. మొత్తంగా మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మట్టికరిచిన నేపథ్యంలో మహానాడు ఏ మేరకు ఓదార్పునిస్తుందన్న చర్చ జరుగుతోంది.
నైరాశ్యంలో ‘దేశం’
Published Mon, May 26 2014 2:33 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement