అలజడి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్,ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదు. ఓ వైపు ఢిల్లీ పరిణామాలు, మరోవైపు పొత్తుల రాయబారా లు ఊపందుకోవడంతో నిన్న మొన్నటి వరకు టికెట్ ఖాయమని భావించిన అన్ని పార్టీల ఆశావహులు ఇప్పుడు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు.
రోజుకో మలుపు తిరుగుతున్న కాంగి‘రేసు’
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల విషయంలో టీపీసీసీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దిగ్విజయ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూరు, కామారెడ్డిపై చిక్కు వీడింది. అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌పై నెలకొన్న ప్రతిష్టంభన పార్టీ నేతలలో అలజడి రేపుతోంది. గతంలో డిచ్‌పల్లి (ప్రస్తుతం నిజామాబాద్ రూరల్) నుంచి గెలుపొందిన ఆకుల లలిత ఢిల్లీలో మకాం వేసి రూరల్, అర్బన్‌లో ఏదో ఒకటి కావాలని పట్టుబడుతున్నట్లు తెలి సింది.
ఆమెది బాన్సువాడ అన్న తప్పుడు సమాచారంపై బుధవారం హైకమాండ్ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌ను ఆరా తీసినట్లు తెలిసింది. అర్బన్ నుంచి మైనార్టీ నేత తాహెర్ బిన్ హందాన్ కూడా గట్టి ప్రయత్నంలో ఉన్నారు. జహీరాబాద్‌కు మార్గం సుగమం చేసుకునే ప్రయత్నంలో ఎంపీ షెట్కార్ ఉన్నారు. బుధవారం ఆయన ఓ మాజీ ఎమ్మెల్యేను బాన్సువాడ నుంచి రంగంలోకి దింపేందుకు దిగ్విజయ్‌సింగ్‌ను కలిపించినట్లు సమాచారం. జుక్కల్, ఎల్లారెడ్డిపైనా సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో,అభ్యర్థులను ప్రకటించే వరకు ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు పార్టీ నేతలు.
‘గులాబీ’ నేతలకు పరీక్ష
2014 సార్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలు, నేతలకు కీలకం కావడంతో టికెట్లు సంపాదించడమే ఆశావహులకు అసలు పరీక్షగా మారిం ది. ఈ క్రమంలో ఇప్పటికే టీఆర్ ఎస్ పార్టీకి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలుపోను, బాల్కొండ, ఆర్మూరుకు సైతం అభ్యర్థులను ప్రకటించారు. మరో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
కానీ, ఇప్పుడు సిట్టింగ్‌లతోపాటు అందరూ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌తో జతకట్టిన సీపీఐ నేత నారాయణ తాజా గా టీఆర్‌ఎస్‌తో పొత్తుల ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం ఆశావహులను మళ్లీ ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో వారికి కేసీఆర్ చుట్టూ చక్కర్లు తప్ప డం లేదు.
కమలం-సైకిల్ కలవరం
బీజేపీ, టీడీపీ మధ్యన ఇంకా కొలిక్కిరాని పొత్తుల వ్యవహారం రెండు పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో పార్టీ పక్షాన టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో, ప్రతి సెగ్మెంట్‌లో పోటీ చేసేందుకు సిద్దమైన రెండు పార్టీల నేతల్లో కొలిక్కిరాని పొత్తులు కలకలం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు అగ్రనేతల చుట్టూ చక్కర్లు కొడుతుండటం, పోటాపోటీ ప్రయత్నాలు చే స్తుండటం చర్చనీయాంశం అవుతోంది. పొత్తులు నిజమైతే ఎవరి సీటు గల్లంతవుతుందో, టికెట్ రానివారు ఎక్కడ రెబెల్స్‌గా బరిలో దిగుతారోనన్న భయం కూడ ఇరు పార్టీల్లో ఉంది.
వైఎస్‌ఆర్ సీపీ, వామపక్షాలు రెడీ
సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. జిల్లాలో నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతోపాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులు బరిలో దిగనున్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమ లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ సీపీ నేతలు త్వరలోనే నామినేషన్లు వేయనున్నారు.
సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, మహమూద్ మొహియొద్దీన్ నిజామాబాద్, జహీరాబాద్ లో క్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు అంతి రెడ్డి శ్రీధర్‌రెడ్డి, బొడ్డు గంగారెడ్డి (సిర్పూరు), ఎంఏ ఖాన్, చిల్కూరి కృష్ణారెడ్డి, పటోళ్ల సిద్దార్థరెడ్డి సమన్వయకర్తలుగా ఉండగా, జిల్లా ఎన్నికల పరిశీలకులు నాయుడు ప్రకాశ్ జుక్కల్ సమన్వయకర్తగా ఉన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్లు వేసేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ తదితర పార్టీలు సైతం నామినేషన్లకు సిద్దమవుతున్నాయి. సీపీఎం ఇప్పటికే నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ అభ్యర్థులను ఖరారు చేయగా వారు కూడ నామినేషన్లు వేయనున్నారు.