సాధారణ నేరాలు తగ్గినా.. | Despite the general crime .. | Sakshi
Sakshi News home page

సాధారణ నేరాలు తగ్గినా..

Published Tue, Dec 30 2014 12:46 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

సాధారణ నేరాలు తగ్గినా.. - Sakshi

సాధారణ నేరాలు తగ్గినా..

  • ఆర్థిక, సైబర్ నేరాలు పెరిగాయి
  • మహిళలు, ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాలు కూడా పెరిగాయి
  • వార్షిక నివేదికలో డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ ఏడాది సవ్యంగా ఉన్నాయని, నేరాలు తగ్గుముఖం పట్టాయని, అయితే ఆర్థిక, సైబర్ నేరాలు పెరిగాయని  డీజీపీ అనురాగ్‌శర్మ  వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, కొత్త ప్రణాళికల  అమలుపై ఆయన సోమవారం  విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను విలేకరులకు అందజేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని  ఉపయోగించుకొని రాష్ట్ర పోలీసుల ప్రతిష్టను అంతర్జాతీయస్థాయికి పెంచుతామన్నారు.

    సార్వత్రిక ఎన్నికల బందోబస్తు విజయవంతంగా నిర్వహించామని, ఒక్క రీపోలింగ్ ఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు.  ఈ ఏడాది నవంబర్‌నాటికి రాష్ట్రంలో 93,392 నేరాలు నమోదు కాగా, గత ఏడాది 93,780 నమోదయ్యాయన్నారు. ఆర్థికనేరాలు గత ఏడాది కంటే ఈ సంవత్సరం 6.47 శాతం పెరిగాయని, సైబర్ నేరాలు కూడా గత ఏడాది కంటే  వంద శాతం  పెరిగాయన్నారు. గత ఏడాది రూ.139.19  కోట్ల రూపాయల ఆస్తి చోరుల పాలు కాగా, ఈ ఏడాది రూ.141.17 కోట్ల రూపాయల ఆస్తి చోరుల పాలైందన్నారు.

    అత్యాచారాలు 14.34 శాతం పెరిగాయన్నారు. ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాల నిరోధకచట్టం కింద  కేసులు ఈ ఏడాది 57.86 శాతం పెరిగాయన్నారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టామన్నారు. ఈ ఏడాది 370 ట్రాఫికింగ్ కేసులు నమోదు కాగా 528  మంది బాధితులను రక్షించామన్నారు.  మావోయిస్టుల చేతుల్లో ఈ ఏడాది నలుగురు హత్యకు గురయ్యారని, ఒక నక్సలైట్ ఎదురుకాల్పుల్లో మరణించారని అన్నారు. ఏడు ఎన్‌కౌంటర్లు జరుగగా, 68 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 18 మంది అరెస్టయ్యారని  పేర్కొన్నారు.
     
    ఐఎస్‌ఐ కార్యకలాపాలపై డేగ కన్ను..

    రాష్ట్రంలో ఐఎస్‌ఐ దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై  డేగ కన్నేశామని  డీజీపీ వివరిం చారు.  సిమికి చెందిన షాముదస్సిర్, షోయబ్ అహ్మద్‌ఖాన్‌లను అక్టోబర్ 22న సికింద్రాబాద్‌లో  అరెస్టు చేశామన్నారు. అలాగే నలుగురు  సిటీ విద్యార్థులు ఐఎస్‌ఐఎస్ భావజాలానికి లోనై  దేశ సరిహద్దులు దాటుతుండగా వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.
     
    24 అంతస్తుల భవనం...

    రూ.20 కోట్లతో బంజారాహిల్స్‌లో  24 అంతస్తుల అత్యంత ఆధునిక  పోలీసు కమిషనరేట్ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళా భద్రత కమిటీ చేసిన సిఫార్సుల మేరకు వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్‌లను  ఏర్పాటుచేయడం, మహిళల కోసం ప్రత్యేకించి 181 నంబరుతో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామన్నారు. మహిళల ఫిర్యాదుల కోసం అన్ని పోలీసు స్టేషన్లలో డెస్క్‌ను  ఏర్పాటు చేశామని తెలిపారు.

    హైదరాబాద్‌లో షీ టీమ్‌ను ఏర్పాటు చేసి పోకిరీల భరతం పడుతున్నామని  అన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణను చేపట్టడం జరిగిందన్నారు. శిక్షల రేటును పెంచడానికి కోర్టు మానిటరింగ్ సిస్టమ్‌ను చేపడుతున్నామని  తెలిపారు. సోషల్‌మీడియాను ఆధారంగా  చేసుకుని  ప్రజలకు మరింతగా సేవలు అందించాలని, పీపుల్స్ ఫ్రెండ్లీ వ్యవస్థగా పెంచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కొత్త రిక్రూట్‌మెంట్ పాలసీని అమలు చేస్తామన్నారు.  విలేకరుల సమావేశంలో  సీనియర్ అధికారులు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, సత్యనారాయణ్, చారుసిన్హా, శివధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement