సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల్లో వైరి పార్టీలు పోటీ పడడం, ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం సహజం. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పొత్తులు పెట్టుకున్న పార్టీలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నాయి. టీడీపీ–జనసేన పరిస్థితి అలాగే ఉంది. అధికారం కోసం జత కట్టిన ఈ పార్టీ లు సీట్ల పంపకాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపేందుకు తెగ ప్రయతిస్తున్నాయి. జనసేన జిల్లాలో మూడు నియోజకవర్గాలపై కన్నేసింది. టీడీపీకి అది మింగుడు పడడం లేదు.
పొత్తులో భాగంగా జిల్లాలోని ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను జనసేన అడుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో జనసేన వేలు పెట్టింది. ఈ నియోజకవర్గాల్లో తమకు పట్టు ఉందని, పొత్తులో భాగంగా వాటిని తమకు కేటాయించాలని కోరింది. క్షేత్రస్థాయిలో ఎవరికెంత పట్టు ఉందో జనాలకు తెలిసినప్పటికీ టీడీపీకి తమ మద్దతు కావాలంటే వీటిని తమకు ఇవ్వాల్సిందే అన్న ధోరణిలో జనసేన వెళ్తోంది.
మండపేట, అరకు నియోజకవర్గాలకు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గరి నుంచి జనసేన వైఖరి మారింది. పొత్తు లేకపోతే టీడీపీ బలహీనమని, పొత్తులో ఉంటే కనీస సీట్లు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో జనసేన గత కొన్ని రోజులుగా స్వరం పెంచింది. అడిగినవి ఇవ్వకపోతే టీడీపీకే నష్టమన్న ధోరణిలో మొండిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను డిమాండ్ చేస్తోంది.
ఎచ్చెర్ల – పాతపట్నంలలో ఇలా..
ఎచ్చెర్లలో టీడీపీ విభేదాలు అందరికీ తెలిసిందే. ఒకవైపు కళా వెంకటరావు, మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుని సీటు కోసం పైరవీలు చేస్తున్నారు. వీరిలో ఎవరికిచ్చినా మిగతా వారు సహకరించే పరిస్థితి లేదు. అవసరమైతే టిక్కెట్ దక్కని వారు ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి అక్కడుంది. దీన్ని బూచిగా చూపించి జనసేన ఆ సీటును తమకివ్వాలని అడుగుతోంది. నియోజకవర్గంలో తమకు పట్టు ఉందని పట్టుబడుతోంది. పాతపట్నం నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నాయకుడు మామిడి గోవిందరావు నియోజకవర్గంలో నువ్వానేనా..అనే రీతిలో ఉంటున్నారు. వీరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నాయో నియోజక వర్గ ప్రజలందరికీ తెలిసిందే. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. టిక్కెట్ దక్కని నాయకుడు తిరుగుబావుటా ఎగురవేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీన్ని అడ్వాంటేజ్‌గా జనసేన తీసుకుంటోంది. టీడీపీలో ఎవరికిచ్చినా ఓడిపోతారని, ఆ సీటు తమకిస్తే తప్పకుండా గెలుస్తామని జనసేన కోరుతోంది.
పలాసలో ఇలా..
పలాసలో ప్రస్తుత టీడీపీ ప్రధాన ఆశావహులు గౌతు శిరీషపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అటు ప్రజల్లోనే కాదు పార్టీ కేడర్‌లోనూ అసంతృప్తి ఉంది. ఆమె అయితే కష్టమనే అభిప్రాయానికి దాదాపు పార్టీ శ్రేణులు వచ్చేశాయి. ఆమె తీరు వారికి నచ్చడం లేదు. ఆమెకు పోటీగా ఇద్దరు ముగ్గురు నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన ఓ వైద్యుడు టీడీపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారు. ఒక పర్యాయం చర్చలు కూడా జరిగాయి. ఇలా ఎవరికి వారు లోపాయికారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎన్నికల్లో కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దీంతో జనసేన కన్నేసింది. టీడీపీ నాయకులపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆ సీటు తమకివ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది.
ద్విముఖ వ్యూహంలో జనసేన..
టీడీపీ గ్రూపులు, నాయకుల మధ్య విభేదాలను క్యాష్ చేసుకోవాలని జనసేన చూస్తోంది. అందులో భాగంగానే ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను అడుగుతోంది. అలాగని, ఆ సీట్లు వారికిస్తే ఇప్పుడున్న జనసేన నాయకులను పోటీలో దింపుతుందా అంటే డౌటే. పొత్తులో ఒప్పందం కుదిరితే ఆ సీట్లలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్లనో తటస్థులనో రంగంలోకి దించాలని చూస్తోంది. ఆ మేరకు ఇప్పటికే సంప్రదింపులు చేస్తోంది. ఆ మూడు సీట్లు వస్తాయనుకుంటే టీడీపీలో తమకు అనుకూలంగా ఉన్న ఒకరిని తమ పారీ్టలోకి తీసుకుని వారి చేత పోటీ చేయించాలన్నది ఒక ఆప్షనైతే, వైద్యులు, వ్యాపారులు, రిటైర్డు ఉద్యోగులను బరిలోకి దించాలన్నది మరో ఆప్షన్.
పలాసలో పోటీ చేయించడానికి శ్రీకాకుళానికి చెందిన ఓ వైద్యుడితో సంప్రదింపులు చేస్తోంది. పాతపట్నంలో బరిలో దించడానికి మరో వ్యాపారితో మంతనాలు జరుపుతోంది. ఎచ్చెర్లలో కూడా అదే తరహాలో ఇప్పుడున్న నాయకులను కాకుండా కొత్త వారి కోసం అన్వేషణ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న జనసేన నాయకులకు అంత సీన్ లేదన్న అభిప్రాయంతో రెండు ఆప్షన్లు పెట్టుకుని ముందుకెళ్తోంది. జనసేన అనుకున్నట్టు జరిగితే ఎన్నాళ్లగానో టీడీపీ కోసం పనిచేస్తున్న నాయకుల ఆశలపై నీళ్లు జల్లినట్టే.
Comments
Please login to add a commentAdd a comment