Bharat Nyay Yatra: రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ యాత్ర’ | Bharat Nyay Yatra: Rahul Gandhi To Start Bharat Nyay Yatra From Manipur To Maharashtra, See More Details Inside- Sakshi
Sakshi News home page

Bharat Nyay Yatra: రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ యాత్ర’

Published Thu, Dec 28 2023 4:14 AM | Last Updated on Thu, Dec 28 2023 10:28 AM

Bharat Nyay Yatra: Rahul Gandhi to start Bharat Nyay Yatra from Manipur to Maharashtra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మరో సుదీర్ఘయాత్రకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నూతన జవసత్వాలు అందించే దిశగా రెండో విడత యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘భారత్‌ న్యాయ యాత్ర’ పేరిట తూర్పున మణిపూర్‌ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు పాదయాత్ర జరుగనుందని కాంగ్రెస్‌ వర్గాలు బుధవారం వెల్లడించాయి.

వచ్చే ఏడాది జనవరి 14న మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్ర 67 రోజుల పాటు కొనసాగి, మార్చి 20వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే ధ్యేయంగా రాహుల్‌ గాంధీ భారత్‌ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంఫాల్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం షెడ్యూల్‌ ఖరారు చేసింది. రెండో విడత యాత్ర చేపట్టాలని రాహుల్‌ గాం«దీని కోరుతూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఈ నెల 21న ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే.  

చాలావరకు బస్సు యాత్ర.. అవసరమైన చోట పాదయాత్ర
రాహుల్‌ గాంధీ తన తొలి విడత భారత్‌ జోడో యాత్రను 2022 సెపె్టంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. ఈ ఏడాది జనవరి 30న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యాత్ర ముగిసింది. మొదటి యాత్రకు కొంత భిన్నంగా చాలావరకు బస్సు ద్వారా భారత్‌ న్యాయ యాత్ర చేపట్టనున్నప్పటికీ, అవసరమైన చోట పాదయాత్ర సైతం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. మణిపూర్‌లో ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్‌ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్రలో ముగియనుంది. భారత్‌ జోడోయాత్ర 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు జరిగింది. భారత్‌ న్యాయ యాత్ర 67 రోజుల్లోనే 6,200 కిలోమీటర్లు సాగనుంది.

ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలు మాన్పాలన్నదే ఆకాంక్ష   
ఇటీవల నెలల తరబడి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌ నుంచి యాత్రను ప్రారంభిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే కాంగ్రెస్‌ పెద్దల ఉద్దేశమని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలను మాన్పాలన్నదే తమ ఆకాంక్ష అని కాంగ్రెస్‌ అగ్రనేత కె.సి.వేణుగోపాల్‌ వివరించారు.

యాత్ర సందర్భంగా 12 బహిరంగ సభల్లో రాహుల్‌ ప్రసంగిస్తారు. 100కుపైగా స్ట్రీట్‌–కార్నర్‌ సమావేశాలు ఉంటాయి. 13 ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు సైతం నిర్వహిస్తారు. మహిళలు, యువతతోపాటు అణగారిన వర్గాల ప్రజలతో ముఖాముఖి భేటీ అవుతారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న మహారాష్ట్రలోని నాగపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ఈ సభకు హమ్‌ తయ్యార్‌ హూ(మేము సిద్ధంగా ఉన్నాం) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement