ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ సీపీ సమీక్ష
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సీమాంధ్ర జిల్లాల పరిశీలకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు బుధవారం భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులపై త్రిసభ్య కమిటీ బృందం ప్రతిజిల్లాలో పర్యటించనుంది. ఈ కమిటీ జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించనుంది. కాగా వచ్చే నెల మొదటి వారం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు.
సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ సమీక్షలు విడివిడిగా జరుగుతాయి. సమీక్షా సమావేశాల నిర్వహణకు ఒక్కొక్క జిల్లాకు విడివిడిగా అనుభవజ్ఞులైన నేతలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప , 30న కృష్ణా, అనంతపురం, 31న కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 1వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో సమీక్షలు జరుగుతాయి.