న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ కార్యాచరణను వేగవంతం చేశాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తమతమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆచీతూచీ పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాల అన్వేషణపై ఇప్పటికే దృష్టి సారించింది.
160 మంది అభ్యర్థల ప్రకటన
ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే బీజేపీ యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే అభర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. మొదటి విడతలో 160 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే 60 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నామని భావిస్తున్న బీజేపీ.. చాలా కాలంగా ఆ స్థానాలపై ఫోకస్ చేసింది.
చదవండి: ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు
ఈ జాబితాలోనే తెలంగాణ కూడా?
ఇక ఈ మొదటి జాబితాలోనే తెలంగాణాలోని 12 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు డిసెంబర్ లేదా జనవరిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ముందస్తు అభ్యర్ధుల ప్రకటన కసరత్తు ఆసక్తి రేపుతోంది.
బీజేపీ చరిత్రలో తొలిసారి!
అయితే షెడ్యూల్ రాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. కానీ లోక్‌సభకు షెడ్యూల్ కన్నా ముందు అభ్యర్ధులను ప్రకటించండం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. దీని ద్వారా అభ్యర్ధుల విజయవకాశాలు మెరుగవుతాయని కాషాయదళం అంచానా వేస్తోంది.
తెలంగాణలో కమలం కసరత్తు
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్న తరుణంలో టికెట్ల జాబితాపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. కోర్ కమిటీ భేటీ తర్వాత అధిష్టానానికి అభ్యర్థుల జాబితా అందజేయనుంది. సెప్టెంబర్ మొదటవారంలో మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. - 25 మందితో తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment