TDP Weak In Greater Rayalaseema Assembly Elections Of AP - Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ సీమలో టీడీపీకి అభ్యర్థులు కరవు.. అన్ని ఖర్చులు పార్టీ భరిస్తేనే సై! లేదంటే నై!

Published Tue, Feb 21 2023 1:55 AM | Last Updated on Tue, Feb 21 2023 8:28 AM

TDP weak in Greater Rayalaseema Assembly Elections Of AP - Sakshi

రాష్ట్రంలో ఎన్నికలకు మరో 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితిలో ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సన్నద్ధమవుతూ బిజిబిజీగా ఉండాలి. టీడీపీలో ఎక్కడా ఆ వాతావరణం కన్పించడం లేదు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పోటీకి విముఖత చూపుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి కూడా టీడీపీకి అధికారం దక్కదని ఆయా ప్రాంతాల్లో వారు చేయించిన సర్వేల్లో స్పష్టం కావడమే ఇందుకు కారణం.  

రాయలసీమలో పార్టీ కంటే వర్గాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. గెలిచినా, ఓడిపోయినా తమ వర్గాన్ని కాపాడుకునేందుకు ఏదో ఒక పార్టీ నుంచి బరిలో నిలవాలనుకుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదంటే టీడీపీ పరిస్థితి ఎంత తీసికట్టుగా మారిందో స్పష్టమవుతోంది. అందుకే చాలా మంది నేతలు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఏదారీ లేని వారు.. అంటే ఎక్కడా గెలవలేమనుకునే వారు మాత్రమే.. అన్ని ఖర్చులు పార్టీ భరిస్తేనే పోటీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీచేస్తున్నారు.  

సాక్షి, ఏపీ నెట్‌వర్క్‌: గ్రేటర్‌ రాయలసీమలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు, నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో 2019లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పీఆర్‌ అండ్‌ ఆర్డీ మాజీ కమిషనర్‌ రామాంజనేయులు, జయరాజ్‌ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తా లేరు. అక్కడి నుంచి ఈసారి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా టీడీపీకి దొరకలేదు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బొల్లినేని రామారావు 2019లో ఓడిపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ‘ఎటూ గెలవలేం.. పైగా టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు.. ఇలాంటప్పుడు ఎంత ఖర్చు చేసినా ఏం లాభం?’ అని పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేశ్‌లను బరిలోకి దింపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.

కందుకూరులో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పోతుల రామారావు పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావును ఇన్‌చార్జ్‌గా నియమించారు. పోతుల రామారావు కూడా రియల్టరే. మధ్యలో నాగేశ్వరరావు హ్యాండిస్తే మరో రియల్టర్‌ రాజేశ్‌కు టికెట్‌ ఇవ్వాలని ఆప్షన్‌గా పెట్టుకున్నారు. మచ్చుకు ఈ మూడు ఉదాహరణలు పరిశీలిస్తే ‘గ్రేటర్‌ రాయలసీమ’లో టీడీపీ పరిస్థితి ఏంటో, ఆ పార్టీ నేతల మనుసులో ఎలాంటి భావన ఉందో స్పష్టమవుతోంది.  

ప్రత్యామ్నాయం వైపు పార్టీ శ్రేణులు 
గ్రేటర్‌ రాయలసీమలో 74 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 67 మంది వైఎస్సార్‌సీపీ, ఏడుగురు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఏడుగురిలో నలుగురు ప్రకాశం జిల్లాలో, మిగిలిన ఐదు ఉమ్మడి జిల్లాల్లో ముగ్గురు (కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌) గెలిచారు.

ప్రకాశం జిల్లాలోని నలుగురిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీని వీడారు. ఎన్నికల తర్వాత సింహభాగం నియోజకవర్గాల్లో ఇప్పటికీ టీడీపీ నేతలు ప్రజలకు కన్పించడం లేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అత్యధికులు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. ఎక్కువ మంది సీఎం వైఎస్‌ జగన్‌ పథకాలు నచ్చి వైఎస్సార్‌సీపీలో చేరారు.  

మేమేం చేసేది..? 
‘రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు?’ అని ఓ మాజీ ఎమ్మెల్యేను ఆయన ముఖ్య అనుచరుడు ప్రశ్నిస్తే.. ‘ఇటీవల రోజుకు 10 మంది చొప్పున పది రోజులపాటు 100 మందితో ఫోన్లో, ప్రత్యక్షంగా మాట్లాడాను. వారిలో 94 మంది జగన్‌ ప్రభుత్వం వల్ల తమకు మేలు జరిగిందని చెప్పారు.

ఇంత కచ్చితంగా వారు ఆ మాట చెప్పినప్పుడు వారంతా నా వెంటే నడుస్తారన్న గ్యారంటీ ఏముంది? ఏం చూసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలి? పరిస్థితి ఇలా ఉంటే మేమేం చేసేది?’ అని ఎదురు ప్రశ్న వేశారట. ప్రజల నాడి ఇలా ఉన్నందుకే టీడీపీ నేతలు పోటీ చేయడానికి విముఖత చూపుతున్నారు. 

ఇన్‌చార్జ్‌ల కోసం వెంపర్లాట  
► నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు పోటీ అంటేనే జంకుతున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కృష్ణయ్య వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. కావలిలో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. సర్వేపల్లిలో మూడు పర్యాయాలు ఓడిపోయిన సోమిరెడ్డి మళ్లీ ఓటమి తప్పదని.. నెల్లూరు రూరల్‌ ఆశిస్తున్నారు.  

► తిరుపతి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఖర్చులు పార్టీ భరించాలని కండీషన్‌ పెట్టింది. చంద్రగిరిలో ఇందు శేఖర్‌ను కాదని పులివర్తి నానికి టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే చంద్రగిరిలో చెవిరెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదని నాని చిత్తూరు టికెట్‌ ఆశిస్తున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి ఖర్చు భరించలేనంటున్నారు. 

► పుంగూరులో పోటీ చేసేందుకు అభ్యర్థే లేరు. ఖర్చు పార్టీ చూసుకుంటే పోటీ చేస్తానని చల్లా రామచంద్రారెడ్డి తేల్చి చెప్పాడు. పూతలపట్టులో అభ్యర్థే దొరకని పరిస్థితి. ఖర్చు పార్టీ భరించాలని వెంకటగిరిలో కురగొండల రామకృష్ణ తేల్చి చెప్పారు. నగరిలో గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాశ్‌ కూడా ఇదే విషయం చెప్పాడు. దీంతో సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్‌ అశోక్‌రాజ్‌కు టికెట్‌ ఇవ్వాలన్న యోచనలో టీడీపీ ఉంది.  

► ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో ఎన్నికల ఖర్చులు పూర్తిగా భరిస్తేనే పోటీ చేస్తానని ఇన్‌చార్జ్‌ ఈరన్న చెబుతున్నారు. పెనుకొండలో పార్థసారథి, రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు, గుంతకల్లులో జితేంద్రగౌడ్‌తో పాటు చాలా చోట్ల నాయకుల మాట ఇదే! దీంతో బీజేపీ నేత సూరికి ధర్మవరం టికెట్‌ ఇస్తే.. మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు భరించాలని చెప్పినట్లు సమాచారం. పార్టీ గెలిచే అవకాశాలు లేనందున ఇంత ఖర్చు చేయాలా? వద్దా? అనే ఆలోచనలో సూరి ఉన్నారు.  

► ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి ఎప్పుడూ గడ్డుకాలమే. ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, కడప, జమ్మలమడుగుతో పాటు చాలా నియోజకవర్గాల్లోని అభ్యర్థులు అన్ని ఖర్చులు పార్టీ భరిస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆర్థికంగా లబ్ధి పొంది, తర్వాత బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేశ్‌ను తిరిగి రప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తంగా ఈ పరిస్థితిలో చాలా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి ఇన్‌చార్జ్‌లను నియమించేందుకు బాబు తల పట్టుకుంటున్నారు. 

ఇప్పుడు కూడా వార్‌ వన్‌సైడే!  
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 సీట్లలో గత 20 ఏళ్లలో టీడీపీ నేతలు అత్యధికంగా గెలిచిన అసెంబ్లీ సీట్లు కేవలం నాలుగే. 2004లో 3, 2009లో 4, 2014లో 3, 2019లో సున్నా. ఈ గణాంకాలు చూస్తే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో పోటీ చేసేందుకు అభ్యర్థులు జంకుతున్నారు. కర్నూలు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా టీజీ భరత్‌ ఉన్నారు.

ఇతని తండ్రి టీజీ వెంకటేశ్‌ బీజేపీ నేత. ఒకే ఇంట్లో ఉంటూ, రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న వీరు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. దీంతో భరత్‌కు టికెట్‌ ఇచ్చినా ఓడిపోతారని తెలిసి, మైనార్టీ కోటాలో అహ్మదుల్లాఖాన్‌కు టికెట్‌ ఇవ్వాలని భావించారు. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఖాన్, ఆ తర్వాత సర్వేలు చేయించుకుని టీడీపీ తరఫున బరిలో నిలిస్తే ఓటమి తప్పదని తేలడంతో పార్టీలో చేరకుండా మొహం చాటేశారు.

డోన్‌ అభ్యర్థిగా కేఈ కుటుంబాన్ని కాదని ధర్మవరం సుబ్బారెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. అయితే కేఈ ప్రభాకర్‌ మాత్రం డోన్‌లో తమ కుటుంబం పోటీలో ఉంటుందని, అన్ని రకాలుగా తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మరవొద్దని నేరుగా చంద్రబాబును ఉద్దేశించి స్పష్టం చేశారు. అంటే తమకు టికెట్‌ ఇవ్వకపోతే మరో పార్టీలోనో, స్వతంత్ర అభ్యర్థిగానో బరిలోకి దిగి.. టీడీపీని ఓడిస్తామనే భావన స్పష్టమవుతోంది.

ఆదోనిలో మీనాక్షి నాయుడు పోటీకి అయిష్టంగా ఉన్నారు. దీంతో బీసీ వర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, రియల్టర్‌ కోసం టీడీపీ అన్వేషిస్తోంది. ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ కేసులు, ఇతర వ్యవహారాల్లో తరచూ వివాదాల్లో ఉన్నారు.

అక్కడ ఆమె ఏ లెక్కనా గెలిచే పరిస్థితే లేనందున, భూమా కిషోర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. నంద్యాలలో అఖిలకు, ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. చివరకు గత నెల భూమా జయంతిని కూడా వేర్వేరుగా జరిపారు.   

మూడేళ్లు.. ముగ్గురు ఇన్‌చార్జ్‌లు
ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ ఇన్‌చార్జిగా 2019 ఎన్నికల వరకు శిద్ధా రాఘవరావు ఉన్నారు. ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైఎస్సార్‌­సీపీలో చేరారు. ఎన్నికల సమయంలో దర్శి ఇన్‌చార్జిగా వచ్చిన  కదిరి బాబూరావు.. 2019లో పోటీ చేసి ఓడిపోయాక వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తర్వాత ఇన్‌చార్జిగా వచ్చిన పమిడి రమేశ్‌బాబు కూడా గతేడాది జూలైలో ‘సైకిల్‌’ దిగేశాడు. దీంతో ఇక్కడ ఎవరిని ఇన్‌చార్జ్‌గా నియమించాలో తెలియని పరిస్థితి.

కనిగిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉగ్రనరసింహారెడ్డిని అక్కడి నేతలు పోకానాయుడు,  హుస్సేర్‌యాదవ్, గంగరాజు, మాల్యా­ద్రి వ్యతిరేకిస్తున్నారు. మార్కాపురంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి ఉన్నారు. ఇక్కడ కీలక నేతలుగా ఉన్న డీవీ కృష్ణారెడ్డి, షేక్షావలి, మక్బుల్‌బాషా, బీఎల్‌పీ యాదవ్‌ ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. పొదిలికి చెందిన శ్రావణి వెంకటేశ్వర్లు, జి.భాస్కర్‌ పార్టీకి దూరంగా ఉన్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement