- జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌లో భర్తీ కాని కీలక పోస్టులు
- రెగ్యులర్ కమిషనర్ బాధ్యతలతో పాలనలో మార్పు?
అనకాపల్లి: గ్రేటర్ విశాఖ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ఇప్పటికీ మునిసపాలిటీ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. జీవీఎంసీలో విలీనమై 11 నెలలు గడుస్తున్నా జోనల్ స్థాయి తరహా కీలకమైన పోస్టులు భర్తీ కాలేదు. గ్రేటర్‌లో విలీనమయ్యాక నలుగురు కమిషనర్‌లు మారారు. ఎవరి శైలి వారిదన్న చందంగా పాలన సాగింది. దీనికితోడు విలీనమయ్యాక సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలకు తోడు రాష్ట్ర విభజన పాలనపై ప్రభావం చూపింది.
గ్రేటర్ విశాఖ పరిధిని విస్తరించడం ద్వారా మెట్రో తరహా నిధులను రాబట్టుకోవచ్చని అధికార యంత్రాంగం భావించారు.అటువంటి నిధుల ప్రవాహం ఎప్పుడొస్తుందా ? అని అనకాపల్లి వాసులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడి జోనల్ కార్యాలయంలో పూర్తిస్థాయి కమిషనర్ లేనంతకాలం దిగువ స్థాయి సిబ్బంది పనితీరును పర్యవేక్షించే నాధుడే లేకుండా పోయాడు.
వినతుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు వివిధ శాఖల అధికారులు అందుబాటులోఉండేవారు కాదు. స్థానికంగా సమస్యలు పేరుకుపోయాయి. గ్రేటర్ స్థాయి వచ్చినా మునిసిపల్ చాయలు తొలగకపోవడంతో పాలనా వ్యవస్థ పాత తరహాలోనే కొనసాగుతోందన్న వాదన వ్యక్తమవుతోంది. మరోవైపు విలీనానికి ముందు మునిసిపాలిటీకి పాలకవర్గం లేకపోవడం, తదనంతర కాలంలో ఎన్నికలు లేకపోవడం వంటి పరిణామాలతో అధికారుల్లో జవాబుదారీతనం లోపించింది.
తాజాగా గెలుపొం దిన ఎమ్మెల్యే మాత్రం అడపాదడపా సమావేశాలు నిర్వహిస్తూ గ్రేటర్ అధికారులను పరుగెత్తిస్తున్నారు. సుదీర్ఘ లక్ష్యంతో చేపట్టిన సమగ్ర మురుగునీటి అభివృద్ధి పథక పనులు నత్తనడకన సాగుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ గాడిలో పడలేదు. మంచినీటి సరఫరా వ్యవస్థ, వీధిలైట్ల విభాగాల పనితీరు నామమాత్రమే. సులభ్ కాంప్లెక్స్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
భర్తీకాని కీలకపోస్టులు...
మునిసిపాలిటీ వ్యవస్థలోని ఉద్యోగుల ఫార్మాట్‌కు గ్రేటర్ విశాఖ జోనల్‌లోని ఉద్యోగుల ఫార్మాట్‌కు తేడా ఉంటుంది. విభాగాలలోని ఉద్యోగుల కేడర్, దిగువస్థాయి సిబ్బంది కేటాయింపుల్లో వ్యత్యాసం గోచరిస్తోంది. కానీ అనకాపల్లి జోనల్‌లో మాత్రం గ్రేటర్ విశాఖ పరిధికి సంబంధించిన మేరకు పోస్టుల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. ఉదాహరణకు మునిసిపాలిటీలో మేనేజర్ పోస్టు ఉంటే అది గ్రేటర్ విశాఖ జోనల్‌కు వచ్చేసరికి సూపరింటెండెంట్‌గా మారుతుంది. కానీ అనకాపల్లిలో ఇంకా మేనేజర్ స్థాయి పోస్టే కొనసాగుతోంది.
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఎఎంవోహెచ్) పోస్టు ఖాళీగానే ఉంది. రెవెన్యూ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టు భర్తీ కావాల్సి ఉంది. ఇంజినీరింగ్ వ్యవస్థలో ఈఈ, డీఈ, ఏఈల పోస్టులు భర్తీ బాగానే ఉంది. ఇక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులలో ఖాళీలుండడంతో కొన్ని శాఖల పనితీరు నత్తనడకే. కొద్దిరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన రెగ్యులర్ కమిషనర్ అనకాపల్లి జోనల్‌ను పూర్తిగా గాడిలో పెడతారని పురప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.