సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందని పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు.
శంకర్‌పల్లి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందని పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఆతిథిగృహంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, అయితే ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని వెంకటస్వామి అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా ప్రచారం చేసుకోకపోవడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు.
సంక్షేమ పథకాల వల్ల ఎంతోమంది లబ్ధి పొందినా... నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందన్నారు. సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయన్న ధీమాతో ఎన్నికలకు వెళ్తే ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి మంచి గౌరవం ఉందని, కానీ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. పార్టీ పరాజయానికి కారణాలపై అందరం కలిసి చర్చించుకుంటామని, తప్పులను సరిదిద్దుకొని మళ్లీ ప్రజల వద్దకు వెళ్తామని ఆయన అన్నారు.
నియోజకవర్గ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ మళ్లీ ఎన్నికలనాటికి కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, డీసీసీ సంయుక్త కార్యదర్శి వాసుదేవ్, ఎంపీటీసీ సభ్యులు బద్దం శశిధర్‌రెడ్డి, నర్సింలు, రావులపల్లి మాజీ సర్పంచ్ రవీందర్, పార్టీ నాయకులు పార్శి బాలకృష్ణ, కొంగళ్ల మల్లేషం, సర్తాజ్ తదితరులు పాల్గొన్నారు.