రుణం తీర్చుకోవడం ఇలాగేనా! | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver: YSR Congress | Sakshi
Sakshi News home page

రుణం తీర్చుకోవడం ఇలాగేనా!

Published Tue, Jun 10 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

రుణం తీర్చుకోవడం  ఇలాగేనా!

రుణం తీర్చుకోవడం ఇలాగేనా!

రుణాలు మాఫీ అవుతాయని గంపెడు ఆశతో ఉన్న రైతన్న ఆశలను అడియాసలు చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించడం తో వారిలో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతున్నాయి.

విజయనగరం వ్యవసాయం : రుణాలు మాఫీ అవుతాయని గంపెడు ఆశతో ఉన్న రైతన్న  ఆశలను అడియాసలు చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించడం తో వారిలో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతున్నాయి. పంట రుణాలను మాఫీ చేస్తానని, మొదటి సంతకాన్ని రుణ మాఫీ ఫైల్‌పై పెడతానని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడంతో రైతులు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అయితే ఇప్పుడు బాబు ఆ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీలుయినంత వరకు రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవడం లేదా రుణ మాఫీ చేయకుండా కాలయాపన చేయాలనే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే రుణమాఫీపై చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇందుకు అద్దం పడుతోందని వారు వాపోతున్నారు. అధికారం చేపట్టగానే మాట మార్చడంపై   రైతులు మండిపడుతున్నారు. కమిటీ నివేదిక ఇచ్చే లోపే ఖరీఫ్ సీజన్ సగం పూర్తవుతుంది. ఈ లోగా అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి రైతుల వద్ద చిల్లిగవ్వలేదు. ఎందుకంటే గత నాలుగేళ్లూ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అతివృష్టి, అనావృష్టిలతో కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో రుణమాఫీపై   కోటి ఆశలు పెట్టుకున్నారు. పాత రుణం రద్దయి... కొత్తగా రుణాలు ఇస్తే ఖరీఫ్ సాగు చేపట్టాలని రైతులు ఆనందంతో ఎదురు చూశారు. అయితే రుణమాఫీపై ప్రభుత్వం మెలిక పెట్టడంతో  దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కమిటీ నివేదిక 45 రోజుల తర్వాత వస్తుంది, అప్పటికి ఖరీఫ్ సీజన్ సగం అయిపోతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.
 
 సాగుకు పెట్టుబడి ఏదీ ...?  
 వ్యవసాయ శాఖ ఇప్పటికే వరి, పత్తి, మొక్కజొన్న తదితర  విత్తనాలను 92 వేల క్వింటాళ్ల వరకూ సిద్ధం చేసింది. అయితే  విత్తనాలను కొనుగోలు చేయడానికి రైతుల వద్ద చిల్లిగవ్వలేదు. ప్రతీ ఏడాది రైతులు ఖరీఫ్ సీజన్‌కు ముందు జూన్ నెలలో బ్యాంకులో రుణాలు తీసుకుని పెట్టుబడి పెడతారు. పాత బకాయిలు చెల్లించనిదే బ్యాంకర్లు కొత్త రుణాలు మంజూరు చేయరు. దీంతో ఖరీఫ్ పెట్టుబడిని ఏ విధంగా సమకూర్చుకోవాలన్నదానిపై అన్నదాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పంట రుణాలు రద్దవుతాయని భావించిన బ్యాంకర్లు కూడా కొత్త రుణాల మంజూరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
 
 ప్రైవేటు వ్యాపారులే దిక్కు
  రైతులకు పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయి. అప్పటి చంద్రబాబు పాలనలో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టేవారు. పంటలు కలిసిరాక అప్పట్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇదే పరిస్థితులు దాపురించేలా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 రుణ వివరాలు:
 గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో రూ.1,162 కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారు. ఇందులో బంగారంపై తీసుకున్న రుణాలు 431 కోట్లు కాగా, పంటరుణాలు రూ. 731 కోట్లు. పంట రుణాలు తీసుకున్న రైతులు 1,82,174మంది, బంగారుపై రుణం తీసుకున్న రైతులు 53,701 మంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement