మాటిచ్చి తప్పడం దారుణం
విజయనగరం కంటోన్మెంట్/మున్సిపాలిటీ: రైతులు, డ్వాక్రా మహిళలు, నేతన్నల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పెద్దఎత్తున రోడ్డెక్కిన వారంతా ప్రభుత్వం అనుసరిస్తున్న రుణమాఫీ తీరుపై మండిపడ్డారు. ‘మీ రుణాలన్నీ మాఫీ చేసే బాధ్యత నాది’. అని హా మీలు గుప్పించి గద్దెనెక్కిన చంద్రబాబు తమను మోసం చేశారంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని డ్వాక్రా మహిళలు, రైతాంగం, నేతన్నలు కలెక్టరేట్ వద్ద శని వారం ఉదయం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
కలెక్టరేట్‌కు భారీ ర్యాలీగా వచ్చిన మహిళలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు రైతులు, నేతన్నలు చంద్రబాబు హామీ ఇచ్చిన రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా మహిళలంతా చంద్రబాబు వాగ్దానాలను దుయ్యబట్టారు. ఆయన అన్నీ మోసపూరిత హామీలనే గుప్పించారంటూ మండిపడ్డారు. ఎలాగైనా గద్దెనెక్కాలనే పదవీకాంక్షతోనే మహిళలు, రైతులకు రుణాలు మాఫీ చేస్తానని, మీరు చెల్లించనవసరం లేదని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చారని, అవి నమ్మి ఓట్లేస్తే..రుణాల మాఫీకి కమిటీలు వేసి తమను ముంచేశారనీ వాపోయారు.
మానవహారం
భారీ ధర్నా సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ జంక్షన్‌లో మానవహారాన్ని రూపొందించా రు. ఈ మానవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన మహిళలు డ్వాక్రా మహిళలు, రైతులు, నేతన్నలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంత రం మహిళలు తమ వెంట ఉన్న జెండా కర్రలతో దహనమవుతున్న చంద్రబాబు దిష్టిబొమ్మను కసిదీరా కొట్టారు.
ఈ సందర్భంగా మహిళలు, రైతులు దిష్టిబొమ్మను కొట్టేందుకు పోటీ పడడం చూస్తే ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంపై వారిలో ఎంతమేర ఆగ్రహం ఉందో ప్రతి ఒక్కరికీ అర్థమైంది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్సీ, విజయనగరం నియోజక వర్గ పార్టీ ఇన్‌చార్జ్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీ మాజీ చైర్మన్, చీపురుపల్లి నియోజక వర్గ పార్టీ ఇన్‌చార్జ్ బెల్లాన చంద్రశేఖర్, పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్నకుమార్, ఎస్‌కోట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి నెక్కల నాయుడుబాబు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్, పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఆదాడ మోహనరావు,
పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గొర్లె వెంకటరమణ, విజయనగరం మున్సిపాలిటీ కౌన్సిలర్‌లు కేదారశెట్టి సీతారామమూర్తి, పిలకాదేవి, పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు మజ్జి వెంకటే ష్, పార్టీ ఇతర నాయకులు కాళ్ల గౌరీశంకర్, అవనాపు విక్రమ్, మజ్జి వెంకటేష్, అంబళ్ల శ్రీరాములునాయుడు, చనమల్లు వెంకట రమణ, మామిడి అప్పలనాయుడు, పిన్నింటి చంద్రమౌళి, నామాల సర్వేశ్వరరావు, మజ్జి త్రినాథ్, మొయిద ఆదినారాయణ, యల్లపు దమయంతీ దేవి, మజ్జి అప్పారావు, బంగారునాయుడు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
జేసీకి వినతిపత్రం
ధర్నా అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జాయిట్ కలెక్టర్ బి.రామారావుకు మెమొరాండాన్ని అందజేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులకు రుణా లు మాఫీ విషయంలో కాలయాపన చేస్తున్నారని వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి తెలియజెప్పాలని జేసీకి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.
ధర్నాలో నేతల ప్రసంగాలు...
రుణమాఫీపై రోజుకో మాట: ఎమ్మెల్యే సుజయ్
రుణమాఫీపై చంద్రబాబు రోజుకో మాట ఆడుతున్నారని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణరంగారావు అన్నారు. స్టేట్‌లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో తేల్చిన మొత్తాన్నే రుణ మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశా రు. ఎన్నికల సమయంలో అన్ని రుణాలూ రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిలా మాఫీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనుకున్న జనం ఇప్పుడిలా కమిటీలు వేయడం చూసి విస్తుపోతున్నారన్నారు. ప్రజల తరఫున తామే ఒత్తిడి తెచ్చి రుణాలను పూర్తిగా మాఫీ చేసేలా పోరాడతామన్నారు. పరిమితులు లేని రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఓర్పు, సహనం లేదనీ తెలుగు దేశం పార్టీ నాయకులు అనడం సరికాదని సుజయ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పర్చడం లేదని ప్రజల తరఫున జగన్ అన్నారే తప్ప మరే విధమైన మాటలూ అనలేదన్నారు.
కల్లబొల్లి కబుర్లు: పెనుమత్స
చంద్రబాబు చెప్పిన కల్లబొల్లి కబుర్లను నమ్మిన ప్రజలు ఓ ట్లేస్తే ఆ ప్రజలనే చంద్రబాబు ఏమార్చారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు విమర్శించారు.
ప్రజల పక్షాన పోరాడతాం: పుష్పశ్రీవాణి
కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రుణాల మాఫీ కోసం వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.
అధికారం లోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామన్నారు: మాజీ ఎమ్మెల్సీ కోలగ ట్ల
ఎవ్వరూ రుణాలను చెల్లించనక్కరలేదని, తాము అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పారని, ఆ మాటలను అమాయక ప్రజలు నమ్మారని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఇచ్చిన హామీలు వైఎస్ రాజశేఖరరెడ్డిలా నెరవేరుస్తారని నమ్మి ఓట్లేసిన జనాలకు చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారని ఎద్దేవా చేశారు. ‘నాకు వెన్ను పోటు పొడవడం అలవాటుంది. మా మామకు పొడిచినట్టే ప్రజలకూ పొడిచా’నని బహిరంగంగా ఒప్పుకోవాలంటూ చంద్రబాబును కోలగట్ల ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా తాము ప్రజల పక్షానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.