అంతా మాయ !
- డ్వాక్రా సంఘాలకు రుణ మాఫీ...ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీ.
- అబ్బే మాఫీ కాదు. మూలధనం నిధి కింద సాయమందిస్తాం...అధికారంలోకి వచ్చాక టీడీపీ
చంద్రబాబు బూటకపు హామీ వల్ల జిల్లా మహిళలపై రూ.5.5 కోట్ల వడ్డీ భారం పడింది. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా డ్వాక్రా మహిళల పరిస్థితి తయారైంది. రుణం మాఫీ అవుతుందనుకున్న వారి ఆశలపై నీళ్లు జల్లుతూ ఇప్పుడు మూలధనం రాగమెత్తుకున్నారు. దానిపై కూడా స్పష్టతలేకపోవడంతో డ్వాక్రా మహిళలకు ఇప్పుడిప్పుడే మాిఫీ మాయ అర్థమవుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పోనీ ఇదేనా జరుగుతుందంటే అదీ లేదు. కాగితాల్లోనే లెక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాల్లేవు. మూలధనం నిధి కింద ఒక్కొక్క సంఘానికి ఎంత ఇవ్వనున్నారో ఇప్పటికీ తెలపడం లేదు. సభలు, సమావేశాల్లో మాత్రం రూ.లక్ష చొప్పున ఇస్తామని ప్రకటిస్తున్నారు. అది కూడా ఒకసారి ఇస్తారా ? రూ.50వేలు చొప్పున ఇస్తారా ? రూ.25వేలు చొప్పున ఇస్తారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. అధికారులకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రభుత్వమిచ్చే సాయం కోసం కసరత్తు చేయాలన్న కనీస సూచన కూడా చేయలేదు. అంతా దాటవేత ధోరణియే అవలంబిస్తున్నారు. మాఫీయా ? మూలధనమా ? అన్నది పక్కన పెట్టి తీసుకున్న రుణ వాయిదాల్ని మాత్రం సక్రమంగా చెల్లించాలని సంఘాలపై ప్రభుత్వం కత్తి పెడుతోంది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్తగా రుణాలొస్తాయని ఖరాఖండిగా చెప్పేస్తోంది. దీంతో బకాయిలు చెల్లించలేక, వడ్డీ భారం భరించలేక డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో బకాయిలు చెల్లించని సంఘాల పొదుపు ఖాతాల నుంచి బ్యాంకులు నిధులు మళ్లించేస్తున్నాయి.
జిల్లా మహిళలపై 5.5కోట్ల వడ్డీ భారం
2014 మార్చి నాటికి జిల్లాలో సుమారు రూ.500కోట్ల మేర డ్వాక్రా సంఘాల రుణాలున్నాయి. ఇవన్నీ మాఫీ అయిపోతాయని దాదాపు 29,500 సంఘాలు ఆశించాయి. వాయిదాల చెల్లింపులు కూడా నిలిపేశాయి. కానీ, సర్కార్ మాట నిలుపుకోలేదు. మాఫీ జోలికి పోలేదు. దీంతో బ్యాంకులు వడ్డీలు వడ్డించాయి. గరిష్టంగా 14శాతం మేర వడ్డీ గుంజుతున్నాయి. ఈ విధంగా రూ.500కోట్ల బకాయిపై ఇప్పటికే సుమారు రూ.5.5కోట్ల వడ్డీ భారం పడింది. సర్కార్ పాపానికి డ్వాక్రా సంఘాలు మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి నెలకొంది. పోనీలే ఎప్పుడైనా మాఫీ అయిపోతుంది వడ్డీ ఎంత వేస్తే మనకేంటి ఆలోచించే సంఘాలకు సర్కార్ అనుకోని షాక్ ఇచ్చింది. సంఘాలకు చేసేది మాఫీ కాదని, వాటి పేరున మూలధనం నిధి కింద సాయమందిస్తామని ప్రకటించింది. ఒక్కొక్క సంఘానికి రూ.లక్ష చొప్పున ఇస్తామని వెల్లడించింది. కానీ ఆమేరకు ఉత్తర్వులు ఇవ్వలేదు.
ఇక, మౌఖికంగా వెల్లడించిన రూ.లక్ష కూడా ఒకేసారి చెల్లిస్తుందా? లేదంటే విడతల వారీగా ఇస్తుందన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. రూ.లక్ష చొప్పున మూలధనం నిధి కింద ఇస్తే జిల్లా వ్యాప్తంగా 29,500సంఘాలకు రూ.295కోట్ల మేర మూలధనం నిధి విడుదలవుతోంది. అంటే రుణ బకాయిగా ఉన్న రూ.500కోట్లలో రూ.295కోట్లకు ఉపశమనం కల్గనుంది. మిగతా రూ.205కోట్లును సంఘాలే భరించాల్సి వస్తోంది. కనీసం మూలధనం నిధి ప్రక్రియ కొనసాగుతుందనుకుంటే అదీ లేదు. సభలు, సమావేశాల్లో పాలకులు చేసిన ప్రకటనలు తప్ప అధికారులకు ఎటువంటి ఉత్తర్వుల్లేవు. దీంతో అధికారులు వాటి జోలికెళ్లడం లేదు. సర్కార్ నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకపోవడంతో కనీస కసరత్తు చేయడం లేదు. స్పష్టత లేక అధికారులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎవర్ని అడిగినా తమకేమీ తెలియదని దాట వేస్తున్నారు.
మూలధనం నిధి విషయమై ఉత్తర్వులివ్వని సర్కార్, సంఘాలు సక్రమంగా రుణ వాయిదాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తూచా తప్పకుండా పాటిస్తూ సంఘాలపై అధికార వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. మూలధనం నిధి ఎప్పటికిస్తుందో? అంతవరకు వదిలేస్తే ఎంత వడ్డీ పడిపోతుందో? వచ్చే దానికన్నా పోయేదే ఎక్కువైనట్టు ఉందని భావించి కొన్ని సంఘాలు అప్పోసప్పో చేసి చెల్లింపులు చేస్తున్నాయి. ఏం చేస్తారో చూద్దామనే దోరణితో మొండిగా వ్యవహరిస్తున్న సంఘాలపై బ్యాంకులు తమదైన శైలీలో వ్యవహరిస్తున్నాయి. వాటి పొదుపు సంఘాల నిధుల్ని మళ్లించేస్తున్నాయి. కొత్తగా లింకేజీ రుణాలు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు మాఫీ హామీ పుణ్యమా అని డ్వాక్రా సంఘాల మహిళలు అల్లాడిపోతున్నారు.