- ఈ నెల 15 వరకు గడువు
- ఇవ్వని పక్షంలో షాడో రిజిస్టర్ అధారంగా ధరల ఖరారు
- కలెక్టర్ గంగాధర కిషన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత నెల 30వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఈనెల 15వ తేదీలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు (ఆర్‌ఓ) అందజేయాలని కలెక్టర్ గంగాధర కిషన్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఆర్‌ఓలతో కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిఒక్క అభ్యర్థి లెక్కలు సమర్పించాలన్నారు. పెయిడ్ న్యూస్ విషయంలో పూర్తి భాధ్యత అభ్యర్థులదేనని చెప్పారు. ఈ విషయంలో అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు వెంటనే స్పందించాలన్నారు. సకాలంలో లెక్కలు ఇవ్వని పక్షంలో అధికారులు షాడో రిజిస్టర్ అధారంగా ధరలు ఖరారు చేస్తారని స్పష్టం చేశారు.
ధరలు అధికంగా లెక్కిస్తున్నారు..
ఎన్నికల ఖర్చుకు సంబంధించి అధికారులు మార్కెట్ ధరల కన్నా రేట్లు అధికంగా వేశారని సమావేశంలో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పోటీ చేసిన అభ్యర్థి తిరుణహరిశేషుతోపాటు మరికొందరు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల తమకు ప్రత్యక్షంగా నష్టం లేకున్నా... ఆదాయ పన్ను, ఆదాయ వనరులు చూపాల్సిన సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వాస్తవ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఇవ్వనప్పుడు మాత్రమే అధికారులు ధరలు నిర్ణయించి అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారని కలెక్టర్ వారికి చెప్పారు. అందుకే నోటీసులకు సమాధానమిచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
9 నుంచి అందుబాటులో ఉండాలి
ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఎన్నికల లెక్కలు తీసుకునేందుకు సంబంధిత ఆర్‌ఓ కార్యాలయంలో సహాయ వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సందేహాలుంటే ఆర్‌ఓలను సంప్రదించాలన్నారు.
రాజకీయ చర్చ
అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు ఇచ్చే విషయంలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభంలోనే రాజకీయ చర్చకు దారితీసి ఆసక్తిని రేకెత్తించింది. సమావేశం ప్రారంభం కాగానే ములుగు ఆర్డీఓ మోతీలాల్ ఖర్చులు లెక్కించే విషయంలో అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోతీలాల్‌ను ఉద్దేశించి మీరెవరు... అంటూ రెడ్యానాయక్ ప్రశ్నించారు. తాను ములుగు ఆర్డీఓ మోతీలాల్ అని ఆయన సమాధానమిచ్చారు.
ఎన్నికల్లో ఆర్ ఓలు, ఏఆర్‌ఓలు అందరూ టీఆర్‌ఎస్‌కు గుద్దమని (ఓటేయమని) చెప్పారు... వారుకూడా వేశారంటూ రెడ్యా అన్నారు. ఆర్డీఓ కలుగజేసుకుని ఎమ్మెల్యే గారూ... అలా మాట్లాడొద్దని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇక కలెక్టర్ వచ్చాక కార్యక్రమం ముగుస్తుందనుకున్న సమయంలో ఇదే విషయూన్ని మరో అభ్యర్థి లేవనెత్తారు.
ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నట్లు ప్రస్తుత ఎన్నికల్లో అధికారులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేశారని భావిస్తే 2004, 2009లో కాంగ్రెస్‌కు పనిచేశారని భావించాల్సి ఉంటుందన్నారు. దీంతో కలెక్టర్ కల్పించుకుని రాజకీయ చర్చకు ఇది వేదిక కాదని చర్చకు ముక్తాయింపు ఇచ్చారు. వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.