చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి
నిజమైన ప్రజాస్వామ్యంలో అన్నింటినీ అనుమతించాలి
హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ చర్చాగోష్టిలో షబానా అజ్మీ
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతం దేశంలో సంభవిస్తున్న పరిణామాలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. చరిత్రను తెరమరుగుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాఠ్యాంశాల నుంచి కొన్ని అధ్యాయాలను తొలగిస్తున్నారు. దీనిని ప్రజలు చూస్తూ ఉండిపోతున్నారు. ఇది విచారించవలసిన విషయం. భారత రాజ్యాంగం అనేది ఎంతో ముఖ్యమైనది.. ప్రధానమైనది. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ రక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారతదేశం సెక్యులరిజం, బహుళత్వం అనే పునాదులపై నిలుస్తోంది..’అని పద్మభూషణ్, సీనియర్ నటి షబానా అజ్మీ అన్నారు.
శుక్రవారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభ ప్లీనరీ ‘ఏ లైఫ్ ఇన్ సినిమా’కార్యక్రమంలో షబానా అజ్మీతో ఫెస్టివల్ డైరెక్టర్ అమితా దేశాయ్ చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు షబానా జవాబిచ్చారు. హింసను ప్రోత్సహించే విధంగా కేరళ స్టోరీ, కశీ్మ ర్ ఫైల్స్ వంటి బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి కదా.. వాటిపై మీ స్పందన ఏమిటని ఒక కాలేజీ విద్యార్థని వేసిన ప్రశ్నకు షబానా పైవిధంగా స్పందించారు.
‘మనదేశంలో లెఫ్ట్, రైట్ శక్తుల మధ్య పోరాటం సాగుతూనే ఉంది. ఈ రెండింటి సిద్ధాంతాలు పూర్తిగా భిన్నం. నిజమైన ప్రజాస్వామ్యంలో అన్నింటినీ అనుమతించాలి. ఉద్రిక్తతలు రెచ్చ గొట్టని సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. నేడు కేవలం పదిమంది ఒక సినిమాకు అభ్యంతరం చెబుతున్నారు. అభ్యంతరం మంచిదే కాని అది హింసకు దారితీయడం ఆమోదయోగ్యం కాదు..’అని షబానా వివరించారు.
కమ్యూనిస్టుల మధ్య నా బాల్యం గడిచింది
‘నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ప్రగతిశీల రచయితగా నా తండ్రి ఖైఫీ అజ్మీ ఇక్కడ అజ్ఞాతంలో గడిపారు. కమ్యూనిస్టుపార్టీ నాయకుల మధ్యలోనే నా బాల్యం గడిచింది. చిన్నప్పుడు ప్రతి వేసవిలో హైదరాబాద్‌కు వచ్చేదాన్ని. నగర సంస్కృతి, ప్రగతిశీల సాహిత్యం, చుట్టంతా మేధావులతో నిండిన వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. నా తొలి సినిమా ‘అంకుర్’షూటింగ్ సందర్భంగా ఇక్కడే ఓ గ్రామ (నేటి ఎల్లారెడ్డిగూడ) వాతావరణంలోకి తొలిసారిగా అడుగుపెట్టా.
అక్కడి నుంచి స్టీఫెన్ స్పీల్‌బర్గ్ చిత్రంలోనటించే వరకు నా నట జీవితం కొనసాగింది..’అని షబానా వివరించారు. ముంబయి మురికివాడల్లోని పేదలకు రాజకీయవేత్త శరద్‌పవార్ సహకారంతో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కృషి చేశానన్నారు. తన తండ్రి ఖైఫీ అజ్మీ ప్రారంభించిన ‘మిజ్వా’ద్వారా ఇప్పటికీ కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా షబానా సినీ జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ 3 నిమిషాల లఘు చిత్రాన్ని నిర్వాహకులు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment