సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్! | actor Upendra chit chat | Sakshi
Sakshi News home page

సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్!

Published Fri, Jun 26 2015 8:14 AM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్! - Sakshi

సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్!

సదరన్ స్పైస్
మీరు అతణ్ణి ద్వేషించడాన్ని ప్రేమిస్తారు. మీరు అతణ్ణి ప్రేమించడాన్ని ద్వేషిస్తారు. ప్రేమిస్తారు. ద్వేషిస్తారు.
కాని- ఎప్పుడూ తీసి పడేయలేరు. అలాంటి పిచ్చ పాపులారిటీ కొట్టేశాడు.
సినిమాలు హిట్ కావడానికి పెద్ద హీరో, పెద్ద బడ్జెట్, పెద్ద కథ... ఎట్లీస్ట్ ఒకటైనా ఉండాలి.
మూడు లేకుండా హిట్ కొట్టినోడు ఉపేంద్ర.
అదే ఉపేంద్ర షాక్ వాల్యూ. ఊహించినదాని కంటే పిచ్చగా,  ఊహించనంత పిచ్చగా... ఇదీ ఉప్పి ఫార్ములా.

 
సినిమా స్టార్స్ అంటే స్పెషలే... కొందరు మాత్రం మరీ స్పెషల్. కన్నడసీమలో అందరూ ముద్దుగా ‘ఉప్పి’ అని పిలుచుకొనే ఉపేంద్ర అంతే! ఆయన యాక్టింగే కాదు... ఎంచుకొనే చిత్రమైన స్క్రిప్ట్‌లు... వేసే వేషాలు... చేసే సినిమాలు, పెట్టే పేర్లు, విచిత్రమైన హెయిర్‌స్టైల్స్... ఏవైనా అంతే! అవన్నీ... ఉపేంద్ర మార్కు స్పెషల్. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, పాటల రచయిత, గాయకుడు - ఇన్ని వేషాలూ ఉప్పిదాదా వేస్తాడు. కాకపోతే, ‘ఎడ్డెమంటే తెడ్డెమ’నే తరహా హీరో పాత్రలంటే మొదట గుర్తొస్తాడు. అలాంటి పాత్రలకు సౌతిండియన్ సినిమాలో అతనిదే పేటెంటన్నా తప్పు లేదేమో! ఆ క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్... మరెన్నో కమర్షియల్ పాత్రల సృష్టికి బీజం వేశాయి. కావాలంటే, మన పూరి జగన్నాథ్ ‘ఇడియట్’, ‘పోకిరి’ లాంటి హీరో పాత్రలు... ఉపేంద్ర సినిమాలు ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూడండి!
 
చిన్నప్పటి నుంచీ ఉపేంద్ర అంతే! ‘నలుగురికీ నచ్చినది... నాకసలే ఇక నచ్చదురోయ్...’ టైపు. ఎంతో కష్టపడి పైకొచ్చాడు. నాన్న వంటవాడు. అమ్మ, తను, అన్న. పొట్టకూటి కోసం పళ్ళు, కూరలు తీసుకెళ్ళే కాగితపు కవర్లు తయారు చేశాడు. మిక్స్చర్, బూందీ ప్యాక్ చేసే ప్లాస్టిక్ కవర్లు చేశాడు. చేతిలో వంద రూపాయలుంటే గొప్ప అని బతికినరోజులవి. బంధువు, దర్శకుడు కాశీ నాథ్ (‘అనుభవం’ ఫేం) సాయంతో సినిమాల్లోకొచ్చాడు. అక్కడ నుంచి ఉప్పి జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది.
 
శాండల్‌వుడ్‌కు... క్రేజీ ఇమేజ్
1990లలో ఉపేంద్ర ఎంట్రీ శాండల్‌వుడ్‌లో ఊహించని మలుపు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌ల తరం జోరు తగ్గి, కొత్తవాళ్ళకు ఆడియన్స్ తలుపులు తెరుస్తున్న టైమ్‌లో ఉపేంద్ర ఎంటరయ్యాడు. అసలు ఆయన మొదలు పెట్టింది అసిస్టెంట్ డెరైక్టర్‌గా! ఆయన ఆగలేదు... డెరైక్టర్‌య్యాడు. విజయం సాధించాడు. అక్కడితో ఆగలేదు... హీరో అయ్యాడు. అన్నిసార్లు ఆగనివాడికి ఆ తరువాత ఎక్కడా ఆగాల్సిన అవసరమే రాలేదు. కొత్త మిలీనియమ్‌కు కాస్తంత ముందు నుంచి కన్నడ సినిమాలకు ఒక కొత్త క్రేజు, ఇమేజ్ వచ్చిందంటే - అది ఉపేంద్ర మ్యాజిక్.
 
మొదట్లో కెమేరా ముందుకొచ్చి, చిన్న వేషాలేసిన ఉపేంద్ర. కాశీనాథ్ మార్క్ కామెడీ తర్లే నాన్ మగ(92)తో దర్శకుడయ్యాడు. అయితే, ఆడియన్స్‌ను ఆకర్షించాలంటే, భారీ బడ్జెటైనా ఉండాలి. షాకింగ్‌గా అనిపించే స్క్రిప్టైనా ఉండాలి. ఉప్పి రెండో రూట్ ఎంచుకున్నాడు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ష్’ (’93) తీస్తే, అదీ హిట్టు. ఆ తరువాత శివరాజ్‌కుమార్‌ను హీరోగా పెట్టి తీసిన ‘ఓం’ (’95) ఒక పెద్ద కుదుపు.
 
బెంగుళూరులోని రియల్ గ్యాంగ్‌స్టర్స్ జీవితాలను చూపెట్టిన సినిమా అది. అసలు సిసల్ గ్యాంగ్‌స్టర్స్‌నీ నటింపజేశాడు. మింగుడు పడనిది చూపెట్టి, అక్కడ నుంచి వెనక్కి వెళ్ళి, ఫ్లాష్‌బ్యాక్‌తో అదెంత సమంజసమో ఒప్పించే విచిత్రమైన స్క్రీన్‌ప్లే ‘ఓం’లో కనిపిస్తుంది. ఆ పద్ధతిలో వెళ్ళాలనుకొనే చాలామందికి ఇప్పటికీ అది టెక్స్ట్‌బుక్కే కాదు... గైడ్ కూడా! ఆ మూసలో ఇవాళ్టికీ కన్నడ సినిమాలు వస్తూనే ఉన్నాయి. నటి ప్రేమ తెరకు పరిచయమైంది ‘ఓం’తోనే. తెలుగుతో (రాజశేఖర్ ‘ఓంకారం’) సహా అనేకచోట్ల రీమేకైన ఈ ఫిల్మ్ 20 ఏళ్ళ తరువాత కూడా ఇప్పటికీ కన్నడంలో హాటే. ఇవాళ్టికీ రిలీజైనప్పుడల్లా, కాసులు కురిపిస్తోంది.
 అతనికి తిక్కుంది... కానీ లెక్కే లేదు!
 
సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్!
ఉపేంద్ర ప్రేమ, పెళ్ళి - చాలా పెద్ద కథ. వివాదాస్పదమైన ‘హెచ్2ఓ’ ఘోరంగా ఫెయిలైతే అయింది కానీ, ఆ సినిమా హీరోయినైన బెంగాలీ నటి ప్రియాంకా త్రివేదీతో ఉపేంద్ర ప్రేమ మాత్రం సక్సెసైంది. ‘రా’ సినిమాతో మొదలైన వాళ్ళ స్నేహం... క్రమంగా ప్రేమగా మారి... ఈ సినిమాతో పెళ్ళి పీటలపెకైక్కింది. ముచ్చటైన సంసారం. వాళ్ళకిప్పుడు ఇద్దరు పిల్లలు... అబ్బాయి ఆయుష్ ఆరో తరగతి. అమ్మాయి ఐశ్వర్య అయిదో తరగతి.
 
ఉపేంద్రలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఆయన నటిస్తారు. పాటలు రాస్తారు... పాడతారు. కథ చేస్తారు... సినిమా తీస్తారు... దాన్ని ప్రతిభ అనేవాళ్ళు కొందరు... పిచ్చి అనేవాళ్ళు మాత్రం ఎందరో! అది వేపకాయంతా... గుమ్మడికాయంతా? ఏమో తెలీదు. కానీ, ఏది చెప్పినా ముక్కుసూటిగా కాదు... ముక్కు బద్దలయ్యేలా చెప్పడం ఉపేంద్ర నైజం. విచిత్రమైన ఈ ‘క్రియేటివ్ ఎక్సెంట్రిసిటీ’ కొందరికి మొరటు, కొందరికి వెగటు. సగటు ప్రేక్షకుడు మాత్రం ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే, అభిమాన గణంలో, ఆదాయ గణాంకాల్లో - టాప్ ఫైవ్ కన్నడ హీరోల్లో ఉప్పి ఒకడు.
 
ఉపేంద్ర హీరోయిక్ జర్నీ స్టార్ట్ అయింది ‘ఎ’ (’98) సినిమాతో! హీరోయిన్ ప్రేమలో పడ్డ దర్శకుడు... తీరా పేరొచ్చాక ఆ నటి అతణ్ణి కాదనడం... ఆడవాళ్ళంటే అతను పెంచుకున్న ద్వేషం... ఇలా నడుస్తుందా కథ. అది ఉపేంద్ర సొంత కథేననీ, ఆ హీరోయిన్ నటి ప్రేమ అనీ ఒకటే పుకారు. నిజానిజాలు ఉపేంద్ర కెరుక. సినిమా మాత్రం డబ్ అయిన తెలుగులోనూ డబ్బు చేసుకుంది. తెరపై ఉపేంద్ర నిర్మొహమాటం జనానికీ నచ్చుతూనే వచ్చింది. ఉపేంద్రనగానే తెలుగువారికి ‘ఎ’, ‘రా’, ‘ష్’, ‘ఉపేంద్ర’, ‘సూపర్’ ఇప్పటికీ గుర్తొచ్చేదీ అందుకే!
 
పాలిటిక్స్ వయా సినిమా
ఉపేంద్ర తన సినిమాల్లో ఆవేశం చూపిస్తాడు. సమాజంలోని ‘హిపో క్రసీ’పై ఆగ్రహం పలికిస్తాడు. ఆ సినిమాలు జనంతో పాటు ఆయన మీదా ప్రభావం చూపాయి. ఈ వెండితెర ఆగ్రహాన్ని వీధుల్లో ఆచరణగా మార్చాలని పాతికేళ్ళుగా సినీ రంగంలోనే ఉన్న 47 ఏళ్ళ ఉప్పి అభిప్రాయం. కన్నడ ‘సూపర్’లో ముఖ్యమంత్రైన ఈ హీరో ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తానంటాడు. అయితే, ఇంకా టైమ్ ఉందంటాడు. ఆ లోగా తనకున్న సినిమాస్కోప్ కలలు తీర్చుకొనే పనిలో ఉన్నాడు.
 
మరక కూడా మంచిదే!
కాంట్రవర్సీకీ, కన్నడ స్టార్ ఉపేంద్రకూ దగ్గరి చుట్టరికం. తమిళ, కన్నడ రాష్ట్రాల మధ్య కావేరీ జలవివాదం నేపథ్యంలో ముక్కోణపు ప్రేమకథగా ఆయన రాసి, నటించిన ‘హెచ్2ఓ’ (2002) రోజుల నుంచి ఆ చుట్టరికం మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంది. కానీ, ఆయన కలవరపడలేదు. కామ్‌గా పని చేసుకుంటూ పోయాడు. కన్నడంలో అందరి లానే ఆయనా ఆ మధ్య వరుసగా రీమేక్‌ల బాట పట్టాడు. త్రివిక్రమ్ రాసిన తెలుగు సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’ కన్నడ రీమేక్స్‌లోనూ ఉప్పి హీరో. ఇప్పటికి దాదాపు 50 సినిమాల్లో నటించిన ఉపేంద్ర కొంత గ్యాప్ తరువాత మళ్ళీ ఇప్పుడు మెగాఫోన్ పట్టాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ షూటింగ్‌లోనూ బ్రేక్ టైమ్‌లో తన క్యారవాన్‌లోనే ఎడిటింగ్ చేస్తూ గడిపిన ఆయన తన దర్శకత్వంలో 9వ సినిమా ‘ఉప్పి2’తో రానున్నాడు.
 
సౌత్ అంతా ఫేమసే!
‘‘తిరుపతికి పోయి... ఇదే వెంకన్న సామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినాయనా! మన గురించి ఇక్కడ తెలిస్తే సాలదు... హైదరాబాద్‌లో కూడా తెలవాల! ఫేమస్ అవ్వాల మనం...’’ సమ్మర్ రిలీజ్ త్రివిక్రవ్‌ు ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో దేవరాజ్ పాత్రధారి ఉపేంద్ర పలికే డైలాగ్ ఇది. అవును... పాతికేళ్ళ క్రితం జీరోగా మొదలై ఇవాళ హీరోగా వెలుగుతున్న ఉపేంద్ర ఇవాళ ఇక్కడా ఫేమస్సే! కన్నడ రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌ల తరువాత తెలుగులో, ఆ మాటకొస్తే ఆల్ ఓవర్ సౌతిండియాలోనూ ఫేమున్న ఏకైక కన్నడ హీరో ఉపేంద్రే! ఏళ్ళ క్రితం వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమాలు ‘ఏ’, ’రా’ చూసి ఈల వేసి, గోల చేసిన జనం మొన్న సమ్మర్ రిలీజ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో విలన్ పాత్రకూ థియేటర్లలో అదే రకంగా వెల్‌కమ్ చెప్పడం ఉపేంద్ర ఇమేజ్‌కు తాజా నిదర్శనం.
 
లైఫ్ ఫిలాసఫీ
బెంగుళూరులోని విద్యాపీఠ్‌లో మధ్యతరగతి కుటుంబాల మధ్య వీధుల్లో సైకిల్ తొక్కుతూ పెరిగి, మధ్య, ఎగువ మధ్యతరగతి మనుషుల ‘హిపోక్రసీ’ని తెరపై చెడుగుడు ఆడిన ఉపేంద్రలో చాలామందికి తెలియని మరో కోణం - స్పిరిచ్యువాలిటీ. సినిమాల్లో ఉపేంద్ర చెప్పిన జీవిత పాఠాలన్నీ కలిపి, ఆ మధ్య ‘ఉప్పిగింత’ అంటూ పుస్తకమే వచ్చింది. ‘‘అల్లిరువుదు నమ్మనే, ఇల్లిరువుదు సుమ్మనే’’ (అసలు ఇల్లు వేరెక్కడో ఉంది. ఇప్పుడిక్కడ మనం ఊరకే ఉంటున్నాం అని అర్థం) అనే లోతైన అర్థమున్న కన్నడ సూక్తిని ఆయన ప్రస్తావిస్తుంటాడు. పదిహేనేళ్ళ క్రితం బనశంకరి థర్‌‌డ ఫేజ్‌లో ఇంటికి మారిన ఉప్పి, ఆ ఇంటికి పెట్టిన పేరేమిటో తెలుసా? ‘సుమ్మనే!’
 
అవును. ఉప్పి జీవితాన్ని కాచివడపోశాడు. ఒకప్పుడు... చదువుకొంటూనే, 15 రూపాయల కోసం పేపర్ కవర్లు చేసిన పిల్లాడు... సినిమాల్లో పేరొచ్చాక లక్ష రూపాయల చెక్ ఇస్తే, జీవితంలో అంత డబ్బు మునుపెన్నడూ చూడక తడబడిపోయిన మిడిల్‌క్లాస్ వ్యక్తి... డబ్బులెక్కడ దాచుకోవాలో తెలియని కుర్రాడు... ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. వచ్చినా, తన మూలాలు మర్చిపోలేదు. ఇవేవీ శాశ్వతం కాదనీ మర్చిపోలేదు. అందుకే, ఉపేంద్ర సిన్మా లానే ఉపేంద్రా స్పెషల్. శాండల్‌వుడ్‌లోనే కాదు... మరి ఏ ‘వుడ్’లోనూ కనిపించని స్పెషల్. భాషల గోడలు బద్దలు కొట్టుకొని, మనసుపై ముద్ర వేసిన స్పెషల్ స్టార్. ‘సమ్ మే లవ్ హిమ్. సమ్ మే హేట్ హిమ్. బట్ నో వన్ కెన్ ఇగ్నోర్ హిమ్!’    
- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement