నాగ్ అశ్విన్
‘‘అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్తుతుందనే నమ్మకం ఉంది. ‘బాహుబలి’ సినిమా వల్ల కొత్త దారులు ఏర్పడ్డాయి. స్పైడర్‌మ్యాన్, జేమ్స్‌బాండ్ వంటి చిత్రాలు మన దగ్గర విడుదలవుతున్నాయి. మన సినిమాలు కూడా ఆ స్థాయిలో అక్కడ రిలీజ్ అయ్యే తరుణం వస్తుంది’’ అని దర్శక -నిర్మాత నాగ్ అశ్విన్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకుడు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు...
► నాకు జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ హిలేరియస్ మూవీ చేద్దామనుకున్నాను. అనుదీప్ చేసిన ఓ కామెడీ షార్ట్‌ఫిల్మ్ చూసి ఓ హిలేరియస్ సినిమా చేద్దామని నేనే అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లా. అతను చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పాను. అలా ‘జాతిరత్నాలు’ మొదలైంది. ఈ సినిమాలో కామెడీ, స్టోరీ ఐడియా అనుదీప్‌దే. ఎక్కువకాలం ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అనిపించిన ఇన్ పుట్స్ కొన్ని ఇచ్చాను.
► విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా నుంచి పరిచయం. విజయ్, నవీన్ ల కాంబినేషన్‌లోనే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తీద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ షూటింగ్ సమయంలో నవీన్ కు ‘జాతిరత్నాలు’ కథ పంపా. అతనికి కథ నచ్చింది. నవీన్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు. రాహుల్, ప్రియదర్శి కూడా చాలా బాగా చేశారు. ఒక స్క్రిప్ట్ రాయాలన్నా.. సినిమా తీయాలన్నా బ్రెయిన్ కావాలి. కానీ మంచి కామెడీ తీయాలంటే మాత్రం హార్ట్ ఉండాలి. అనుదీప్‌కి మంచి హార్ట్ ఉంది. అందుకే సినిమా ఇంత హిలేరియస్‌గా వచ్చింది.
► ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కథ. ‘మనీ మనీ..’, ‘అనగనగా..’ తరహాలో ఔట్ అండ్ ఔట్ కామెడీ. రెండు మూడు టైటిల్స్ అనుకున్న తర్వాత ‘జాతిరత్నాలు’ ఫిక్స్ చేశాం. నవీన్ కు హిందీలో మార్కెట్ ఉంది. కాబట్టి దీన్ని హిందీలో డబ్ చేసే ఆలోచనలో ఉన్నాం.
► నాకు నిర్మాతగా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మంచి కంటెంట్ సినిమాలు వస్తే స్వప్న సినిమాస్ ద్వారా ప్రోత్సహిస్తాను.
► నా గత చిత్రాలు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లో హ్యూమర్ ఉంది. అలాగే ప్రభాస్‌తో నేను చేయబోయే సినిమాలో కూడా కొంత హ్యూమర్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. అందుకే సమయం పడుతోంది. జూలైలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం.
► ప్రభాస్ దగ్గరకి ఒక పెద్ద స్టార్‌గా భావించి వెళతాం. కానీ ఆయన సరదాగా ఉంటారు. సినీ లెక్కలు, బాక్సాసీఫ్ ఓపెనింగ్స్ పట్టించుకోరు. సోషల్ మీడియాపై ఆసక్తి చూపించరు. ఎప్పుడైనా మాట్లాడితే మేం చేయాల్సిన సినిమాలు, ఆయన చేస్తున్న ఇతర సినిమాల గురించే మాట్లాడతారు. అందుకే ప్రభాస్ అంత కూల్‌గా ఉంటారేమో!
- ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment