శోభన్‌బాబు చేసిన ఏకైక వ్యాపారం ఏంటో తెలుసా? | Shoban Babu Sridevi And Jayasudhas Super HIt Film Illalu Completes 40yrs | Sakshi
Sakshi News home page

ఆ రికార్డు శోభన్‌బాబుకే సొంతం

Published Sat, Apr 17 2021 10:36 AM | Last Updated on Sat, Apr 17 2021 7:31 PM

Shoban Babu Sridevi And Jayasudhas Super HIt Film Illalu Completes 40yrs - Sakshi

సృష్టిలో తియ్యనిది తల్లి ప్రేమ! ఒకరు కన్నతల్లి! మరొకరు తల్లి కాని తల్లి! ఇద్దరమ్మల ముద్దుల బిడ్డ మమతల కథ... ‘ఇల్లాలు’. శోభన్‌బాబు, జయసుధ, శ్రీదేవి నటించిన ఈ కుటుంబ కథాచిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌ సినిమా. ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి..’, ‘అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా...’ లాంటి పాటలతో గుర్తుండిపోయిన సినిమా. లేడీ ఫ్యాన్స్‌ అమితంగా ఉన్న హీరో శోభన్‌బాబుకూ, నటనలో ఉన్నత శిఖరాలకు ఎగబాకుతున్న సమయంలో హీరోయిన్లు జయసుధ, శ్రీదేవికీ కెరీర్‌లో అది ఓ మైలురాయి సినిమా. 1981 ఏప్రిల్‌లో రిలీజైన ‘ఇల్లాలు’కు ఇప్పుడు 40 వసంతాలు. 

ఇల్లాలు.. భర్తకు ప్రేమమూర్తి. బిడ్డకుమాతృమూర్తి!  సృష్టికే దేవతామూర్తి!!! భార్యాభర్తల అనుబంధానికీ, కుటుంబ బంధానికీ నిర్వచనమైన ఈ అంశాన్నే తెరపై సెంటిమెంట్‌ నిండిన కుటుంబకథగా చెప్పింది ‘ఇల్లాలు’ చిత్రం. బాబు ఆర్ట్స్‌ పతాకంపై జి. బాబు నిర్మాతగా, అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో, తాతినేని రామారావు దర్శకత్వంలో తయారైందీ సినిమా. ఈ ముగ్గురూ స్నేహితులు, వ్యాపార భాగస్వాములు. ఆ రకంగా ఇది ఆ ముగ్గురి సినిమా. ఇంకా గమ్మత్తేమిటంటే, శోభన్‌బాబు ఆర్థిక అండదండలతో ఏర్పాటైన అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ లక్ష్మీచిత్ర (నైజామ్‌లో శ్రీలక్ష్మీచిత్ర)యే ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అలా మిత్రులందరి సమష్టి సినీ ప్రాజెక్టుగా ‘ఇల్లాలు’ ముందుకు నడిచింది. 

ఇద్దరు తల్లుల కథ – ‘ఇల్లాలు’!
సంసారం సవ్యంగా సాగాలంటే, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవగాహన. ఆ విషయాన్ని ఈ చిత్రం అర్థవంతంగా చెప్పింది. ఆస్తిపాస్తులతో, ధనవంతుల ఇంట్లో పుట్టిపెరిగిన, అహంకారపూరితమైన అమ్మాయి కల్పన (జయసుధ). సామాన్య జీవితాన్ని సాగిస్తున్న కథానాయకుడు కిరణ్‌ (శోభన్‌ బాబు)ను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటుంది. ఓ బిడ్డ పుట్టాక, భర్తతో ఇమడలేనంటూ, అహంభావంతో కాపురాన్ని కాలదన్నుకుంటుంది. ఆ పరిస్థితుల్లో మరో అమ్మాయి జ్యోతి (శ్రీదేవి)ని పెళ్ళి చేసుకుంటాడు. అతని బిడ్డను కన్నతల్లిలా పెంచుతుంటుంది ఆమె. మొదటి భార్య కల్పన తాను పోగొట్టుకున్నదేమిటో గ్రహించి, వెనక్కివచ్చి తన కన్నబిడ్డను ఇమ్మని హీరోను అడుగుతుంది. కన్నపాశం, పెంచిన మమకారం మధ్య నడిచే ఈ చైల్డ్‌ సెంటిమెంట్‌ కథ విశేష ప్రేక్షకాదరణ పొందింది. 

అహంకారంతో కాపురాన్నీ, కన్నబిడ్డనూ కాదనుకున్న సెంటిమెంటల్‌ పాత్రలో జయసుధ, ఒద్దికైన ఇంటి ఇల్లాలుగా శ్రీదేవి, భర్త పాత్రలో శోభన్‌బాబు రాణించారు. సంసార సూత్రాలు గొల్లపూడి రచనలో వినిపిస్తాయి. హిందీ హిట్‌ కథకు ఇది రీమేకైనప్పటికీ, మూలాన్ని అనుసరిస్తూనే, మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. కథనంలోని ఇలాంటి మార్పులు, సెంటిమెంట్‌ బాగా పండించడం ‘ఇల్లాలు’ విజయానికి తోడ్పడ్డాయి. 

ఒకే దర్శకుడు – రెండు హిట్లు!
ఆ ఏడాది మొదట్లో వచ్చిన శోభన్‌బాబు చిత్రాలు ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’ – రెండింటికీ దర్శకుడు తాతినేని రామారావే. ఆయన దర్శకత్వంలో అంతకు ముందెప్పుడో అక్కినేనితో వచ్చిన ‘ఆలుమగలు’కే పాత్రలతో సహా కొన్ని కీలక మార్పులు చేసి, ‘పండంటి జీవితం’ అందించారాయన. ‘ఇల్లాలు’ ఏమో హిందీ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అప్నాపన్‌’ (చుట్టరికం అని అర్థం – 1977)కు రీమేక్‌. జితేంద్ర, రీనారాయ్, సులక్షణా పండిట్‌ నటించగా దర్శక, నిర్మాత జె. ఓం ప్రకాశ్‌ రూపొందించిన ఆ చిత్రం పెద్ద హిట్‌. హిందీ మాతృకలో లక్ష్మీకాంత్‌ – ప్యారేలాల్‌ సంగీతంలో ‘ఆద్మీ ముసాఫిర్‌ హై...’ అంటూ మహమ్మద్‌ రఫీ, లతా మంగేష్కర్‌ పాడే పాట పెద్ద హిట్‌. తెలుగు రీమేక్‌లోనూ జేసుదాస్, ఎస్పీ శైలజ పాడిన సందర్భోచిత ఆత్రేయ రచన ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి...’ మారుమోగిపోయింది. ఈ పాట సినిమాలో పలు సందర్భాల్లో పదే పదే వినిపిస్తూ, కథలోని మూడ్‌ను పెంచింది. 

తోటి హీరోల్లో... ఆయనదే రికార్డు!
అప్పట్లో ‘ఇల్లాలు’ చిత్రం 6 కేంద్రాలలో (విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, తెనాలి, హైదరాబాద్‌) డైరెక్టుగా వంద రోజులు ఆడింది. 2 కేంద్రాలలో (కాకినాడ, చీరాల) షిఫ్టుతో, రోజుకు మూడు ఆటలతో శతదినోత్సవం చేసుకుంది. అలా 8 కేంద్రాలలో రెగ్యులర్‌ షోలతో శతదినోత్సవం జరుపుకొన్న చిత్రమైంది. ఇవి కాక, మరో 4 కేంద్రాలలో నూన్‌ షోలతో – మొత్తంగా 12 కేంద్రాలలో ఈ ఫ్యామిలీ డ్రామా వంద రోజుల పండగ చేసుకుంది. 1981 ఆగస్టు 16న మద్రాసులోని చోళా హోటల్‌లో శతదిన ఘనమహోత్సవం జరిపారు. ప్రేక్షకాదరణతో ఆపైన ‘ఇల్లాలు’ రజతోత్సవమూ చేసుకుంది.

బాక్సాఫీస్‌ లెక్క చూస్తే – ఇలా ఎనిమిది, అంతకు మించి కేంద్రాలలో రెగ్యులర్‌ షోలతో వంద రోజులు ఆడిన సినిమాలు శోభన్‌బాబు కెరీర్‌లో ఏకంగా పది ఉన్నాయి. ‘ఇల్లాలు’కు ముందు ఆయన కెరీర్‌లో 8 చిత్రాలు కనీసం 8 కేంద్రాల్లో వంద రోజులాడాయి. ‘సంపూర్ణ రామాయణం’ (10 కేంద్రాలు), ‘జీవన తరంగాలు’(12), ‘శారద’ (8), ‘మంచి మనుషులు’(11), ‘జీవనజ్యోతి’ (12), ‘జేబుదొంగ’(10), ‘సోగ్గాడు’ (19), ‘గోరింటాకు’ (8), తర్వాత ‘ఇల్లాలు’ (8 కేంద్రాలు) 9వ సినిమా అయింది. ఆ తర్వాత ‘దేవత’ చిత్రం (9 కేంద్రాలు) ఆ శతదినోత్సవ విజయాల జాబితాలో పదోది అయింది. గమ్మత్తేమిటంటే, తన సమకాలీన హీరోలలో అలాంటి శతదినోత్సవ చిత్రాలు అత్యధికంగా ఉన్నది శోభన్‌బాబుకే! ఇలా పది చిత్రాలతో శోభన్‌బాబు హయ్యస్ట్‌గా నిలిస్తే, ఆయన సమకాలీన హీరోల సెకండ్‌ హయ్యస్ట్‌ 4 చిత్రాలే కావడం గమనార్హం!  

ఆ రోజుల్లో హీరోల్లో శోభన్‌ బాబుకు మహిళాదరణ ఎక్కువ. ఆ కారణంగా ఆయన సినిమాలు బాగా ఆడేవి. ఎక్కువ రోజుల రన్‌ కూడా వచ్చేది. సమకాలీన హీరోలకు మించి ఆయనకు శతదినోత్సవ చిత్ర రికార్డుకు అది ఓ ప్రత్యేక కారణం. శోభన్‌బాబు ఈ పది శతదినోత్సవ చిత్రాల విజయయాత్ర సాగించిన 1972 – 1982 మధ్య కాలానికి సంబంధించి మొత్తం తెలుగు సినీపరిశ్రమ పరంగా గమనిస్తే – ఎన్టీఆర్‌ (15 చిత్రాలు) తరువాత శోభన్‌ బాబుదే (10 చిత్రాలు) అగ్రస్థానం. చివరకు సీనియర్‌ హీరోలతో సహా మిగతా హీరోలెవరూ శోభన్‌బాబులో సగం మార్కును కూడా దాటలేకపోయారు. అదీ ఆ కాలఘట్టంలో హీరో శోభన్‌బాబుకున్న సక్సెస్‌ స్టామినా!

ముగ్గురు మిత్రుల ‘దీపారాధన’
ఒకపక్కన ‘ఇల్లాలు’ క్రిక్కిరిన ప్రేక్షకులతో ఆడుతుంటే, అదే సమయంలో... ఆ పక్కనే కూతవేటు దూరంలో... వేరే హాలులో శోభన్‌బాబు సినిమా ‘దీపారాధన’ సక్సెస్‌ఫుల్‌గా నడవడం ఆ రోజుల్లోని ఓ విశేషం. ‘బలిపీఠం’, ‘గోరింటాకు’ తరువాత దర్శకుడు దాసరి – శోభన్‌బాబుల కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. స్నేహం విలువను చాటే ఈ సినిమా నిరుద్యోగులైన ముగ్గురు ప్రాణమిత్రుల (శోభన్, మోహన్‌బాబు, మురళీమోహన్‌) కథ. వారిలో ఒకరైన హీరోకు పెళ్ళి కావడం... ఎదురైన సంఘటనలు... త్యాగాలు... ఇలా సెంటిమెంటల్‌గా సాగే, సంభాషణల ప్రధానమైన సినిమా ఇది. ‘వచ్చే జన్మంటూ ఉంటే మీ భార్యగా కాకుండా, స్నేహితుడిగా పుట్టాలని కోరుకుంటున్నా’ అంటూ కన్నుమూసే త్యాగభరిత కథానాయికగా జయప్రద కనిపిస్తారు. చక్రవర్తి బాణీల్లో ‘సన్నగా సనసన్నగా...’, ‘తూరుపు తిరిగి దణ్ణం పెట్టు అన్నారండి మావారు...’ పాటలు అప్పట్లో పదే పదే వినిపించేవి. ‘దీపారాధన’ మధ్యతరగతి మహిళలను ఆకట్టుకుంది. ‘ఇల్లాలు’ తర్వాత రెండు రోజుల తేడాలో ‘దీపారాధన’ షిఫ్టులు, నూన్‌ షోలతో 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొంది. 

వంద రోజుల్లో...3 వంద  రోజులు 
నిజం చెప్పాలంటే, శోభన్‌ బాబుకు ఒకటికి మూడు శతదినోత్సవ చిత్రాలు అందించి, బాగా కలిసొచ్చిన సంవత్సరాల్లో ఒకటి – 1981. ఆ ఏడాది జనవరి 1న వచ్చిన ‘పండంటి జీవితం’ వంద రోజులు ఆడింది. అప్పట్లో విజయవాడ (కల్యాణచక్రవర్తి థియేటర్‌) సహా 4 కేంద్రాలలో ‘పండంటి జీవితం’ చిత్రాన్ని 98 రోజులకే ఎత్తేసి, 99వ రోజున ఏప్రిల్‌ 9న అదే శోభన్‌బాబు నటించిన కొత్త చిత్రం ‘ఇల్లాలు’ రిలీజ్‌ చేశారు. గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ కూడా సూపర్‌ హిట్టయి, వంద రోజులు దాటేసింది. ఇంకా గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ రిలీజయ్యాక రెండు రోజుల తేడాతో ఏప్రిల్‌ 11న శోభన్‌బాబు నటించినదే ‘దీపారాధన’ రిలీజైంది. ఒక పక్కన ‘ఇల్లాలు’ విపరీతమైన ఆదరణతో నడుస్తుండగానే, మరోపక్క ‘దీపారాధన’ కూడా హిట్టయింది. శతదినోత్సవమూ జరుపుకొంది. మొత్తానికి, వంద రోజుల వ్యవధిలో 3 వంద రోజుల సినిమాలు రావడం ఏ హీరోకైనా అరుదైన సంఘటన. ఆ మూడూ కుటుంబ కథలు, సెంటిమెంట్‌ చిత్రాలే తప్ప, మాస్‌ యాక్షన్‌ సినిమాలు కావు. అది గమనార్హం. అప్పట్లో శోభన్‌బాబు సినిమాకున్న మహిళాదరణకు అది ఓ నిదర్శనం.  

శోభన్‌బాబు చేసిన ఏకైక సినీ వ్యాపారం! 
అప్పట్లో దర్శకుడు తాతినేని రామారావు, నిర్మాణ సారథులు అట్లూరి పూర్ణచంద్రరావు, జి. బాబు, తరువాతి కాలంలో నిర్మాతగా పేరు తెచ్చుకున్న వై. హరికృష్ణ (మేనేజింగ్‌ పార్ట్‌నర్‌) – నలుగురూ కలసి చిత్రనిర్మాణం చేసేవారు. కేంద్రీకృత సినీ పంపిణీ వ్యవస్థ ఇంకా పట్టుసడలని సమయం అది. ఆ పరిస్థితుల్లో ఆ నలుగురూ, హరికృష్ణ మేనల్లుడైన కాట్రగడ్డ ప్రసాద్, హైదరాబాద్‌ ‘వెంకటేశా’ థియేటర్‌ బి.వి. రాజు, తర్వాత టి.టి.డి చైర్మనైన ఆదికేశవులునాయుడు భాగస్వాములుగా ‘లక్ష్మీచిత్ర’ అనే ఓ కొత్త పంపిణీ సంస్థను ప్రారంభించారు. హీరో శోభన్‌బాబు ఆర్థికంగా అండగా నిలిచారు. తన సతీమణికి అన్నగారైన గోపిని అందులో భాగస్వామిని చేశారు. ఒకరకంగా శోభన్‌బాబు సినీ వ్యాపారమంటూ చేసింది – ఈ పంపిణీ సంస్థలో చేతులు కలపడమొక్కటే! 

1979 మార్చి 29న విజయవాడలో ‘లక్ష్మీచిత్ర’ కార్యాలయం ప్రారంభమైంది. ఆంధ్రాలో ‘లక్ష్మీచిత్ర’గా, నైజామ్‌లో ‘శ్రీలక్ష్మీచిత్ర’గా వ్యాపారం నడిచింది. శోభన్‌ హీరోగా నటించిన ‘కార్తీకదీపం’ తొలి ప్రయత్నంగా విడుదలైంది. అది సూపర్‌ హిట్‌. అక్కడ నుంచి ‘లక్ష్మీచిత్ర’ వెనుదిరిగి చూడలేదు. వరుసగా కొన్నేళ్ళు శోభన్‌ సినిమాలన్నీ ఆ సంస్థే పంపిణీ చేసింది. 1981 మొదట్లో రిలీజైన ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’– లక్ష్మీచిత్ర రిలీజ్‌లే. శోభన్‌తో చిత్రాలు నిర్మించే స్థాయికి వై. హరికృష్ణ ఎదిగారు. కాట్రగడ్డ ప్రసాద్‌ ‘వసుధాచిత్ర’తో డిస్ట్రిబ్యూషన్‌ నడిపి, మేనమామ బాటలో నిర్మాత అయరు. ఇప్పుడు సౌతిండియన్‌ ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడయ్యారు.

మహిళలు మెచ్చిన అందాల నటుడు
సినిమాల్లోనే కాదు... చదువుకొనే రోజుల నుంచి అందగాడు శోభన్‌ బాబుకు లేడీస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. చదువుకొనే రోజుల్లో ఆఖరు నిమిషంలో కాలేజీ ఎన్నికల్లో అనుకోకుండా పాల్గొనాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనకు లేడీ స్టూడెంట్స్‌ ఓట్లు మూకుమ్మడిగా పడ్డాయి. అనూహ్యంగా ఆయన గెలిచారు. ఆ సంగతి శోభన్‌బాబే స్వయంగా రాశారు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయనకు మహిళా అభిమానులే ఎక్కువ.

‘శారద’, ‘జీవన తరంగాలు’, ‘జీవనజ్యోతి’ చిత్రాల రోజుల నుంచి ఆ ఫాలోయింగ్‌ అలా కొనసాగుతూ వచ్చింది. అందుకే, ఒక దశ దాటిన తరువాత నుంచి ఆయన తన ప్రధాన అభిమాన వర్గమైన మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేసేవారు. మహిళలు మెచ్చే అంశాలు, సెంటిమెంట్‌ ఉండేలా చూసుకొనేవారు. 1979 నాటి ‘కార్తీక దీపం’ మొదలు ‘గోరింటాకు’, ‘ఇల్లాలు–ప్రియురాలు’, ‘శ్రావణసంధ్య’(’86)  – ఇలా అన్నీ అశేష మహిళాదరణతో ఆయన కెరీర్‌ను అందంగా తీర్చిదిద్దినవే. మరణానంతరం కూడా ఇవాళ్టికీ ఆయనకు ఒక వర్గం అభిమానులు ఉన్నారంటే, దానికి ఆ కథలు, ఆ సినిమాలు అందించిన ఇమేజే కారణం. 
 – రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement