‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడీ’ మూవీ రివ్యూ | Love, Life And Pakodi Movie Review, Rating In Telugu | Sakshi
Sakshi News home page

సెక్స్‌.. ప్రేమ.. పెళ్ళి.. సందేహాల సహజీవనం 

Published Sat, Mar 13 2021 1:32 AM | Last Updated on Sat, Mar 13 2021 1:36 PM

Love, Life And Pakodi Movie Review, Rating In Telugu - Sakshi

చిత్రం: ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడీ’;
తారాగణం: బిమల్‌ కార్తీక్‌ రెబ్బా, సంచితా పూనఛా;
కెమేరా: సాగర్‌ వై.వి.వి, జితిన్‌ మోహన్‌;
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ సిద్దారెడ్డి;
సమర్పణ: ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి;
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: జయంత్‌ గాలి;
రిలీజ్‌: మార్చి 12

మారుతున్న సమాజంలో ప్రేమ, పెళ్ళి, ఫ్యామిలీ కూడా మారిపోతున్నాయి. వాటి చుట్టూ ఏళ్ళ తరబడిగా రాసుకున్న విలువలూ మారుతున్నాయి. మన అభిప్రాయాలూ మారుతున్నాయి. అయితే, మనిషిలోనూ, చుట్టూ సమాజంలోనూ ఎన్ని మార్పులు వచ్చినా, మనసులో మాత్రం ఇప్పటికీ లివిన్‌ రిలేషన్‌షిప్, ప్రేమ, పెళ్ళి, విడాకుల లాంటి అంశాల మధ్య నవతరంలోనూ బోలెడన్ని కన్‌ఫ్యూ జన్లు. ఆ సందేహాల ఊగిసలాటను తెర మీదకు తెస్తే? ప్రీ మ్యారిటల్‌ సెక్స్‌ కామన్‌ అవుతున్న రోజుల్లోనూ పెళ్ళి మీద అనుమానాలను బ్యాలెన్సుడ్‌ గా చర్చిస్తే? అందరూ కొత్తవాళ్ళే చేసిన అలాంటి ప్రయత్నం – ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడీ’.

కథేమిటంటే..:  బెంగళూరు నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమంటే తెలియని వయసు నుంచి ముగ్గురు, నలుగురితో బ్రేకప్‌ అయిన వ్యక్తి – అరుణ్‌ (కార్తీక్‌). అతనికి అనుకోకుండా రేయా (సంచిత) పరిచయమవుతుంది. ఆల్రెడీ వేరొకరితో బ్రేకప్‌ అయి, అబార్షన్‌ కూడా చేయించుకున్న ఆ హీరోయిన్, మన హీరోతో ప్రేమలో పడుతుంది. పెళ్ళి, గిళ్ళి లాంటి జంఝాటాలేమీ లేకుండా సహజీవనం చేసేస్తుంటారు హీరో, హీరోయిన్‌.  

ఒక సందర్భంలో పెళ్ళి ప్రతిపాదన తెస్తాడు హీరో. ప్రేమకు ఓకే కానీ, పెళ్ళికి నో అంటుంది హీరోయిన్‌. భర్తతో విడిపోయిన తల్లిని అలా వదిలేసి, తాను పెళ్ళి చేసుకోనంటుంది. అవతలివాళ్ళను ప్రతిదానికీ జడ్జ్‌ చేసే పాతబడ్డ హీరో అభిప్రాయాలను తన కౌన్సెలింగ్‌తో హీరోయిన్‌ బద్దలు కొడుతుంది. అలా తండ్రికి మళ్ళీ దగ్గరవుతాడు హీరో. కాగా, కన్‌ఫ్యూజన్‌లో ఉన్న హీరోయిన్‌కు ఆమె తల్లి ఓ షాక్‌ ఇస్తుంది. తానూ ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానంటుంది. అక్కడ నుంచి కథ మరో కీలక మలుపు తిరుగుతుంది. తల్లీ కూతుళ్ళ ప్రేమకథలు అనుకోకుండా ఒకదానికొకటి ముడిపడతాయి. ఆ తరువాత ఏమైంది, పెళ్ళి లేని ప్రేమ ఉండవచ్చేమో కానీ, పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ప్రేమ ఉంటుందా లాంటి అంశాలపై చర్చతో మిగతా సినిమా కథ సాగుతుంది.

ఎలా చేశారంటే..:  అందరూ కొత్తవాళ్ళతో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులంతా సహజంగా అనిపిస్తారు. వారి కన్నా ఆ పాత్రలే కనిపిస్తాయి. హీరో కార్తీక్‌ తెరపై అందంగా ఉన్నారు. అందంతో పాటు, పాత్రచిత్రణ బలం రీత్యా హీరోయిన్‌ సంచిత ప్రత్యేకంగా నిలిచారు. బాడీ లాంగ్వేజ్‌లోనూ, నటనలోనూ అప్రయత్నంగా పాపులర్‌ హీరోయిన్‌ నిత్యా మీనన్‌ను గుర్తుకు తెస్తారు. ఇలాంటివెన్నో కలవడంతో– హీరో కన్నా ముందు ప్రేక్షకులే ఈ హీరోయిన్‌తో ప్రేమలో పడతారు. హీరో తండ్రి పాత్రలో కృష్ణ హెబ్బలే, హీరోయిన్‌ తల్లి పాత్రలో కళాజ్యోతి వగైరా యథోచితంగా నటించారు. 

ఎలా తీశారంటే..:  నవలను సినిమాగా తీయవచ్చు. అది కొద్దిగా కష్టం. సినిమాను నవల లాగానూ తీయవచ్చు. ఈ రెండోది మరీ కష్టం. ఫన్‌ తక్కువ, సీరియస్‌నెస్‌ ఎక్కువున్న ఈ సినిమా కథాకథనం రెండో ఫక్కీలోది. ఫస్టాఫ్‌ నిదానంగా సాగుతుంది. ఎంతసేపటికీ ప్రీ మ్యారిటల్‌ సెక్స్, బ్రేకప్, తాగుడు, తిరుగుళ్ళ చుట్టూరానే కథ నడుస్తున్నదేమో అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ, కథనం ఊపందుకుంటాయి. కథలోని మలుపులతో పాటు వివిధ పాత్రల మధ్య చర్చ, డైలాగులు ఆలోచింపజేస్తాయి. ‘‘నాలుగేళ్ళుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నవాడితోనే హ్యాపీగా లేకపోతే, కొత్తగా పెళ్ళి చేసుకొనేవాడితో ఏం హ్యాపీగా ఉంటాం’’ (స్నేహితురాలితో హీరోయిన్‌) లాంటి డైలాగులతో వేర్వేరు సీన్లను దర్శకుడు జయంత్‌ కన్విన్సింగ్‌గా రాసుకున్నారు.

నిజానికి, కథాకథనానికి నేపథ్య గీతాలు, సంగీతం కాస్తంత ఎక్కువగానే వాడిన ఈ చిత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా వచ్చిన ఇండిపెండెంట్‌ సినిమా. ఎక్స్‌ప్లిసిట్‌ సీన్లు, డైలాగులు చాలానే ఉన్నప్పటికీ, మారుతున్న సమాజానికీ – మారని మనుషుల మానసిక స్థితికీ మధ్య సంఘర్షణను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ఇతివృత్తంతో గతంలోనే కొన్ని సినిమాలు ఇంగ్లీషు, హిందీ, మలయాళాల్లో రాకపోలేదు. ప్రేమ, పెళ్ళి, రిలేషన్‌షిప్‌ లాంటి అంశాలను తెలుగులోనూ కొన్ని సినిమాలు బలంగానే ప్రస్తావించాయి. ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడీ’ ఆ బాటలో తెరపై ఫ్రెష్‌నెస్‌ తీసుకురావడం గమనార్హం. 

కెమెరా వర్క్, పవన్‌ నేపథ్య సంగీతం, సమర్పకుడిగా ‘మధుర’ శ్రీధర్‌ రెడ్డి తీసుకున్న శ్రద్ధతో ఒక రకంగా ఈ సినిమా కలరే మారింది. బెంగళూరులో ఉంటున్న రాయలసీమ బిడ్డ జయంత్‌ తన తొలి ప్రయత్నంలో, ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని సీన్లు బాగా రాసుకున్నారు. రెస్టారెంట్‌ సీన్‌లో హీరోయిన్‌ కు హీరో నిజాయతీగా ప్రపోజ్‌ చేసే సన్నివేశంలోని డైలాగులు చేయి తిరిగిన మాటల మాంత్రికుల్ని తలపించాయి. హీరోయిన్‌కీ – ఆమె తల్లికీ మధ్య డిస్కషన్, ముఖ్యంగా క్లైమాక్స్‌ లో పెళ్ళి – ప్రేమ గురించి  హీరోకు హీరోయిన్‌ చేసే ప్రబోధం సీన్లు కాసేపు ఆలోచనల్లోకి నెడతాయి. ‘‘పెళ్ళి చేసుకుంటే ఏమొస్తుంది బొజ్జ తప్ప’’ (హీరోతో ఫ్రెండ్‌) లాంటివేమో నవ్విస్తాయి.

పెళ్ళికి ముందే సెక్స్, అబార్షన్, బ్రేకప్‌లు, పార్టీలు, మందు కొట్టడం, గంజాయి తాగడం, యథేచ్ఛగా బూతులు మాట్లాడడం, స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించడం లాంటి వాటితో నేటి ఆధునిక నగర యువతికి ప్రతీకగా హీరోయిన్‌ పాత్ర కనిపిస్తుంది. కథలోని నిజాయతీ, ఆ పాత్ర, ఆ పాత్రలో కన్నడమ్మాయి సంచిత అభినయం కొంతకాలం గుర్తుండిపోతాయి. వెండితెరపై కథావస్తువులో, స్త్రీ పాత్రల రూపకల్పనలో వస్తున్న మార్పుల గురించి రాబోయే రోజుల్లో చర్చిస్తున్నప్పుడు ఈ సినిమా, ఈ పాత్ర ప్రస్తావనకు వస్తాయి. వాణిజ్య విజయం మాటెలా ఉన్నా ఈ ప్రత్యేకతే ఈ సినిమాను కాస్తంత విభిన్నంగా నిలబెడుతుంది. అయితే, అధిక శాతం ఇంగ్లీషు డైలాగులతో ఇది తెలుగు సినిమాయేనా అని అనుమానమూ వస్తుంది. ప్రేమ, పెళ్ళి, బ్రేకప్పులు అందరికీ కామనే అయినా, అనేక పరిమితుల మధ్య కొత్తవాళ్ళు తీసిన ఈ చిత్రం మల్టీప్లెక్స్‌ జనం మెచ్చే న్యూ ఏజ్‌ అర్బన్‌ ఫిల్మ్‌ కావచ్చనిపిస్తుంది. 

కొసమెరుపు: కమర్షియాలిటీకి భిన్నమైన ఇండిపెండెంట్‌ ప్రయత్నం!

బలాలు:
నవ సమాజపు పోకడలున్న కథ, పాత్రలు
సంగీతం, రీరికార్డింగ్‌
హీరోయిన్‌ సంచిత స్క్రీన్‌ప్రెజెన్స్, నటన
సెకండాఫ్‌లోని కొన్ని సీన్లు, డిస్కషన్లు

బలహీనతలు: నటీనటులు, దర్శకుడు అందరికీ తొలి సినిమా కావడం
ఫస్టాఫ్‌ నవల తరహాలో సాగే నిదానపు కథనం
రెగ్యులర్‌ కమర్షియల్‌ సూత్రాలకు భిన్నంగా ఉండడం

– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement