లవ్‌లీ చిక్కుముడి | Premam film Monsoon hit Kerala | Sakshi
Sakshi News home page

లవ్‌లీ చిక్కుముడి

Published Tue, Jun 30 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

లవ్‌లీ చిక్కుముడి

లవ్‌లీ చిక్కుముడి

మలయాళీ అమ్మాయిల జుట్టు చూస్తే
ఓ చిక్కుముడుల ప్రేమకథలా అనిపిస్తుంది.
అమ్మాయి జుట్టులోనే ఇన్ని చిక్కులుంటే
ఆమెతో ప్రేమలో ఎన్ని ముడులుంటాయో!
జుట్టుకైతే దువ్వెనకున్న పళ్లు బలి అవుతాయి.
మరి ఆమె ప్రేమకు?
పళ్లు ఊడేకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా అన్నది డౌటే!
‘ప్రేమమ్’ సినిమా కేరళను మాన్‌సూన్‌లా తాకింది.


ఆకాశం నుంచి కాసులు ఊడిపడుతున్నాయి.
రికార్డుల ఉరుములు వినిపిస్తున్నాయి.
ఇది ఇప్పట్లో ఆగే వర్షంలా లేదు.
త్వరలోనే రీమేక్‌గా మనల్నీ తాకవచ్చు.


రామ్
ఎడిటర్, ఫీచర్స్

 
జూన్ మూడోవారం... తిరువనంతపురంలోని హాలు.
బుకింగ్ ఇంకా తెరవలేదు... క్రిక్కిరిసిన జనం... ఎక్కువభాగం యూత్... కాలేజీ కుర్రకారు. పదిహేను రోజుల పైగా మలయాళ సీమను ఉర్రూతలూపేస్తున్న ఆ సినిమాను ఎలాగైనా చూడాలని వాళ్ళలో ఉత్సాహం... రోజుకు అయిదాటలు వేస్తున్నా, క్రేజ్ తగ్గని ఆ సినిమాకు టికెట్లు దొరుకుతాయో లేదో అని చిన్న ఉత్కంఠ...
 
ఇంతలో ఉన్నట్టుండి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. కారణం - ఊళ్లోని కాలేజీ స్టూడెంట్లు మూకుమ్మడిగా క్లాసులకు ఎగనామం పెట్టి, సదరు సినిమాకు వస్తున్నారని కంప్లయింట్స్! అరవైమందికి పైగా స్టూడెంట్స్‌ను పోలీసులు బలవంతాన వెనక్కి పంపాల్సి వచ్చింది.
 
కనివినీ ఎరుగని ఈ సంఘటనకు కారణమైన ఆ మలయాళ సినిమా విడుదలై ఇవాళ్టికి నెల దాటింది. ఈ అయిదోవారంలోనూ జనం వేలంవెర్రిగా వస్తూనే ఉన్నారు. టికెట్ల కోసం పై స్థాయి నుంచి ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఒక్క కేరళలోనే కాదు... రిలీజైన ప్రతిచోటా ఇదే పరిస్థితి. ఆ లేటెస్ట్ హిట్.. ‘ప్రేమమ్’ (లవ్ అని అర్థం).

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్!
రిలీజైన రెండు వారాల్లో... ఒక్క కేరళలోనే రూ. 20 కోట్లు వసూలు చేసిన ‘ప్రేమమ్’ ఇవాళ టాక్ ఆఫ్ ది సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మొదటివారంలో మలయాళ బిగ్గెస్ట్ హిట్స్ ‘దృశ్యం’, ‘బెంగుళూర్ డేస్’లను మించి, వసూలు చేసిందీ సినిమా. ఇప్పుడు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్... అన్నిచోట్లా హౌస్‌ఫుల్‌గా ఆడుతోంది. ఈ వరుస చూస్తుంటే, రాగల రోజుల్లో ‘ప్రేమమ్’ రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించి, ‘మల్లు’ ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిల్చినా ఆశ్చర్యం లేదు.
 
మమ్మూటి, మోహన్‌లాల్ లాంటి టాప్‌స్టార్సెవరూ లేని ‘ప్రేమమ్’కు ఇంత క్రేజేంటి? మలయాళ సీమలో వాళ్ళే ఇప్పటికీ టాప్ స్టార్స్. కానీ, వాళ్ళ అభిమానులు పెద్దవాళ్ళయిపోతుంటే, సినిమాలకు మహారాజ పోషకులైన యూత్‌లో కొత్తతరం నటులకు క్రేజ్ పెరుగుతోంది.  సమకాలీన కథలనే ఎక్కువగా కోరుకుంటున్నారు. తమ అనుభవాలనూ, తమలో ఒకడిగా అనిపించే హీరోనూ తెరపై చూడడానికి ఇష్టపడుతున్నారు. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘బెంగుళూర్ డేస్’ లాంటివి బాగా ఆడడానికీ, ఆ చిత్రాల ఫేమ్ 30 ఏళ్ల నివిన్ పౌలీ (‘ప్రేమమ్’లో హీరో కూడా ఇతనే) హాట్‌స్టార్‌గా మారడానికీ అదే కారణం.
 
గుర్తుకొస్తున్నాయీ... గుర్తుకొస్తున్నాయీ!
రోజూ సినిమాలను కళ్ళతో చూస్తాం. చెవులతో వింటాం. కానీ, ‘ప్రేమమ్’ లాంటి కొన్ని మాత్రం కళ్ళకు కాదు, మనసుకు పని చెబుతాయి. తెర మీది విజువల్సే స్టెతస్కోపై మర్చిపోయిన మన గుండె చప్పుడును మనకే వినిపిస్తాయి. నోస్టాల్జియా ఎప్పుడైనా, ఎవరికైనా మధుర జ్ఞాపకమే. చిన్నప్పటి అదుపు లేని అల్లరి... బాధ్యతలు తెలియని రోజుల్లో చేసిన చేష్టలు... టీనేజీ కాలేజీ వయసులో తిరిగిన రోడ్లు... కలిసిన స్నేహాలు... ప్రేమ కోసం పడినపాట్లు... కళ్ళ ముందే కరిగిన కలలు... అన్నీ ఎవరికి వారికే యునీక్ ఎక్స్‌పీరియన్స్. అదే సమయంలో ఆ దృశ్యాలన్నీ అందరిలో ఒకే తీగను సమశ్రుతిలో కదిలించే మ్యూజికల్ సింఫనీలు. ‘ప్రేమమ్’ చేసిన పని అదే.
 
ముప్ఫై ఒక్క ఏళ్ళ క్రితం పుట్టిన ఒక కుర్రాడి జీవితం ఇది. కథలోని హీరోలానే 1984లోనే పుట్టిన 31 ఏళ్ళ డెరైక్టర్ అల్ఫోన్స్ పుతరెన్ తన అనుభవాలను ఈ సినిమాగా అందించారా అనిపిస్తుంది. మొదట టీనేజ్‌లో, తరువాత కాలేజ్‌లో, చివరకు కెరీర్‌లో సెటిలైన స్టేజ్‌లో కథానాయక పాత్రకు ఎదురైన మోహావేశపు ప్రేమానుభూతులు ఈ సినిమాలో కనిపిస్తాయి. అవన్నీ మనల్ని ఫ్లాష్‌బ్యాక్‌లోకి నడిపిస్తాయి. తెరపై ఉన్న పాత్రల్లో ఏదో ఒకదానితో, మరేదో ఒక సందర్భంలో మనల్ని మనం చూసుకొనేలా జీవితాన్ని గుర్తుచేస్తాయి. ఈ సినిమా ప్రధాన బలం అదే!  
 
ఫస్ట్ ఫిల్మ్‌తోనే... టాప్ హీరోయిన్స్
కథానాయక పాత్ర జార్జ్ (నివిన్ పౌలీ) జీవితంలోని వివిధ ఘట్టాల్లో ప్రేమను అనుభూతించిన ప్రతి క్షణం మన గుండె కూడా ‘లవ్... డబ్... లవ్... డబ్’ అని కొట్టుకుంటుంది. ఊహించని అడ్డంకులెదురైన ప్రతిసారీ, ఎలాగైనా అతని ప్రేమ గెలిస్తే, మనమూ గెలిచినట్లే అనుకుంటాం. ఈ సహానుభూతి ఇవాళ ప్రతిచోటా ‘ప్రేమమ్’ను స్పెషల్‌గా నిలబెడుతోంది. కలెక్షన్స్ రాబడుతోంది.
 
ఇలాంటి కథలు గతంలో కూడా వచ్చాయి కదా! ‘ప్రేమమ్’ గొప్పేంటట? దానికి జవాబు - ఫ్రెష్‌నెస్. డిగ్రీ సెకండియర్ చదువుతున్న ‘సాదాసీదా జీన్స్, చుడీదార్ అమ్మాయి’ అనుపమా పరమేశ్వరన్‌కు ఇదే మొదటి సినిమా. అయితేనేం? టీనేజ్ హీరో ప్రేమించే స్టూడెంట్ మేరీ పాత్రలో అమాయకమైన చిరునవ్వుతో ఈ కేరళ కుట్టి అందరి హృదయాలనూ కొల్లగొట్టింది. పోస్టర్ల నిండా ఆమె ఫోటోలే. మరో ప్రేమికురాలైన లెక్చరర్ మలర్ పాత్ర పోషించిన తమిళ పొన్ను సాయి పల్లవి జార్జియాలో ఫైనలియర్ ఎమ్బీబీయస్ స్టూడెంట్. డ్యాన్స్ రియాలిటీ షోలలో కొన్నేళ్ళ క్రితం ఆమెను టీవీలో చూసిన డెరైక్టర్ ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌లో, ఫోన్‌లో వెంటపడి మరీ ఆమెను ఎంచుకున్నారు. మొటిమలతో ఎర్రబడ్డ కుడి చెంపతో మన పక్కింటి అమ్మాయే అనిపించే సాయి పల్లవి ఈ ఫస్ట్‌ఫిల్మ్‌తోనే ఇవాళ కేరళ కుర్రకారు గుండె చప్పుడు.
 
టెక్నికల్ ఫ్రెష్‌నెస్... మ్యూజికల్ మ్యాజిక్
కథకు కీలకమైన ఈ హీరోయిన్లతో సహా ఏకంగా 17 మంది కొత్త ముఖాలను పరిచయం చేసిన ఈ మలయాళ ఫిల్మ్‌లో సన్నివేశాలు, డైలాగ్స్ సమకాలీన మలయాళ సమాజపు మట్టిపరిమళాన్ని గుప్పుమనిపిస్తాయి. ఈ తాజాదనపు అనుభూతికి కెమేరా (ఆనంద్ సి. చంద్రన్), ఎడిటింగ్ (దర్శక - రచయిత అల్ఫోన్స్ పుతరెన్), మ్యూజిక్ (రాజేశ్ మురుగేశన్) అదనపు చేర్పు. రెగ్యులర్ ఫార్మట్‌కు భిన్నంగా లైటింగ్ నుంచి కలర్ గ్రెడేషన్ దాకా అన్నిటిలో రియలిజానికే పెద్దపీట. ఎడిటింగూ అంతే! ఏడు మలయాళం పాటలు, 2 తమిళ పాటలు... పెద్ద మ్యూజికల్ హిట్. ‘ఆళువా పుళయుడ తీరత్తు..’(ఆళువా ఏటి ఒడ్డున), విజయ్ ఏసుదాస్ పాడిన ‘మలరే...’ పాటలు ఇప్పుడు కేరళలో వినిపించని ఊరు లేదు. ఎక్స్‌ట్రీమ్ క్లోజప్పులతో సాగే కొన్ని దృశ్యాలలో, డైలాగుల్లేకుండా హీరో రోదించే సీన్‌లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకం. ఇలాంటి కొత్త తరహా పనితీరు సినిమాకు మరింత కొంగ్రొత్తదనాన్ని సంతరించింది. అది ‘ప్రేమమ్’కు మరో ఎడ్వాంటేజ్.
 
అలుపెరుగని అన్వేషణ
ఈ సినిమాకూ, తమిళంలో చేరన్ తీసిన ‘ఆటోగ్రాఫ్’ (రవితేజతో రీమేకైన ‘నా ఆటోగ్రాఫ్...’)కూ పోలికలున్నాయని కొందరు తేలిగ్గా తీసిపారేయచ్చు. కానీ, ఆ పోలిక మహా అయితే కథాంశం వరకే. ఇక్కడి సీన్లు డిఫరెంట్. ఆలోచనకు అవకాశం, అవసరం ఇవ్వని రొటీన్ ఫిల్మ్స్‌కు అలవాటుపడిపోయిన కళ్ళకు ఈ రెండుమ్ముప్పావు గంటల లవ్‌స్టోరీ సుదీర్ఘంగా అనిపించవచ్చు. కానీ, ‘ప్రేమమ్’ గుర్తుకుతెచ్చే జ్ఞాపకాలతో పోలిస్తే, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయమే కాదు. తేనె కోసం పువ్వులను వెతికే సీతాకోక చిలుకలా, మనిషి ప్రేమ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆ అన్వేషణ ఫెయిల్ కావచ్చు. ఆ క్రమంలో పరిస్థితుల్లో వచ్చే అతి చిన్న మార్పులు సైతం ఫలితంపై గణనీయ ప్రభావం చూపుతాయి. ఆఖరుకు ఎక్కడో ఒకచోట అన్వేషణ సక్సెసై, సెటిలవుతాడు. స్థూలంగా... ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’. తెరపై సీతాకోక చిలుకల్ని పదే పదే చూపిన డెరైక్టర్ మాటల్లో, ‘బటర్‌ఫ్లైస్ ఆర్ మెంటల్లీ మెంటల్, సో ఈజ్ లవ్!’
 
మొత్తానికి, మొన్న మే నెలాఖరుకు కేరళ తీరాన్ని ఒకటి కాదు... రెండు పవనాలు తాకాయి. మొదటిది - చిరుజల్లుల నైరుతీ ఋతుపవనాలు. రెండోది - మంచి సినిమాల కోసం తపిస్తున్న ప్రేక్షకుడిని తాకిన సినీ మలయసమీరం ‘ప్రేమమ్’. రెండూ తాపాన్ని తీర్చి, పరిసరాల్ని ఆహ్లాదంగా మార్చినవే! కావాలంటే, దగ్గరలో ఉన్న మల్టీప్లెక్స్‌కు వెళ్ళండి. టికెట్లు ముందే బుక్ చేసుకొని, ప్రేమిస్తున్నవాళ్ళను వెంటపెట్టుకొని మరీ వెళ్ళండి. ‘ప్రేమ’(మ్) డిజప్పాయింట్ చేయదు! మలయాళం రాకపోయినా, ఈ సినిమా విజువల్‌గా మనకు ఒక అనుభూతిని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. భావాన్ని ట్రాన్స్‌మిట్ చేస్తుంది. విజువల్ మీడియమైన సినిమా చేయాల్సింది అదే కదా!
- రెంటాల జయదేవ
 
కేరళ... కేరాఫ్ అడ్రస్ టు...సెన్సిబుల్ కమర్షియల్ సినిమా
మలయాళ సినిమా అనగానే ‘బిట్లు’ కలిపిన బూతు బొమ్మలనే దురభిప్రాయం. పాతుకుపోయిన ఈ భావాన్ని తుడిచిపెట్టేలా రిలీజవుతున్న కొత్త తరం సినిమాల్లో లేటెస్ట్ వన్ ‘ప్రేమమ్’. తెరపైన మంచి కథలు చెప్పడంతో ఆగకుండా, సినిమాటిక్ మీడియమ్‌పై గౌరవం పెంచేలా జీవితాన్ని తెరకెక్కించడంలో మలయాళ సినిమా ముందుంది. అందుకు తాజా ఉదాహరణలు - నిన్నటి ‘బెంగుళూర్ డేస్’, ఇవాళ్టి ‘ప్రేమమ్’. యాదృచ్ఛికంగా ఈ రెండు ఫీల్‌గుడ్ మూవీస్‌తో బాక్సాఫీస్ వద్ద జాక్‌పాట్ కొట్టిన నిర్మాత ఒకరే! అన్వర్ రషీద్! దర్శకుడిగా మొదలైన రషీద్‌ను భావోద్వేగాలున్న కమర్షియల్ కథలను సొంతంగా నిర్మించాలనే ఆలోచన తొలిచేసింది.

అదే టైమ్‌లో అంజలీ మీనన్ తీసిన ‘హ్యాపీ జర్నీ’ చూసి, గుమ్మైయారు. ఆమె దర్శకత్వంలోనే ‘బెంగుళూర్ డేస్’తో నిర్మాత అవతారమెత్తారు. గత ఏడాది రిలీజై, అభినందనలు, ఆదాయం - రెండూ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో సహా అనేక భాషల్లో రీమేక్ అవుతోంది. ఇప్పుడీ ‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫోన్స్ పుతెరెన్‌కు కూడా రషీద్ అలానే ఛాన్సిచ్చారు.

అల్ఫోన్స్ తొలి సినిమా తమిళ, మలయాళ ద్విభాషా చిత్రం ‘నేరమ్’ (టైమ్ అని అర్థం). రెండేళ్ళ క్రితం సరిగ్గా మే నెలలోనే వచ్చి, హిట్టయిన ఈ కామెడీ థ్రిల్లర్ రషీద్‌కు బాగా నచ్చింది. ‘ప్రేమమ్’ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాత రషీదే చెప్పినట్లు, ‘ప్రేమమ్’ ఏదో ఆర్ట్ సినిమా కాదు. సున్నితమైన విషయాలను గుర్తు చేస్తూనే, వినోదాత్మక అంశాలనూ రంగరించిన కమర్షియల్ ఫిల్మ్. ఒక్క మాటలో- సెన్సిబిలిటీ, కమర్షియాలిటీల సమరస సమ్మేళనం. రీమేక్ రైట్స్ కోట్లలో పలుకుతున్న ఇలాంటి ప్రయత్నాలు తెలుగులో మనం చేయలేమా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement