‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. ‘అ..ఆ..’ సినిమా ట్రైలర్‌లో వినిపించే ఈ డైలాగ్‌తో తెలుగు సినిమా అభిమానుల మనస్సుల్లోకి దూసుకొచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. నిజానికి అంతకన్నా ముందే ఒక మలయాళ సినిమాతో తెలుగు కుర్రకారుకు ఈ భామ పరిచయమైంది. ఆ సినిమాయే ‘ప్రేమమ్’. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే, అదే పాత్రలో మళ్లీ కనిపించి మెప్పించింది అనుపమ. పరిచయమైతే మలయాళ పరిశ్రమలోనే అయినా, ఇప్పుడు ఈ హీరోయిన్ స్టార్‌గా దూసుకెళ్తోంది మాత్రం తెలుగులోనే! ఈ లేటెస్ట్ స్టార్ సెన్సేషన్ గురించి
కొన్ని విశేషాలు...
తెలుగులోనే స్టార్‌గా...
అనుపమ మలయాళ సినిమాతోనే హీరోయిన్ అయినా ప్రస్తుతానికి ఆమె కెరీర్ తెలుగులోనే సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతోంది. ‘అ..ఆ..’ విడుదలైన వెంటనే అనుపమకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘శతమానం భవతి’, ‘ప్రేమమ్’ సినిమాలతో వరుసగా సూపర్‌హిట్స్ వచ్చాయి. దీంతో మిడిల్ బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు స్టార్ అనుపమనే! ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న ‘హలో గురూ ప్రేమకోసమేరా!’ దసరా కానుకగా విడుదల కానుంది.
కాలేజీకి నో చెప్పి సినిమాల్లోకి!
అనుపమ పరమేశ్వరన్ పుట్టి, పెరిగిందంతా కేరళలోనే! మలయాళ భామ. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ కలలు కనేది. ఆ పిచ్చే ఆమెకు ‘ప్రేమమ్’ సినిమాలో అవకాశం తెచ్చిపెట్టింది. కొత్తవాళ్ల కోసం దర్శకుడు ఆల్ఫన్స్ పుత్రన్ వెతుకుతూ ఉంటే అనుపమ ఫొటోషూట్ ఆయన కంట్లో పడింది. వెంటనే ‘ప్రేమమ్’లోని మూడు ప్రేమకథల్లో ఒక కథకు హీరోయిన్‌గా ఎంపికచేశాడు. అప్పటికి అనుపమ వయసు 18 ఏళ్లు. తన డ్రీమ్ కావడంతో కాలేజీకి కూడా నో చెప్పేసింది.
డబ్బింగ్ చెప్పిందంటే...
‘అ..ఆ..’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అనుపమకు తెలుగు రాదు. కానీ ఆ సినిమాలో తన పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అనుపమ స్పెషాలిటీస్‌లో ఆ వాయిస్ కూడా ఒకటి. అందుకే అప్పట్నుంచీ అన్ని సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది. అనుపమ వాయిస్‌ను తెలుగు ప్రేక్షకులు, తెలుగులో విన్నది ‘అ..ఆ..’ ట్రైలర్‌లోని ఈ డైలాగ్‌తోనే – ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’.
లైఫ్‌లో అదే పెద్ద మిరాకిల్!
చిన్న వయసులోనే కెరీర్‌లో పెద్ద సక్సెస్ చూసిన అనుపమ, సినిమాల్లోకి రావడమే తన జీవితంలో జరిగిన పెద్ద మిరాకిల్ అని చెప్తుంది. ఇప్పటికీ ఇదంతా కలలా ఉంటుందని, ఒక్కోసారి ఎలాంటి సినిమాలు ఎంపికచేసుకోవాలో తెలియనప్పుడు దర్శకులు త్రివిక్రమ్, ఆల్ఫన్స్ పుత్రన్‌లను అడుగుతానని అంటుంది. ఈ దర్శకులే అనుపమను తెలుగు, మలయాళ సినీ పరిశ్రమలకు పరిచయం చేశారు.
బ్లాక్‌బస్టర్ డెబ్యూట్
‘ప్రేమమ్’ విడుదలవ్వడమే పెద్ద బ్లాక్‌బస్టర్. మలయాళ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసిందీ సినిమా. తెలుగు ప్రేక్షకులు సైతం ఆన్‌లైన్లో వెతుక్కొని మరీ చూసేలా చేసింది. అలా తెలుగులోకి రాకముందే ‘ప్రేమమ్’లో మేరీ పాత్రలో కనిపించిన అనుపమ ఇక్కడ కూడా ఫేమస్. ఆ క్రేజే ఆమెను వెంటనే తెలుగుకు తీసుకొచ్చింది. తెలుగులో ‘అ..ఆ..’లో నాగవల్లి రోల్‌తో డెబ్యూట్ ఇచ్చింది అనుపమ. ఆ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అయింది. తమిళంలో ‘కోడి’ అనే సినిమాతో డెబ్యూట్ ఇచ్చింది. ఆ సినిమా కూడా బ్లాక్‌బస్టర్.
Comments
Please login to add a commentAdd a comment