
ఉత్తమ బాలనటులుగా నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన ‘పెరియ కాకాముట్టై’, ‘చిన్న కాక్కా ముట్టై’ పాత్రల్లో విఘ్నేశ్, రమేశ్
ఈ అన్నదమ్ములిద్దరు టీవీలో పిజ్జాను మొట్టమొదటిసారి చూశారు, జీవితంలో కోడిగుడ్డు కూడా నోచుకోనివాళ్లు...
ఈ అన్నదమ్ములిద్దరు టీవీలో పిజ్జాను మొట్టమొదటిసారి చూశారు. జీవితంలో కోడిగుడ్డు కూడా నోచుకోనివాళ్లు. కాకికి కొంచెం ఎంగిలి పారేసి, దాని గూటిలో నుంచి కాకిగుడ్లు దొంగిలించి తినేవాళ్లు. వీళ్లిప్పుడు పిజ్జా తినాలి! కాకి ఎంగిలైనా ఓ.కె! అంటే ఒక ముక్క... ఇద్దరు కొరుక్కున్నా చాలు. మహాపట్టణాల్లో మనం ఎంగిలి చేసి పారేసినవి వీళ్లింటి ముందు మురుగు కాలువలా పారుతుంటాయి. తమిళ సినిమా ‘కాక్కా ముట్టై’ చూస్తుంటే బాధా కలుగుతుంది. సంతోషంగానూ అనిపిస్తుంది. బాధ ఇంకా ఇలాంటి అవస్థ ఉన్నందుకు! సంతోషం బాధను కూడా కాకి ఎంగిలిలా పంచుకోగలుగుతున్నందుకు!!
సదరన్ స్పైస్ - కాక్కాముట్టై (తమిళ సినిమా)
హీరో ధనుష్‌కు మనసు మనసులో లేదు...
తమిళనాట క్రేజున్న ఆ యువ స్టార్‌కు రెండు రోజులుగా అదే అవస్థ. కమర్షియల్ సినిమాలతో తల మునకలై, కోట్లు సంపాదిస్తున్న ఒక స్టార్‌కు అది విచిత్రమైన పరిస్థితే! దర్శకుడు, స్నేహితుడు వెట్రిమారన్ చెప్పిన కథ, ఇచ్చిన స్క్రిప్టు మనసులో సుడులు తిరుగుతూనే ఉంది.
ఎవరో మణికంఠన్ అట... కొత్త డెరైక్టర్... అతను రాసిన కథ. ఆ రాత్రి ధనుష్ చదివింది పట్టుమని పది పేజీలే! ఆ తరువాత చదువుదామంటే కంటి మీది నీటి పొర అక్షరాలకు అడ్డం పడుతోంది. ఒక్కసారిగా పాతికేళ్ళ క్రితం రోజులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. స్క్రిప్టులోని అన్నదమ్ములిద్దరు (పెరియ కాకాముట్టై, చిన్న కాకా ముట్టై) చేసిన పనులు అన్నయ్య సెల్వ రాఘవన్, తాను కలసి చిన్నప్పుడు చేసిన అల్లరిని గుర్తు చేశాయి.
చాలా రోజులకు ఒక ఎమోషనల్ స్క్రిప్టు. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ‘ఈ సినిమాలో ఎలాగూ నటించలేను. కానీ, లోలోపల జ్వలిస్తున్న కళాతృష్ణను తీర్చుకోవాలంటే... ఏం చేయాలి? ఇప్పటి దాకా ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ నాన్ కమర్షియల్ ఫిల్మ్‌కు నిర్మాతనైతేనో...?’ ధనుష్ అంతరంగ మథనం ఎట్టకేలకు ముగిసింది. అంతే... ధనుష్‌కు నిద్ర పట్టింది.
తమిళనాట వీస్తున్న గాలి ఇదే!
హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ నిర్మాతలుగా ఒక చిన్న ప్రయోగం తెరకెక్కింది. మనసుకు నచ్చి చేసిన ఆ ప్రయోగం... అంతర్జాతీయంగానూ అందరినీ ఆకట్టుకుంటుందని ఆ రోజున వారు ఊహించలేదు. తాజా జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటులు - ఆ సినిమాకు ఒకటికి రెండు నేషనల్ అవార్డులు. ధనుష్ సినిమా తీస్తున్నప్పుడు ‘దుస్సాహసం’ అన్నవాళ్ళంతా, ఒక్కసారి ఆగి, ఆలోచనలో పడ్డారు. సరిగ్గా రెండు వారాల క్రితం ప్రపంచమంతటా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు వాళ్ళతో పాటు అందరినీ ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. లక్షలాది సామాన్య సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుస్తోంది. ఇప్పుడు తమిళనాట విడుదలైన కొత్త సినిమాల్లో సెన్సేషన్ ఏదైనా ఉందీ అంటే - అది ఈ సినిమానే!
‘కాక్కా ముట్టై’(తెలుగులో ‘కాకి గుడ్డు’ అని అర్థం)!!
శంకర్‌ను కదిలించిన ఈ దర్శకుడెవరు?
భారీ సినీ స్వప్నాలను వందల కోట్ల ఖర్చుతో వెండితెరపై పరచే దర్శకుడు శంకర్ రియలిస్టిక్‌గా ఉన్న ‘కాక్కా ముట్టై’ చూసి కదిలిపోయారు. చెన్నై మహానగరంలో మురుగు నదిగా మిగిలిన కూవమ్ నది ఒడ్డున, ఒక మురికివాడలో, రైలు పట్టాల పక్కన బతుకులీడ్చే ఒక నిరుపేద కుటుంబం కథను తెరపై చూసి, ఆగలేకపోయారు. వెంటనే ఫేస్‌బుక్‌లో ‘‘పెద్ద పెద్ద విషయాల్ని కూడా చాలా సింపుల్ పద్ధతిలో చెప్పిన సినిమా. జీవం తొణికిసలాడే పాత్రలు, నటన...’’ అని తన మనసులో మాటలు పంచుకున్నారు.
ఇంతమందిని కదిలిస్తున్న ‘కాక్కా ముట్టై’ తీసిందెవరు? ఈ సినిమాకు రచన, ఛాయాగ్రహణం, దర్శకత్వం - మూడూ మణికంఠన్‌వే! ఆయనేమీ కొమ్ములు తిరిగిన దర్శకుడు కాదు. సగటు... పెళ్ళిళ్ళ ఫొటోగ్రాఫర్. పోనీ, అంతకు ముందు ఏవైనా సినిమాలు చేశాడా? అదీ లేదు! కానీ, తొలి ప్రయత్నంతోనే అంతర్జాతీయంగా కూడా అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి పడేశాడు.
టొరంటో, లాస్ ఏంజెల్స్, దుబాయ్... ఇలా ఒకటీ, రెండూ కాదు... అయిదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాకు చప్పట్లు... ప్రశంసలు... స్టాండింగ్ ఒవేషన్లు... అవార్డులు. నిజాయతీతో ఒక ప్రయత్నం చేస్తే, అది ప్రాంతం, భాషలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుందనడానికి ఈ సినిమా తాజా ఉదాహరణ. ఒక ప్రాంతీయ భాషా సినిమాను ‘ఫాక్స్ స్టార్ స్టూడియో’ లాంటి ప్రసిద్ధ సంస్థ పంపిణీ చేయడం చాలా స్పెషల్. ఆ స్పెషల్ ట్రీట్‌మెంట్ కూడా ‘కాక్కా ముట్టై’కి దక్కింది.
చిన్న సినిమా... పెద్ద హిట్టు!
ఈ సినిమా అవార్డులతో ఆగలేదు. వర్షం... కలెక్షన్ల వర్షం... ఎండకూ, వానకూ వెరవకుండా వస్తున్న ప్రేక్షక జనంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లో రోజుకు ఒక్క షో వేస్తున్నా... వర్కింగ్ డే కూడా హాలులో 70 శాతం పైగా ఫుల్. ఆ మాటకొస్తే, రిలీజ్‌కు ముందే ఈ సినిమా నిర్మాత ధనుష్‌కు డబ్బులు తెచ్చేసింది. శాటిలైట్ రైట్స్ అమ్మకంతోనే ఆయనకు పెట్టిన పెట్టుబడితో పాటు లాభమూ వచ్చేసింది. రిలీజయ్యాక కలెక్షన్ల ద్వారా వస్తున్నదంతా లాభాల బోనస్సే!
ఇవాళ ‘కాక్కా ముట్టై’ చిన్న సినిమా కాదు. పెద్ద సినిమా. పది రోజుల్లో రూ. 8.6 కోట్లు వసూలు చేసిన భారీ హిట్ సినిమా. ప్రయోగాత్మక బాలల చిత్రం కాదు... సినీజీవుల్ని ఆలోచింపజేస్తున్న పాత్ బ్రేకింగ్ మూవీ.
పెద్దలూ చూడాల్సిన పిల్లల సినిమా
ప్రపంచంలో ఉన్నవి రెండే జాతులు - ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు. పెరిగిపోతున్న ఈ అంతరం, ప్రపంచీకరణ పర్యవసానం, ప్రతి ఒక్కరినీ కన్జ్యూమర్స్‌గా చూస్తున్న వ్యాపార ప్రకటనలు, సెల్‌ఫోన్ మోజు - ఇలాంటి ఎన్నో అంశాల్ని ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. సమకాలీన సమాజం పసి హృదయాలపై చూపుతున్న ప్రభావాన్ని సందేశాలు, బోధనలు, డైలాగుల హోరు లేకుండా విజువల్‌గా మనసుకు తాకేలా చెబుతుంది. గుండెను పిండే ఎన్నో అంశాలను లేయర్లు... లేయర్లుగా చూపెట్టిన ప్రోగ్రెసివ్ ఫిల్మ్ కాబట్టే ఇది ఇవాళ ఇంతమందిని కదిలిస్తోంది. బాలల సినిమాలు రావడం లేదంటాం కానీ, ఇలాంటి సినిమాలకు పిల్లల్ని తీసుకెళితే... పిల్లలే కాదు, పెద్దలూ చుట్టూ ఉన్న సమాజం పట్ల ఆలోచనలో పడతారు.
మనం తీయలేమా?
‘కాక్కా ముట్టై’ కథ వింటే... ‘ఓస్... ఇంతేనా’ అని కొందరికి అనిపించవచ్చు. బడ్జెట్ తెలుసుకుంటే... ఇలాంటి డజను సినిమాల ఖర్చుతో కానీ, ఒక తెలుగు సినిమా తయారుకాదని అనుకోవచ్చు. సహజమైన ఆ మాటలు, నటన, లొకేషన్లు... తెరపై చూస్తే... ‘ఈ మాత్రం మనం చేయలేమా’ అనిపించవచ్చు.
అనిపించవచ్చు, అనుకోవచ్చు కాదు... కచ్చితంగా అనుకోవాలి. అలా అనుకొని మన తెలుగు నుంచి కూడా ఏ ధనుష్ లాంటి హీరోనో నిర్మాతగా మారాలి. ఏ మణికంఠన్ లాంటి మట్టిలో మాణిక్యమో సినిమా తీయాలి. అలా చేస్తే... అంతకన్నా ఇంకేం కావాలి! తెలుగు సినిమా మళ్ళీ కొత్త బాట పడుతుంది. కొత్తదనంతో కాలరెగరేసుకొని మరీ తిరుగుతుంది. ‘కాక్కా ముట్టై’ ప్రేక్షకులకే కాదు... రూపకర్తలకూ ఇస్తున్న
స్ఫూర్తి ఇదే!
నిజజీవితంలో 9వ తరగతి చదువుతున్న విఘ్నేశ్, 6వ తరగతి చదువుతున్న రమేశ్ ఇప్పుడు తమిళనాట ధనుష్ కన్నా పెద్ద హీరోలు. ధనుష్ మొన్న సినిమా రిలీజయ్యాక చెప్పిందీ అదే... ఎప్పటికైనా ఈ సినిమాలోని బాల నటుల లాగా తానూ నటించాలి. కెమేరానే లేదన్నట్లుగా, అత్యంత సహజంగా నటించాలి. అలా చేస్తే నటుడిగా తాను ఉన్నత స్థాయికి చేరుకున్నట్లే! ఇలాంటి బాలల సినిమాలు మరిన్ని తీయాలి. ఒక జాతీయ ఉత్తమ నటుడిలో ఈ చిన్న ‘కాకి గుడ్డు’ రగిలించిన క్రియేటివ్ అర్జ్ అది. సినిమా చూస్తే... మనకూ, మనవాళ్ళకూ కూడా మనసు వీణలోని తీగ ఏదో శ్రుతి అవడం ఖాయం!
- రెంటాల జయదేవ
ఈ ‘కాకి గుడ్డు’ కథేంటి?
ఇంతా చేస్తే ఈ సినిమాలో ఉన్నది ప్రసిద్ధ తారాగణమేమీ కాదు. ఆరితేరిన అభినేతలు అసలే కాదు. ఇద్దరు పసివాళ్ళు... అదీ కొత్తవాళ్ళు... విఘ్నేశ్ (14 ఏళ్ళు), రమేశ్ (12). వాళ్ళే కథను నడిపే కథానాయకులు. వాళ్ళు చేసినవి కమర్షియల్ రోల్స్ కావు. చెన్నైలోని ఒక మురికివాడలోని రోజూ కష్టపడి రూపాయి రూపాయి సంపాదించే కుటుంబంలోని పిల్లల పాత్రలు... ఒక నెల మొత్తం సంపాదనతో సమానమైన 300 రూపాయల పిజ్జాను ఎలాగైనా రుచి చూడాలనుకొనే ఆ పసి మనసుల కోరిక చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
తల్లి (ఐశ్వర్యా రాజేష్), బామ్మ - ఇలా సినిమాలో ఎవరిని చూసినా మనం చూసిన మనుషులు, మన జీవితాలే గుర్తుకొస్తాయి. బామ్మ పిల్లాడికి స్నానం చేయిస్తుంటే, పిల్లాడు తన చేతిలోని పెంపుడు కుక్కపిల్లకు అప్రయత్నంగా నీళ్ళు పోయడం లాంటి ఘట్టాలు చూడాల్సినవే. ఇలాంటి ప్రయత్నం కాబట్టే, మరో యువ తమిళ స్టార్ హీరో శింబు కూడా ఇందులో తన నిజజీవిత పాత్రలోనే గెస్ట్‌గా కనిపించారు. జి.వి. ప్రకాశ్‌కుమార్ (సంగీతం), ఇటీవలే కన్నుమూసిన కిశోర్ (ఎడిటింగ్) లాంటి పేరున్న టెక్నీషియన్స్ పెద్ద సపోర్ట్‌గా నిలిచారు. పాటలు, రీ-రికార్డింగ్‌లో ఒక కొత్త జి.వి. ప్రకాశ్‌కుమార్‌ను చూడవచ్చు. అలాగే, దృశ్యాలు మారుతున్న సంగతే తెలియనివ్వని షార్ప్ ఎడిటింగ్ గమనించవచ్చు.