డెఫినెట్లీ.. మిసెస్ గోడ్బోలే! | Nadhiya Special Interview | Sakshi
Sakshi News home page

డెఫినెట్లీ.. మిసెస్ గోడ్బోలే!

Published Sun, Dec 27 2015 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

డెఫినెట్లీ.. మిసెస్ గోడ్బోలే!

డెఫినెట్లీ.. మిసెస్ గోడ్బోలే!

బిరబిరా పారే నది... నదియా! ...
జరీనా మొయిదు నుంచి నదియా దాకా...
నదియా నుంచి మిసెస్ గోడ్బోలే దాకా...
మిసెస్ గోడ్బోలే నుంచి ‘అత్తారింటికి దారేది’ దాకా...
నదియా మలుపులు మన గుండెల్ని తట్టాయి.
ఎన్ని మలుపులు తిరిగినా తనకు బాగా నచ్చిన పాత్ర...
డెఫినెట్లీ... మిసెస్ గోడ్బోలే!


 
* వెల్‌కమ్ బ్యాక్ టు ‘సుందరి ఆఫ్ సౌత్’! ఇంతకీ మీకు ఆ పేరెలా వచ్చింది?
నదియా: తమిళ్‌లో తొలిచిత్రం ‘పూవే పూచూడవా’లో పాత్ర పేరు సుందరి. అంతకు ముందు మలయాళంలో పేరొచ్చినా, ఆ చిత్రంతో సౌత్‌లో పాపులరయ్యా. బహుశా, అందుకే ‘సుందరి ఆఫ్ సౌత్’ అని అంటారేమో.

* క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది?
 హీరోయిన్‌గా చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌నైన ఈ సెకండ్ ఇన్నింగ్స్‌నే ఆస్వాదిస్తున్నా. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని అందరూ మా అక్క, మా అత్త, మా అమ్మ ఇలా ఉంటే బాగుండుననుకుంటున్నారు. పురుషాధిక్యమెక్కువ, హీరోయిన్ల షెల్ఫ్‌లైఫ్ తక్కువ ఉండే సినీ రంగంలో నా లాంటి మిడిల్ ఏజ్డ్ ఉమెన్ విజయంగా దీన్ని భావిస్తున్నా.

* ఇప్పటికీ మీరు అందంగా ఉన్నారు. హీరోయిన్‌గా కూడా చేయచ్చేమో?                                     
(నవ్వేస్తూ) ఆ మాట అన్నవాళ్ళందరితో ‘అలాగైతే, నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు కథ రాయండి’ అని అడుగుతుంటా. ఒకప్పుడు హీరోయిన్ ఒరియంటెడ్ ఫిల్మ్స్ చాలా వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి! వయసును బట్టి, మారిన కాలాన్ని బట్టి మనమూ మారాలి. హీరోయిన్‌గా మొదలెట్టాం కాబట్టి, పాతికేళ్ళ తర్వాతా అవే పాత్రలు చేస్తామంటే ఎలా?

* మీ అమ్మా నాన్నల గురించి చెప్పండి. వాళ్ళతో మీది బలమైన బంధమట?
మా నాన్న గారి పేరు - ఎన్.కె. మొయిదు. ముస్లిమ్. అమ్మ పేరు- లలిత. హిందువు. ఇద్దరూ మలయాళీలే. ‘టాటాస్’ సంస్థలో పనేచేసేవారు. మా అమ్మానాన్నకు ఇద్దరు పిల్లలం - నేను, చెల్లెలు హసీనా. నా అసలు పేరు జరీనా మొయిదు. సినిమాల్లోకి వచ్చాకా నా బాగోగులన్నీ నాన్న గారే చూసుకొనేవారు. స్క్రిప్ట్‌లు నేను, ఆయన కలసి వినేవాళ్ళం, నిర్ణయం తీసుకొనేవాళ్ళం. మరీ గ్లామరస్ పాత్రలు, వాన పాటలుంటే నో చెప్పేస్తుండేవాళ్ళం. ఒక్క మాటలో - మై ఫాదర్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మి! హి ఈజ్ వెరీ స్పెషల్ టు మి. మా అమ్మ మాకు పెద్ద సెలైంట్ సపోర్టర్!

* మరి, హీరోయిన్‌గా పీక్‌లో ఉన్నప్పుడే పెళ్ళిచేసుకొని, స్టేట్స్ వెళ్ళిపోయారేం?
ముంబయ్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే నాకూ, మా ఆయన శిరీష్ గోడ్బోలేకూ పరిచయం. ప్రసిద్ధ దర్శకుడు ఫాజిల్ వాళ్ళ బ్రదర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నేను కాలేజ్‌లో చదువుకొంటున్నప్పుడే ఫాజిల్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తూ, నన్ను ఆ పాత్ర చేయమన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం వల్ల ఆయనను నమ్మి, ఈ రంగంలోకి వచ్చా. అయితే, వచ్చినప్పుడే తెలుసు... పెళ్ళి చేసుకొని, ఈ రంగానికి దూరంగా వెళ్ళిపోతానని! పద్ధెనిమిదేళ్ళ వయసులో మలయాళ చిత్రం ‘నోక్కెత్త దూరత్తు కన్నుమ్ నట్టు’ (1984)తో వచ్చా. తొలి సినిమాకే ‘ఉత్తమ నటి’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. అయిదేళ్ళు హీరోయిన్‌గా చేశా. శిరీష్ నిలదొక్కుకోగానే, పెళ్ళి చేసుకొని స్టేట్స్ వెళ్ళిపోయా. పదిహేనేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ ‘ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’ (2004)తో మళ్ళీ వచ్చా.
     
* ఇంతకీ మీ పేరును నదియా అని మార్చిందెవరు?

 నేను సినిమాల్లోకి వస్తున్నప్పటికే హిందీ నటి జరీనా వహాబ్ ఫేమస్. అందుకని నా పేరు మార్చారు. ఫాజిల్ గారి సోదరుడి వరుసయ్యే ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పా కదా! ఆయనకు ఒక సిస్టర్ ఉండేది. నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు నిరంతరం ప్రవహించే నదిలా నా ప్రయాణం సాగిపోవాలని ఆమే నా పేరు ‘నదియా’ అని మార్చింది.  
     
* పెళ్ళితో హీరోయిన్‌గా అన్నీ వదులుకొని వెళ్ళిపోవడం కఠిన నిర్ణయమేనే!  
జీవితంలో తీసుకున్న కీలకమైన, తెలివైన నిర్ణయమదే. ఎందుకంటే, కెరీర్‌లో ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత సంపాదించినా వ్యక్తిగత జీవితమూ బాగుండాలి. అయామ్ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ రైట్ ఛాయిస్.
     
* మరి, సినిమాల్లోకి మళ్ళీ ఎలా? దర్శకుడు రాజా ఎలా ఒప్పించారు?  
ఒకసారి సెలవులకి ముంబయ్‌కి వచ్చా. ఎలా తెలిసిందో ఏమో దర్శకుడు ‘జయం’ రాజా వాళ్ళు ఫోన్ చేసి, ఆ పాత్ర ఆఫర్ చేశారు. ముంబయ్ వచ్చి, తెలుగు మాతృక ‘అమ్మ.నాన్న..ఒక తమిళమ్మాయి’ సీడీ ఇచ్చారు. అందులో హుందాగా ఉన్న తల్లి పాత్ర చూసి, ఒప్పుకున్నా.
     
* సినిమాల్లో కొనసాగినప్పుడు నిజజీవితంలో తల్లిగా ఎలా బ్యాలెన్స్ చేశారు?                                        
ఇప్పుడు మేము ముంబయ్‌కి షిఫ్ట్ అయిపోయాం. సినిమాల్లో నటిస్తున్నా, సెట్స్‌లో లేనంటే, ముంబయ్‌లో అందరు అమ్మల్లాగే ఇంటా, బయట పనులు చేసుకుంటూ ఉంటా. ఇప్పటికీ చాలా సెలెక్టివ్. ఏడాదికి ఒకటో, రెండో ఫిల్మ్స్ చేస్తున్నా. త్రివిక్రమ్ ‘అ..ఆ..’ నా 41వ సినిమా.
     
* పదిహేనేళ్ళ గ్యాప్ మాట అటుంచితే, 31 ఏళ్ళ కెరీర్‌లో ఇన్ని సినిమాలేనా?                                     
చేసినవి కొన్నే అయినా, టైటిల్ రోల్స్. రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్మూట్టి లాంటి అగ్ర హీరోలతో, గుర్తుండిపోయే పాత్రలు చేశా. అప్పట్లో నా సమకాలీన హీరోయిన్లయిన రాధ, రాధిక, అంబిక, రేవతి వందల సినిమాలు చేశారు. అయామ్ స్టిల్ ఎ జూనియర్! (నవ్వులు)
     
* హిందీ హీరోయిన్‌గా చాన్‌‌స వస్తే వదిలేశారట?
సుభాష్ ఘయ్ సహా కొంతమంది సంప్రతించారు. సల్మాన్‌ఖాన్ తొలినాళ్ళ సూపర్‌హిట్ ‘మై నే ప్యార్ కియా’కు హీరోయిన్‌గా నన్ను అడిగారు. నిర్మాతలైన బర్జాత్యాలు మా ఇంటికి కూడా వచ్చారు. కానీ, పెళ్ళికి సిద్ధమవుతున్న నేను వద్దనేశా. ఇప్పటికీ ఆ విషయం మా పిల్లలతో సరదాగా చెబుతూ, ‘సల్మానా? మీ డాడీనా?’ అంటే, ‘మీ డాడీకి ఓటేశా’ అంటూ ఉంటా. ‘మైనే క్యా కియా’ అని ఆట పట్టిస్తుంటా.
     
* శిరీష్ గోడ్బోలేతో మీ ప్రేమకథ చెప్పలేదు!
మేము ముస్లిమ్‌లం. వాళ్ళు మహారాష్ట్ర బ్రాహ్మణులు. ముంబయ్‌లో మా ఇళ్ళు కొద్ది దూరంలోనే ఉండేవి. కామన్ ఫ్రెండ్స్ వల్ల మా ఇద్దరికీ ముందు నుంచే పరిచయం. అప్పటికి నాకు 17 ఏళ్ళు. ఆయనకు 20 ఏళ్ళు. నేనింకా చదువుకుంటున్నా. చదువు, ఉద్యోగం కోసం శిరీష్ అమెరికా వెళ్ళినా మా ప్రేమ, స్నేహం కొనసాగింది. అప్పట్లో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇ-మెయిల్స్ లేవు. ట్రంక్ కాల్ బుక్ చేయాలి. లేదంటే, ఉత్తరాలు. అలా మేము చాలా ఉత్తరాలే రాసుకున్నాం. మా ప్రేమ రెండువైపులా తెలిసింది. మా పెళ్ళి అయింది.
     
* కులమతాలు తేడా. రాజీపడాల్సి వచ్చిందా?
నేను, ఆయన ముంబయ్‌లో పెరిగినవాళ్ళం. మెట్రోపాలిటన్ ఆలోచనా దృక్పథం, మా సోషల్ సెటప్ ఒకేలా ఉండేవి. అందుకే, కుటుంబాలు బాగా కలిసిపోయాయి. నేను మరాఠీ ధారాళంగా మాట్లాడతా. మావారి ఇంట్లో చేసే ప్రతి పండుగ మనస్ఫూర్తిగా చేస్తా. మా అత్తమామల్ని ‘మాయి’ (అమ్మ), డాడీ అనే పిలుస్తా.
     
* మరి, ఇంతకీ మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు?
మా నాన్న గారు ముస్లిమ్ అయినా, మాకు ముస్లిమ్ పేర్లు పెట్టినా, మేమెప్పుడూ ఒకే మత ధర్మాన్ని అనుసరించలేదు. ఇప్పటికీ రాత్రి నిద్రపోయే ముందు మా నాన్న గారు నేర్పిన ఖురాన్‌లోని ప్రార్థనలు, మా అత్త గారింట్లో నేర్చుకున్న గణేశ్ హారతి, చిన్నతనంలో పారసీ స్కూల్‌లో నేర్చుకున్న పారసీ ప్రార్థనలు చేసి కానీ పడుకోను. అల్లా బిజీగా ఉంటే వినాయకుడు, ఆయన బిజీగా ఉంటే మరో పారసీ దేవుడు కాపాడతారని మా వాళ్ళతో సరదాగా అంటుంటా.
     
* అప్పటికీ, ఇప్పటికీ పెంపకంలో తేడా?
అప్పట్లో పిల్లలం అమ్మానాన్న ఏం చెబితే అది, ప్రశ్నలు వేయకుండా వినేవాళ్ళం. కానీ, ఈ తరం పిల్లలు ప్రశ్నలడుగుతారు. వాళ్ళకు లాజికల్‌గా జవాబివ్వాలి. అప్పటి తల్లితండ్రులు మంచి వక్తలైతే, ఇప్పటివాళ్ళు మంచి శ్రోతలవాలి. పిల్లల కష్టసుఖాలు విని, జవాబివ్వాలి.
     
* మీ అందం, ఆహార, వ్యాయామ సీక్రెట్స్?
(నవ్వేస్తూ) అనేక అంశాల కలయిక. ప్రధానంగా అమ్మానాన్నల జీన్స్ నుంచి వచ్చింది. బాగా వండుతా. బాగా తింటా. అందుకు తగ్గట్లే వ్యాయామం చేస్తా.రోజూ వాకింగ్, వెయిట్ ట్రైనింగ్, యోగా - మూడూ చేస్తా. నెగటివ్ ఎనర్జీకీ దూరంగా ఉంటా. వాట్సప్ మినహా ఏ సోషల్ మీడియాలోనూ లేను. ఐ కీప్ మై లైఫ్ సింపుల్.
     
* మీ తాజా సినిమా గురించేం చెబుతారు?
త్రివిక్రమ్ ‘అ...ఆ...’లో చేస్తున్నా. ఆయన సూపర్‌డెరైక్టర్. ఇది ఆయన శైలి మంచి రొమాంటిక్ కామెడీ. సమంతకు తల్లిగా మహాలక్ష్మిపాత్ర కొత్తగా ఉంటుంది.
     
* జరీనాకూ, తెర జీవిత నదియాకూ తేడా?
నటినైనా నేల విడిచి సాము చేయను. అందరిలా మామూలు మనిషిలా ఉంటా. ఒక్క మాటలో జరీనా, మిసెస్ గోడ్బోలే- ఒరిజినల్ జీవితం. నదియా - తెరపై అందరినీ నమ్మించే కల్పన.
 - రెంటాల జయదేవ
 
అమ్మ-నాన్న-ఇద్దరు మరాఠీ అమ్మాయిలు
* మా ఆయన శిరీష్ గోడ్బోలే అమెరికాలో చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికన్ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘మోర్గాన్ స్టాన్లీ’కి మేనేజింగ్ డెరైక్టర్. మా పెద్దమ్మాయి సనమ్‌కి 19 ఏళ్ళు. యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో లిబరల్ ఆర్ట్స్, ఆంత్రొపాలజీతో డిగ్రీ చేస్తోంది.
 ఇక, జానాకి 14 ఏళ్ళు. నైన్త్ గ్రేడ్ చదువుతోంది.

* పెద్దమ్మాయి వెస్ట్రన్ మ్యూజిక్ సింగర్. చాలా సంగీత నాటకాల్లో పాల్గొంది. చిన్నమ్మాయికి డ్యాన్స్ ఇష్టం. హిప్‌హాప్, జాజ్ డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతానికైతే పిల్లల దృష్టి చదువు మీదే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement