పిల్లలకు... ఒక పుస్తకంతో... రెండు భాషలొస్తాయ్! | children's two languages learn to one book | Sakshi
Sakshi News home page

పిల్లలకు... ఒక పుస్తకంతో... రెండు భాషలొస్తాయ్!

Published Thu, Feb 26 2015 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

పిల్లలకు...    ఒక పుస్తకంతో...    రెండు భాషలొస్తాయ్!

పిల్లలకు... ఒక పుస్తకంతో... రెండు భాషలొస్తాయ్!

మీ పిల్లలకు పుస్తకాలు కొనివ్వాలనుకుంటున్నారా? చిన్నప్పుడు మీరు చదివిన ‘చందమామ’ పుస్తకాలు, రంగురంగుల సోవియట్ బొమ్మల పుస్తకాలు అందుబాటులో లేవే అని విచారిస్తున్నారా? ఈ ఇంగ్లీషు మీడియమ్ ఆధునిక చదువుల ప్రపంచంలో తెలుగు పుస్తకాన్ని మీ పిల్లలకు చేరువ చేయడమెలాగా అని లోలోపలే సందిగ్ధావస్థలో ఉన్నారా? అయితే, వీటన్నిటికీ పరిష్కారం ఇప్పుడు లభించినట్లే!  ఒక తెలుగు ప్రచురణ సంస్థ (ఎమెస్కో బుక్స్), దేశ భాషల విశిష్టత, వికాసం, పరిరక్షణల మీద దృష్టిపెట్టే ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థ (సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు) కలసి ఆ కొరతను తీర్చేస్తున్నాయి.

ఒక పేజీలో పెద్ద బొమ్మ, ఎదురుగా పేజీలోనే సులభమైన ఇంగ్లీషులో, కిందే తెలుగులో (ఇతర భారతీయ భాషల్లో కూడా) ఉన్న బొమ్మల పుస్తకాలు ఇప్పుడు వచ్చాయి. ఏకంగా 22 భాషల్లో 1008 పుస్తకాలను తెచ్చాయి. ఇప్పటికి అర్ధ పుష్కరకాలం పైచిలుకుగా, కోటిన్నర పైగా ఖర్చుతో సాగుతున్న ఈ బాల సాహిత్య ‘సాంస్కృతిక ఏకీకరణ ప్రయత్నం’పై ‘ఎమెస్కో’ మేనేజింగ్ డెరైక్టర్ డి. విజయకుమార్‌తో జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలు...

ఇప్పటికి 30 ఏళ్ళుగా పుస్తక ప్రచురణ, విక్రయ రంగంలో ఉన్నాను. ‘ఎమెస్కో’ తరఫున దాదాపుగా 5 వేల పుస్తకాలు ప్రచురించా. అయితే, ప్రచురణకర్తగా ఇన్నేళ్ళ నా జీవితంలో చేసిన అతి పెద్ద ప్రాజెక్ట్ మాత్రం ఈ ‘పిల్లల బుక్ బ్యాంక్’. దీని మీద పెట్టినంత శ్రమ, పెట్టుబడి మరి దేని మీదా పెట్టలేదు.

ఆవేదనతో వచ్చిన ఆలోచన...

నిజానికి, ఈ పిల్లల పుస్తకాల ఆలోచనకు బీజం ఏడెనిమిదేళ్ళ క్రితం పడింది. ఒకసారి ‘వరల్డ్ బుక్ ఫెయిర్’ చూసినప్పుడు భారతీయ భాషల్లో బాలసాహిత్యం చాలా తక్కువని అర్థమైంది. మరీ ముఖ్యంగా మన తెలుగులో చిన్న పిల్లలకు ఉత్తమ బాలసాహిత్యం అందుబాటులో లేదు. చిన్నప్పుడు మా తరం చదువుకున్న ‘చందమామ’ లాంటి ఉత్తమ బాలసాహిత్య పత్రికలూ లేవు. ఈ క్రమంలో ఏమైనా చేయాలనే ఆవేదన పడుతున్నప్పుడు బొమ్మలతో కథల పుస్తకాలు ప్రచురిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. భారీ పెట్టుబడితో కూడిన ప్రాజెక్ట్ కాబట్టి, ఏకకాలంలో ఎక్కువ భాషల్లో తేవడం సరైన వ్యూహమని భావించా.

కేంద్ర మానవవనరుల అబివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే సి.ఐ.ఐ.ఎల్. (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్) వాళ్ళను అనుకోకుండా కలిశా. నా ఆలోచన వాళ్ళకూ నచ్చింది. వాళ్ళు కథ, భాష గురించి చూస్తే, నేను బొమ్మలు, పుస్తకాల ముద్రణ గురించి చూసేలా, ఉమ్మడి కాపీరైట్ ఉండేలా, ఆదాయం కూడా కలసి పంచుకొనేలా ఒప్పందానికి వచ్చాం. ఆరేళ్ళుగా ఎంతో శ్రమించి, ఇప్పటికి జనం ముందుకు కొంత తేగలిగాం.

ఒక పేజీలో బొమ్మ... ఎదురుగా రెండు భాషల్లో కథ...

ఒక్క ముక్కలో చెప్పాలంటే, కొత్తగా అక్షరాస్యులైనవారికీ, చిన్న తరగతులు చదివే పిల్లలకూ ఉపకరించే సాహిత్య సామగ్రి బ్యాంక్ ఇది. ఈ ప్రాజెక్ట్ కింద వచ్చే పుస్తకాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అన్నీ 16 నుంచి 24 పేజీల లోపు పుస్తకాలే. వెల అందుబాటులో (రూ. 35) ఉంటుంది. పుస్తకంలో ఒక పేజీలో పెద్ద బొమ్మ, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులోనూ, దాని కిందే ఎంపిక చేసిన భారతీయ భాషలోనూ కథ ఉంటాయి. దీనివల్ల పిల్లలందరికీ ఒకే పుస్తకంతో ఇటు తమ మాతృభాష, అటు ఇంగ్లీషు - రెండూ నేర్చుకొనే వీలు కలుగుతుంది. పెపైచ్చు, ప్రతి పుస్తకం చివర ఆ భాషలో, ఇంగ్లీషులో కూడా చిన్న చిన్న అభ్యాసాలు ఉంటాయి. పుస్తకం చదివిన పిల్లలకు ఇటు వినోదం, వికాసంతో పాటు ఈ లాంగ్వేజ్ టూల్స్ ద్వారా రెండు భాషల మీద పట్టు వస్తుంది.  

సాంస్కృతిక ఏకీకరణకు మార్గం

ప్రస్తుతానికి ‘పంచతంత్ర కథలు’, ‘జాతక కథలు’ లాంటి దేశవ్యాప్తంగా జనానికి తెలిసిన కథలను ఈ పుస్తకాల ద్వారా అందిస్తున్నాం. అలాగే, రామాయణ, భారతాల లాంటి దేశమంతటికీ తెలిసిన పురాణ కథలను కూడా ఇలా తేవడానికి బొమ్మలు వేస్తున్నాం. ఇక, తరువాతి దశలో ఆ యా ప్రాంతాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలనూ, జానపద కథలనూ, అక్కడి సాహిత్య, సాంస్కృతిక ప్రముఖుల జీవితగాథలనూ ఇలాగే అన్ని భాషల్లో పిల్లల పుస్తకాలుగా తెస్తాం. దీనివల్ల ఒక ప్రాంతపు కట్టూబొట్టూ, సంస్కృతి మరొక ప్రాంతానికి తెలుస్తాయి. ఇవాళ్టికీ దేశంలో పరాయివారుగా మిగిలిపోతున్న ఈశాన్య రాష్ట్రాల వారిని అందరితో మమేకం చేయడానికి ఇది కచ్చితంగా తోడ్పడుతుంది.

ఆరేళ్ళ శ్రమ... ఒకటిన్నర కోట్ల పెట్టుబడి...

అది గ్రహించడం వల్లే ఈ పుస్తకాలను ఆవిష్కరించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సైతం ఈ విశిష్ట ప్రయత్నాన్ని ఎంతో మెచ్చుకున్నారు. సింధీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని భాషల్లో సైతం వీటిని తీసుకురావాల్సిందిగా కోరారు. వాటన్నిటిలో ఈ పుస్తకాలను తేవడానికి మరో రెండు, మూడేళ్ళు పడుతుంది. పిల్లల పుస్తకాల ప్రచురణ నిజానికి ఒక బృహత్తర ఉద్యమం. కేవలం లాభనష్టాల ప్రాతిపదికన ఈ పని చేయలేం. సాధారణ పుస్తకాలు ప్రచురించడం వేరు. పిల్లల పుస్తకాలేయడం వేరు. పిల్లలకు తగ్గట్లు తేలికగా అర్థమయ్యే భాష వాడుతూ, వారికి ఆసక్తికరంగా ఉండేలా మంచి బొమ్మలు వేయించి పుస్తకాలు తేవడానికి బోలెడంత శ్రమ పడాలి. సహనం కావాలి. ఉదాహరణకు ఒక పుస్తకం గమ్మత్తై మూడు కాళ్ళ గుర్రం గురించి కథ. అయితే, ఆర్టిస్టు గుర్రమనగానే పొరబడి, నాలుగు కాళ్ళ గుర్రం వేశారు. తీరా ప్రింటయ్యాక చూసుకొని, 3 వేల కాపీలూ పక్కన పడేశాం.
 ఇలాంటి ఇబ్బందుల్ని భరించి, ఉన్నత ప్రమాణాల్లో పుస్తకాలు తేవడం సులభం కాదు. ఈ పుస్తకాల కోసం లోపలి పేజీలకు కూడా ముఖచిత్రాలకు వాడే ‘హైబల్క్ ఆర్ట్ కార్డ్’ పేపర్ ఉపయోగించాం. దీనివల్ల పుస్తకం కొన్నేళ్ళపాటు మన్నుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండడానికి హ్యాండ్ పెయింటింగ్‌లే వాడాం. ఏటా 150కి పైగా టైటిల్స్ ప్రచురిస్తున్న మేము ఆరేడేళ్ళుగా మా ఆదాయంలో 60 శాతం పైగా ఈ ప్రాజెక్ట్ మీద పెట్టుబడిగా పెట్టాం. ఇప్పటికి రూ. 1.5 కోట్ల దాకా వెచ్చించాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద బయటకు వచ్చినవి 130 కథలే. మరో 700 కథలకు బొమ్మలు సిద్ధంగా ఉన్నాయి. (బీరువా తెరిచి చూపిస్తూ) ఇవన్నీ కథలకు

వేయించిన వేలాదిబొమ్మలే!

ఇలాంటి ప్రయత్నం మన భాషలు వేటిలోనూ ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ జరగలేదు. గతంలో ‘అమర్ చిత్రకథ’ లాంటివి ఉన్నా, అవన్నీ ప్రధానంగా ఎదిగిన బాలబాలికల కోసం ఉద్దేశించిన కామిక్స్ తరహావి. పిల్లల మనోలోకంలోకి ఎదిగి, చేస్తున్న ఈ ప్రయత్నం వేరు. వీటి ద్వారా ఈ తరం పిల్లలకు మా చిన్నప్పటి ‘చందమామ’ పుస్తక పఠనం లాంటి అనుభూతి కలిగించాలని నా ఆశ. ఆ ప్రయత్నంలో ఏ కొంత సఫలమైనా ప్రచురణకర్తగా కన్నా, ప్రయోజనాత్మక సాహిత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా నాకెంతో సంతృప్తి, సంతోషం!
 ఫొటో: జి. రాజేశ్
 
‘ఎమెస్కో బుక్స్’, ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థ అయిన మా సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు సంయుక్తంగా ఈ ‘పిల్లల బుక్ బ్యాంక్’ ప్రాజెక్ట్ చేపట్టాం. ఈ పిల్లల పుస్తకాల్లోని కథ, కథనం, భాష మేము చూసుకుంటే, ఆ పుస్తకాల డిజైనింగ్, లోపల వేసే బొమ్మలు, ముద్రణ వ్యవహారాలు ‘ఎమెస్కో’ చూస్తుంది. అలా ఒక రకంగా ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సాగుతున్న బృహత్తర ప్రయత్నం. రాజ్యాంగంలోని షెడ్యూల్డు భాషలన్నిటిలో, దేశంలోని అనేక గిరిజన భాషల్లో ఈ పుస్తకాలను అందించాలని మా ప్రయత్నం. ఈ నెల 21న ‘మాతృభాషా దినం’ సందర్భంగా 22 భాషల్లో (తెలుగు, కన్నడ, హిందీ తదితర 15 భారతీయ భాషలు, కుయి, ఆవో లాంటి 7 గిరిజన భాషలు) మొత్తం 1008 పుస్తకాలను కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విడుదల చేశారు.
 
డాక్టర్ అవదేశ్ కుమార్ మిశ్రా, డెరైక్టర్, సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు

రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement