సినిమా రివ్యూ - ‘బాహుబలి... ది బిగినింగ్’ | movie review of baahubali the begining | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ - ‘బాహుబలి... ది బిగినింగ్’

Published Fri, Jul 10 2015 8:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

సినిమా రివ్యూ - ‘బాహుబలి... ది బిగినింగ్’

సినిమా రివ్యూ - ‘బాహుబలి... ది బిగినింగ్’

ఈ కలల లోకవిహారం... ప్లేట్ మీల్సా? ఫుల్ మీల్సా?
....................................
చిత్రం - బాహుబలి... ది బిగినింగ్, తారాగణం - ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, రోహిణి, కథ - వి. విజయేంద్రప్రసాద్, కెమేరా - కె.కె. సెంథిల్ కుమార్, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, కాస్ట్యూమ్స్ - రమా రాజమౌళి, ప్రశాంతి, ప్రొడక్షన్ డిజైనర్ - సాబూ శిరిల్, సంగీతం - ఎం.ఎం. కీరవాణి, ఫైట్స్ - పీటర్ హెయిన్, విజువల్ ఎఫెక్ట్స్ - వి. శ్రీనివాస మోహన్, సెకండ్ యూనిట్ దర్శకుడు - కార్తికేయ, లైన్ ప్రొడ్యూసర్ - శ్రీవల్లీ కీరవాణి, నిర్మాతలు - శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - ఎస్.ఎస్. రాజమౌళి
..............................
ఆలోచనలు అందరికీ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టేవాళ్ళు కొందరే. వెండితెర కలలు కనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ, వాటిని నిజం చేసుకోవడానికి ఏళ్ళ తరబడి అనుక్షణం శ్రమించేవారు మాత్రం అతి కొందరే. ‘బాహుబలి... ది బిగినింగ్’ సినిమా చూసినప్పుడు - ఇలాంటి బ్రహ్మాండమైన సెల్యులాయిడ్ శిల్పాన్ని స్వప్నించేవాళ్ళు, కల గన్నా కార్యరూపంలో పెట్టేవాళ్ళూ వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినంతమంది కూడా ఉండరనిపిస్తుంది. అందుకే, ఈ కల గని, కళ్ళ ముందు తెరపై మనకూ పంచిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని అభినందించకుండా ఉండలేమనిపిస్తుంది. అదే సమయంలో దాదాపు రెండేళ్ళుగా నిరంతరం ప్రచారంలో ఉన్న ఈ సినిమా పార్ట్1లో ఉన్నట్టుండి ఆత్మ ఎక్కడో జారిపోయినట్లు అనిపిస్తుంది. కథ అటూ ఇటూ కాకుండా, అర్ధంతరంగానే ఆగిపోయిన భావన కలుగుతుంది. అద్భుతం కావాల్సిన ప్రయత్నం గమ్యానికి దూరంగానే ఆగిపోయిందా అని అనుమానం కలుగుతుంది.

అన్నదమ్ముల పోరాటమే
‘బాహుబలి’ పక్కా జానపద కథ. కాలక్షేపం కథ. రాజకుటుంబానికి చెందిన మహిళ శివగామి (రమ్యకృష్ణ) వెన్నుకు బాణం గుచ్చుకొని, సైనికులు తరుముతుండగా పొత్తిళ్ళలోని పసిబాబును రక్షించడానికి ఎత్తైన జలపాతం దగ్గర ప్రయత్నిస్తుండగా సినిమా మొదలవుతుంది. నీటిలో నిండా మునిగిపోతున్నా, చేతిలోని పసికందును కాపాడుతుంది. ఆమె మరణిస్తుంది. ఆ పసిబిడ్డ గూడెంలో శివుడు (చిన్న ప్రభాస్)గా పెరుగుతాడు. పక్కనే ఉన్న ఎత్తైన జలపాతపు నీటి కొండను ఎక్కాలనుకొనే శివుడు అనుకోకుండా దొరికిన ఒక కొయ్య ముసుగును పట్టుకొని, తన కలల్లో కనిపిస్తున్న అవంతిక (తమన్నా)ను వెతకడానికి వెళతాడు. దేశభక్తులైన తిరుగుబాటు బృందంలో సభ్యురాలు అవంతిక. వాళ్ళంతా పక్కనే ఉన్న మాహిష్మతి రాజ్యంలోని రాజు భల్లాలదేవుడు (రానా) చెరలో పాతికేళ్ళుగా మగ్గుతున్న రాణి దేవసేన (అనుష్క)ను విముక్తురాలిని చేయాలని చూస్తుంటారు. అవంతిక, శివుడు ప్రేమలో పడతారు. దేవసేన తన సొంత తల్లి అని తెలియకుండానే శివుడు, ఆమెను కాపాడే పనిని తన భుజానికి ఎత్తుకుంటాడు.

భల్లాలదేవుణ్ణి ఎదిరించే క్రమంలో శివుణ్ణి చూసి ఆ రాజ్య ప్రజలు చనిపోయిన తమ మహారాజు అమరేంద్ర బాహుబలి (పెద్ద ప్రభాస్)ను గుర్తుచేసుకుంటారు. తానెవరన్నది శివుడికి అనుమానం వస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో శివుడి కన్నతండ్రి అయిన ఆ బాహుబలి కథ చూపిస్తారు. యాభై ఏళ్ళ క్రితం జరిగిన ఆ కథలో బాహుబలి తండ్రి మహారాజు. ఆ మహారాజుకు అన్న బిజ్జాలదేవుడు (నాజర్). అన్నకున్న వ్యసనాల వల్ల అతణ్ణి కాదని తమ్ముణ్ణి రాజును చేస్తారన్నమాట. భార్య గర్భవతిగా ఉండగానే మహరాజు చనిపోతాడు. అప్పుడు బిజ్జాలదేవుడి భార్య శివగామి (రమ్యకృష్ణ) రాజ్యభారం చూస్తుంది. ఒక పక్క తన కొడుకు భల్లాలదేవుడు (రానా)నూ, మరోపక్క మరణించిన మహారాజు దంపతుల కొడుకు బాహుబలి (పెద్ద ప్రభాస్)నూ పెంచుతుంది. వారు పెద్దయ్యాక, ఎవరిని రాజును చేయాలనే పోటీ వస్తుంది. అప్పుడే దేశంపై దండెత్తిన కాలకేయులతో పెద్ద యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో వారిని ఓడించి, ప్రజల బాగు కోసం చూసిన బాహుబలి రాజు అవుతాడు.  అక్కడి దాకా ఫ్లాష్‌బ్యాక్.  మరి, ఆ పెద్ద బాహుబలి ఎలా చనిపోయాడు? వెన్నంటి ఉండే నమ్మకస్థుడైన సేనాయోధుడు కట్టప్ప (సత్యరాజ్) అతణ్ణి ఎందుకు చంపాడు? బాహుబలి భార్య దేవసేన (అనుష్క) కథేమిటి? రాజ్యకాంక్ష ఉన్న భల్లాలదేవుడు ఆమెను పాతికేళ్ళుగా ఎందుకు చెరలో ఉంచాడు? ఇలా సవాలక్ష ప్రశ్నలకు జవాబుల కోసం 2016లో వచ్చే ‘బాహుబలి... ది కన్‌క్లూజన్’ అనే రెండో పార్ట్ కోసం ఎదురుచూడాల్సిందేనంటూ ఈ ఫస్ట్‌పార్ట్ ముగుస్తుంది.

రానాయే కాదు... ప్రభాసూ ఇంపార్టెంటే!
రిలీజ్‌కు ముందు ఈ సినిమాలో ప్రభాస్‌కు పాత్ర తక్కువా, రానాకు ఎక్కువా లాంటి చర్చలు జరిగాయి. కానీ, సినిమాలో దాదాపుగా ఇద్దరికీ సమానమైన డ్యూరేషన్ ఉంది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాహుబలి పాత్రలో ప్రభాస్ కాసేపు కనిపిస్తాడు. అయితే, ప్రధానంగా సినిమాలో ఎక్కువ సేపు కనిపించేది యువకుడైన శివుడి పాత్రలోనే. అమరేంద్ర బాహుబలి పాత్రలో ఎక్కువగా వీరత్వ, ధీరత్వ లక్షణాలనూ, శివుడు పాత్రలో చలాకీతనంతో పాటు చిన్నపాటి తుంటరితనం, ప్రేమ, సాహసం లాంటి లక్షణాలనూ దర్శకుడు చూపే ప్రయత్నం చేశాడు. ప్రభాస్ ఈ రెండు పాత్రలనూ ఆ మేరకు పోషించాడు. అయితే, అతని నటనా ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే భావోద్వేగభరిత సన్నివేశాలు ఆయనకు ఈ పార్ట్‌లో రాలేదనే చెప్పాలి. విలన్ భల్లాలదేవుడిగా రానా విగ్రహం, వాచికం బాగున్నాయి. క్రూరత్వాన్నీ, కుటిలత్వాన్నీ బాగానే పలికించారు. బాహుబలి భార్య దేవసేనగా వయసు మీద పడ్డ పాత్రలో అనుష్క కాళ్ళకూ, చేతులకూ సంకెళ్ళతోనే కనిపిస్తుంది. ఈ ఫస్ట్‌పార్ట్‌లో ఆమె కనిపించేది చాలా కొద్ది సేపే. డైలాగులూ ఒకటీ, అరానే! ఒకపక్క గ్లామర్ పాత్రలు పోషిస్తున్న టైమ్‌లో ఇలాంటి పాత్రకు ఆమె ఒప్పుకోవడం, చేయడం విశేషమే.

ఒక నమ్మకస్థుడు... ఒక భీకర ప్రతినాయకుడు...
శివుడి పాత్రకు పెయిర్ అవంతికగా తమన్నా తన మిల్కీ వైట్ ఛాయతో అందంగా మెరిసింది. అదే సమయంలో తన హైటూ, వెయిటూ సరిపోకపోయినా, ఖడ్గం, విల్లంబులు ధరించిన యోధురాలిగానూ వీరరస పోషణ చేసింది. ఎడమ చేయి అవుడుగా ఉండే బిజ్జాల దేవుడిగా నాజర్ విలనిజమ్ బాగుంది. మాహిష్మతి రాజ్యంలో ప్రభువుల రక్షణకే కట్టుబడిన కట్టుబానిస, ఆయుధాగార అధిపతి కట్టప్పగా సత్యరాజ్ అభినయం గంభీరంగా, పాత్రౌచిత్యాన్ని పెంచేలా ఆకట్టుకుంది. ఆటవిక తెగ కాలకేయు’లకు అధిపతి అయిన కాలకేయుడిగా ప్రభాకర్ ఆహార్యం, కళ్ళలోని క్రూరత్వం ఒక దశలో ఇతర విలన్లను మించినట్లుగానూ అనిపిస్తుంది. ఆ పాత్రకు ప్రత్యేకంగా సృష్టించిన భాష విచిత్రంగా వినిపిస్తూ, ఆకట్టుకుంటుంది. బిజ్జాలదేవుడి భార్య, రాజమాత అయిన శివగామి పాత్రలో రమ్యకృష్ణ హుందాతనాన్నీ, రాజసాన్నీ బాగా పండించారు. తెలుగులో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పారు. ఒకటి, రెండు చోట్ల మాత్రం తెలుగు మాటల ఉచ్చారణలో మరింత శ్రద్ధ చూపితే బాగుండేది. శివుణ్ణి పెంచిన గిరిజన గూడెం దంపతులు దొర, సంగిగా ప్రభాకర్, రోహిణి కనిపిస్తారు. సినిమా సెకండాఫ్‌లో మద్యం దుకాణం ఓనర్‌గా ఒక సీన్, ఒక డైలాగ్‌తో రాజమౌళి తెరపై కనిపిస్తారు.

తెరపై... స్వప్నసాక్షాత్కారం
ఇలాంటి కథలు బ్లాక్ అండ్ వైట్ శకం నుంచి మనం చూస్తున్నవే. కాకపోతే, రంగుల్లో, టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్‌తో వచ్చిన విజువల్ గ్రాండియర్ తోడైంది. కళ, ఛాయాగ్రహణం, కూర్పు, రచన - ఇలా అన్ని కళల సమాహార రూపంగా సినిమా తయారైన తీరు తెరపై కనిపిస్తుంటుంది. రాజమౌళి ఊహించిన దృశ్యాలకు వెండితెర రూపం రావడానికి ఈ విభాగాల కృషి బాగా ఉపకరించింది. ఈ సినిమా కోసం వేసిన సెట్లు, తయారు చేసిన ఆయుధాలు, రథాలు (జాతీయ అవార్డు గ్రహీత సాబూ శిరిల్ప్రొడక్షన్ డిజైనర్), కాస్ట్యూమ్స్ (రమా రాజమౌళి, ప్రశాంతి) ఆ కథాకాలానికి తీసుకువెళతాయి. తెలుగువాడైన జాతీయ అవార్డు విజేత వి. శ్రీనివాస మోహన్ సారథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కొన్ని పదుల మంది కృషి చేసిన సినిమా ఇది. మైళ్ళ కొద్దీ ఎత్తున్న జలపాతం, భారీ ప్రాసాదాలు, జంతువులు - ఇలా ప్రతిదీ ఏది విజువల్ ఎఫెక్ట్, ఏది వాస్తవం - అనే తేడా తెలియనివ్వకపోవడంలో ఈ టీమ్ కృషి, రాజమౌళి చెక్కుడు అర్థమవుతుంది. టాప్ యాంగిల్ షాట్‌లో రాజప్రాసాదంలో నడిచివచ్చే సీన్, నీళ్ళ మీదుగా శివుడు గెంతే సీన్ లాంటి కెమేరా పనితనపు ఉదాహరణలు అనేకం.

సంగీతమే ప్లస్సూ... మైనస్సూ!
విచిత్రంగా ఈ సినిమాకు కీరవాణి సంగీతమే ప్లస్సూ, మైనస్సూ కూడా. కీరవాణి సంగీతంలో పాటలు గొప్పగా అనిపించవు. ‘పచ్చబొట్టు...’ పాట, బిట్ సాంగ్ అయిన ‘నిప్పులో శ్వాసగా...’ లాంటి ఒకటీ అరానే బాగున్నాయి. ఆడియో వీక్ అయినా, సినిమా రీరికార్డింగ్ మాత్రం తెర మీది దృశ్యాల్లోని గాఢతను ఒకటికి పదింతలు చేసేలా సాగడం విశేషం.

లోపాలు బోలెడు..! వార్ సీన్స్ సూపర్..!  
తమిళ, తెలుగు, కన్నడ (‘ఈగ’ ఫేమ్ సుదీప్ ఒక్క సీన్ వేషంలో కనిపించారు) సినీ తారలు ముగ్గురినీ పెట్టుకోవడం మంచి బిజినెస్ స్ట్రేటజీయే. దక్షిణాది భాషల్లో విడుదలైనప్పుడు ఆ స్టార్ పవర్ సినిమాకు కలిసొస్తుందని దర్శక, నిర్మాతలు మంచి స్ట్రేటజీయే వేశారు. కానీ, ఆ పనితనం కథ, కథనం మీద కూడా పెట్టాల్సింది. 'ట్రాయ్’, ‘300’, ‘మాస్క్ ఆఫ్ జోర్’ లాంటి అనేక సినిమాల ప్రభావం స్పష్టంగా ఉన్నప్పటికీ  తెరపై చూపిన కథలో లోపాలున్నాయి. ఫస్టాఫ్ ఎక్కువగా చిన్న ప్రభాస్, తమన్నాల మధ్య ప్రేమకే అంకితమైనట్లు అనిపిస్తుంది. డ్రీమ్ సాంగ్ ‘ధీవర...’ కానీ, ప్రేమగీతం ‘పచ్చబొట్టు...’ కానీ సినిమా నిడివినే పెంచాయి తప్ప, ప్రేక్షకుల ఇన్‌వాల్వ్‌మెంట్‌ను పెంచలేదు. రాజమౌళి సినిమాల్లో తరచూ ఉండే బలమైన ఇంటర్వెల్ పాయింట్ ఇందులో మిస్సయ్యామా అనిపిస్తుంది. ఇక, సెకండాఫ్‌లో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది. కానీ, అక్కడి ఐటమ్ సాంగ్ జానపదం సెటప్‌లో కాక, కౌబాయ్ సెటప్‌లో రావాల్సిన పాటేమో అనిపిస్తుంది. ఆ పాట కూడా కథాగమనానికి అడ్డే. ఇక, కాలకేయులు అంత హఠాత్తుగా వచ్చి, మాహిష్మతిపై ఎందుకు యుద్ధం చేస్తారో అర్థం కాదు. అలాగే, అనుష్కను కాపాడాలనుకొనే బృందం ఆ పనిలో ఎందుకుందో, తమన్నాకూ ఆ పనికీ సంబంధం ఏమిటో, చిన్న ప్రభాస్ కేవలం చెక్క కొయ్య ముసుగు ఆధారంగా తమన్నాను ఊహించుకుంటూ మబ్బుల్లో ఉండే ఆ నీటికొండను ఎక్కడమేమిటో అర్థం కాదు. దాదాపు 25 నిమిషాలుండే యుద్ధ సన్నివేశాలు మాత్రం హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయి. అవన్నీ వీడియో గేమ్‌లకు అలవాటు పడిన ఈ తరం చిన్న పిల్లల్ని ఆకట్టుకుంటాయి. అయితే, వీటితో పాటు వీటన్నిటినీ బలంగా ముడివేసే తల్లీ కొడుకుల అనుబంధం లాంటి ఎమోషన్స్ మీద మరింత వర్క్ చేసి ఉండాల్సింది.

రెండు పార్ట్‌లు చేయడమే లోపమా?
తెరపై ఒక కథను పూర్తిగా చూడడం, చదవడం అలవాటైన తెలుగు ప్రేక్షకులకు రెండు పార్ట్‌లుగా ఒక కథను చూపాలనుకోవడం ఒక రకంగా సాహసమే. అయితే, అలా చేస్తున్నప్పుడు తరువాతి పార్ట్ కోసం ఒక ఆసక్తికరమైన లింక్‌ను అసంపూర్తిగా వదిలిపెట్టడం వరకైతే ఫరవాలేదు కానీ, ఏ పార్ట్‌కు ఆ పార్ట్ వరకు కథలో ఒక కంప్లీట్‌నెస్ ఉండేలా జాగ్రత్తపడాలి. అలా చేయకపోతే, కథ అసంపూర్తిగా ఆగిందంటూ, ప్రేక్షకుడు అంత సినిమా చూసీ, అసంతృప్తిగా బయటకు తిరిగొస్తాడు. ‘బాహుబలి... ది బిగినింగ్’ అనే ఈ ఫస్ట్ పార్ట్‌లో జరిగింది అదే! నిజానికి, దీన్ని ఒక సినిమాగా తీయాలనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తీరా కొన్ని నెలల షూటింగ్ తరువాత - భారీ బడ్జెట్ వల్లనో, మరే కారణం వల్లనో కానీ రెండు పార్ట్‌లుగా తీయాలనీ, విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. అందుకు తగ్గట్లే, కథలో, కథనంలో అనివార్యంగా మార్పులు చేసుకున్నట్లున్నారు. ఫలితంగా, సినిమాలో అక్కడక్కడ కొన్ని సందర్భాలు చాలా ఆసక్తికరంగా అనిపించినా, ఆద్యంతం ఆ టెంపోనూ, ఫ్లోనూ కొనసాగించలేకపోయారు.  

విందు భోజనం పెడతామని వాగ్దానం చేసినప్పుడు, లేదా ప్రిపేరై వచ్చినప్పుడు పెట్టేవాళ్ళ మాటేమో కానీ, తినేవాళ్ళు మాత్రం విందు భోజనానికే సిద్ధమై వస్తారు. కానీ, తీరా ఫుల్ మీల్స్ కాదు కదా... ప్లేట్ మీల్స్ పెట్టి పంపిస్తే... వచ్చినవాళ్ళకు అసంతృప్తి కలుగుతుంది. ‘బాహుబలి’ పార్ట్1 చూసి బయటకొస్తున్నవాళ్ళ ఫీలింగ్ దాదాపు అదే! ఆకాశమే హద్దుగా జరిగిన ప్రచారం, ‘తెలుగు సినిమా ప్రమాణాలను హాలీవుడ్‌కు చేరుస్తుంది’ అంటూ వచ్చిన పోలిక, ఆశ్చర్యపరుస్తుందంటూ యూనిట్ సభ్యులు చేసిన వాగ్దానం లాంటివన్నీ ‘బాహుబలి’కి పాజిటివ్ కన్నా నెగిటివ్ అయ్యే ప్రమాదం మొదటి రోజు థియేటర్ల దగ్గర కనిపించింది. విజువల్‌గా ఎంతో బాగుందనిపించినా, కథతో, కథనంతో పూర్తిస్థాయి తృప్తి కలగకపోతే, ఆ తప్పు ప్రేక్షకులది మాత్రం కానే కాదు.

కొసమెరుపు - రెండు గంటల నలభై నిమిషాలూ చూశాక, ఈ సినిమా ‘ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా’ అవునో కాదో కానీ, ‘ప్రైడ్ ఆఫ్ తెలుగు డెరైక్టర్ రాజమౌళి’ అని మాత్రం అర్థమవుతుంది.
-రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement