బస్‌లో... స్పీడున్న హీరో
కొత్త సినిమా గురూ!
చిత్రం- ‘స్పీడున్నోడు’
మూలకథ- ప్రభాకరన్
కెమేరా- విజయ్ ఉలగనాథ్
యాక్షన్- రవివర్మ
సంగీతం- డి.జె. వసంత్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత- వివేక్ కూచిభొట్
నిర్మాత- భీమనేని సునీత
స్క్రీన్‌ప్లే- దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్‌రావు
‘‘తప్పుడు ఫ్రెండ్స్ ఉండవచ్చేమో కానీ, ఫ్రెండ్‌షిప్ ఎప్పుడూ తప్పు కాదు!’’ ‘స్పీడున్నోడు’లో ఒక డైలాగ్ ఇది. ఈ చిత్రకథ, హీరో పాత్ర స్వభావం బేసిగ్గా ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్నవే. స్నేహం, ప్రేమ, పగ, ద్వేషం, ద్రోహం - దీనికి మూలస్తంభాలు. తమిళ హిట్ ‘సుందర పాండియన్’ (2012)కి ఇది రీమేక్. ఇదే కథ కన్నడంలో ‘రాజా హులి’ (2013) పేరిట రీమేకై, అక్కడా సక్సెసైంది. రీమేక్‌లకు మారుపేరైన భీమనేని శ్రీనివాస్‌రావు ఆ మ్యాజిక్‌ను తెలుగులో క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు.
తమిళంలో పల్లెటూళ్ళ నేపథ్యంలోని ఈ కథను తెలుగులో రాయలసీమకి మార్చారు. రాప్తాడు, వెంకటాపురం అనే రెండు గ్రామాల మీదుగా పక్కనే ఉన్న పట్నానికి ఓ ఆర్టీసీ బస్సు వెళుతుంటుంది. పట్నం వెళ్ళి చదువుకొనే స్టూడెంట్స్ ప్రేమలకు కారణమైన ‘ప్రేమపావురం’ ఆ బస్సు. రాప్తాడు ప్రెసిడెంట్ వీరభద్రప్ప (ప్రకాశ్‌రాజ్). అతని కొడుకు శోభన్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). డిగ్రీ అయి, నాలుగేళ్ళయినా జాలీగా ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తుంటాడు. అతనికి ఫ్రెండ్‌షిప్ అంటే ప్రాణం. స్నేహితుల ప్రేమ నిలబెట్టడా నికి ఎన్ని ట్రిక్కులైనా వేస్తాడు.
ఇక, వెంకటాపురం పెద్దమనిషి (రావు రమేశ్) కూతురు వాసంతి (సోనారిక). ఆమె ప్రేమను పొందడానికి హీరో ఫ్రెండ్ గిరి అలియాస్ రబ్బరు గాడు (మధునందన్), పక్క ఊరి చిట్టి (సత్య) పోటీలు పడుతుంటారు. మరోపక్క హీరోయిన్‌కు బావ వరసయ్యే జగన్ (కబీర్ దుహాన్ సింగ్) ఆమెను పెళ్ళాడాలనుకుం టాడు. తీరా హీరోయినేమో హీరోనే ప్రేమిస్తున్నానంటుంది. సెకండాఫ్‌కొచ్చేసరికి, హీరోయిన్‌ని ప్రేమించిన చిట్టి మళ్ళీ బస్సులో గొడవపడ్తాడు. అక్కడో ఘటనతో కథలో ట్విస్ట్. తర్వాతి మలుపులన్నీ తెరపై చూడాల్సిన మిగతా కథలోని అంశాలు.
పేరున్న నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడైన హీరో శ్రీనివాస్‌కిది రెండో సినిమా. ‘అల్లుడు శీను’లానే ఈసారీ మాస్‌ని ఆకట్టుకొనేందుకు తపించారు. పాటలు, ఫైట్లు - అన్నిటిలో ఆ శ్రమ కనిపించింది. ఇక, ఆ మధ్య ‘జాదూగాడు’లో, ఇప్పుడు ఇందులో మెరిసిన హీరోయిన్ సోనారికది బస్సుకూ, పాటలకూ పరిమితమైన అందం. సినిమా నిండా భారీ తారాగణం ఉంది. హీరో మిత్ర బృందంలో శ్రీనివాసరెడ్డి, ‘షకలక’ శంకర్ - ఇలా చాలామంది కనిపిస్తారు.
ఇల్లరికపు అల్లుళ్ళుగా పృథ్వి, పోసాని నవ్విస్తారు. ‘అల్లుడు శీను’లానే ఇందులోనూ తమన్నా ఐటవ్‌ుసాంగ్ చేశారు. ఇన్ని హంగు లున్న సినిమాగా ‘స్పీడున్నోడు’లో నిర్మాణవిలువలు పుష్కలం. సంగీతం, రీరికార్డింగ్ ల్లోనూ మాస్‌ని దృష్టిలో పెట్టుకొన్నారు. భీమనేని, ప్రవీణ్‌వర్మ రాసిన డైలాగ్స్ పేలాయి.
రెండున్నర గంటల పైచిలుకు సినిమాలో - ఫస్టాఫ్ అంతా హీరోల ఫ్రెండ్స్, మందు పార్టీలు, బస్సులో ప్రేమతో అక్కడక్కడే నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథ స్పీడందు కుంటుంది. ఊహించని ట్విస్టులూ వస్తాయి. నిజానికి, హీరోయిన్ పదో తరగతిలో ఉన్న ప్పుడే హీరో ఆమెను ప్రేమించాడనీ, ఆమె కాదనేసరికి అప్పట్లో వదిలేశాడనీ చూపిస్తారు. అలాగే, హీరోయిన్‌పై బావ మోజు కానీ, వాళ్ళిద్దరూ బంధువులని కానీ ఆ బావకి బాగా ఫ్రెండైన హీరోకు చివరి దాకా తెలియదంటారు. అవన్నీ కన్వీయంట్ స్క్రీన్‌ప్లే.
తమిళ కథను యథాతథంగా తీసినా, హీరోయిజమ్ కోసం, తెలుగు వారికి అలవాటైన స్టైలిష్ టేకింగ్ కోసం మార్పులు అనివార్యమని దర్శక నిర్మాతలు ఫీలవ డం అర్థం చేసుకోవాలి! ‘కొట్టింది ఫ్రెండ్ అయితే, అరుపు బయటకు వినిపించకూడదు’ అని తమాషాగా ముగు స్తుందీ సినిమా. అక్షరాలా ‘స్పీడున్నోడు’ అరుపులు వినిపించని సెలైంట్ కిల్లర్!
- రెంటాల జయదేవ