యాక్షన్ సీన్స్ చూశా.. బాగా చేశాడు!
- నాగార్జున
‘‘సాయి శ్రీనివాస్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. కొన్ని యాక్షన్ సీన్స్ చూశా... బాగా చేశాడు. ప్రకాష్‌రాజ్ మామూలుగా ఎవర్నీ పొగడడు. కానీ తనను ఈ మధ్య కలిసినప్పుడు శ్రీనివాస్‌ను పొగడటం చూశాను. బెల్లంకొండ సురేశ్ డైనమిక్ నిర్మాత. నాగ చైతన్యతో ‘తడాఖా’ చిత్రం చేశాడు. సురేశ్ వంటి గొప్ప తండ్రి శ్రీనుకు ఉన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక జంటగా గుడ్‌విల్ సినిమా పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమనేని సునీత నిర్మించిన ‘స్పీడున్నోడు’ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది.
హీరోలు నాగార్జున, వెంకటేశ్ చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్‌లు అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘కొంతమందికి మాత్రమే ఇలాంటి టైటిల్స్ కుదురుతాయి. శ్రీనివాస్ తన డ్యాన్సు, ఫైట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘స్పీడున్నోడు’ టైటిల్ తనకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. శ్రీను నుంచి భీమనేని మంచి అవుట్ పుట్ తీసుకుని ఉంటాడు ’’ అని పేర్కొన్నారు. ‘‘నాకు ‘సుస్వాగతం’ చిత్రం నుంచి భీమనేనిగారితో రిలేషన్ ఉంది. ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడాయన. వారి హృదయాలను తాకే సినిమాలు తీస్తాడు’’ అని ప్రకాష్‌రాజ్ తెలిపారు.
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ‘‘ఈ రోజుల్లో సినిమా తీయడం, రిలీజ్ చేయడం చాలా కష్టంతో కూడకున్న పని. ఒక రీమేక్ స్క్రిప్ట్‌ను నమ్ముకుని మూడేళ్లుగా పనిచేశాం. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నా గత చిత్రాలతో పోలిస్తే కథ, టెక్నాలజీ పరంగా ట్రెండీగా ఉండే చిత్రమిది. సాయి శ్రీనివాస్ భవిష్యత్తులో బిగ్గెస్ట్ స్టార్ హీరో అవుతాడు’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రానికి మంచి పాటలు అందించిన డీజే వసంత్ టాప్ టెక్నీషియన్‌గా ఎదుగుతాడు. వివేక్ కూచిబొట్లగారు మాకు ఎంతో అండగా నిలబడ్డారు.
సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉలగనాథ్ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు’’ అని సాయి శ్రీనివాస్ చెప్పారు. ఈ వేడుకలో నటులు బ్రహ్మానందం, అలీ, రావు రమేశ్, నిర్మాత పోకూరి బాబూరావు, ఎడిటర్ గౌతంరాజు తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.