Bhimaneni Srinivasa Rao
-
నవ్వుల నమో
విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ శ్రీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎ. ప్రశాంత్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. ఏదో చేయాలనే, నేర్చుకోవాలనే తపన తనలో ఉంది. ‘నమో’ పేరు వినగానే ప్రధాని నరేంద్ర మోదీగారి మీద కథ అనుకున్నాను. హీరోల పాత్రల పేర్లలోని (నగేశ్, మోహన్) తొలి అక్షరాలతో టైటిల్ పెట్టినట్లు చెప్పాడు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నమో’ ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’’ అన్నారు ఆదిత్య రెడ్డి కుందూరు. ‘‘ఇదొక వైవిధ్యమైన చిత్రం’’ అన్నారు విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ. -
కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం
‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం’ లాంటి మంచి సినిమాలు చేశాను. మంచి కథలు దొరకడం కష్టమవుతున్న ఈ మధ్యకాలంలో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఒక గొప్ప సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇది నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్’’ అని భీమనేని శ్రీనివాసరావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో శివ కార్తికేయన్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు చెప్పిన విశేషాలు. ► ‘కౌసల్య కృష్ణమూర్తి’కి వచ్చినన్ని అభినందనలు నా గత సినిమాలకు రాలేదు. మా చిత్రం నచ్చడంతో మీడియా మిత్రులు కూడా సొంత సినిమా అనుకుని సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు కూడా సినిమాకు 100 శాతం కనెక్ట్ అయ్యారు. చాలా మంది కాలేజ్ విద్యార్థులు ఫోన్ చేసి, ఈ సినిమా మాకు ఓ స్ఫూర్తిలా ఉందని అంటున్నారు. ► ఈ మధ్య కాలంలో ‘మజిలీ, జెర్సీ’ లాంటి క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలు వచ్చి సక్సెస్ సాధించాయి. అయితే మాది ఫిమేల్ సెంట్రిక్ మూవీ. క్రికెటర్‌గా ఎదగాలనే ఒక అమ్మాయి తపనను చూపిస్తూనే, తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్ని చూపించాం. దానికి సమాంతరంగా రైతుల సమస్యలను చూపించాం. స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరికీ నచ్చడంతో పాటు భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ► ‘కళాబంధు’ టి. సుబ్బిరామిరెడ్డిగారు కుటుంబ సభ్యులతో కలిసి మా సినిమా చూశారు. వారికి సినిమా విపరీతంగా నచ్చడంతో నన్ను, కె.ఎస్ రామారావుగారిని అభినందించారు. రాజేంద్రప్రసాద్, ఐశ్వర్య రాజేష్, కార్తీక్ రాజు నటనను కొనియాడి, ఫోన్లో అభినందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ వంటి గొప్ప బేనర్లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు కె.ఎస్ రామారావుగారికి, కె.ఎ వల్లభ గారికి థ్యాంక్స్. ► ప్రేక్షకులకు కథ నచ్చితే అది రీమేక్ సినిమానా? ఒరిజినల్ సినిమానా? అని చూడకుండా ఆదరిస్తున్నారు.. హిట్ చేస్తున్నారు. ఒక మంచి కథ ఎక్కడ ఉన్నా మన తెలుగు ప్రేక్షకులకి చూపించాలనే సంకల్పంతో ఇప్పటి వరకూ ఎక్కువ రీమేక్ సినిమాలే చేశాను. కాలంతో పాటు మనం మారాలి. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు తీసినప్పుడే విజయం సాధించగలం. ► స్కూల్, కాలేజ్ డేస్ నుంచే నేను రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా చేసేవాణ్ణి. ఆ అనుభవంతో సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న టైమ్‌లో ‘అశ్వద్ధామ’ సినిమాలో ఓ పాత్ర చేశా. ఆర్. నారాయణమూర్తిగారి ‘ఆలోచించండి’ సినిమాలో సెకండ్ హీరోగా చేశా. ‘కుదిరితే కప్పు కాఫీ, కెరటం’ వంటి చిత్రాల తర్వాత ‘కౌసల్య కృష్ణమూర్తి’లో బ్యాంకు మేనేజర్ పాత్ర చేశా. ఈ సినిమాలో నాదొక్కటే నెగటివ్ రోల్ అయినా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇకపైన కూడా మంచి పాత్రలొస్తే నటిస్తా. ► ఏ దర్శకుడికైనా కొన్ని సినిమాలు మైలేజ్‌నిస్తాయి. నాకు ‘సుడిగాడు’ అలాంటి సినిమా. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా. నేను, ‘అల్లరి’ నరేష్ కూడా ‘సుడిగాడు 2’ మీద చాలా ఆసక్తిగా ఉన్నాం. మంచి అవకాశం వస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. -
శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు
‘‘సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం కూడా అవసరం. అప్పుడే ఇంకా మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంది. సినిమా చూసినవారు ‘శంకరాభరణం, మాతృదేవోభవ’ లాంటి గొప్ప సినిమా అని అభినందిస్తున్నారు. ఇకపై కూడా మా బ్యానర్లో మా గత సినిమాల్లానే క్వాలిటీతో పాటు మంచి పర్పస్ ఉన్న సినిమాలే అందిస్తాం’’ అన్నారు కేయస్ రామారావు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో పాటు కలెక్షన్లూ సాధిస్తోందని చిత్రబృందం తెలిపింది. శనివారం సక్సెస్ మీట్లో ఐశ్వర్యా రాజేశ్ మాట్లాడుతూ – ‘‘తమిళంలో ఎలా ఆదరించారో తెలుగులోనూ ఈ సినిమాను అలానే ఆదరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి ఈ ప్రశంసలను సపోర్ట్‌గా భావిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాకు పునాది కథ. మంచి కథ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాం. ఈ బ్యానర్లో గతంలో వచ్చిన గొప్ప సినిమాలకు దీటుగానే ఈ సినిమా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘ఒక గొప్ప సినిమాకు పాటలు రాసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాంబాబు గోసాల. ‘‘కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి సినిమాయే ‘కౌసల్య కృష్ణమూర్తి’’ అన్నారు బీఏ రాజు. ‘ఇండియన్ 2’ నుంచి తప్పుకున్నాను కమల్‌హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌ది ఓ కీలక పాత్ర. డేట్స్ క్లాష్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు. ఇలాంటి సినిమా వదులుకోవడం బాధగా ఉందని ఐశ్వర్య తెలిపారు. -
అలా అనుకోకపోతే పేరు మార్చుకుంటా
‘‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చూసి బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా సరే.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ‘రాజేంద్రప్రసాద్ మా నాన్నగారు అయ్యుంటే బాగుండు’ అనుకోకపోతే నా పేరు మార్చుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఐశ్వర్యారాజేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కనా’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యారాజేశ్తోనే ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించారు. దిబు నినన్ థామస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అభిరుచి ఉన్న నిర్మాత ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. అభిరుచికి, డబ్బుకి సంబంధం లేదు. రామారావుగారు ఇప్పటికీ, ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ గొప్ప కథ. ఈ సినిమాలో కామెడీ, తండ్రీ కూతుళ్ల బంధం ఉంటుంది. భీమనేని శ్రీను నా నుంచి చాలా సున్నితమైన నటన రాబట్టుకున్నాడు’’ అన్నారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం టీజర్ చూశాను.. వాస్తవానికి దగ్గరగా ఉంది. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. తల్లిదండ్రులతో అమ్మాయిల రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? అమ్మాయిల కలలకు తల్లిదండ్రులు ఎలా సపోర్టివ్‌గా నిలిచారు? అనే అంశాలను సినిమాలో చర్చించారు. ఇలాంటి చిత్రాల వల్ల ఉమెన్ క్రికెట్‌ను ప్రోత్సహించాలన్న విషయం మరింత మందికి చేరువ అవుతుంది. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనకు ఈ సినిమా దోహదం చేస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘మా రామారావు అన్నయ్య రీమేక్ చేసిన సినిమాలన్నీ హిట్లు, రికార్డులు బద్దలు కొట్టాయి. చిరంజీవిగారివంటి ఎందరో పెద్ద స్టార్స్‌తో సినిమాలు తీసినా, ఆయన తీసిన చిన్న సినిమాలే సెన్సేషన్ హిట్లు.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు తీసుకొచ్చాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆయన కొడుకు వల్లభ సక్సెస్‌కి నాంది అవుతుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘ఐశ్వర్య నటిస్తోందనిపించదు.. నటన ఆమెకు నల్లేరు మీద నడకలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారు, ఐశ్వర్య పోటీపడి మరీ నటించారు. రామానాయుడుగారిలాంటి టాప్ 10 నిర్మాతల్లో రామారావుగారు ఒకరు’’ అన్నారు. ఐశ్వర్యారాజేష్ మాట్లాడుతూ – ‘‘కనా’ నా జీవితాన్ని మార్చింది. తెలుగులో నా తొలి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’ కావడం అదృష్టం. రామారావుగారి ప్రొడక్షన్లో నా తొలి సినిమా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా హక్కులు నాకు కావాలని ఐశ్వర్యను అడిగితే ఇప్పించింది. సావిత్రిగారు, శారదగారు.. ఇప్పుడు కీర్తీ సురేశ్, సమంత బాగా నటిస్తారు. వారికి ఏ మాత్రం తీసిపోకుండా నటించగలదు ఐశ్వర్య’’ అన్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ పి.రామ్మోహన్రావు, నిర్మాతలు పోకూరి బాబూరావు, కె. అశోక్ కుమార్, జి.విజయ రాజు, కార్తీక్ రాజు, నటుడు మహేశ్, డైరెక్టర్ క్రాంతిమాధవ్, ‘కనా’ చిత్ర దర్శకుడు, కథా రచయిత అరుణ్ రాజా కామరాజు, కెమెరామెన్ ఆండ్రూ, సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా: చిరంజీవి
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్ అనేది టాగ్లైన్. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘క్రియేటివ్ కమర్షియల్స్ మా కె.ఎస్. రామారావు నిర్మాణ సారథ్యంలో మిత్రుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. ఇది క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న విబిన్న కథాంశమిది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. నేషనల్ వైడ్‌గా స్పోర్ట్స్ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించాయి. గేమ్స్‌కి అంతటి ప్రాధాన్యత ఉంది. దాని బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. ఇందులో హీరోయిన్గా చేసిన ఐశ్యర్యా రాజేష్.. సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక ఉమెన్ క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో ఆ అమ్మాయి చక్కగా ఒదిగిపోయింది. అతడికి ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది క్రికెటర్ క్యారెక్టర్‌కి జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకుంది అంటే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం తెలుస్తోంది. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్ రావడం అన్నది శుభపరిణామం. నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను. నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుంది. కమర్షియల్‌తో పాటు మంచి ఇతివృత్తాలను తీసుకునే తెరకెక్కించే భీమనేని శ్రీనివాసరావుకి ఇది ఒక మైలుస్టోన్ మూవీగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్రతి ఒక్క యూనిట్ సభ్యునికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు, పలువురు నటీనటులు తదితరులు పాల్గొన్నారు. -
దర్శకుడికి ప్రతి సినిమా పరీక్షే
‘‘ప్రతి సినిమాకు ప్రెషర్ ఉంటుంది. ప్రతి సినిమా ఫస్ట్ సినిమా అని చేయాలి. హీరోకు ఇంకో చాన్స్ ఉంటుంది. కానీ దర్శకుడికి ప్రతి సినిమా పరీక్షే. బావుంటే ప్రేక్షకులు ఎంత ఎత్తుకు తీసుకువెళ్తున్నారో బాలేకపోతే అంతే సులువుగా మరచిపోతున్నారు. అది ఎన్ని కోట్లుతో తీసిన సినిమా అయినా, ఎన్ని హిట్స్ ఇచ్చిన దర్శకుడు అయినా సరే’’ అని భీమనేని శ్రీనివాస్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వ ప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కుచ్చిభొట్ల నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా భీమనేని శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► ‘అల్లరి’ నరేశ్, నేను ‘సుడిగాడు’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని చాలా డిస్కస్ చేసుకున్నాం. ‘సుడిగాడు’ హిట్ అవుతుంది అనుకున్నాం కానీ అంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందనుకోలేదు. దాంతో మా కాంబినేషన్లో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలి? ‘సుడిగాడు’ సీక్వెల్ చేయలా? అని ఆలోచించాం. ఓ లైన్ కూడా అనుకున్నాం. ఈలోపు ఈ పాయింట్ వచ్చి ఈ సినిమా చేశాం. ఇందులో నరేశ్ లేడీస్ టైలర్‌గా కనిపిస్తారు. జయప్రకాశ్ రెడ్డి టైలర్ నుంచి ఎంఎల్ఏ అవుతారు. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలో నరేశ్ కూడా అతని దారినే ఫాలో అవుతాడు. ► సునీల్ హీరోగా మంచి సక్సెస్ చూశారు. మళ్లీ కామెడీ చేయాలనుకున్నప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాతో లాంచ్ అవ్వాలనుకున్నారు. ఈ సినిమా నచ్చడంతో ఒప్పుకున్నారు. నరేశ్ ఫ్రెండ్‌గా ఓ కీ రోల్లో కనిపిస్తారాయన. ► క్లైమాక్స్ ముందు వచ్చే 20 నిమిషాలు సినిమాకు హైలైట్ అని ఫీల్ అవుతున్నాం. ఆడియన్స్ సీట్లో కూర్చోకుండా నవ్వుతారు. లాజిక్, మేజిక్‌లు పట్టించుకోకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ ఇది. ► ఏదైనా క్రాఫ్ట్ బాగా చేస్తే మన మీద ఆ ముద్రపyì పోతుంది. ఫస్ట్ సినిమా ‘సుప్రభాతం’ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా రీమేక్‌లు చేశాను. తర్వాత సొంత కథలతో చేసిన ‘స్వప్నలోకం, నీ తోడు కావాలి’ సరిగ్గా ఆడలేదు. అందుకే రీమేక్స్‌లో బాగా రాణిస్తాడనే ముద్ర పడిపోయింది. దాంతో ఇవే చేస్తున్నాను. ► ఈ నిర్మాతలతో చాలా రోజులుగా అనుబంధం ఉంది. వాళ్లు ఆల్రెడీ ‘నేనే రాజు నేనే మంత్రి’ , ఎం.ఎల్.ఎ’ సినిమాలు తీశారు. హ్యాట్రిక్ కోసం స్క్రిప్ట్ జాగ్రత్తగా ఎంచుకున్నారు. -
ఆ లోటు తీరుతుంది
‘అల్లరి’ నరేశ్, సునీల్ కలిసి నటిస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. చిత్రా శుక్లా కథానాయిక. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సుడిగాడు’ వంటి హిట్ చిత్రం తర్వాత నరేశ్, నా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. సునీల్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఏడాదిపాటు కష్టపడి హిట్ సాధించాలనే లక్ష్యంతో వస్తున్నాం. దాదాపు 200 టైటిల్స్ అనుకున్నాం. ఆఖరికి నా ‘ఎస్’ సెంటిమెంట్‌ను కూడా వదిలేద్దామనుకున్నా. చివరికి ‘ఎస్’తోనే టైటిల్ ఫిక్స్ చేశాం’’ అన్నారు. ‘‘ఆడియన్స్ నా నుంచి ఏదైతే ఇన్నాళ్లు మిస్ అయ్యారో నేనూ అదే మిస్ అయ్యాను. ‘సిల్లీ ఫెలోస్’తో ఆ లోటు తీరుతుంది. ఒకప్పటి కామెడీ జానర్లను తలపించే సినిమా అవుతుంది’’ అన్నారు సునీల్. ‘‘దాదాపు మూడేళ్లు స్క్రిప్ట్‌పై వర్క్ చేసిన సినిమా ‘సిల్లీ ఫెలోస్’. పూర్తి స్థాయి ఎంటరై్టన్మెంట్తో వస్తున్నాం’’ అన్నారు నరేశ్. ‘‘నేనే రాజు నేనే మంత్రి, ఎమ్.ఎల్.ఎ’ చిత్రాల తర్వాత మా బ్యానర్లో వస్తోన్న చిత్రమిది. హ్యాట్రిక్ సాధిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి. చిత్రా శుక్లా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బ్లూ ప్లానెట్ ఎంటరై్టన్మెంట్స్ ఎల్ ఎల్ పీ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కెమెరా: అనీష్ తరుణ్ కుమార్, సంగీతం: శ్రీ వసంత్. -
బస్‌లో... స్పీడున్న హీరో
కొత్త సినిమా గురూ! చిత్రం- ‘స్పీడున్నోడు’ మూలకథ- ప్రభాకరన్ కెమేరా- విజయ్ ఉలగనాథ్ యాక్షన్- రవివర్మ సంగీతం- డి.జె. వసంత్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత- వివేక్ కూచిభొట్ నిర్మాత- భీమనేని సునీత స్క్రీన్‌ప్లే- దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్‌రావు ‘‘తప్పుడు ఫ్రెండ్స్ ఉండవచ్చేమో కానీ, ఫ్రెండ్షిప్ ఎప్పుడూ తప్పు కాదు!’’ ‘స్పీడున్నోడు’లో ఒక డైలాగ్ ఇది. ఈ చిత్రకథ, హీరో పాత్ర స్వభావం బేసిగ్గా ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్నవే. స్నేహం, ప్రేమ, పగ, ద్వేషం, ద్రోహం - దీనికి మూలస్తంభాలు. తమిళ హిట్ ‘సుందర పాండియన్’ (2012)కి ఇది రీమేక్. ఇదే కథ కన్నడంలో ‘రాజా హులి’ (2013) పేరిట రీమేకై, అక్కడా సక్సెసైంది. రీమేక్‌లకు మారుపేరైన భీమనేని శ్రీనివాస్‌రావు ఆ మ్యాజిక్‌ను తెలుగులో క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. తమిళంలో పల్లెటూళ్ళ నేపథ్యంలోని ఈ కథను తెలుగులో రాయలసీమకి మార్చారు. రాప్తాడు, వెంకటాపురం అనే రెండు గ్రామాల మీదుగా పక్కనే ఉన్న పట్నానికి ఓ ఆర్టీసీ బస్సు వెళుతుంటుంది. పట్నం వెళ్ళి చదువుకొనే స్టూడెంట్స్ ప్రేమలకు కారణమైన ‘ప్రేమపావురం’ ఆ బస్సు. రాప్తాడు ప్రెసిడెంట్ వీరభద్రప్ప (ప్రకాశ్‌రాజ్). అతని కొడుకు శోభన్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). డిగ్రీ అయి, నాలుగేళ్ళయినా జాలీగా ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తుంటాడు. అతనికి ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం. స్నేహితుల ప్రేమ నిలబెట్టడా నికి ఎన్ని ట్రిక్కులైనా వేస్తాడు. ఇక, వెంకటాపురం పెద్దమనిషి (రావు రమేశ్) కూతురు వాసంతి (సోనారిక). ఆమె ప్రేమను పొందడానికి హీరో ఫ్రెండ్ గిరి అలియాస్ రబ్బరు గాడు (మధునందన్), పక్క ఊరి చిట్టి (సత్య) పోటీలు పడుతుంటారు. మరోపక్క హీరోయిన్‌కు బావ వరసయ్యే జగన్ (కబీర్ దుహాన్ సింగ్) ఆమెను పెళ్ళాడాలనుకుం టాడు. తీరా హీరోయినేమో హీరోనే ప్రేమిస్తున్నానంటుంది. సెకండాఫ్‌కొచ్చేసరికి, హీరోయిన్ని ప్రేమించిన చిట్టి మళ్ళీ బస్సులో గొడవపడ్తాడు. అక్కడో ఘటనతో కథలో ట్విస్ట్. తర్వాతి మలుపులన్నీ తెరపై చూడాల్సిన మిగతా కథలోని అంశాలు. పేరున్న నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడైన హీరో శ్రీనివాస్‌కిది రెండో సినిమా. ‘అల్లుడు శీను’లానే ఈసారీ మాస్‌ని ఆకట్టుకొనేందుకు తపించారు. పాటలు, ఫైట్లు - అన్నిటిలో ఆ శ్రమ కనిపించింది. ఇక, ఆ మధ్య ‘జాదూగాడు’లో, ఇప్పుడు ఇందులో మెరిసిన హీరోయిన్ సోనారికది బస్సుకూ, పాటలకూ పరిమితమైన అందం. సినిమా నిండా భారీ తారాగణం ఉంది. హీరో మిత్ర బృందంలో శ్రీనివాసరెడ్డి, ‘షకలక’ శంకర్ - ఇలా చాలామంది కనిపిస్తారు. ఇల్లరికపు అల్లుళ్ళుగా పృథ్వి, పోసాని నవ్విస్తారు. ‘అల్లుడు శీను’లానే ఇందులోనూ తమన్నా ఐటవ్ుసాంగ్ చేశారు. ఇన్ని హంగు లున్న సినిమాగా ‘స్పీడున్నోడు’లో నిర్మాణవిలువలు పుష్కలం. సంగీతం, రీరికార్డింగ్ ల్లోనూ మాస్‌ని దృష్టిలో పెట్టుకొన్నారు. భీమనేని, ప్రవీణ్‌వర్మ రాసిన డైలాగ్స్ పేలాయి. రెండున్నర గంటల పైచిలుకు సినిమాలో - ఫస్టాఫ్ అంతా హీరోల ఫ్రెండ్స్, మందు పార్టీలు, బస్సులో ప్రేమతో అక్కడక్కడే నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథ స్పీడందు కుంటుంది. ఊహించని ట్విస్టులూ వస్తాయి. నిజానికి, హీరోయిన్ పదో తరగతిలో ఉన్న ప్పుడే హీరో ఆమెను ప్రేమించాడనీ, ఆమె కాదనేసరికి అప్పట్లో వదిలేశాడనీ చూపిస్తారు. అలాగే, హీరోయిన్‌పై బావ మోజు కానీ, వాళ్ళిద్దరూ బంధువులని కానీ ఆ బావకి బాగా ఫ్రెండైన హీరోకు చివరి దాకా తెలియదంటారు. అవన్నీ కన్వీయంట్ స్క్రీన్‌ప్లే. తమిళ కథను యథాతథంగా తీసినా, హీరోయిజమ్ కోసం, తెలుగు వారికి అలవాటైన స్టైలిష్ టేకింగ్ కోసం మార్పులు అనివార్యమని దర్శక నిర్మాతలు ఫీలవ డం అర్థం చేసుకోవాలి! ‘కొట్టింది ఫ్రెండ్ అయితే, అరుపు బయటకు వినిపించకూడదు’ అని తమాషాగా ముగు స్తుందీ సినిమా. అక్షరాలా ‘స్పీడున్నోడు’ అరుపులు వినిపించని సెలైంట్ కిల్లర్! - రెంటాల జయదేవ -
స్పీడున్నోడు ఆడియో విడుదల
-
ఉత్తముడైన గోపీ!
ఒక దశలో తమిళంలో టాప్ హీరోగా వెలుగొందారు సుధాకర్. ఆ తర్వాత తెలుగులోకి ఎంటరయ్యారు. ‘యముడికి మొగుడు’ తర్వాత తన కామెడీతో బాక్సాఫీస్‌ను ‘పిచ్చకొట్టుడు’ కొట్టారు. హీరో ఎవరైనా సరే, అప్పట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే సుధాకర్ పర్మినెంట్. ‘శుభాకాంక్షలు’లో జగపతిబాబు ఫ్రెండ్‌గా సుధాకర్ తనదైన శైలి ఎక్స్‌ప్రెషన్స్‌తో, డైలాగ్ డెలివరీతో నవ్వులు విరబూయించారు. సినిమా పేరు : శుభాకాంక్షలు (1998) డెరైక్ట్ చేసింది : భీమనేని శ్రీనివాసరావు సినిమా తీసింది : ఎన్.వి. ప్రసాద్,శానం నాగ అశోక్‌కుమార్ మాటలు రాసింది : మరుధూరి రాజా ‘‘గంగా భాగీరథీ సమానుడైన చందూకి... మీ లవింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్‌పాయింట్ పెన్నుతో రాయునది. మీరు క్షేమంగానే ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం మీ జన్మజన్మల అదృష్టం.డియర్ చందూ! మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ స్నేహితుడు గోపి చాలా ఓపిగ్గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయనను తడపకండి. పెళ్లైనా మీకు దూరంగా ఉండడం వల్ల మీరెంత బాధపడుతున్నారో - పెళ్లి కాకపోయినా గోపీ దూరమై, నేనూ అంతే బాధపడుతున్నాను. మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ‘ఆంధ్రా అన్నమయ్య’ అని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే, ఆయనెంత బాగుంటారో కదా అనిపిస్తోంది. ఆయన పాటను క్యాసెట్ చేసి, దాంతోపాటు ఆయన ఫొటో పంపండి. ఫొటో చూస్తూ... పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. ఉత్తముడైన గోపీని మరీ మరీ అడిగినట్టు చెప్పండి’’ ఇట్లు నిర్మలా మేరీ చందూ అనబడే ఓ భర్తకు... నిర్మలా మేరీ అనబడే ఓ భార్య రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో మీకు ఏం కనిపిస్తోంది? భర్త మీద అనురాగం... ప్రేమ... తొక్క... తోటకూర... ఇవేమీ కనబడడం లేదు కదూ! ఎందుకు కనిపిస్తాయి? పానకంలో పుడక లాగా, బెల్లం జిలేబీలో కారప్పొడి లాగా మధ్యలో ఈ గోపీగాడు కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు కనబడుతుంటే! అసలు ఎవడీ గోపీ? సారీ... ఎవడీ ఉత్తముడైన గోపీ? అయితే మీకు ముందు చందూ గురించి చెప్పాలి. చందు శారీ అయితే, ఈ గోపి బ్లౌజు. ఛీఛీ.. బ్యాడ్ కంప్యారిజన్. చందు ప్యాంటు అయితే, ఈ గోపీ అండర్వేర్. గోపీ లేకుండా చందూ ఎక్కడికీ వెళ్లలేడు.. ఏం చేయలేడు. అలాగని గోపి అరివీర భయంకరుడో, అపర మేధావో అనుకునేరు. గోపీకి బ్రెయినుంది కానీ, అది మోకాలి దగ్గరే ఉందని ప్రపంచంతో పాటు అతనికీ తెలుసు. బోడి సలహాలివ్వడంలో స్పెషలిస్టులకే స్పెషలిస్టు. కొంచెం మీరూ టేస్టు చేయండి... చందు... గోపి... ఇద్దరూ బ్యాచ్లర్సే. మేడ మీద గది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంటుంది. బాత్రూమ్కు గడియ కూడా ఉండదు. ఎన్నోసార్లు పనిమనిషికి తన దివ్యమంగళ రూపాన్ని ప్రదర్శించేశాడు మన గోపి. ఓసారి వీళ్లను విపరీతమైన ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టేసింది. నెలకు రెండువేలు కూడా అద్దె కట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఓ గురకారావు తగులుతాడు. అతను ఎంత రెంట్ ఇచ్చినా ఎవ్వరూ రూమ్ రెంట్కివ్వరు. అంత కిరాతకమైన గురక అతనిది. గోపీకో ఐడియా వచ్చింది. ఆ గురకారావుని బుట్టలో వేసుకుని రూమ్‌లో షేర్ ఇచ్చాడు. అతనొచ్చి రూమంతా తేరిపార చూశాడు. ‘రూమ్‌లో ఫ్యాన్లు లేవా?’ అడిగాడు మొహం అదోలా పెట్టి. ‘‘నేను బాలకృష్ణ ఫ్యాన్‌ని. ఈ చందూగాడు రమ్యకృష్ణ ఫ్యాన్. మన ఇంటి ఓనర్ వాళ్ల పనిమనిషికి ఫ్యాన్... ఇన్ని ఫ్యాన్లుండగా ఇంక కొత్త ఫ్యాన్లెందుకు?’’ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు గోపి. గురకారావుకి బాగా కాలింది - ‘నేను రూమ్లోఉండనంటే ఉండను’ అని తిరుగు టపా కట్టబోయాడు. గోపీ వదులుతాడా... వెంటనే ఓ అస్త్రం వదిలాడు. ‘‘ఇదే రూమ్‌లో కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి ఉండేవారు. వాళ్లెంత పైకొచ్చారో తెలుసు కదా’’ అని చెప్పాడు గోపి. అసలే సినిమా ఫీల్డ్‌లో రైటర్‌గా ట్రై చేస్తున్న ఆ గురకారావు ఆ దెబ్బకు ఫ్లాట్. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు స్టోరీ.. నైట్ టైమ్ స్టార్టయ్యింది. విమానం ఇంజిను మింగేసినట్టుగా ఒకటే గురక. వీళ్లిద్దరికీ నిద్ర కరవు, మనశ్శాంతి కరవు...‘ఇదేంట్రా బాబూ’ అని వాపోయాడు చందు. గోపీకి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. వెంటనే అప్లయ్ చేసేశాడు. గురకపెట్టి నిద్రపోతున్న ఆ గురకారావు పక్కనే పడుకుని, మీద కాలు వేశాడు. ఆ తర్వాత చేయి వేసి హత్తుకున్నాడు. ఈ దెబ్బకు ఆ గురకారావు ఉలిక్కిపడి లేచాడు. గోపీ అదోరకంగా చిలిపిగా చూశాడు. అతగాడు కంగారుపడిపోయాడు. ‘ఏంటి... నువ్వు ఆ టైపా?’ అనడిగాడు. గోపీ కవ్వింపుగా నవ్వుతూ - ‘మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నాం. రా... ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం’ అని ఆహ్వానించాడు.గురకారావుకి నిద్రమత్తు వదిలిపోయింది. ‘‘అమ్మో... ఇప్పుడు మనసు విప్పి మాట్లాడదామంటావ్. తర్వాత బట్టలు విప్పి మాట్లాడదామంటావ్. నా వల్ల కాదు’’ అని ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తాడు. గోపీ విజయగర్వంతో చందూ వైపు చూశాడు. ఓ ప్రేమ జంటను కలపడం కోసం చందు ఓ ఊరు వెళతాడు. తోడుగా గోపీ కూడా! అక్కడ వీళ్లకు ఎవరూ గది అద్దెకు ఇవ్వరు. చివరకు నానాతంటాలు పడి నాదబ్రహ్మ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. ఓ విపత్కర పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నంలో చందూకి పెళ్లయిందని అబద్ధం చెబుతాడు గోపి. దాన్ని కవర్ చేయడం కోసం తనే నిర్మలా మేరీ పేరుతో చందూకి ఉత్తరాలు రాస్తుంటాడు. ఆ ఉత్తరాల నిండా చందు యోగక్షేమాల కన్నా తన గొప్పతనాన్ని పొగుడుకోవడమే సరిపోతుంది. ఓ రోజు - ఇలా దొంగ ఉత్తరం రాసి, పోస్ట్ డబ్బాలో చేయిపెడతాడు గోపి.ఇంతలో ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తను సరదాగా అబద్ధమాడి చెప్పిన నిర్మలా మేరీ అనే క్యారెక్టర్ నిజంగానే ఎంటరైపోతుంది. గోపీకి కాళ్లూ చేతులూ ఆడలేదు. ఈ గందరగోళంలో గోపీ చేయి పోస్టుడబ్బాలో ఇరుక్కుపోయింది. అలా పోస్టుడబ్బాతోనే పరిగెత్తాడు. వెనుక పోస్ట్‌మ్యాన్ పరుగులు. తీరా అతగాడొచ్చి, పోస్టుడబ్బాలోని ఉత్తరాలు తీసుకుని వెళ్లిపోయాడు. ‘పోస్టు మావా... పోస్టు మావా... ఇరుక్కున్న నా చేతిని నరక్కుండా విడిపించవా?’ అని దీనంగా వేడుకున్నాడు. ఆ పోస్టుమ్యాన్ చాలా నిర్లక్ష్యంగా ‘సారీ! అది నా డ్యూటీ కాదు. పోస్టుమాస్టర్ గారికి లెటర్ రాస్తే, ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్‌కి రాస్తారు. ఆయనేమో సెంట్రల్‌కి రాస్తారు’ అని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. ‘ఓరి దేవుడో... ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చెయ్యిపెట్టానే’ అని లబోదిబోమన్నాడు గోపీ. ఇలా ఉంటాయండీ గోపీ పనులన్నీ. ఏదైనా చింపి చేట చేస్తాడు. అతని దగ్గర సలహా తీసుకుంటే.. మీ బతుకు మేకలు చింపిన వాల్పోస్టరైపోద్ది!బీ కేర్‌ఫుల్! సీ కేర్ ఫుల్!! డీ కేర్ ఫుల్!!! - పులగం చిన్నారాయణ పోస్ట్‌బాక్స్ కామెడీ హైలైట్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుకు నేనంటే ప్రత్యేక అభిమానం. ఆయన సినిమాల్లో నాకు మంచి పాత్రలిచ్చారు. పవన్ కల్యాణ్ ‘సుస్వాగతం’లో ‘త న్ము ఖ త ర్మ’ అంటూ నత్తిగా మాట్లాడే పాత్ర ఎంతో పేరు తెచ్చింది. అప్పట్లో నేనెక్కడికి వెళ్ళినా అందరూ ఆ పాత్రని గుర్తు చేసుకొనేవారు. అందులోని నత్తి మేనరిజవ్ును అనుకరించేవారు. ఈ పెద్ద హిట్ తర్వాత భీమనేని నాకిచ్చిన మరో మంచి పాత్ర ఈ ‘గోపి’. హీరో పక్క నుండే ఫ్రెండ్‌గా ఈ సినిమా నాలో మరో కొత్త కోణాన్ని చూపించింది. నేను రాసే దొంగ ఉత్తరాలు, నా చేయి ఇరుక్కొనే పోస్ట్‌బాక్స్ కామెడీ జనానికి బాగా నచ్చాయి.. మరుధూరి రాజా రాసిన మాటలు, స్క్రిప్ట్ పెట్టుకొని, డెరైక్టర్‌తో సెట్స్ మీద అప్పటికప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం. అలా ఆన్ ది స్పాట్ చేసిన ఇంప్రూవ్ మెంట్లు కూడా బాగా పేలాయి. నా కెరీర్లో ఇదొక మెమరబుల్ క్యారెక్టర్. - సుధాకర్ సుధాకర్ కామెడీని బాగా ఎంజాయ్ చేశారు తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పూవే ఉనక్కాగ’కు రీమేక్‌గా ఈ సినిమా చేశాం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులూ చేర్పులూ చేశాం. తమిళంలో విజయ్ పక్కన చార్లీ అనే కమెడియన్ చేశారు. ఇక్కడ మనకు జగపతిబాబు పక్కన సుధాకర్ చేశారు. సుధాకర్ తన పెర్ఫార్మెన్స్తో ఈ గోపీ పాత్రను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. తమిళంలో కన్నా ఫుల్ బెటర్‌గా తీర్చిదిద్దామీ పాత్రను. సుధాకర్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంలో సుధాకర్ పాత్ర చాలా ఉంది. అప్పట్లో నా సినిమాలన్నింటిలోనూ సుధాకర్ కంపల్సరీగా ఉండేవారు. - భీమనేని శ్రీనివాసరావు -
భీమనేనితో... అల్లుడు శీను
‘అల్లుడు శీను’ చిత్రంతో చేరువైన బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రం ఏమిటా అన్న ఆసక్తికి ఎట్టకేలకు తెర పడింది. ఈ యువ హీరో నటించనున్న రెండో చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. వినోదభరిత చిత్రాలకు చిరునామా అయిన భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడే కాక నిర్మాత కూడా కావడం విశేషం. గుడ్ విల్ సినిమా పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వినాయక్ క్లాప్ ఇచ్చారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. భీమనేని మాట్లాడుతూ,‘‘తమిళంలో ‘సుందర పాండ్యన్’, కన్నడంలో ‘రాజహులి’ గా విడుదలై విజయాన్ని సాధించిన కథను చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేశాం’’ అని చెప్పారు. ఈ నెల 16 నుంచిరెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఆగస్టు 28న ఈ విడుదల చేయనున్నామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: భీమనేని సునీత, సమర్పణ: భీమనేని రోషితా సాయి.