ఉత్తముడైన గోపీ! | special story to comidian sudhakar | Sakshi
Sakshi News home page

ఉత్తముడైన గోపీ!

Published Wed, Jul 15 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

ఉత్తముడైన గోపీ!

ఉత్తముడైన గోపీ!

ఒక దశలో తమిళంలో టాప్ హీరోగా వెలుగొందారు సుధాకర్. ఆ తర్వాత తెలుగులోకి ఎంటరయ్యారు. ‘యముడికి మొగుడు’ తర్వాత తన కామెడీతో బాక్సాఫీస్‌ను ‘పిచ్చకొట్టుడు’ కొట్టారు. హీరో ఎవరైనా సరే, అప్పట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే సుధాకర్ పర్మినెంట్. ‘శుభాకాంక్షలు’లో జగపతిబాబు ఫ్రెండ్‌గా సుధాకర్ తనదైన శైలి ఎక్స్‌ప్రెషన్స్‌తో, డైలాగ్ డెలివరీతో నవ్వులు విరబూయించారు.
 
సినిమా పేరు    :    శుభాకాంక్షలు (1998)
డెరైక్ట్ చేసింది    :    భీమనేని శ్రీనివాసరావు
సినిమా తీసింది    :    ఎన్.వి. ప్రసాద్,శానం నాగ అశోక్‌కుమార్
మాటలు రాసింది    :    మరుధూరి రాజా
 
‘‘గంగా భాగీరథీ సమానుడైన చందూకి... మీ లవింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్‌పాయింట్ పెన్నుతో రాయునది. మీరు క్షేమంగానే ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం మీ జన్మజన్మల అదృష్టం.డియర్ చందూ! మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ స్నేహితుడు గోపి చాలా ఓపిగ్గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయనను తడపకండి.

పెళ్లైనా మీకు దూరంగా ఉండడం వల్ల మీరెంత బాధపడుతున్నారో - పెళ్లి కాకపోయినా గోపీ దూరమై, నేనూ అంతే బాధపడుతున్నాను.
మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ‘ఆంధ్రా అన్నమయ్య’ అని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే, ఆయనెంత బాగుంటారో కదా అనిపిస్తోంది. ఆయన పాటను క్యాసెట్ చేసి, దాంతోపాటు ఆయన ఫొటో పంపండి. ఫొటో చూస్తూ... పాట వింటూ చచ్చిపోవాలని ఉంది.
 ఉత్తముడైన గోపీని మరీ మరీ అడిగినట్టు చెప్పండి’’

 ఇట్లు నిర్మలా మేరీ    
చందూ అనబడే ఓ భర్తకు... నిర్మలా మేరీ అనబడే ఓ భార్య రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో మీకు ఏం కనిపిస్తోంది? భర్త మీద అనురాగం... ప్రేమ... తొక్క... తోటకూర... ఇవేమీ కనబడడం లేదు కదూ! ఎందుకు కనిపిస్తాయి? పానకంలో పుడక లాగా, బెల్లం జిలేబీలో కారప్పొడి లాగా మధ్యలో ఈ గోపీగాడు కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు కనబడుతుంటే!
 
అసలు ఎవడీ గోపీ?
సారీ... ఎవడీ ఉత్తముడైన గోపీ?
అయితే మీకు ముందు చందూ గురించి చెప్పాలి.
చందు శారీ అయితే, ఈ గోపి బ్లౌజు.
ఛీఛీ.. బ్యాడ్ కంప్యారిజన్.
చందు ప్యాంటు అయితే, ఈ గోపీ అండర్‌వేర్.

 గోపీ లేకుండా చందూ ఎక్కడికీ వెళ్లలేడు.. ఏం చేయలేడు. అలాగని గోపి అరివీర భయంకరుడో, అపర మేధావో అనుకునేరు. గోపీకి బ్రెయినుంది కానీ, అది మోకాలి దగ్గరే ఉందని ప్రపంచంతో పాటు అతనికీ తెలుసు. బోడి సలహాలివ్వడంలో స్పెషలిస్టులకే స్పెషలిస్టు. కొంచెం మీరూ టేస్టు చేయండి...
     
చందు... గోపి... ఇద్దరూ బ్యాచ్‌లర్సే.
మేడ మీద గది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంటుంది. బాత్రూమ్‌కు గడియ కూడా ఉండదు. ఎన్నోసార్లు పనిమనిషికి తన దివ్యమంగళ రూపాన్ని ప్రదర్శించేశాడు మన గోపి.

ఓసారి వీళ్లను విపరీతమైన ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టేసింది. నెలకు రెండువేలు కూడా అద్దె కట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఓ గురకారావు తగులుతాడు. అతను ఎంత రెంట్ ఇచ్చినా ఎవ్వరూ రూమ్ రెంట్‌కివ్వరు. అంత కిరాతకమైన గురక అతనిది.
 గోపీకో ఐడియా వచ్చింది. ఆ గురకారావుని బుట్టలో వేసుకుని రూమ్‌లో షేర్ ఇచ్చాడు. అతనొచ్చి రూమంతా తేరిపార చూశాడు.
 ‘రూమ్‌లో ఫ్యాన్లు లేవా?’ అడిగాడు మొహం అదోలా పెట్టి. ‘‘నేను బాలకృష్ణ ఫ్యాన్‌ని. ఈ చందూగాడు రమ్యకృష్ణ ఫ్యాన్. మన ఇంటి ఓనర్ వాళ్ల పనిమనిషికి ఫ్యాన్... ఇన్ని ఫ్యాన్‌లుండగా ఇంక కొత్త ఫ్యాన్‌లెందుకు?’’ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు గోపి. గురకారావుకి బాగా కాలింది  - ‘నేను రూమ్‌లోఉండనంటే ఉండను’ అని తిరుగు టపా కట్టబోయాడు. గోపీ వదులుతాడా... వెంటనే ఓ అస్త్రం వదిలాడు. ‘‘ఇదే రూమ్‌లో కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి ఉండేవారు. వాళ్లెంత పైకొచ్చారో తెలుసు కదా’’ అని చెప్పాడు గోపి. అసలే సినిమా ఫీల్డ్‌లో రైటర్‌గా ట్రై చేస్తున్న ఆ గురకారావు ఆ దెబ్బకు ఫ్లాట్.

 ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు స్టోరీ.. నైట్ టైమ్ స్టార్టయ్యింది. విమానం ఇంజిను మింగేసినట్టుగా ఒకటే గురక. వీళ్లిద్దరికీ నిద్ర కరవు, మనశ్శాంతి కరవు...‘ఇదేంట్రా బాబూ’ అని వాపోయాడు చందు. గోపీకి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. వెంటనే అప్లయ్ చేసేశాడు. గురకపెట్టి నిద్రపోతున్న ఆ గురకారావు పక్కనే పడుకుని, మీద కాలు వేశాడు. ఆ తర్వాత చేయి వేసి హత్తుకున్నాడు. ఈ దెబ్బకు ఆ గురకారావు ఉలిక్కిపడి లేచాడు. గోపీ అదోరకంగా చిలిపిగా చూశాడు. అతగాడు కంగారుపడిపోయాడు. ‘ఏంటి... నువ్వు ఆ టైపా?’ అనడిగాడు. గోపీ కవ్వింపుగా నవ్వుతూ - ‘మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నాం. రా... ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం’ అని ఆహ్వానించాడు.గురకారావుకి నిద్రమత్తు వదిలిపోయింది. ‘‘అమ్మో... ఇప్పుడు మనసు విప్పి మాట్లాడదామంటావ్. తర్వాత బట్టలు విప్పి మాట్లాడదామంటావ్. నా వల్ల కాదు’’ అని ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తాడు. గోపీ విజయగర్వంతో చందూ వైపు చూశాడు.
     
ఓ ప్రేమ జంటను కలపడం కోసం చందు ఓ ఊరు వెళతాడు. తోడుగా గోపీ కూడా!  అక్కడ వీళ్లకు ఎవరూ గది అద్దెకు ఇవ్వరు. చివరకు నానాతంటాలు పడి నాదబ్రహ్మ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. ఓ విపత్కర పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నంలో చందూకి పెళ్లయిందని అబద్ధం చెబుతాడు గోపి. దాన్ని కవర్ చేయడం కోసం తనే నిర్మలా మేరీ పేరుతో చందూకి ఉత్తరాలు రాస్తుంటాడు. ఆ ఉత్తరాల నిండా చందు యోగక్షేమాల కన్నా తన గొప్పతనాన్ని పొగుడుకోవడమే సరిపోతుంది. ఓ రోజు - ఇలా దొంగ ఉత్తరం రాసి, పోస్ట్ డబ్బాలో చేయిపెడతాడు గోపి.ఇంతలో ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తను సరదాగా అబద్ధమాడి చెప్పిన నిర్మలా మేరీ అనే క్యారెక్టర్ నిజంగానే ఎంటరైపోతుంది.
 
గోపీకి కాళ్లూ చేతులూ ఆడలేదు. ఈ గందరగోళంలో గోపీ చేయి పోస్టుడబ్బాలో ఇరుక్కుపోయింది. అలా పోస్టుడబ్బాతోనే పరిగెత్తాడు. వెనుక పోస్ట్‌మ్యాన్ పరుగులు. తీరా అతగాడొచ్చి, పోస్టుడబ్బాలోని ఉత్తరాలు తీసుకుని వెళ్లిపోయాడు.
 ‘పోస్టు మావా... పోస్టు మావా... ఇరుక్కున్న నా చేతిని నరక్కుండా విడిపించవా?’ అని దీనంగా వేడుకున్నాడు. ఆ పోస్టుమ్యాన్ చాలా నిర్లక్ష్యంగా ‘సారీ! అది నా డ్యూటీ కాదు. పోస్టుమాస్టర్ గారికి లెటర్ రాస్తే, ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్‌కి రాస్తారు. ఆయనేమో సెంట్రల్‌కి రాస్తారు’ అని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. ‘ఓరి దేవుడో... ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చెయ్యిపెట్టానే’ అని లబోదిబోమన్నాడు గోపీ.
     
ఇలా ఉంటాయండీ గోపీ పనులన్నీ. ఏదైనా చింపి చేట చేస్తాడు. అతని దగ్గర సలహా తీసుకుంటే.. మీ బతుకు మేకలు చింపిన వాల్‌పోస్టరైపోద్ది!బీ కేర్‌ఫుల్! సీ కేర్ ఫుల్!! డీ కేర్ ఫుల్!!!
  - పులగం చిన్నారాయణ
 
 పోస్ట్‌బాక్స్ కామెడీ హైలైట్
 దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుకు నేనంటే ప్రత్యేక అభిమానం. ఆయన సినిమాల్లో నాకు మంచి పాత్రలిచ్చారు. పవన్ కల్యాణ్ ‘సుస్వాగతం’లో ‘త న్ము ఖ త ర్మ’ అంటూ నత్తిగా మాట్లాడే పాత్ర ఎంతో పేరు తెచ్చింది. అప్పట్లో నేనెక్కడికి వెళ్ళినా అందరూ ఆ పాత్రని గుర్తు చేసుకొనేవారు. అందులోని నత్తి మేనరిజవ్‌ును అనుకరించేవారు. ఈ పెద్ద హిట్ తర్వాత భీమనేని నాకిచ్చిన మరో మంచి పాత్ర ఈ ‘గోపి’. హీరో పక్క నుండే ఫ్రెండ్‌గా ఈ సినిమా నాలో మరో కొత్త కోణాన్ని చూపించింది. నేను రాసే దొంగ ఉత్తరాలు, నా చేయి ఇరుక్కొనే పోస్ట్‌బాక్స్ కామెడీ జనానికి బాగా నచ్చాయి.. మరుధూరి రాజా రాసిన మాటలు, స్క్రిప్ట్ పెట్టుకొని, డెరైక్టర్‌తో సెట్స్ మీద అప్పటికప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం. అలా ఆన్ ది స్పాట్ చేసిన ఇంప్రూవ్ మెంట్లు కూడా బాగా పేలాయి. నా కెరీర్‌లో ఇదొక మెమరబుల్ క్యారెక్టర్.
 - సుధాకర్
 
సుధాకర్  కామెడీని  బాగా ఎంజాయ్ చేశారు

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పూవే ఉనక్కాగ’కు రీమేక్‌గా ఈ సినిమా చేశాం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా  చాలా మార్పులూ చేర్పులూ చేశాం. తమిళంలో విజయ్ పక్కన  చార్లీ అనే కమెడియన్ చేశారు. ఇక్కడ మనకు జగపతిబాబు పక్కన సుధాకర్ చేశారు. సుధాకర్ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఈ గోపీ పాత్రను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. తమిళంలో కన్నా ఫుల్ బెటర్‌గా తీర్చిదిద్దామీ పాత్రను. సుధాకర్  కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంలో సుధాకర్ పాత్ర చాలా ఉంది. అప్పట్లో నా సినిమాలన్నింటిలోనూ సుధాకర్ కంపల్సరీగా ఉండేవారు.
  - భీమనేని శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement