భీమనేని శ్రీనివాసరావు
‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం’ లాంటి మంచి సినిమాలు చేశాను. మంచి కథలు దొరకడం కష్టమవుతున్న ఈ మధ్యకాలంలో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఒక గొప్ప సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇది నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్’’ అని భీమనేని శ్రీనివాసరావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో శివ కార్తికేయన్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు చెప్పిన విశేషాలు.
► ‘కౌసల్య కృష్ణమూర్తి’కి వచ్చినన్ని అభినందనలు నా గత సినిమాలకు రాలేదు. మా చిత్రం నచ్చడంతో మీడియా మిత్రులు కూడా సొంత సినిమా అనుకుని సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు కూడా సినిమాకు 100 శాతం కనెక్ట్ అయ్యారు. చాలా మంది కాలేజ్ విద్యార్థులు ఫోన్ చేసి, ఈ సినిమా మాకు ఓ స్ఫూర్తిలా ఉందని అంటున్నారు.
► ఈ మధ్య కాలంలో ‘మజిలీ, జెర్సీ’ లాంటి క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలు వచ్చి సక్సెస్ సాధించాయి. అయితే మాది ఫిమేల్ సెంట్రిక్ మూవీ. క్రికెటర్‌గా ఎదగాలనే ఒక అమ్మాయి తపనను చూపిస్తూనే, తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్‌ని చూపించాం. దానికి సమాంతరంగా రైతుల సమస్యలను చూపించాం. స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరికీ నచ్చడంతో పాటు భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతున్నారు.
► ‘కళాబంధు’ టి. సుబ్బిరామిరెడ్డిగారు కుటుంబ సభ్యులతో కలిసి మా సినిమా చూశారు. వారికి సినిమా విపరీతంగా నచ్చడంతో నన్ను, కె.ఎస్ రామారావుగారిని అభినందించారు. రాజేంద్రప్రసాద్, ఐశ్వర్య రాజేష్, కార్తీక్ రాజు నటనను కొనియాడి, ఫోన్‌లో అభినందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ వంటి గొప్ప బేనర్‌లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు కె.ఎస్ రామారావుగారికి, కె.ఎ వల్లభ గారికి థ్యాంక్స్.
► ప్రేక్షకులకు కథ నచ్చితే అది రీమేక్ సినిమానా? ఒరిజినల్ సినిమానా? అని చూడకుండా ఆదరిస్తున్నారు.. హిట్ చేస్తున్నారు. ఒక మంచి కథ ఎక్కడ ఉన్నా మన తెలుగు ప్రేక్షకులకి చూపించాలనే సంకల్పంతో ఇప్పటి వరకూ ఎక్కువ రీమేక్ సినిమాలే చేశాను. కాలంతో పాటు మనం మారాలి. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు తీసినప్పుడే విజయం సాధించగలం.
► స్కూల్, కాలేజ్ డేస్ నుంచే నేను రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా చేసేవాణ్ణి. ఆ అనుభవంతో సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న టైమ్‌లో ‘అశ్వద్ధామ’ సినిమాలో ఓ పాత్ర చేశా. ఆర్. నారాయణమూర్తిగారి ‘ఆలోచించండి’ సినిమాలో సెకండ్ హీరోగా చేశా. ‘కుదిరితే కప్పు కాఫీ, కెరటం’ వంటి చిత్రాల తర్వాత ‘కౌసల్య కృష్ణమూర్తి’లో బ్యాంకు మేనేజర్ పాత్ర చేశా. ఈ సినిమాలో నాదొక్కటే నెగటివ్ రోల్ అయినా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇకపైన కూడా మంచి పాత్రలొస్తే నటిస్తా.
► ఏ దర్శకుడికైనా కొన్ని సినిమాలు మైలేజ్‌నిస్తాయి. నాకు ‘సుడిగాడు’ అలాంటి సినిమా. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా. నేను, ‘అల్లరి’ నరేష్ కూడా ‘సుడిగాడు 2’ మీద చాలా ఆసక్తిగా ఉన్నాం. మంచి అవకాశం వస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా.
Comments
Please login to add a commentAdd a comment