అలా అనుకోకపోతే పేరు మార్చుకుంటా | Kausalya Krishnamurthy audio launch | Sakshi
Sakshi News home page

అలా అనుకోకపోతే పేరు మార్చుకుంటా

Published Wed, Jul 3 2019 2:51 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Kausalya Krishnamurthy audio launch - Sakshi

రాజేంద్రప్రసాద్, మిథాలీ రాజ్, కేఎస్‌ రామారావు, భీమనేని శ్రీనివాసరావు, ఐశ్వర్యారాజేష్‌

‘‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చూసి బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా సరే.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ‘రాజేంద్రప్రసాద్‌ మా నాన్నగారు అయ్యుంటే బాగుండు’ అనుకోకపోతే నా పేరు మార్చుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఐశ్వర్యారాజేశ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘కనా’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యారాజేశ్‌తోనే ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్‌ రాజు  ముఖ్య పాత్రల్లో నటించారు. కేయస్‌ రామారావు సమర్పణలో  కె.ఎ. వల్లభ నిర్మించారు.

దిబు నినన్‌ థామస్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘అభిరుచి ఉన్న నిర్మాత ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. అభిరుచికి, డబ్బుకి సంబంధం లేదు. రామారావుగారు ఇప్పటికీ, ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ గొప్ప కథ. ఈ సినిమాలో కామెడీ, తండ్రీ కూతుళ్ల బంధం ఉంటుంది. భీమనేని శ్రీను నా నుంచి చాలా సున్నితమైన నటన రాబట్టుకున్నాడు’’ అన్నారు.

మిథాలీ రాజ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం టీజర్‌ చూశాను.. వాస్తవానికి దగ్గరగా ఉంది. మంచి ఎమోషన్స్‌ ఉన్నాయి. తల్లిదండ్రులతో అమ్మాయిల రిలేషన్‌షిప్స్‌ ఎలా ఉంటాయి? అమ్మాయిల కలలకు తల్లిదండ్రులు ఎలా సపోర్టివ్‌గా నిలిచారు? అనే అంశాలను సినిమాలో  చర్చించారు. ఇలాంటి చిత్రాల వల్ల ఉమెన్‌ క్రికెట్‌ను ప్రోత్సహించాలన్న విషయం మరింత మందికి చేరువ అవుతుంది. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనకు ఈ సినిమా దోహదం చేస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘మా రామారావు అన్నయ్య రీమేక్‌ చేసిన సినిమాలన్నీ హిట్లు, రికార్డులు బద్దలు కొట్టాయి. చిరంజీవిగారివంటి ఎందరో పెద్ద స్టార్స్‌తో సినిమాలు తీసినా, ఆయన తీసిన చిన్న సినిమాలే సెన్సేషన్‌ హిట్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ కలెక్షన్లు తీసుకొచ్చాయి. ఈ సినిమా హిట్‌ కొడితే ఆయన కొడుకు వల్లభ సక్సెస్‌కి నాంది అవుతుంది’’ అన్నారు.

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘ఐశ్వర్య నటిస్తోందనిపించదు.. నటన ఆమెకు నల్లేరు మీద నడకలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారు, ఐశ్వర్య పోటీపడి మరీ నటించారు. రామానాయుడుగారిలాంటి టాప్‌ 10 నిర్మాతల్లో రామారావుగారు ఒకరు’’ అన్నారు.

ఐశ్వర్యారాజేష్‌ మాట్లాడుతూ – ‘‘కనా’ నా జీవితాన్ని మార్చింది. తెలుగులో నా తొలి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’ కావడం అదృష్టం. రామారావుగారి ప్రొడక్షన్‌లో నా తొలి సినిమా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా హక్కులు నాకు కావాలని ఐశ్వర్యను  అడిగితే ఇప్పించింది. సావిత్రిగారు, శారదగారు.. ఇప్పుడు కీర్తీ సురేశ్, సమంత బాగా నటిస్తారు. వారికి ఏ మాత్రం తీసిపోకుండా నటించగలదు ఐశ్వర్య’’ అన్నారు.

తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు, నిర్మాతలు పోకూరి బాబూరావు,  కె. అశోక్‌ కుమార్, జి.విజయ రాజు, కార్తీక్‌ రాజు, నటుడు మహేశ్, డైరెక్టర్‌ క్రాంతిమాధవ్, ‘కనా’ చిత్ర దర్శకుడు, కథా రచయిత అరుణ్‌ రాజా కామరాజు, కెమెరామెన్‌ ఆండ్రూ, సంగీత దర్శకుడు దిబు నినన్‌ థామస్, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement