ప్రేమకథతో... పడేసావే | Padesave Movie Review | Sakshi
Sakshi News home page

ప్రేమకథతో... పడేసావే

Published Sat, Feb 27 2016 8:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

ప్రేమకథతో... పడేసావే

ప్రేమకథతో... పడేసావే

కొత్త సినిమా గురూ!
చిత్రం: ‘పడేసావే’, తారాగణం: కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, జహీదా శామ్, విశ్వ, నరేశ్
మాటలు: కిరణ్, పాటలు: అనంత్ శ్రీరామ్
సంగీతం: అనూప్ రూబెన్స్
కళ: పురుషోత్తమ్
స్టంట్స్: వెంకట్
కెమేరా: కన్నా కూనపరెడ్డి
ఎడిటింగ్: ధర్మేంద్ర కె
నిర్మాణం: అయన్ క్రియేషన్స్ ప్రొడక్షన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చునియా
రిలీజ్: 26 ఫిబ్రవరి
 
ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో ‘చండీరాణి’ని రూపొందించడం ద్వారా అరుదైన దక్షిణాది మహిళా డెరైక్టర్‌గా పేరుతెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి - మన భానుమతి. కానీ, అప్పటి నుంచి గడచిన 60 ఏళ్ళ పైచిలుకు కాలంలో తెలుగులో వచ్చిన మహిళా దర్శకులు మాత్రం పట్టుమని పదిమంది కూడా లేరు. చాలాకాలం తరువాత ఇప్పుడు చునియా ఆ జాబితాకెక్కారు. తొలి చిత్రం ‘పడేసావే’తో మన ముందుకు వచ్చారు. కె. రాఘవేంద్రరావు లాంటి ప్రముఖ దర్శకుల దగ్గర సహాయకురాలిగా పనిచేసి, టీవీ సీరియల్స్ దర్శకురాలిగా అనుభవం సంపాదించి, అన్నపూర్ణా స్టూడియోలో నాగార్జునకు కుడిభుజంగా నిలిచిన చరిత్ర చునియాది. అందుకే, నాగ్ సహాయ సహకారాలు పుష్కలంగా అందుకొని, ‘యాన్ అక్కినేని నాగార్జున ఎంకరేజ్‌మెంట్’ అంటూ ఇప్పుడీ ‘పడేసావే’ను తెర మీదకు తెచ్చారు.
 
టైటిల్ సూచిస్తున్నట్లే - ఇదో ప్రేమకథ. కాకపోతే, స్నేహానికీ, ప్రేమకూ మధ్య సాగే కన్‌ఫ్యూజన్‌లను ఆధారంగా చేసుకొని అల్లుకున్న ఒక ముక్కోణపు ప్రేమ కథ. కార్తీక్ (కార్తీక్‌రాజు) పనికిరాని వస్తువులతో కళాత్మకంగా బొమ్మలు సృష్టించే జంక్ ఆర్టిస్ట్. తల్లితండ్రులు (నరేశ్, అనితా చౌదరి)లకు ఇష్టం లేకపోయినా, ఆ పని చేస్తుంటాడు. స్నేహితురాలైన ఎదురింటి అమ్మాయి నీహారిక (నిత్యాశెట్టి) హీరోను ప్రేమిస్తుంది. అయితే, హీరో మాత్రం నీహారికకు ఆప్తమిత్రురాలైన స్వాతి (జహీదా శామ్)ని ప్రేమిస్తాడు. సినీ నటి తార (రాశి)కి కూతురైన స్వాతికి వ్యాపారవేత్త అయిన మరో అబ్బాయితో పెళ్ళి కుదురుతుంది.
 
మొదటి గంటలో ఈ వ్యవహారమంతా ఎస్టాబ్లిష్ చేశాక, అక్కడ నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. అప్పటికే పెళ్ళి కుదిరిన స్వాతికి సినీ నటి అయిన తన తల్లి అంటే కోపం. ఆ కోపాన్ని పోగొట్టి, వారిద్దరినీ దగ్గర చేస్తాడు హీరో. ఆ తరువాత ఆమె పెళ్ళి చేసుకోబోతున్న అబ్బాయి మంచివాడు కాదన్నదీ బయటకొస్తుంది. అలా కొన్ని సీన్లతో స్వాతికి హీరో దగ్గరవుతాడు. మనసులో ఆమెకూ హీరో మీద ప్రేమ పుడుతుంది. కానీ, అప్పటికే కుదిరిన పెళ్ళి, ఆప్తమిత్రురాలి స్నేహం, హీరోను తన మిత్రురాలే ప్రేమిస్తుండడం లాంటివన్నీ బంధనాలవుతాయి. మరోపక్క హీరోకూ తనను ప్రేమించే నీహారిక, తాను ప్రేమించే అమ్మాయిల మధ్య ఊగిసలాట.

ఈ ముక్కోణపు ప్రేమకథ చివరకు ఎన్ని మలుపులు తిరిగింది? ప్రేమ, స్నేహం మధ్య బంధాలు ఎలా అతలాకుతలమయ్యాయి? హీరో ఇంతకీ ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు? లాంటివన్నీ ఓపికగా చూడాల్సిన మిగతా సినిమా. సీరియల్ తరహా స్క్రీన్‌ప్లేతో ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్విస్ట్‌తో నడిచే ఈ సినిమాలో చాలా సీన్లున్నాయి. ఒకదాని తరువాత మరొకటిగా అవన్నీ వస్తున్నప్పుడు నిడివితో సంబంధం లేకుండా చాలా పెద్ద కథే చెప్పారని అనిపిస్తుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ రాజు కుమారుడైన కార్తీక్ రాజు, ఒకప్పుడు ‘దేవుళ్ళు’లో బాలనటిగా పేరు తెచ్చుకొని, ఇప్పుడు తొలిసారిగా కథానాయిక పాత్ర పోషించిన హైదరాబాద్ అమ్మాయి నిత్యాశెట్టి, అలాగే జహీదా శామ్ - ఈ ముగ్గురూ తమ శక్తి మేరకు నటించారు.

వారెవరూ ప్రేక్ష కులకు పెద్దగా పరిచితులు కాకపోవడం సినిమాకు ప్లస్, మైనస్సూ! బాగా చేయడానికి వాళ్ళూ, చేయించడానికీ దర్శకురాలూ బానే శ్రమపడ్డారు. కాక పోతే, దర్శకురాలికీ ఇదే తొలి ప్రయత్నం. ‘దేవుళ్ళు’ మొదలు దాదాపు 20 దాకా సినిమాల్లో బాల నటిగా చేసి, 2 నంది అవార్డులు కూడా అందుకున్న నిత్యాశెట్టి రూపురేఖల్లో కొన్నిసార్లు తొలినాళ్ళ ‘కలర్స్’ స్వాతినిగుర్తు చేస్తారు.
 
యువ కమెడియన్ విశ్వ నుంచి సీనియర్ నరేశ్, ఒకటి రెండు సీన్లలోనే వచ్చే కృష్ణుడు, రెండు సీన్లు - ఒక పాటకు పరిమితమయ్యే అలీ - ఇలా చాలామంది హాస్య నటులను సినిమాలో వినోదం కోసం పెట్టారు. వాళ్ళు కూడా అడపాదడపా నవ్వించారు. కాకపోతే, ఉమన్ డెరైక్టర్ పగ్గాలు పట్టిన ఈ సినిమాలోనూ అలీ గ్యాంగ్‌తో హోటల్ రూమ్‌లో జరిగే ఘట్టం లాంటివి ఉండడం ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఈ సినిమాకు మరో అండ - పేరున్న అనూప్ లాంటి సంగీత దర్శకుడు. కాకపోతే, ఇలా రోజూ వస్తున్న కమర్షియల్ లవ్‌స్టోరీలలో హాలులో నుంచి బయటకొచ్చాక పాటలు గుర్తుండాలని అనుకోకూడదు. సెంటిమెంటల్ గీతం ‘చిట్టితల్లీ చిన్నితల్లీ నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి...’, తల్లీ కూతుళ్ళ మధ్య దూరం లాంటి ఎపిసోడ్‌లు మహిళల్ని ఆకట్టుకొంటాయని ఆశించాలి.
 
‘ప్రేమ చెప్పి రాదు... చెప్పినా పోదు’ తరహా పంచ్ డైలాగులు, విశ్లేషణల్ని కూడా ఈ సినిమాలో వీలున్నచోటల్లా పెట్టారు. ఇక, ఇతర సాంకేతిక విభాగాల పనితనం కూడా ఈ పరిమిత బడ్జెట్ ప్రేమకథకు సరిపడేవే. ఇది తొలి సినిమానే కాబట్టి, దర్శకురాలు చునియా నుంచి మరీ అతిగా ఆశించడం పొరపాటు. మొన్నటి వరకు సీరియల్స్‌కు అలవాటుపడిన ఆమె భవిష్యత్తులో రచనా విభాగంపై ఇంకా దృష్టి పెట్టి, మరింత పకడ్బందీ కథ, వేగవంతమైన కథనంతో ముందుకొస్తారని ఆశించవచ్చు. కొత్తవాళ్ళను ప్రోత్సహించాలన్న హీరో నాగార్జున తదితరులలానే ప్రేక్షకులు కూడా సహృదయంతో చూసి, రావాల్సిన సినిమా ‘పడేసావే’.

- రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement