లెక్క సరిచేశాడు | madhavan hisaab barabar movie ott review in telugu | Sakshi
Sakshi News home page

లెక్క సరిచేశాడు

Feb 7 2025 3:18 AM | Updated on Feb 7 2025 3:18 AM

madhavan hisaab barabar movie ott review in telugu

ఓటీటీ(ott)లో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హిందీ చిత్రం హిసాబ్‌ బరాబర్‌(hisaab barabar) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఈ ప్రపంచంలో ఆశ లేని మనిషి ఉండడు. కానీ అత్యాశ మాత్రం అనర్ధదాయకం. అందరూ బాగుండాలి... అందులో మనముండాలి అనుకుంటే పర్లేదు. కొంతమంది మాత్రం నేను బాగు పడాలంటే పదిమంది నాశనం కావాలి అని అత్యాశకు లోనవుతుంటారు. అటువంటి వారు తమకు ఎవరూ ఎదురు రారు అనుకుంటూ విర్రవీగుతుంటారు. అలా విర్రవీగేవారికి ఓ సామాన్యడు ఇచ్చే అనుకోని ఝలక్కే ఈ ‘హిసాబ్‌ బరాబర్‌’ చిత్రం. జీ5 ఓటీటీ వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. ‘హిసాబ్‌ బరాబర్‌’ కథ విషయానికొస్తే... ఇది ఓ సామాన్యుడి కథ. రాధేమోహన్‌ శర్మ ఓ టికెట్‌ కలెక్టర్‌. అతనికి ఒక్కడే కొడుకు. భార్య విడిపోతుంది. ఇక రాధేమోహన్‌ కు అద్భుతమైన టాలెంట్‌ ఒకటుంది. అదే అతని లెక్కల చాతుర్యత.

ఎటువంటి లెక్కనైనా అవలీలగా చెప్పేస్తాడు. చిన్న పైసా కూడా నష్టపోడు. అటువంటి రాధేమోహన్‌ బ్యాంకు అకౌంటులో అనూహ్యంగా ఓ 27 రూపాయలు తేడా వచ్చి కనపడకుండా పోతుంది. దాంతో బ్యాంకు అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తాడు. బ్యాంకు అధికారులు ఈ ఫిర్యాదును తాత్సారం చేస్తున్న విషయం గమనించి అదే బ్యాంకుకు సంబంధించిన ఇతరుల అకౌంట్లో కూడా 27 రూపాయలు కట్‌ అయినట్టు కనిపెడతాడు. రాధేమోహన్‌ కథ 27 నుండి మొదలై కొన్ని వేల కోట్ల దాకా వెళుతుంది. దీంతో ఇదో పెద్ద స్కామ్‌ అని నిర్ధారణకు వచ్చి పై అధికారులకు సమాచారమిస్తాడు. ఈ విషయం సదరు బ్యాంకు అధికారుల నుండి ఆ బ్యాంకు ఓనరుకు తెలుస్తుంది. ఇక ఆ పై బ్యాంకు ఓనరుకు రాధేమోహన్‌కు మధ్య యుద్ధం మొదలవుతుంది.

కోట్లకు అధిపతి అయిన బ్యాంకు ఓనరును 27 రూపాయలు పోగొట్టుకున్న రాధేమోహన్‌ ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమాలోనే చూడాలి. రూపాయి అయినా కోటి రూపాయలైనా దేని విలువ దానిదే, కాగితంలో నంబరు విలువను పెంచుతుందే కానీ కాగితమైతే మారదు. పైన చెప్పుకున్నట్టు ఎవరి కష్టం వారిది, ఎవరి ఫలితం వారిది. ఈ రోజు వరించిన విజయానికి ఆనందిస్తే రేపు అపజయాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ‘హిసాబ్‌ బరాబర్‌’ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ మంచి సందేశంతో ముగుస్తుంది. రాధేమోహన్‌పాత్రలో ప్రముఖ నటుడు మాధవన్‌ జీవించారు. సినిమాలో తన లెక్కే కాదు అందరి లెక్క సరిచేశాడు. వీకెండ్‌కి వాచబుల్‌ మూవీ. – ఇంటూరు హరికృష్ణ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement