పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో సాయిరాం శంకర్. 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సినిమాలు చేసిన వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని మూవీ టీమ్ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
ఒక పథకం ప్రకారం కథేంటంటే..
ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్‌కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్‌గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్‌ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచే హింట్ ఇస్తూ వచ్చారు మేకర్స్ దానికి తోడు విలన్ ఎవరో కనిపెడితే పట్టుకుంటే పదివేలు అనే అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ఓపెనింగ్ నుంచే కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఏది గతమో.. ఏది ప్రస్తుతమో అర్థకాక ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్‌కి గురవడం ఖాయం. అయితే సిద్ధార్థ హత్య కేసులో చిక్కుకున్న తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో కొంత క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ హీరో మీద అనుమానాలు పెంచేలా ఉంటుంది.
ఆ తర్వాత సెకండ్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్‌గా తీసుకువెళ్లడంలో డైరెక్టర్ కొంతమేర సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు అంచనా వేసే విధంగానే ఉన్న దానిని కనెక్ట్ చేయడం మాత్రం ఫర్వాలేదనిపించేలా ఉంది. అయితే అసలు విలన్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ చిత్రం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితం సినిమా కావడంతో విజువల్స్ కొన్ చోట్ల లాజిక్ లెస్ సీన్స్‌గా ఉన్నాయి. కానీ సస్పెన్స్ విషయంలో మాత్రం దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ కూడా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మలయాళ దర్శకుడు కావడంతో మలయాళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే..
నటీనటుల విషయానికి వస్తే లాయర్ పాత్రలో సాయిరాం శంకర్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఆషిమా నర్వాల్ తన పాత్ర మేర మెప్పించింది. కొంత సేపైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖని, శృతి సోది, సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు. ఇక సాంకేతి అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కత్తెరకు పని చెప్పాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment