టైటిల్: ప్రసన్న వదనం
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు
డైరెక్టర్: అర్జున్ వైకే
నిర్మాతలు: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్
ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్
విడుదల తేదీ: 03-05-2024
టాలీవుడ్‌లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి.
అసలు కథేంటంటే...
ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్‌నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్‌లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య.. తనకి ఫేస్ బ్లైండ్‌నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.
ఎలా సాగిందంటే..
ఇలాంటి ఫేస్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌ను తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్‌ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్‌నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్ ఉంటుందన్నమాట.
సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్‌గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.
ఎవరెలా చేశారంటే...
సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment