జక్కన్న బాహుబలి | Jakkanna Baahubali Movie | Sakshi
Sakshi News home page

జక్కన్న బాహుబలి

Published Mon, May 25 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

బహుబలి చిత్రాన్ని బహునిష్ఠతో చెక్కుతున్న దర్శకుడు రాజమౌళికి సృజనాత్మక గ్రాఫిక్

బహుబలి చిత్రాన్ని బహునిష్ఠతో చెక్కుతున్న దర్శకుడు రాజమౌళికి సృజనాత్మక గ్రాఫిక్

రాజమౌళి గుండెకు కూడా భుజాలు (బాహువులు) ఉన్నాయేమో! లేకపోతే ఇంత టెన్షన్ ఎలా మోస్తున్నాడు? ‘బాహుబలి’ పెద్ద సినిమా అని అందరం వింటూనే ఉన్నాం. ఫిల్మ్ యూనిట్ అన్ని విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల కాబోలు... సినిమా ‘స్కోపు’... కిసీ కో సమజ్‌మే నహీఁ ఆయా. అర్థం కాలేదు. ఈ మధ్యే మన ‘సాక్షి’ సినిమా టీమ్ అక్కడా ఇక్కడా వినికిడిలో ఉన్న సమాచారం పోగేసుకొచ్చింది. నథింగ్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్.

‘కథ వెనుక కథ ఇంత ఉందా?’ అని మేమే నివ్వెరపోయేంత కథ ఉంది. తెలిసిన విషయం పంచుకోకపోతే కడుపునొప్పే. అదీ... సినిమాను అంతగా ప్రేమించే మీతో పంచుకోకపోతే ఎలా? జూలై 10 సినిమా రిలీజ్. విన్నదానికీ, చూసేదానికీ లింకు అప్పుడు కుదురుద్ది. అప్పటి దాకా మేము చెప్పిందే సినిమా... ఎంజాయ్!

 
ఇంతకీ ‘బాహుబలి’ కథేంటి?
రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇది జైనులు ఆరాధించే ‘బాహుబలి’ కథ అని కొందరంటున్నారు. యుద్ధం నుంచి శాంతికి పరివర్తన చెందిన మహావీరుడి జీవితం నుంచి తీసుకున్నారని మరికొందరు. అయితే, అవేవీ నిజం కాదని ఆంతరంగిక వర్గాల మాట. రాజుల కాలపు ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా - పూర్తిగా కల్పిత కథ. రాజమౌళి తండ్రి వి.విజయేంద్రప్రసాద్ వండిన వంటకం.

రాజ్యాధికారం కోసం పెదనాన్న, చిన్నాన్న పిల్లల మధ్య సాగే పోరాటం. పగ, ప్రతీకారం, ప్రేమ, అసూయల మధ్య సినిమా నడుస్తుంది. శివుడుగా, బాహుబలిగా ఇందులో రెండు పాత్రల్ని ప్రభాస్ పోషిస్తున్నారు. ప్రభాస్ మాటల్లో... ‘‘ఇది - రాజులు, రాజ్యాలు, అధికారం కోసం సాగే పోరాటం, యోధానుయోధుల చుట్టూ తిరిగే కాల్పనిక గాథ’’. బాహువుల్లో అపారమైన బలం ఉన్న వ్యక్తి గనక, అతణ్ణి ‘బాహుబలి’ అంటారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి మాటల్లో అయితే... బాహుబలి ‘‘ది ట్రూ కింగ్’’.
 
అనుష్క కనిపించేది కాసేపేనా?
ప్రభాస్ వేస్తున్న రెండు పాత్రల్లో ఒక పాత్రే ఫస్ట్‌పార్ట్ ‘బాహుబలి... ది బిగినింగ్’లో కనిపిస్తుందని ఒక గాలివార్త షికారు చేస్తోంది. అదేమిటని ఆరా తీస్తే, రెండు పాత్రలూ ఇందులో కనిపిస్తాయని తెలిసింది. బాహుబలిలో హీరో తరువాత హీరో అంతటి ప్రాధాన్యమున్న పాత్ర - భల్లాలదేవ. బాహుబలికి తమ్ముడి వరసయ్యే పరమ దుష్టుడు. ఆ పాత్రను వేస్తున్నది రానా దగ్గుబాటి. సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ మీద నడుస్తుంది.

అది అంత పవర్‌ఫుల్ పాత్ర. ‘‘రానా చేసిన భల్లాలదేవ క్యారెక్టర్ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ విలన్ పాత్రల్లో ఒకటవుతుంది. ఆ మాట నమ్మకంగా చెప్పగలను’’అని ప్రభాస్ అన్నది అందుకే!
 
బాహుబలి ప్రేమికురాలు అవంతిక  పాత్రధారిణి-తమన్నా. ఈ ఫస్ట్‌పార్ట్‌లో ఆమే ప్రధాన హీరోయిన్. ఇక, అనుష్క పోషించే కీలక పాత్ర దేవసేన. అయితే, ఈ ఫస్ట్ పార్ట్‌లో ఆమె కనిపించేది మాత్రం చాలా కొద్దిసేపేనట! అదీ ఈ మధ్య విడుదల చేసిన వయసు మీద పడ్డ గెటప్‌లోనే అట! 2016లో వచ్చే ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ (దానికి ఇంకా పేరేదీ ఖరారు చేయలేదు)లో మాత్రం అనుష్క పాత్రదే హవా అని కృష్ణా నగర్ కబురు. అలాగే, రమ్యకృష్ణ, తమిళం నుంచి నాజర్, సత్యరాజ్, కన్నడం నుంచి ‘ఈగ’ ఫేమ్ సుదీప్ లాంటి భారీ తారలు ఈ సినిమాలో ఉండనే ఉన్నారు.
 
ప్రీ-ప్రొడక్షన్‌కే... ఆరు నెలల పైగా...

‘బాహుబలి’ సెట్స్, పాత్రల రూపురేఖలు, దుస్తులు,అలంకరణ లాంటి వాటికి పాతిక మందికి పైగా ఆర్టిస్టులు దాదాపు 15 వేలకు పైగా రేఖాచిత్రాలు గీశారు. జాతీయ స్థాయిలో పేరున్న ఆర్ట్ డెరైక్టర్ సాబూ శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. బ్రహ్మాండమైన సెట్స్ వేశారు. అంతటితో ఆగకుండా, ఆయన అక్షరాలా ఒక మెకానికల్ ఇంజనీర్ లాగా అగ్ని గోళాలను విసిరే యంత్రాలు, నీటిని పైకి తోడే పరికరాల లాంటి వాటిని సొంతంగా తయారు చేశారు.

ఇప్పటికీ ఆ పరికరాలను స్వయంగా ఉపయోగించి చూడవచ్చు. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి, ప్రశాంతి తిపిర్నేని కాస్ట్యూమ్స్ పని చూస్తే, రాజమౌళి ఆస్థాన కెమేరామన్ కె.కె. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు.
 
కాన్సెప్ట్ స్కెచ్‌ల మొదలు... ఎక్కడ, ఏ సీన్ ఎలా తీయాలి, ఏం చేయాలి, ఏ డ్రెస్‌లు, ప్రాపర్టీ వాడాలనేది పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొన్నాకే షూటింగ్‌కు వెళ్ళారు. ఇలా ఆరు నెలలకు పైగా ప్రీ పొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకోవడం వల్ల చిత్ర నిర్మాణవ్యయంలో దాదాపు 25 నుంచి 30 శాతం ఆదా అయింది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆ సంగతి వెల్లడించారు.  
 
ఎక్కడెక్కడ తీశారు?
రెండేళ్ళ క్రితం 2013 జూలైలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ‘బాహుబలి’ షూటింగ్ మొదలైంది. సినిమా ప్రధానంగా ఆర్.ఎఫ్.సి.లో తీశారు. కొంత భాగం మహాబలేశ్వర్‌లో, రెండు పాటలు అన్నపూర్ణా ఏడెకరాల్లో వేసిన సెట్స్‌లో చిత్రీకరించారు. కథానుసారం మంచు కొండల నేపథ్యం అవసరం. దాంతో, బల్గేరియా వెళ్ళి, అక్కడ నెల రోజుల పాటు షూట్ చేశారు. కీలక దృశ్యాలు తీశారు.
 
3డి ఆలోచన రాలేదా?
తమిళంలో ‘బాహుబలి’కి మొదట అనుకున్న పేరు - ‘మహాబలి’. కానీ, తమిళ సంప్రదాయంలో ఆ పేరు ఒక రాక్షసుడిదట! దాంతో, వెనకడుగు వేశారట! పైగా ‘బాహుబలి’ అనే పేరే అన్ని భాషల్లో ఉంటే బ్రాండ్‌గా డెవలప్ చేయడం ఈజీ. అది గ్రహించి, చివరకు ఆ పేరే అన్ని భాషల్లో ఉంచారు. అసలు ముందుగా ఈ చిత్రాన్ని 3డి వెర్షన్‌లో, ఐ-మ్యాక్స్ వెర్షన్‌లో కూడా చేయాలని అనుకున్నారట! కానీ, ఇంతకు ఇంత ఖర్చవుతుంది, టైమ్ పట్టేస్తుందని గుర్తించి, ఆలోచన దశలోనే ఆ ప్రతిపాదనను చిత్ర యూనిట్ విరమించుకుందని తెలిసింది.
 
తెలివి, టెక్నాలజీయే పెట్టుబడి... ఫ్రీగా కోట్ల పబ్లిసిటీ
దాదాపు రెండేళ్ళుగా నిర్మాణంలో ఉన్నప్పటికీ ‘బాహుబలి’ ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్‌తో జనం నోట నానుతూనే ఉంది. ఇన్నేళ్ళుగా పబ్లిక్‌లో ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉండేలా చేయడానికి విభిన్నమైన పబ్లిసిటీ, ప్రమోషన్‌లు అనుసరించారు. ఫస్ట్‌లుక్స్, మేకింగ్ వీడియోలు మధ్య మధ్య రిలీజ్ చేశారు.

ఇప్పటి దాకా ఏ మీడియాలోనూ ఒక్క రూపాయి కూడా యాడ్స్‌కు ఖర్చు పెట్టలేదు. ఆధునిక సాంకేతికతను నేర్పుగా వాడుకున్నారు. కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్‌వర్క్ మీదే ఆధారపడ్డారు. కొన్ని పదుల కోట్ల రూపాయల పబ్లిసిటీని తెలివిగా పొందారు. అందుకే, ఒక్కమాటలో... న్యూ డిజిటల్ ఎరా మార్కెటింగ్‌కు లేటెస్ట్ లెసన్ - ‘బాహుబలి’.  
 
సినిమా రిలీజ్ డేట్లు చాలాసార్లు మారుతూ వచ్చినా, ఆ ఎఫెక్ట్ పడకుండా దర్శక, నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. మొదట సమ్మర్ రిలీజ్ అనుకున్నారు. కానీ, అది కాస్తా తప్పిపోయింది. అంతే... మే 1వ తేదీ నుంచి వరుసగా సినిమాలోని ప్రధాన పాత్రల గెటప్ పోస్టర్లు, ఆ పాత్రల స్వభావం గురించి దర్శకుడి కామెంట్స్‌తో యూనిట్ హైప్ క్రియేట్ చేసింది.

ఇప్పటికే ఈ సినిమా అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌ను 10 లక్షల 33 వేల మందికి పైగా లైక్ చేసి, ఫాలో అవుతున్నారు. ట్విట్టర్‌లో 74,400 మంది ఫాలోయర్లున్నారు. అక్కడ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నారు. ‘‘భారత్‌లోనే అతి పెద్దదీ, అతి వేగంగా అభిమానులు విస్తరిస్తున్నదీ - ఈ ఫేస్‌బుక్ పేజీనే! అలాగే, దక్షిణాదిలో ఏ సినిమాకూ కనీవినీ ఎరుగని సంఖ్యలో ట్విట్టర్ ఫాలోయర్లున్నదీ ‘బాహుబలి’కే’’ అని సినీ మార్కెటింగ్ నిపుణులు చెప్పారు.  
 
అందరి నోటా అదే డిస్కషన్!
గమ్మత్తేమిటంటే, బాహుబలి పోస్టర్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. గాజులు వేసుకున్న ఒక చెయ్యి నీటి ప్రవాహంలో నుంచి పైకి లేచి, పసిబిడ్డను మునిగిపోకుండా పెకైత్తి పట్టుకున్న దృశ్యాన్ని ‘బాహుబలి’ పోస్టర్ల సిరీస్‌లో ముందుగా రాజమౌళి విడుదల చేశారు. ‘‘ప్రతి కథకూ ఒక ప్రధాన సందర్భం ఉంటుంది. అది ఆ కథాంశం మొత్తాన్నీ నిర్వచించేలా, ముందుకు నడిపేలా ఉంటుంది.

‘బాహుబలి’కి గుండెకాయ లాంటి ఘట్టం ఇది’’ అంటూ ఆ దృశ్యాన్ని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఈ పోస్టర్ ఆలోచన, ఒక ఇంగ్లీషు సినిమా పోస్టర్‌కు ఇమిటేషన్ అంటూ సోషల్ మీడియాలో చర్చ చెలరేగింది. అలాగే, ఆ తరువాత వచ్చిన మరికొన్ని పోస్టర్లకూ, పాత సినిమాల్లోని పాత్రలకూ పోలికలున్నాయంటూ రంధ్రాన్వేషణా సాగింది. చిత్ర యూనిట్ మాత్రం దేనికీ పెదవి విప్పలేదు.
 
ఇంటి దొంగలు... లీకు వీరులు..!
‘బాహుబలి’ రిలీజ్ కాకుండానే, ఫస్ట్‌పార్ట్‌లో 12 నిమిషాల ఫుటేజ్ కొన్ని నెలల క్రితం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. గ్రాఫిక్స్ వర్క్ కోసం పంపిన ముడిసరుకు దృశ్యాలవి. వాటిని కొందరు ‘ఇంటి దొంగలే’ అక్కసుతో బయటపెట్టారు. ఆ వ్యవహారంపై దర్శక, నిర్మాతలు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, నెట్‌లో ఎక్కడా ఆ ఫుటేజ్ లేకుండా చేశారు.  
 
పోస్ట్ ప్రొడక్షన్ వండర్స్
భారతీయ సినిమా చరిత్రలో గ్రాఫిక్స్ వండర్ అంటే రానున్న రోజుల్లో ‘బాహుబలి’ పేరే చెప్పుకుంటే ఆశ్చర్యపోనక్కర లేదు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న ఈ సినిమా కోసం పనిచేస్తున్న రాజమౌళి బృందం కంటి నిండా కునుకు తీసి కొన్ని నెలలైందేమో! మొదట ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నది - మే 15న. ఆ మేరకు రాజమౌళి ప్రకటన కూడా చేశారు. కానీ, వర్క్ పూర్తి కాలేదు.

గ్రాఫిక్సూ సిద్ధం కాలేదు. ఏప్రిల్ నెలాఖరుకు కూడా హైదరాబాద్‌లోని మకుట, ఫైర్‌ఫ్లై, చెన్నైలోని ప్రసాద్ ఇ.ఎఫ్.ఎక్స్‌తో సహా వివిధ దేశాల్లో 17 వి.ఎఫ్. ఎక్స్. స్టూడియోల్లో 600 మందికి పైగా సాంకేతిక నిపుణులు ఒకటికి రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. దానికి తోడు హిందీలో పెద్దయెత్తున మార్కెటింగ్‌కు ఇంకొంత టైమ్ కావాలనుకున్నారు. ఫలితం... హిందీ వెర్షన్‌ను సమర్పి స్తున్న దర్శకుడు కరణ్ జోహార్ సూచన మేరకు, హిందీకి కూడా కలిసొచ్చేలా జూలై 10కి రిలీజ్ ఫిక్స్ చేశారు.
 
హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్
విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మూడుసార్లు (‘మ్యాజిక్... మ్యాజిక్’, రజనీకాంత్ - శంకర్‌ల ‘శివాజీ...ది బాస్’, ‘యంతిరన్... ది రోబో’) జాతీయ అవార్డు అందుకున్న గ్రాఫిక్స్ నిపుణుడు శ్రీనివాస్ మోహన్. ‘బాహుబలి’ గ్రాఫిక్స్ పనులన్నిటికీ కో-ఆర్డినేటర్‌గా సారథ్యం వహిస్తున్నది ఆయనే. హై క్వాలిటీ కావాలంటే, ప్రతి 10 సెకన్ల విజువల్ ఎఫెక్ట్‌కూ దాదాపు రూ. 50 వేల దాకా ఖర్చవుతుందట! అలాంటిది ‘బాహుబలి’లో ఒక్క గ్రాఫిక్స్‌కే సుమారు రూ. 70 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారని సమాచారం.

సినిమాలో దాదాపు 95 శాతం సీన్లలో గ్రాఫిక్స్ ఉంటాయని భోగట్టా. ఇంత వరకూ దర్శకుడు శంకర్ చిత్రాలకూ, బాలీవుడ్‌లో షారుఖ్ ‘రా...వన్’ లాంటి మహా మహా సినిమాలకు కూడా గ్రాఫిక్స్‌కు ఇంత ఖర్చు పెట్టలేదు. శ్రమ పడలేదు. సినిమా అంతటా గ్రాఫిక్స్ ఉండడంతో, హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఫక్కీలో ఏది నిజమో, ఏది గ్రాఫిక్సో తెలియనంత నేర్పరితనం చూపేలా ‘ఫోటో రియల్ గ్రాఫిక్స్’ సృష్టిస్తున్నారు.
 
ఆకలి పెంచే ఆడియో... ట్రైలర్‌ల రుచి... మే 31న!
ఈ నెల 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే భారీ వేడుకలో ‘బాహుబలి’ ఫస్ట్‌పార్ట్ తెలుగు, తమిళ పాటలు విడుదల చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో 8 పాటలుంటాయి. తెలుగు, తమిళ ఆడియో హక్కుల్ని బెంగుళూరుకు చెందిన లహరి మ్యూజిక్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. వారు కేవలం 15 ఏళ్ళ కాలపరిమితికి రూ. 3 కోట్ల పైచిలుకు చెల్లించి, హక్కులు కొనడం విశేషం.

ఇక, హిందీ ఆడియో రైట్స్ మరో సంస్థవి. దేశంలో ఏ సినిమా ఆడియో రైట్లూ ఇంత భారీ మొత్తానికి అమ్ముడు కాలేదు. ఇక ఈ ఆడియో రిలీజ్ సంబరానికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని టాప్ స్టార్లు, టెక్నీషియన్లు హాజరు కానున్నారు.
 
కేవలం ఈ ఆడియో రిలీజ్ వేడుక ప్రత్యక్ష ప్రసార హక్కుల్ని ఒక తెలుగు టీవీ చానల్ రూ. 1.1 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం విశేషం. అన్నట్లు, తెలుగులో తొలిసారిగా డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో విడుదలవుతున్న హై క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ‘బాహుబలి’. అందుకోసం ప్రసిద్ధ ఇంజనీర్ పి.ఎం. సతీష్ ఈ సినిమా సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు చూస్తున్నారు. కీరవాణి, సతీష్‌లు విదేశాలకు కూడా వెళ్ళి, అక్కడ పనులు చేసుకొచ్చారు.
 
సినిమా ఎలా ఉంటుందో ముందుగా రుచి చూపించి, ఆకలి పెంచడానికి మొదటి ట్రైలర్ కూడా ఆడియోతో పాటు రిలీజ్ అవుతోంది. సెన్సార్‌లో ‘యు/ ఏ’ సర్టిఫికెట్ వచ్చిన రెండు నిమిషాల 5 సెకన్ల ఈ ఫస్ట్ థియేటరికల్ ట్రైలర్ అత్యద్భుతంగా ఉందని ఇప్పటికే చూసినవారు చెబుతున్నారు. ‘‘అసలు ఈ ట్రైలర్ చూసే కరణ్ జోహార్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ‘ఇది కేవలం ప్రాంతీయ సినిమా కాదు... జాతీయ స్థాయి సినిమా. ఆ రకంగానే భారీయెత్తున ప్రమోట్ చేయా’లన్నారు’’ అని ‘బాహుబలి’ వర్గాలు చెప్పాయి.
 
ఆల్ ఆర్ ఎవైటింగ్!
తెలుగులో ఒక సీన్, ఆ వెంటనే తమిళంలో అదే సీన్ - ఇలా ఆ రెండు భాషల్లో ఏకకాలంలో ‘బాహుబలి’ని చిత్రీకరించారు. ఇప్పుడు తెలుగు నుంచి హిందీలోకి, తమిళ వెర్షన్ నుంచి మలయాళంలోకీ ఫస్ట్‌పార్ట్ డబ్బింగ్ చేస్తున్నారు. ఆ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. జూలై 10న ఈ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. హిందీ వెర్షన్‌ను ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సారథ్యంలోని ధర్మ ప్రొడక్షన్స్, అనిత్ తడానీకి చెందిన ఎ.ఎ. ఫిల్మ్స్ సమర్పిస్తున్నాయి. తమిళంలోనేమో యు.వి. క్రియేషన్స్, హీరో సూర్య సన్నిహితులదైన స్టూడియో గ్రీన్ సంస్థ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.

‘‘భారతదేశంలో తయారైన అతి పెద్ద సినిమా ఇది’’ అని కరణ్ జోహార్ ‘బాహుబలి’ని అభివర్ణించారు. నిజానికి, ఇవాళ తెలుగు, తమిళ సీమల్లోనే కాదు... యావత్ దేశం ఈ సినిమా వార్తలు, విశేషాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తోంది.
 
తమిళ హీరో సూర్య కూడా ఆ మాటే అన్నారు. ‘‘ఎప్పుడెప్పుడా అని ‘బాహుబలి’ కోసం తమిళనాడు మొత్తం వేయికళ్ళతో నిరీక్షిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు చిత్రాలతో పేరు తెచ్చుకున్న ప్రముఖ తమిళ హీరోయిన్ త్రిష అయితే ‘‘రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి’ చూడాలని ఉంది. అదీ తమిళ డబ్బింగ్ కాకుండా, తెలుగు ఒరిజినల్ చూడాలని ఉంది. అలాంటి సినిమాలు మన భారతీయ సినిమా జెండాను ప్రపంచమంతటా ఎగరేస్తాయి’’ అన్నారు.
 
ఆ దేశాల్లో... అక్కడి భాషల్లో...  
భారతీయ భాషలతో పాటు చైనీస్‌లోనూ, యూరోపియన్ భాషల్లోనూ ‘బాహుబలి’ని ఇంగ్లీషు సబ్‌టైటిల్స్‌తో విడుదల చేయాలనుకుంటున్నారు. ఏషియన్ సినిమా మార్కెట్‌లైన జపాన్, సౌత్ కొరియాలకు కూడా ఈ సినిమా వెళ్ళనుంది. ఇప్పటికే, చైనాలో అధికారిక ‘చైనీస్ ఫిల్మ్ కార్పొరేషన్’తో ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే, చైనాలో ఏడాదికి ఒక నిర్ణీత సంఖ్యలోనే విదేశీ సినిమాల రిలీజ్‌కు అనుమతిస్తారు.

గతంలో ‘ధూమ్3’ లాంటి చిత్రాలు అక్కడ ఆలస్యంగా రిలీజైంది అందుకే. ఇప్పుడు మన ‘బాహుబలి’ కూడా కాస్తంత ఆలస్యంగా ఈ ఏడాది చివరలోనో, వచ్చే ఏడాది మొదట్లోనే చైనీయుల్ని అక్కడి భాషలో పలకరిస్తుంది.
 
ఇంగ్లీష్ వెర్షన్ వేరా?

‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ తుది నిడివి దాదాపు 2 గంటల 20 నిమిషాల దాకా ఉంటుందట! అంతర్జాతీయంగా విడుదల చేసే ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం మన ఇండియన్ వెర్షన్ కన్నా కాస్తంత నిడివి తక్కువుంటుందట! అంతే కాదు... మన వెర్షన్ కన్నా కొద్దిగా వేరుగా కూడా ఉంటుందని కృష్ణానగర్ సమాచారం. పాటలు తగ్గించడమే కాకుండా, వయెలెన్స్, గ్లామర్ అంశాలను అక్కడ కొంత ఎక్కువగా చూపిస్తారని తెలుస్తోంది.

‘బాహుబలి’ రెండో పార్ట్ విషయానికొస్తే, ఇంకా 40 శాతం దాకా షూటింగ్ చేయాల్సి ఉంది. ఫస్ట్ పార్ట్ రిలీజయ్యాక, ఆ షూటింగ్ పనీ పూర్తి చేసి, 2016లో రిలీజ్ చేయాలని ప్లాన్. ఫస్ట్ పార్ట్‌కూ, రెండో పార్ట్‌కూ మధ్యలో ‘బాహుబలి కామిక్ సిరీస్’, పిల్లల బొమ్మలు, వీడియో గేమ్‌ల లాంటివి విడుదల చేస్తారు. అలా ‘బాహుబలి’ని ఒక బ్రాండ్‌గా మర్చంటైజ్ చేయాలన్నది రాజమౌళి బృందం ఆలోచన.
 
‘బాహుబలి’ ఇప్పుడేం చేస్తున్నాడు?
‘బాహుబలి’ సినిమా ఎడిటింగ్, రీ-రికార్డింగ్ వగైరా పనులన్నీ ఇప్పటికే అయిపోయాయని భోగట్టా. కేవలం గ్రాఫిక్స్ వర్కే జరుగుతోందట! అయిదు దేశాల్లో (ఇండియా, సౌత్ కొరియా, హాంగ్‌కాంగ్, అమెరికా, రష్యా) 600 మంది నిపుణులు ఆ పని చేస్తున్నారు. ‘అవతార్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ లాంటి చిత్రాలకు పనిచేసిన అమెరికాలోని ‘టావ్ ఫిల్మ్స్’ నిపుణులు కూడా అందులో ఉన్నారు. ఆ గ్రాఫిక్స్ వర్క్ కూడా దాదాపు అయిపోవచ్చింది. కాకపోతే, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, ఆఖరు క్షణం దాకా మార్పులు చేర్పులతో మన జక్కన్న అపూర్వ సెల్యులాయిడ్ శిల్పాన్ని చెక్కుతూనే ఉన్నారు.

తెలుగు, తమిళ ఆడియో రిలీజ్ కాగానే, హిందీలో ఆడియో రిలీజ్... ఆ వెంటనే ప్రమోషన్... పబ్లిసిటీ... మీడియాలో ఇంటర్వ్యూలు... అలా అలా ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ను ఇంకా ఇంకా పెంచేసి, జూలై 10న తెరపై బొమ్మ పడుతుంది. రాజమౌళికి అచ్చొచ్చిన నెల జూలై. ‘సింహాద్రి’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ లాంటి బ్లాక్‌బస్టర్లన్నీ వచ్చింది జూలైలోనే! ఈసారి కూడా ఆ జూలై కలిసొచ్చేలా ఉంది. తెలుగు సినిమా పేరు అంతర్జాతీయంగా మారుమోగేలా ఉంది.
 
ఇది మన హాలీవుడ్ సినిమా!
ఒక్క ముక్కలో చెప్పాలంటే, దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రాజమౌళి భారీ కలల్ని తెరపైకి తర్జుమా చేసే ప్రయత్నం - ‘బాహుబలి’. ఇందులో లైవ్ యాక్షన్ షూటింగ్ కొంతే. కానీ, దానికి పోస్ట్ ప్రొడక్షన్‌లో విజువల్ ఎఫెక్ట్స్ జత కలిశాక - బ్రహ్మాండం. దాదాపు మూడు మైళ్ళకు పైగా ఎత్తున్న జలపాతం, భారీ యుద్ధక్షేత్ర దృశ్యాలు, లక్షలాది సైన్యం, వందలాది ఏనుగులు, గుర్రాలు, రథాలు - అన్నీ విజువల్ వండర్లే. అన్నీ జూలై 10న తెరపై ప్రత్యక్షమవుతాయి.

భారీ యుద్ధాల నేపథ్యంలో హాలీవుడ్‌లో వచ్చిన ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ట్రాయ్’ లాంటి ఆస్కార్ అవార్డ్ చిత్రాలు, ‘300’ లాంటి పాపులర్ సినిమాలూ మన కళ్ళ ముందు కదలాడతాయి. అందుకే, ‘బాహుబలి’ కేవలం తెలుగు సినిమా కాదు... ఇది తెలుగు వాళ్ళ ‘హాలీవుడ్ సినిమా’. ఆల్ ది బెస్ట్... జక్కన్న టీమ్!
- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement