రాజమౌళిని రిజెక్ట్ చేశా! | first Reject made of Rajamouli cinema - prabas | Sakshi
Sakshi News home page

రాజమౌళిని రిజెక్ట్ చేశా!

Published Sun, Jun 14 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

రాజమౌళిని రిజెక్ట్ చేశా!

రాజమౌళిని రిజెక్ట్ చేశా!

‘‘దర్శకుడు రాజమౌళి ‘స్టూడెంట్ నం.1’ తరువాత రెండు, మూడుసార్లు కలిసి కథ వినమంటే మొహమాటం కొద్దీ విన్నా. కానీ, సినిమా చేస్తానని కూడా చెప్పలేదు. ‘స్టూడెంట్ నం.1’ నాకు నచ్చలేదు. ఇంతలో ఆయన ‘సింహాద్రి’ తీశారు. ఆ సినిమా చూసి, పిచ్చెక్కిపోయింది. మనం రిజెక్ట్ చేశాం కాబట్టి, ఇక లైఫ్‌లో మనతో సినిమా చేయరనుకున్నా. కానీ, తరువాత ‘ఛత్రపతి’ తీశారు. ఇప్పుడు ‘బాహుబలి’ చేశారు’’ అని ప్రభాస్ అన్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ‘బాహుబలి’ చిత్రం పాటల ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు.
 
 సీనియర్ హీరో కృష్ణంరాజుతో పాటు ‘బాహుబలి’ యూనిట్ మొత్తం పాల్గొన్న ఈ భారీ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ, ఈ చిత్ర షూటింగ్ అనుభవాలనూ, రాజమౌళితో అనుబంధాన్నీ ప్రస్తావించారు. ‘‘పెద్ద సినిమా చేద్దాం అన్నారు కానీ. ఇంత పెద్ద సినిమా చేస్తారనుకోలేదు. ఇలాంటి సినిమాల్లో చేసే ఛాన్స్ జీవితంలో ఒక్కసారే వస్తుంది. జూలై 10న సినిమా రిలీజ్’’ అని ప్రభాస్ చెప్పారు. ‘‘నా జీవితంలో రాజమౌళి లాంటి మనిషిని చూడలేదు. ‘గ్రేట్ సోల్’. ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను. సినిమా, వ్యక్తిగత విషయాలను ఆయనతో షేర్ చేసుకుంటా’’ అన్నారు.
 
 నా బలం మా ఆవిడే !   - రాజమౌళి
 ‘‘కథ కోసం ఏడాది, షూటింగ్‌కి రెండేళ్లు, 6 నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్‌కి శ్రమించాం. ఇంత పనిచేస్తున్నప్పుడు నిరాశా నిస్పృహలు వస్తాయి. కానీ రమ్యకృష్ణ గారు చేసిన శివగామి పాత్ర చూస్తే మా కష్టాన్నంతా మర్చిపోయాం. ఆమె సెట్‌లోకి వచ్చి డైలాగ్స్ చె బుతుంటే ఎనర్జీగా ఉండేది. ఐదేళ్ల క్రితమే ఈ సినిమాకు హీరోగా ప్రభాస్ అని ఫిక్స్ అయ్యా. హీరో కన్నా విలన్ ఎత్తుగా, బలంగా ఉండాలి. అప్పుడు నా కళ్ల ముందు మెదిలాడు రానా. ఇక, నా భార్య రమ తోడు లేకపోతే ఈ సినిమా చేయలేకపోయేవాణ్ణి. ఆమే నాకు బలం. నిరాశానిస్పృహల్లో ఉన్న టైంలో ప్రభాస్ అండగా నిలిచాడు. ‘డార్లింగ్ మనం ఓ అద్భుతమైన సినిమా తీస్తున్నాం’ అని ఎప్పుడూ చెప్పేవాడు. ఈ సినిమా మీద అందరి కన్నా ప్రభాస్‌కెక్కువ నమ్మకముంది. అదే మమ్మల్ని ఇన్నాళ్లు న డిపించింది. ఇక మా అన్నయ్య కీరవాణి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇచ్చే సంగీతం, రీ-రికార్డింగ్ చెప్పనవసరం లేదు. నేను ఏది చేసినా నా తప్పులేంటో చెప్పి సరిదిద్దుతారు.’’
 
 మేకప్‌కే... మూడు గంటలు!   - అనుష్క
 ‘‘ఈ చిత్రంలో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. విదేశీ మేకప్‌మెన్‌ను కూడా పిలిపించారు. చివరికి ఇక్కడి మేకప్‌మన్ నాయుడు గారిని అడిగితే, ట్రై చేస్తానన్నారు. మొదటిసారి మేకప్ చేసినప్పుడు సరిగ్గా కుదరలేదు. ఆ తర్వాత నెలరోజుల పాటు రకరకాల పుస్తకాలు చదివి, చాలామందితో చర్చించి మేకప్ చేశారు. నా మేకప్‌కే రోజూ మూడు గంటలు పట్టేది. ఈ చిత్రం చేయడం ఓ మర్చిపోలేని అనుభూతి.’’
 
 కాలంతో బంధించలేని మ్యూజిక్! - తమన్నా
 ‘‘ఇవాళ్టి హీరో కీరవాణి గారు. ఆయన మ్యూజిక్‌ను ఓ కాలానికి బంధించలేం. బాహుబలి ప్రపంచాన్ని రియలిస్టిక్‌గా తేవడానికి చాలామంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.’’
 
 రామాయణం ఎలాంటిదో... ‘బాహుబలి’ అలాంటిది! - రానా
 ‘‘సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ణి. పురాణాలు, ఇతిహాసాలంటే... నాకు జానపద, పౌరాణిక చిత్రాలే. శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు, అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారు, భక్త కన్నప్ప అంటే కృష్ణంరాజుగారు. ఈ సినిమా ఒప్పుకున్నాక. ‘ఇప్పుడిప్పుడే కెరీర్‌లో పైకొస్తున్నావ్. మూడేళ్లు పడుతుందట. పైగా విలన్‌గానా?’ అన్నారు. వాళ్లకు నేనేం చెప్పానంటే.. ‘కాలం అనేది కరిగిపోయే క్షణాలైతే, ఈ ‘బాహుబలి’ కలకాలం నిలిచిపోయే శిల్పం’ అని. మనకు రామాయణం ఎలాంటిదో, వెండితెరపై ‘బాహుబలి’ అలాంటిది.’’
 
 అశేష జనవాహిని మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు డి.సురేశ్‌బాబు, ఎన్వీ ప్రసాద్, సాయి కొర్రపాటి, కెమేరామన్ సెంథిల్‌కుమార్, స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు శ్రీనివాస మోహన్, కథారచయిత విజయేంద్రప్రసాద్, వల్లీ కీరవాణి, రమా రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రసంగించిన యూనిట్ సభ్యులు ఒక్కొక్కరూ ఈ రెండేళ్ల జర్నీలో తమకు నచ్చిన టెక్నీషియన్ పేరు చెప్పి, గౌరవించడం విశేషం.
 
* నా కె రీర్లో ఏ సినిమా గురించీ ఇంత ఉద్వేగానికి గురవలేదు. ఇదే కథ హాలీవుడ్‌కిసే,్త పదేళ్లు తీస్తారు.  - రమ్యకృష్ణ
 
 * ఈ చిత్రం కోసం నా కెరీర్ మొత్తం ఎదురుచూస్తోంది. ఇంత క్లిష్టతరమైన పాత్రను నేనెప్పుడూ చేయలేదు.    - నాజర్
 
 * ‘అవతార్’ సినిమాను ఇక్కడ భాషల్లోకి ఎలా అనువదించారో...  హాలీవుడ్‌లో కూడా రాజమౌళి  సినిమాలను ఇంగ్లీషులోకి అనువదించే రోజులు త్వరలో ఉన్నాయి.           - సత్యరాజ్  
 
 * దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.  రాజమౌళి నా కన్నా చిన్నవాడు. అయినా, అతనికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే శక్తి రాజమౌళికి ఉంది.                                   - కృష్ణంరాజు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement