వేల మంది భుజాలపై మేం నిలబడ్డాం: రాజమౌళి | We have thousands of people on the shoulders of stand up - SS Rajamouli | Sakshi
Sakshi News home page

వేల మంది భుజాలపై మేం నిలబడ్డాం: రాజమౌళి

Published Mon, Mar 27 2017 3:02 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

వేల మంది భుజాలపై మేం నిలబడ్డాం: రాజమౌళి - Sakshi

వేల మంది భుజాలపై మేం నిలబడ్డాం: రాజమౌళి

‘‘డార్లింగ్‌ ఫ్యాన్స్‌... మీకు ప్రభాస్‌ (రోప్‌ సహాయంతో గాల్లోంచి కిందకు, వేదికపైకి ప్రభాస్‌ దిగారు) ఎంట్రీ ఓకేనా? ఇప్పుడు మీరు చూసింది చాలా చాలా తక్కువ. సినిమాలో ఇంకా ఎక్కువ... చాలా చాలా  ఎక్కువ ఉంటుంది. ఇన్నేళ్లు ఇంత కష్టపడి సినిమా చేసి ఈ వేదికపై ఇంతమంది ఉన్నామంటే... కారణం మేము కాదు. ఈ చిత్రానికి పనిచేసిన ఎన్నో వేల మంది. వాళ్లందరి భుజాలపై మేం నిలబడి ఉన్నాం’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన సినిమా ‘బాహుబలి: ద కంక్లూజన్‌’. అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తదితరులు ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘బాహుబలి: ద బిగినింగ్‌’కి కొనసాగింపుగా తీసిన ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో ఎవరెవరు ఏమన్నారంటే...

తప్పని తేలింది... తల తెగింది!: ప్రభాస్‌
‘‘రెండున్నరేళ్లు ఓ సినిమా, రెండేళ్లు ఓ సినిమా కోసం ఎదురు చూసిన డార్లింగ్స్‌ (ఫ్యాన్స్‌) అందరికీ థ్యాంక్స్‌. మీ కోసమైనా ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ట్రై చేస్తా. మా ‘బాహుబలి’ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, నిర్మాతలు... అందరికీ థ్యాంక్స్‌. హిందీలో సినిమా ఇంత పెద్ద హిట్‌ కావడానికి నిర్మాతలు కరణ్‌ జోహార్, అనిల్‌ తడాని చాలా హెల్ప్‌ చేశారు. హిందీ ప్రేక్షకులు చాలామందికి మా ముఖాలు తెలీదు. కరణ్‌ జోహార్‌ సమర్పణ అనే పేరు వల్ల ఉత్తరాదిలో పెద్ద హిట్టయింది’’ అంటూ ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’, ‘వాడిది తప్పు అని తేలింది... తల తెగింది’ అనే డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను అలరించారు.

రాజమౌళితో సినిమా జోక్‌ కాదు: నిర్మాత ప్రసాద్‌ దేవినేని
శోభు, నేనూ ‘బాహుబలి’కి నిర్మాతలమైనా... నాలుగేళ్ల శోభు హార్డ్‌వర్క్, ప్యాషన్‌ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. రాజమౌళితో సినిమా తీయడం జోక్‌ కాదు. అంత ఈజీ అసలు కాదు. హి ఈజ్‌ టోటల్లీ హార్డ్‌ వర్కింగ్‌ అండ్‌ ప్యాషనేట్‌ అబౌట్‌ ద ఫిల్మ్‌. నిర్మాత కూడా అతనితో సమానంగా హార్డ్‌వర్క్‌ చేయాలి. శోభు అంత హార్డ్‌ వర్క్‌ చేశాడు.

http://img.sakshi.net/images/cms/2017-03/41490559698_Unknown.jpg‘బాహుబలి’ ఓ విచిత్రమైన సినిమా!:  రాజమౌళి
ఎన్నో వేలమంది కష్టం ‘బాహుబలి’ సినిమా. వాళ్లందరికీ నేను థ్యాంక్స్‌ చెప్పాలి. కృష్ణంరాజుగారి దీవెనలు మాకెప్పుడూ ఉంటాయి. మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తారు. ఆయన ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నా కోరిక. మా గురువుగారు రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్‌. ‘బాహుబలి’ ఎంత విచిత్రమైన సినిమా అంటే... ఫైట్స్‌కి ఫైట్‌ మాస్టర్‌ ఉండడు. డ్యాన్స్‌ మాస్టర్‌ ఉంటాడు. డ్యాన్సులకు ఫైట్‌ మాస్టర్‌ కావాలి. సీన్స్‌కి ఫైట్‌ మాస్టర్‌ కావాలి. ప్రతి సీన్‌లోనూ ఏదొకటి కదులుతుంది. అన్నిటికీ రిగ్గింగ్‌ కావల్సిందే. కింగ్‌ సాల్మన్‌ మాస్టర్‌ ఈ ఐదేళ్లూ మాతోనే ఉండి పనిచేశారు. ప్రపంచంలో ఆయన వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ రిగ్గర్‌. మా ఆవిడ (రమా రాజమౌళి) కాస్ట్యూమ్స్‌ గురించి చెప్పడం లేదు. ఆవిడ గురించి ఏవీ (ఆడియో విజువల్‌) ప్లే చేశాం. మరీ ఎక్కువ పొగిడేస్తే మాట వినదు. స్టైల్‌గా ఈ మాట అనేసినా మళ్లీ భయం వేస్తోంది.

నేనూ మనిషినే కాబట్టి హిట్స్‌ వచ్చినప్పుడు పొగరు, గర్వం పెరుగుతాయి. అలాంటప్పుడు ఓ మొట్టికాయ వేసి నన్ను నేలకు దించుతూ, ఫ్యామిలీ లైఫ్‌ని, ప్రొఫెషనల్‌ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్‌ చేయాలో నేర్పిస్తున్న నా భార్యకి థ్యాంక్స్‌. మరో స్టైలిష్ట్‌ ప్రశాంతికీ థ్యాంక్స్‌. మా అబ్బాయి కార్తికేయ నిర్మాత కావాలనుకుంటు న్నాడు. వాడికి దర్శకత్వమంటే ఆసక్తి లేకపోయినా ఈ సినిమాకి సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంచి నిర్మాత అవుతాడు. ఎందుకంటే... వాడికి ప్రతి రూపాయి లెక్కే. కార్తికేయ ఇచ్చిన ఐడియాతో ‘బాహుబలి–2’ ట్రైలర్‌ కట్‌ చేశాం. మకుట టీమ్‌ నా హోమ్‌ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో వంటిది. పీట్‌ అండ్‌ టీమ్‌కి థాంక్యూ. డీఓపీ సెంథిల్‌ కుమార్, ఎడిటర్‌ తమ్మిరాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్, మా కల్యాణ్‌ (కోడూరి) అన్న, ‘బాహుబలి’ చిత్ర బృందం అందరికీ థ్యాంక్స్‌.  

ఆయన, నేనూ కొట్టుకున్నంత : రాజమౌళి
మా సినిమా వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ కమల్‌ కణ్ణన్, నేనూ కొట్టుకున్నంత ఎవరూ కొట్టుకోరు. మేమిద్దరం స్పెండ్‌ చేసినంత టైమ్‌ ఎవరూ స్పెండ్‌ చేయరు. విజువల్‌ ఎఫెక్ట్స్‌పై నాకు చాలా గ్రిప్‌ ఉందని ప్రశంసిస్తుంటారు. వీఎఫ్‌ఎక్స్‌కి సంబంధించినంత వరకూ కమల్‌ కణ్ణన్‌గారు నా టీచర్‌. ఓ రోజు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ని బాగుందని చెప్పిన నేను ఆ తర్వాత రెండు రోజులకు అందులో చిన్న సమస్య ఉంది. మళ్లీ వర్క్‌ చేయొచ్చా? అనడుగుతా. తిట్టుకుంటూనే పని చేసిన కమల్‌ కణ్ణన్‌కి థాంక్స్‌.

ఇది ‘బాహుబలి’ నామ సంవత్సరం: కె. రాఘవేంద్రరావు
ఏప్రిల్‌ 28న ఉగాది అని విన్నాను. ఈ ఏడాదిని బాహుబలి నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చు. అందరూ గొప్పగా యాక్ట్‌ చేశారు. తీశారు. గ్రాఫిక్స్, ఫిక్సెల్స్‌ నాకు తెలీవు. సినిమా గురించి చెప్పమంటే ఏమని చెప్పను? నిర్మాతలు శోభు, ప్రసాద్‌ల ధైర్యమని చెప్పనా? ప్రభాస్‌–రానాల యుద్ధమని చెప్పనా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పనా? నన్ను సెట్‌కు రమ్మని రాజమౌళి చాలా సార్లు పిలిచినా... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సి వస్తుందేమోనని వెళ్ళలేదు. బహుశా ‘బాహుబలి 3’ తీస్తే వెళ్లాలని ఉంది. నేను తీసినవాటిలో ‘అడవి రాముడు’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమాలు ఉన్నాయి.

‘అడవిరాముడు’లో ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని’ పాట ఉంది. ఇప్పుడైతే ఈ సాంగ్‌ను ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు. తరతరాలకు తరగని బాహుబలులవుతారు’ అని రాయించేవాణ్ణి. ‘బొబ్బిలి బ్రహ్మన్న’కు ‘బొబ్బిలి బాహుబలి’ అని పేరు పెట్టేవాణ్ణి. కొందరు అవార్డుల గురించి మాట్లాడతారు. నాకైతే ఇప్పుడు ‘బాహుబలి’ అని  బిరుదు ఇస్తే తీసుకోవాలని ఉంది. ఇస్తే హ్యాపీగా ఫీలవుతాను.

జేమ్స్‌ కామెరూన్‌ సరసన చేరే సత్తా రాజమౌళికి ఉంది: కరణ్‌ జోహార్‌
ఇండియన్‌ మూవీని మరోమెట్టు ఎక్కించే వేదికపై ఉన్నానన్న భావన కలుగు తోంది. ఇండియన్‌ సినిమాకు ‘బాహుబలి’ గర్వకారణం. రాజమౌళికి ఇండియన్‌ ఫీల్మ్‌ మేకర్‌గానే కాదు, గ్లోబర్‌ ఫిల్మ్‌ మేకర్‌గా పేరు సంపాదించగల టాలెంట్‌ ఉంది. నిజానికి ఇది ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ కాదు. ఎందరో ఫిల్మ్‌ మేకర్స్‌కు బిగినింగ్‌గా చెప్పవచ్చు. జేమ్స్‌ కామెరూన్‌ వంటి ప్రపంచ స్థాయి డైరెక్టర్ల సరసన చేరగల సత్తా రాజమౌళికి ఉంది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ల ధైర్యానికి మెచ్చుకోవాలి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కా యాక్టింగ్‌ రియల్లీ అమేజింగ్‌. ఏప్రిల్‌ 28 కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ప్రభాస్‌ మిగతా హీరోల్లా కాదు: కీరవాణి
రాజమౌళి ఇలా హిట్‌ సినిమాలు తీస్తూ ఎంతో పైకి రావాలి. ఇంతటి గొప్ప సినిమాలో పాటలు పాడటమే కాదు.. రాసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రభాస్‌కు గర్వంలేదు. తనకు దైవ బలం, మంచి మనసు ఉన్నాయి. మిగతా హీరోల్లా ఉండటం ప్రభాస్‌కు చేత కాదు.

ప్రతి క్షణం గుర్తుండిపోతుంది: రానా
‘కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే.. ‘బాహుబలి’ చిత్రం కలకాలం నిలబడే శాశ్వత శిల్పం’ అని రెండేళ్ల క్రితం చెప్పాను. నా మాటను నిజం చేసిన ప్రేక్షకులకు, ‘బాహుబలి’ అభిమానులకూ ధన్యవాదాలు. ఇప్పుడు మాహిష్మతికి తిరిగి వెళ్లలేనా? తిరిగి చూడలేనా? అన్న చిన్న బాధ ఉంది. అప్పుడప్పుడు కన్నీరు కూడా వచ్చింది. మాహిష్మతి రాజ్యంలో గడిపిన ప్రతిక్షణం నా జీవితంలో గుర్తుండిపోతుంది. ప్రభాస్‌ మంచి కోస్టార్‌. ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణగారైతే బయట వల్లిగారు. రాజమౌళిగారికి థ్యాంక్స్‌. ఈ సినిమాలో పనిచేసిన అందరితో తిరిగి పనిచేయాలని కోరుకుంటున్నాను.

ఎవరూ డబ్బు గురించి ఆలోచించలేదు: నిర్మాత శోభు యార్లగడ్డ
‘బాహుబలి’ ఓ నేషనల్‌ బ్రాండ్‌గా నిలిచినందుకు హ్యాపీగా ఉంది. రెండో పార్ట్‌ ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుండటం ఆనందంగా ఉంది. వేలమంది టెక్నిషియన్లు ఐదేళ్లు పని చేయకపోతే ఈ అద్భుత ఘనత మాకు దక్కేది కాదు. టాలెంట్, హార్డ్‌ వర్కింగ్‌ల కాంబినేషన్‌ రాజమౌళి. ఈ సినిమా కోసం పని చేసిన ఎవరూ డబ్బు గురించి ఆలోచించలేదు. కెరీర్‌ పీక్‌ టైమ్‌లో ఉన్నప్పుడు ఓ సినిమా కోసం ఎవ్వరూ నాలుగేళ్లు ఇవ్వరు. ప్రభాస్‌ ఇచ్చాడు. ఈ వేడుకలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క తదితరులు పాల్గొన్నారు.

ముంబయ్‌ మీడియా అరిచినప్పుడు గర్వపడ్డా – రాజమౌళి
నేను కమర్షియల్‌ సినిమాలు చేస్తూ, కమర్షియల్‌ హీరోయిజమ్‌ను ఎలివేట్‌ చేస్తూ, నాకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చాను. హీరోయిజమ్‌ ఎలా ఉండాలని ఎప్పటికప్పుడు ఆలోచించు కుంటూ, తర్వాత స్థాయికి తీసుకు వెళ్తూ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ప్రతి సినిమాలో ప్రతి హీరోకి ఒక ఎలివేషన్‌ ఇచ్చాను. ‘బాహుబలి’లో ప్రభాస్‌కి ఏం ఇచ్చానని నన్ను నేను ప్రశ్నించుకు న్నప్పుడు... తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌ గురించి, నా గురించి అందరికీ తెలుసు. మొన్న ట్రైలర్‌ లాంచ్‌కి ముంబయ్‌ వెళ్లాం. ఓన్లీ మీడియాను మాత్రమే ఆహ్వానించాం. అక్కడికి వెళ్లగానే... ఇప్పుడు మీరు (ప్రేక్షకులు) ఎలా అరుస్తున్నారో? అలా అరిచారు. ఎవరు అరుస్తున్నారని చూస్తే... ముంబయ్‌లో మీడియా జనాలు. ప్రభాస్‌ ఎంట్రీకి విపరీతంగా అరిచారు. అప్పుడు దర్శకుడిగా గర్వపడ్డా.

కంట తడిపెట్టిన రాజమౌళి!
వేదికపైన చిత్రబృందం ఒక్కొక్కరి ఆడియో విజువల్‌ ప్రదర్శించిన సమయంలో వారి కోసం ప్రత్యేకంగా స్వరపరిచిన పాటను వినిపించారు. రాజమౌళి కోసం రాసిన పాటను కీరవాణి పాడగా.. వేదికపైనే ఉన్న రాజమౌళి కంట తడిపెట్టారు. ఆ పాట ఏంటంటే... ఎవ్వడంటా... ఎవ్వడంటా...? బాహుబలి తీసింది. మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది.. ఎవ్వరూ కనంది. ఎక్కడా వినంది. శివుని ఆన అయ్యిందేమో.... హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. పెంచింది రాజ నందిని.. కొండంత ప్రేమతో... ఎంతెంత పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా చిరుయువై యశస్సుతో.. ఇలాగే సాగిపొమ్మని పెద్దన్న నోటి దీవెన.. శివుణ్ణి కోరు ప్రార్థన.
http://img.sakshi.net/images/cms/2017-03/61490559828_Unknown.jpg

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement