జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్ లాంటి ప్రయోగాలతో అలరించిన హీరో కృష్ణ తొలిసారి దర్శకుడై చేసిన మరో సాహసం ‘సింహాసనం’. తెలుగులో తొలి 70 ఎం.ఎం–6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ చిత్రంగా అది ఆ రోజుల్లో ఓ సంచలనం.
అది 1983. ఎన్టీఆర్ సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి వెళ్ళారు. ఎన్టీఆర్ వదిలి వెళ్ళిన నంబర్ 1 స్థానం కోసం అగ్ర హీరోల నుంచి యువ తారల దాకా అందరూ పోటీలోకి దిగారు. 1983లోనే నవంబర్‌లో కృష్ణ సొంత స్టూడియో పద్మాలయా ప్రారంభమైంది. నటుడిగా తెలుగులోనూ, నిర్మాతగా హిందీలోనూ కృష్ణ బిజీ. అయితే, ఒకపక్క సొంత స్టూడియోకు పని కల్పిస్తూనే, ఏదైనా సాహసం చేసి, సంస్థ జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడించాలి. సరిగ్గా అప్పుడే కృష్ణ హిందీలో ‘పాతాళ్ భైరవి’ (1985 మే 3) రీమేక్‌తో ఓ జానపద ప్రయోగం తీశారు. హిట్. అంతే, పద్మాలయాకూ, దర్శకుడిగా తనకూ ప్రతిష్ఠాత్మకంగా భారీ సెట్స్‌తో జానపద సినిమా, అదీ ఫస్ట్ టైమ్ 70 ఎం.ఎంలో తీస్తే? ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే ‘సింహాసనం’.
రెండు రాజ్యాల పోరాటకథగా...
జానపదాలు కనుమరుగైపోయిన రోజుల్లో, కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ సాహసం వర్కౌట్ అవ్వాలంటే, హిందీలోనూ తీయాలని తీర్మానించుకున్నారు. తెలుగులో ‘సింహాసనం’, హిందీలో జితేంద్ర హీరోగా ‘సింఘాసన్’ పట్టాలెక్కాయి. మంచికీ – చెడుకీ సంఘర్షణగా ఈ చిత్రం తీశారు. సింహాసనం కోసం దశార్ణ రాజ్యానికీ, అవంతీ రాజ్యానికీ మధ్య పోరాటం ఈ చిత్రకథ.
చరిత్ర కలగలిపిన జానపదం
టైటిల్స్‌లో కథకు క్రెడిట్ కృష్ణదే అయినా, ఆయన ఆస్థాన రచయిత త్రిపురనేని మహారథిదే రచనలో కీలకపాత్ర. కాకతీయ సామ్రాజ్యం – రాణీ రుద్రమదేవి – ఆపత్కాలంలో ఆమెకు సాయపడే గోన గన్నారెడ్డి... ఈ ప్రసిద్ధ చారిత్రక పాత్రల ఆధారంగా రాణి అలకనందాదేవి (జయప్రద), ఆమెను కాపాడే సేనాధిపతి విక్రమసింహుడి (కృçష్ణ) పాత్రలు సృష్టించారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ప్రయోగం జరిగినట్టు చరిత్ర. ఆ స్ఫూర్తితో చందనగంధి పాత్ర (మందాకిని) రాశారు.
భారీ రాజదర్బారు... విగ్రహాలు...
రెండు రాజ్యాల మధ్య జరిగే ఈ జానపద కథలో సహజత్వం కోసం కళాదర్శకుడు భాస్కరరాజు లక్షల ఖర్చుతో భారీ సెట్లు వేశారు. గమ్మత్తేమిటంటే, ఈ రాజుల కాలం కథలో కీలకమైన కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆయనే! ఆయన వేసిన ఆరుబయట రాజ దర్బార్ సెట్టు, భారీ విగ్రహాలు... చాలా కాలం స్టూడియోలో పలకరిస్తుండేవి. రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టే ముందు రామోజీరావుకు సైతం ఆ విగ్రహాల తయారీ గురించి ‘పద్మాలయా’ హనుమంతరావు వివరించారట.
కొత్త సింగర్... పాటలు సూపర్‌హిట్
‘సింహాసనం’లో కృష్ణ చేసిన మరో సాహసం – రాజ్ సీతారామ్ గానం. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు ఓ వివాదం తలెత్తింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ రాజ్ సీతారామ్ గొంతు బాగుందనిపించింది. అంతే... కృష్ణ తన ‘సూర్య చంద్ర’ (1985)లో అన్ని పాటలూ అతనితోనే పాడించారు. ‘సింహా సనం’ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి ఆ గొంతుకే ఓటేశారు. ‘ఆకాశంలో ఒక తార’, ‘వహవ్వా నీ యవ్వనం’, ‘ఇది కలయని నేననుకోనా’– ఇలా ఆత్రేయ, వేటూరి పాటలన్నీ హిట్. రాజ్‌సీతారామ్ పేరు మోతమోగింది.
తీసేది 65 ఎం.ఎం! వేసేది 70 ఎం.ఎం!!
నిజం చెప్పాలంటే, అప్పట్లో ఈ చిత్రాలేవీ సిసలైన 70 ఎం.ఎం కెమేరాతో తీసినవి కావు. ఆ కెమేరాలు 35 ఎం.ఎం కన్నా రెట్టింపు రిజల్యూషన్ ఉండే పెద్ద కెమేరాలు. అప్పటికి మన దేశంలో ఆ కెమేరాలూ లేవు. అందుకే అందరూ స్కోపులో, 65 ఎం.ఎం నెగటివ్ స్టాక్ మీద సినిమా షూట్ చేసుకొని, దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేయించి, 70 ఎం.ఎం ఫిల్ము మీద ప్రింట్ చేసేవారు. షూట్ చేసిన 65 ఎం.ఎం పోగా, మిగతా 5 ఎం.ఎం ఫిల్మేమో ‘సౌండ్ ట్రాక్’ కోసమన్న మాట. మామూలు 35 ఎం.ఎం రీలుపై గీతలా సింగిల్ సౌండ్ ట్రాక్ ఉంటుంది. కానీ, 70 ఎం.ఎం రీలుపై మేగ్నటిక్ కోటింగ్‌లో సౌండ్‌ను ఆరు ట్రాక్‌లుగా, ఆరుసార్లు ముద్రించాల్సి ఉంటుంది. అందుకే, ‘6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ అంటారన్న మాట. అందరిలానే తెలుగు ‘సింహాసనం’ సైతం ఆ టెక్నిక్‌లో 65ఎం.ఎంలో తీసి, 70 ఎం.ఎంకి బ్లోఅప్ చేసినదే!
‘‘ఫేమస్ ‘షోలే’తో సహా మన దేశంలో తీసిన 70 ఎం.ఎంలన్నీ దాదాపు ఇలా తీసినవే. 35 ఎం.ఎంకి ఒక రకంగా, 70 ఎం.ఎంకి మరో రకంగా కెమేరాలో మార్కింగ్ ఉంటుంది. 35 ఎం.ఎంలో బొమ్మ ఎత్తుంటుంది. నలుచదరంగా ఉంటుంది. 70 ఎం.ఎంలోనూ బొమ్మ ఎత్తు అంతే కానీ, వెడల్పు రెట్టింపు ఉంటుంది. 70 ఎం.ఎం సినిమా తీయాలంటే కెమేరాలో గేట్ మారుస్తారు. ఒక్క 70 ఎం.ఎంలోనే సినిమా తీస్తే సులభమే కానీ, మన దగ్గర అన్ని థియేటర్లుండవు కాబట్టి, అత్యధిక చోట్ల 35 ఎం.ఎం ప్రింట్లే ప్రదర్శించాల్సి వస్తుంది. అంటే, సినిమా తీస్తున్నప్పుడే బొమ్మ కట్ కాకుండా 35 ఎం.ఎం ప్రింట్‌కీ, 70 ఎం.ఎం ప్రింట్‌కీ తగ్గట్టు జాగ్రత్తగా కెమేరా ఫ్రేమింగ్ పెట్టాలి’’ అని ‘సింహాసనం’కి పనిచేసిన నేటి ప్రముఖ దర్శకుడు తేజ వివరించారు.
స్వామి కెమేరా! నగాయిచ్ ట్రిక్స్
‘సింహాసనం’ ఛాయాగ్రహణమంతా వి.ఎస్.ఆర్. స్వామి పనితనమే. కాగా, ఆయనకు కెమేరా గురువైన రవికాంత్ నగాయిచ్ ఈ ‘సింహాసనం’కి ట్రిక్ ఫోటోగ్రఫీ చేశారు. నగాయిచ్ దగ్గర అసిస్టెంట్‌గా తేజ పనిచేశారు. ‘‘‘ఆకాశంలో ఒక తార...’ పాటలో బృందావన్ గార్డెన్స్‌లోనే ఓ ప్యాలెస్ ఉన్నట్టు చూపించడం లాంటివి ట్రిక్‌షాట్లే. అందుకోసం ప్యాలెస్ మినియేచర్ సెట్ తీసుకెళ్ళాం. అక్కడ షూటింగ్ చేశాక, 6 బస్సుల్లో డ్యాన్సర్లందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి, ఇక్కడ షూట్ సాగించాం’’ అని తేజ చెప్పారు.
ఏడెనిమిది రెట్లు ఎక్కువ బడ్జెట్!
ఒక షాట్‌ను తెలుగులో తీసి, వెంటనే అదే సెటప్‌లో హిందీ ‘సింఘాసన్’ చిత్రీకరించేవారు. 65 రోజుల్లో రెండు వెర్షన్లూ పూర్తి చేశారు. 40 – 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజ్‌లో భారీగా జరిగింది.
తెలుగులో... ఆ ప్రింట్లు ఆరే ఆరు!
షూటింగే కాదు... ‘సింహాసనం’ పబ్లిసిటీ, ప్రింట్ల రిలీజు కూడా ఆ రోజుల్లో భారీగా సాగింది. తెలుగు వెర్షన్ సుమారుగా 86 ప్రింట్లతో, 150కి పైగా థియేటర్లలో రిలీజవడం మరో సంచలనం. ఇక హిందీ వెర్షన్‌కు 120 – 130 ప్రింట్లు తీశారు.
అప్పట్లో మామూలు 35 ఎం.ఎం ప్రింట్ తీయడానికి రూ. 30 – 40 వేల దాకా అయ్యేది. అదే 70 ఎం.ఎం ప్రింట్ తీయాలంటే, లక్షా అరవై వేలయ్యేది. పైపెచ్చు, దానికి కావాల్సిన పాజిటివ్ ఫిల్ము కోసం మూడు నెలల ముందుగానే చెప్పి, విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇక, ల్యాబ్‌లో 70 ఎం.ఎం ప్రింట్ డెవలప్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు రోలర్స్ మార్చాలి. ఆ ప్రింట్లు తీస్తున్నప్పుడు వేరేవి ప్రింట్ చేయలేరు. అందుకే 70 ఎం.ఎం ప్రింట్లకు ఎక్కువ ఛార్జ్ వసూలు చేసేవారు. ఆ ప్రింట్‌ను హాలులో వేయాలన్నా మామూలు ప్రొజెక్టర్‌కు ఉండే రోలర్లు, దానికి ఉండే లెన్సులు మార్చాలి. వెనకాల ఉండే ఆర్క్ లైట్‌ను బ్రైట్ చేయాల్సి ఉంటుంది.
అప్పట్లో ఇలా ‘70 ఎం.ఎం – 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ సినిమాలు ప్రదర్శించేందుకు తగిన సాంకేతిక సదుపాయాలున్న హాళ్ళూ తెలుగునాట తక్కువే! గుంటూరు, నెల్లూరు లాంటి చోట్ల ‘సింహాసనం’ 70 ఎం.ఎం ప్రదర్శన కోసం అదనంగా ఖర్చు పెట్టి, హాళ్ళను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల మధ్య ‘సింహాసనం’ చిత్రం రిలీజు కోసం ఆరు 70 ఎం.ఎం. ప్రింట్లు వేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని, విజయవాడ (రాజ్), గుంటూరు (మంగా డీలక్స్), విశాఖపట్నం (చిత్రాలయా), నెల్లూరు (అర్చన), కాకినాడ (దేవి), హైదరాబాద్ (దేవి) – ఈ 6 కేంద్రాలలో 70 ఎం.ఎం ప్రింట్లు వేశారు. అందులో 68 రోజులకే సినిమా మారిన ఒక్క నెల్లూరు మినహా మిగతా 5 కేంద్రాలలోనూ, అలాగే రాజమండ్రిలో 35ఎం.ఎం ప్రింట్‌తో (స్వామి టాకీస్‌లో)నూ మొత్తం 6 కేంద్రాలలో ‘సింహాసనం’ డైరెక్ట్ శతదినోత్సవం చేసుకుంది.
పోస్టర్ పబ్లిసిటీలో... 24 షీట్ ట్రెండ్!
సినిమాలానే ‘సింహాసనం’ పబ్లిసిటీ కూడా భారీగా సాగింది. అప్పట్లో తెలు గులో కేవలం 4 షీట్, 6 షీట్, 9 షీట్ వాల్ పోస్టర్లే ఉండేవి. కానీ, ‘సింహాసనం’ కోసం తెలుగులో తొలిసారిగా 24 షీట్ వాల్ పోస్టర్లు సిద్ధం చేయించారు ‘పద్మాలయా’ హనుమంతరావు. అందరినీ ఆకర్షించిన ఆ 24 షీట్ పోస్టర్ల విధానం అప్పటి నుంచి తెలుగు సినిమా పబ్లిసి టీలో ఓ ట్రెండైంది! అలాగే, సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో ‘సింహాసనం’ రిలీజుకు ముందు అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగులు, బెంజ్ సర్కిల్ సెంటర్ దగ్గర 75 అడుగుల చొప్పున హీరో కృష్ణ భారీ ప్లైవుడ్ కటౌట్లు పెట్టారు. అప్పట్లో ఆ పబ్లిసిటీ ఆకర్షణ టాక్ ఆఫ్ ది టౌన్!
రాజకీయ ప్రత్యర్థి ఎన్టీఆర్‌పై విసుర్లు
అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హీరో కృçష్ణ సహజంగానే ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద ‘సింహాస నం’లో కొన్ని విసుర్లు కూడా పెట్టారు. ‘‘థియేటర్లలో ఆ డైలాగ్స్‌కు స్పందన లభించింది. దాంతో ఎన్టీఆర్‌పై జనంలో వ్యతిరేకత మొదలైందనే అంచనాతో మేము ‘నా పిలుపే ప్రభంజనం’, తర్వాత ‘సాహసమే నా ఊపిరి’ తీశాం’’ అని ‘పద్మాలయా’ ఆదిశేషగిరిరావు గుర్తుచేసుకున్నారు.
సముద్రపుటొడ్డున... అభిమాన జనసముద్రం మధ్యన...
1986 జూలై 12న మద్రాసులో సముద్రపుటొడ్డున వి.జి.పి. గార్డెన్స్‌లో వందలకొద్దీ బస్సులు, కార్లు, వ్యాన్లలో తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది అభిమానుల మధ్య ‘సింహాసనం’ వందరోజుల వేడుక సాగింది.
ఆ తరువాత... ఆ సినిమాలు అరుదే!
వాస్తవానికి, ‘సింహాసనం’ కన్నా ముందు తెలుగులో ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’, ‘సింహాసనం’ రిలీజైన తరువాత చిరంజీవి ‘కొండవీటి దొంగ’ లాంటి చిత్రాలు కూడా 70 ఎం.ఎం.లో తీసే ప్రయత్నాలు జరిగాయి. కారణాలేమైనా, వాటిని చివరకు ఆ టెక్నిక్‌లో తీయలేదు. ‘సింహాసనం’కే ఆ క్రెడిట్ దక్కింది. తెలుగులో వచ్చిన రెండో 70 ఎం.ఎం – ఏయన్నార్, నాగార్జున ‘అగ్నిపుత్రుడు’ (1987). కాలగతిలో డి.టి.ఎస్, డాల్బీ, డిజిటల్ లాంటి టెక్నాలజీలు వచ్చేయడంతో, 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ అనేదే ప్రధాన ఆకర్షణ అయిన 70 ఎం.ఎం సినిమాలు రావడం మన దగ్గర ఆగిపోయింది. అయితేనేం... తెలుగుతెరపై సాహసం.. సాంకేతిక ప్రయోగం రీత్యా ‘సింహాసనం’ ఇప్పటికీ ఓ సంచలనమే! చిరస్మరణీయమే!
బప్పీ లహరి బాణీల మేనియా
హిందీలో ‘డిస్కో డ్యాన్సర్’ (1982) బాణీలతో దేశాన్ని ఊపేసిన బప్పీలహరికి తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇదే తొలి చిత్రం. పద్మాలయాకు హిందీలో అప్పట్లో ఆయనే పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ‘ఆకాశంలో...’ బదులు ‘ఆకాసంలో...’ లాంటి అపశబ్దో చ్చారణ జరిగినా, ముప్పావు నిమిషం పైగా సుదీర్ఘమైన బి.జి.ఎంలే వినిపించినా, శ్రావ్యత కన్నా శబ్దం ఎక్కువైనా సరే – జనం బప్పీలహరి సంగీతం మాయలో పడిపోయారు. అప్పట్లో ఆ పాటలు, వాటి బి.జి.ఎంలు మారుమోగని ఊరు లేదు.
శ్రీదేవి బదులు మందాకిని!
ఈ భారీ సాహసం కోసం భారీ తారాగణాన్నే ఎంచుకున్నారు. రెండు వెర్షన్లలో హీరోలు వేరైనా, హీరోయిన్లు జయప్రద, రాధ, మందాకిని, అలాగే వహీదా రెహమాన్ కామన్. అప్పటికే రాజ్‌కపూర్ ‘రామ్ తేరీ గంగా మెయిలీ’లో అందాలు ఆరబోసి, జనాన్ని ఆకర్షించిన నీలికళ్ళ సుందరి మందాకినిని కూడా తెలుగుకు తీసుకువచ్చారు. ‘‘ఆ పాత్రను శ్రీదేవితో చేయిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాం. అప్పటికే, కృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ చాలా సినిమాలతో పాపులర్. అయితే, ఫ్రెష్‌గా ఉంటుందని, హిందీలో అప్పుడు సరికొత్త హాట్ మందాకినిని తీసుకున్నాం’’ అని కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు వివరించారు.
కృష్ణ, మందాకిని
హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డ్!
సెవన్టీ ఎం.ఎం ప్రింట్లు ఆడిన అరడజను కేంద్రాలలోని సైడ్ థియేటర్లతో సహా, మిగతా అన్ని కేంద్రాలలో సర్వసాధారణమైన 35 ఎం.ఎం. ప్రింట్లతోనే ‘సింహాసనం’ ప్రదర్శితమైంది. అయితేనేం, సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిలో, ఆదరణలో మార్పు లేదు. అభిమానులేమో రికార్డులపై మోజు వీడలేదు. ఏకంగా 116 రోజులు ప్రదర్శితమైన వైజాగ్ ‘చిత్రాలయా’ లాంటి చోట్ల, సరిగ్గా ఆఖరు రోజుకు ముందు రోజు దాకా హాలు బయట హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. ‘‘మొదటివారమే ఆంధ్రప్రదేశ్, బెంగుళూరు కలిపి ఏకంగా రూ. 1.51 కోట్ల పైగా వసూలు చేసి, అప్పటికి హయ్యస్ట్ ఓపెనింగ్ గా ‘సింహాసనం’ బాక్సాఫీస్ చరిత్ర’’ సృష్టించింది.
మొదటి 70 ఎం.ఎం ‘షోలే’ కాదు!
తెలుగులో తొలి 70 ఎం.ఎం. ‘సింహాసనం’ చిత్రమనే మాట సరే! కానీ, దేశంలోనే ఫస్ట్ సిన్మా ఏమిటి? చాలా మంది ‘షోలే’ అనుకుంటారు. కానీ, ‘షోలే’ కన్నా ముందే వచ్చిన రాజ్‌కపూర్, రాజశ్రీ ‘ఎరౌండ్ ది వరల్డ్’ (1967) మన దేశంలోనే ఫస్ట్ 70ఎం.ఎం చిత్రం. రెండోచిత్రంగా ‘షోలే’ (1975) 70 ఎం.ఎం సిక్స్‌ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో అలరించింది. తర్వాత హిందీలో ‘షాన్’ (’80), అమితాబ్ ‘మహాన్’ (’83) లాంటి సక్సెస్‌లు వచ్చాయి.
దక్షిణాదిలో తొలిసారిగా మలయాళంలో ‘పడయోట్ట మ్’ (’82)వచ్చింది. తర్వాత నాలుగేళ్ళకు కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎంగా ‘సింహాసనం’ (’86) అందించారు. ‘సింహాసనం’ చిత్రాన్ని తమిళంలో ‘సిమ్మాసన్’ పేరిట పద్మాలయా వారే అనువదించి, రిలీజ్ చేశారు. కాగా, అదే ఏడాది తమిళంలోనూ ‘తొలి తమిళ 70 ఎం.ఎం’ రజనీకాంత్ హీరోగా ‘మావీరన్’ (1986 నవంబర్ 1) వచ్చింది. ఈ తొలి తమిళ 70 ఎం.ఎం.నూ పద్మాలయా వారే నిర్మించడం విశేషం.
సెట్స్‌లో దర్శకుడిగా సూపర్‌స్టార్ కృష్ణ, జితేంద్ర హిందీ ‘సింఘాసన్’
– రెంటాల జయదేవ
∙
‘సింహాసనం’కోసం కృష్ణ ఎన్నో సాహసాలు.. ప్రతీది సంచలనమే
Published Sun, Mar 21 2021 12:28 AM | Last Updated on Tue, Nov 15 2022 4:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment