jayapradha
-
హీరోయిన్ అవ్వాలంటే అవి తప్పవు.. అన్‌స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ రెండో సీజన్ టాలీవుడ్ సెలబ్రిటీలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. తాజాగా ఈ సీజన్లో మరో ముగ్గురు హీరోయిన్లను తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా పాల్గొననుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. వీరితో కలిసి బాలయ్య సందడి చేయగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 23న ఫుల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి వేశారు. రాశి ఖన్నాని పొగుడుతూ అలరించాడు. రాశి ఖన్నా తాను నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాలోని పాటతో అలరించింది. ఈ ప్రోమోలో జయప్రద, జయసుధపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. ప్రస్తుతం నేను, శృతి ఆంధ్రప్రదేశ్‌లో హాట్ పెయిర్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. -
నటి జయప్రదకు షాక్, మాజీ ఎంపీపై నాన్ బెయిలబుల్ వారెంట్
సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రత్యేక కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులకు సంబంధించి ఆమెకు వారెంట్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్నాథ్ తివారీ తెలిపారు. వివరాలు.. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియయావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై వేర్వేరుగా రెండు కేసు నమోదయ్యాయి. చదవండి: తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్ రేవంత్, వీడియో వైరల్ ఈ కేసుల విచారణ సమయంలో జయప్రద వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడం కోర్టు ఆమె తీరుపై ఆగ్రం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే జయప్రదపై తాజాగా రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అంతేకాదు వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదని కోర్టులో హజరుపరచాలని రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోర్టు ఆదేశించినట్లు న్యాయవాది అమర్నాథ్ తెలిపారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచిన విజయ్.. తలైవాను అధిగమించాడా? కాగా 2019 ఏప్రిల్ 18న పిపారియా మిశ్రా గ్రామలో జరిగిన ఓ బహిరంగ సభకు సంబంధించి వీడియో నిఘా బృందం ఇన్ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. అలానే.. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో 2019 ఏప్రిల్ 19న ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ జయప్రద మీద మరో కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
‘సింహాసనం’కోసం కృష్ణ ఎన్నో సాహసాలు.. ప్రతీది సంచలనమే
జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్ లాంటి ప్రయోగాలతో అలరించిన హీరో కృష్ణ తొలిసారి దర్శకుడై చేసిన మరో సాహసం ‘సింహాసనం’. తెలుగులో తొలి 70 ఎం.ఎం–6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ చిత్రంగా అది ఆ రోజుల్లో ఓ సంచలనం. అది 1983. ఎన్టీఆర్ సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి వెళ్ళారు. ఎన్టీఆర్ వదిలి వెళ్ళిన నంబర్ 1 స్థానం కోసం అగ్ర హీరోల నుంచి యువ తారల దాకా అందరూ పోటీలోకి దిగారు. 1983లోనే నవంబర్‌లో కృష్ణ సొంత స్టూడియో పద్మాలయా ప్రారంభమైంది. నటుడిగా తెలుగులోనూ, నిర్మాతగా హిందీలోనూ కృష్ణ బిజీ. అయితే, ఒకపక్క సొంత స్టూడియోకు పని కల్పిస్తూనే, ఏదైనా సాహసం చేసి, సంస్థ జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడించాలి. సరిగ్గా అప్పుడే కృష్ణ హిందీలో ‘పాతాళ్ భైరవి’ (1985 మే 3) రీమేక్‌తో ఓ జానపద ప్రయోగం తీశారు. హిట్. అంతే, పద్మాలయాకూ, దర్శకుడిగా తనకూ ప్రతిష్ఠాత్మకంగా భారీ సెట్స్‌తో జానపద సినిమా, అదీ ఫస్ట్ టైమ్ 70 ఎం.ఎంలో తీస్తే? ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే ‘సింహాసనం’. రెండు రాజ్యాల పోరాటకథగా... జానపదాలు కనుమరుగైపోయిన రోజుల్లో, కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ సాహసం వర్కౌట్ అవ్వాలంటే, హిందీలోనూ తీయాలని తీర్మానించుకున్నారు. తెలుగులో ‘సింహాసనం’, హిందీలో జితేంద్ర హీరోగా ‘సింఘాసన్’ పట్టాలెక్కాయి. మంచికీ – చెడుకీ సంఘర్షణగా ఈ చిత్రం తీశారు. సింహాసనం కోసం దశార్ణ రాజ్యానికీ, అవంతీ రాజ్యానికీ మధ్య పోరాటం ఈ చిత్రకథ. చరిత్ర కలగలిపిన జానపదం టైటిల్స్‌లో కథకు క్రెడిట్ కృష్ణదే అయినా, ఆయన ఆస్థాన రచయిత త్రిపురనేని మహారథిదే రచనలో కీలకపాత్ర. కాకతీయ సామ్రాజ్యం – రాణీ రుద్రమదేవి – ఆపత్కాలంలో ఆమెకు సాయపడే గోన గన్నారెడ్డి... ఈ ప్రసిద్ధ చారిత్రక పాత్రల ఆధారంగా రాణి అలకనందాదేవి (జయప్రద), ఆమెను కాపాడే సేనాధిపతి విక్రమసింహుడి (కృçష్ణ) పాత్రలు సృష్టించారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ప్రయోగం జరిగినట్టు చరిత్ర. ఆ స్ఫూర్తితో చందనగంధి పాత్ర (మందాకిని) రాశారు. భారీ రాజదర్బారు... విగ్రహాలు... రెండు రాజ్యాల మధ్య జరిగే ఈ జానపద కథలో సహజత్వం కోసం కళాదర్శకుడు భాస్కరరాజు లక్షల ఖర్చుతో భారీ సెట్లు వేశారు. గమ్మత్తేమిటంటే, ఈ రాజుల కాలం కథలో కీలకమైన కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆయనే! ఆయన వేసిన ఆరుబయట రాజ దర్బార్ సెట్టు, భారీ విగ్రహాలు... చాలా కాలం స్టూడియోలో పలకరిస్తుండేవి. రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టే ముందు రామోజీరావుకు సైతం ఆ విగ్రహాల తయారీ గురించి ‘పద్మాలయా’ హనుమంతరావు వివరించారట. కొత్త సింగర్... పాటలు సూపర్‌హిట్ ‘సింహాసనం’లో కృష్ణ చేసిన మరో సాహసం – రాజ్ సీతారామ్ గానం. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు ఓ వివాదం తలెత్తింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ రాజ్ సీతారామ్ గొంతు బాగుందనిపించింది. అంతే... కృష్ణ తన ‘సూర్య చంద్ర’ (1985)లో అన్ని పాటలూ అతనితోనే పాడించారు. ‘సింహా సనం’ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి ఆ గొంతుకే ఓటేశారు. ‘ఆకాశంలో ఒక తార’, ‘వహవ్వా నీ యవ్వనం’, ‘ఇది కలయని నేననుకోనా’– ఇలా ఆత్రేయ, వేటూరి పాటలన్నీ హిట్. రాజ్‌సీతారామ్ పేరు మోతమోగింది. తీసేది 65 ఎం.ఎం! వేసేది 70 ఎం.ఎం!! నిజం చెప్పాలంటే, అప్పట్లో ఈ చిత్రాలేవీ సిసలైన 70 ఎం.ఎం కెమేరాతో తీసినవి కావు. ఆ కెమేరాలు 35 ఎం.ఎం కన్నా రెట్టింపు రిజల్యూషన్ ఉండే పెద్ద కెమేరాలు. అప్పటికి మన దేశంలో ఆ కెమేరాలూ లేవు. అందుకే అందరూ స్కోపులో, 65 ఎం.ఎం నెగటివ్ స్టాక్ మీద సినిమా షూట్ చేసుకొని, దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేయించి, 70 ఎం.ఎం ఫిల్ము మీద ప్రింట్ చేసేవారు. షూట్ చేసిన 65 ఎం.ఎం పోగా, మిగతా 5 ఎం.ఎం ఫిల్మేమో ‘సౌండ్ ట్రాక్’ కోసమన్న మాట. మామూలు 35 ఎం.ఎం రీలుపై గీతలా సింగిల్ సౌండ్ ట్రాక్ ఉంటుంది. కానీ, 70 ఎం.ఎం రీలుపై మేగ్నటిక్ కోటింగ్‌లో సౌండ్‌ను ఆరు ట్రాక్‌లుగా, ఆరుసార్లు ముద్రించాల్సి ఉంటుంది. అందుకే, ‘6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ అంటారన్న మాట. అందరిలానే తెలుగు ‘సింహాసనం’ సైతం ఆ టెక్నిక్‌లో 65ఎం.ఎంలో తీసి, 70 ఎం.ఎంకి బ్లోఅప్ చేసినదే! ‘‘ఫేమస్ ‘షోలే’తో సహా మన దేశంలో తీసిన 70 ఎం.ఎంలన్నీ దాదాపు ఇలా తీసినవే. 35 ఎం.ఎంకి ఒక రకంగా, 70 ఎం.ఎంకి మరో రకంగా కెమేరాలో మార్కింగ్ ఉంటుంది. 35 ఎం.ఎంలో బొమ్మ ఎత్తుంటుంది. నలుచదరంగా ఉంటుంది. 70 ఎం.ఎంలోనూ బొమ్మ ఎత్తు అంతే కానీ, వెడల్పు రెట్టింపు ఉంటుంది. 70 ఎం.ఎం సినిమా తీయాలంటే కెమేరాలో గేట్ మారుస్తారు. ఒక్క 70 ఎం.ఎంలోనే సినిమా తీస్తే సులభమే కానీ, మన దగ్గర అన్ని థియేటర్లుండవు కాబట్టి, అత్యధిక చోట్ల 35 ఎం.ఎం ప్రింట్లే ప్రదర్శించాల్సి వస్తుంది. అంటే, సినిమా తీస్తున్నప్పుడే బొమ్మ కట్ కాకుండా 35 ఎం.ఎం ప్రింట్‌కీ, 70 ఎం.ఎం ప్రింట్‌కీ తగ్గట్టు జాగ్రత్తగా కెమేరా ఫ్రేమింగ్ పెట్టాలి’’ అని ‘సింహాసనం’కి పనిచేసిన నేటి ప్రముఖ దర్శకుడు తేజ వివరించారు. స్వామి కెమేరా! నగాయిచ్ ట్రిక్స్ ‘సింహాసనం’ ఛాయాగ్రహణమంతా వి.ఎస్.ఆర్. స్వామి పనితనమే. కాగా, ఆయనకు కెమేరా గురువైన రవికాంత్ నగాయిచ్ ఈ ‘సింహాసనం’కి ట్రిక్ ఫోటోగ్రఫీ చేశారు. నగాయిచ్ దగ్గర అసిస్టెంట్‌గా తేజ పనిచేశారు. ‘‘‘ఆకాశంలో ఒక తార...’ పాటలో బృందావన్ గార్డెన్స్‌లోనే ఓ ప్యాలెస్ ఉన్నట్టు చూపించడం లాంటివి ట్రిక్షాట్లే. అందుకోసం ప్యాలెస్ మినియేచర్ సెట్ తీసుకెళ్ళాం. అక్కడ షూటింగ్ చేశాక, 6 బస్సుల్లో డ్యాన్సర్లందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి, ఇక్కడ షూట్ సాగించాం’’ అని తేజ చెప్పారు. ఏడెనిమిది రెట్లు ఎక్కువ బడ్జెట్! ఒక షాట్‌ను తెలుగులో తీసి, వెంటనే అదే సెటప్‌లో హిందీ ‘సింఘాసన్’ చిత్రీకరించేవారు. 65 రోజుల్లో రెండు వెర్షన్లూ పూర్తి చేశారు. 40 – 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజ్లో భారీగా జరిగింది. తెలుగులో... ఆ ప్రింట్లు ఆరే ఆరు! షూటింగే కాదు... ‘సింహాసనం’ పబ్లిసిటీ, ప్రింట్ల రిలీజు కూడా ఆ రోజుల్లో భారీగా సాగింది. తెలుగు వెర్షన్ సుమారుగా 86 ప్రింట్లతో, 150కి పైగా థియేటర్లలో రిలీజవడం మరో సంచలనం. ఇక హిందీ వెర్షన్‌కు 120 – 130 ప్రింట్లు తీశారు. అప్పట్లో మామూలు 35 ఎం.ఎం ప్రింట్ తీయడానికి రూ. 30 – 40 వేల దాకా అయ్యేది. అదే 70 ఎం.ఎం ప్రింట్ తీయాలంటే, లక్షా అరవై వేలయ్యేది. పైపెచ్చు, దానికి కావాల్సిన పాజిటివ్ ఫిల్ము కోసం మూడు నెలల ముందుగానే చెప్పి, విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇక, ల్యాబ్‌లో 70 ఎం.ఎం ప్రింట్ డెవలప్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు రోలర్స్ మార్చాలి. ఆ ప్రింట్లు తీస్తున్నప్పుడు వేరేవి ప్రింట్ చేయలేరు. అందుకే 70 ఎం.ఎం ప్రింట్లకు ఎక్కువ ఛార్జ్ వసూలు చేసేవారు. ఆ ప్రింట్‌ను హాలులో వేయాలన్నా మామూలు ప్రొజెక్టర్‌కు ఉండే రోలర్లు, దానికి ఉండే లెన్సులు మార్చాలి. వెనకాల ఉండే ఆర్క్ లైట్‌ను బ్రైట్ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో ఇలా ‘70 ఎం.ఎం – 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ సినిమాలు ప్రదర్శించేందుకు తగిన సాంకేతిక సదుపాయాలున్న హాళ్ళూ తెలుగునాట తక్కువే! గుంటూరు, నెల్లూరు లాంటి చోట్ల ‘సింహాసనం’ 70 ఎం.ఎం ప్రదర్శన కోసం అదనంగా ఖర్చు పెట్టి, హాళ్ళను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల మధ్య ‘సింహాసనం’ చిత్రం రిలీజు కోసం ఆరు 70 ఎం.ఎం. ప్రింట్లు వేశారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని, విజయవాడ (రాజ్), గుంటూరు (మంగా డీలక్స్), విశాఖపట్నం (చిత్రాలయా), నెల్లూరు (అర్చన), కాకినాడ (దేవి), హైదరాబాద్ (దేవి) – ఈ 6 కేంద్రాలలో 70 ఎం.ఎం ప్రింట్లు వేశారు. అందులో 68 రోజులకే సినిమా మారిన ఒక్క నెల్లూరు మినహా మిగతా 5 కేంద్రాలలోనూ, అలాగే రాజమండ్రిలో 35ఎం.ఎం ప్రింట్‌తో (స్వామి టాకీస్‌లో)నూ మొత్తం 6 కేంద్రాలలో ‘సింహాసనం’ డైరెక్ట్ శతదినోత్సవం చేసుకుంది. పోస్టర్ పబ్లిసిటీలో... 24 షీట్ ట్రెండ్! సినిమాలానే ‘సింహాసనం’ పబ్లిసిటీ కూడా భారీగా సాగింది. అప్పట్లో తెలు గులో కేవలం 4 షీట్, 6 షీట్, 9 షీట్ వాల్ పోస్టర్లే ఉండేవి. కానీ, ‘సింహాసనం’ కోసం తెలుగులో తొలిసారిగా 24 షీట్ వాల్ పోస్టర్లు సిద్ధం చేయించారు ‘పద్మాలయా’ హనుమంతరావు. అందరినీ ఆకర్షించిన ఆ 24 షీట్ పోస్టర్ల విధానం అప్పటి నుంచి తెలుగు సినిమా పబ్లిసి టీలో ఓ ట్రెండైంది! అలాగే, సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో ‘సింహాసనం’ రిలీజుకు ముందు అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగులు, బెంజ్ సర్కిల్ సెంటర్ దగ్గర 75 అడుగుల చొప్పున హీరో కృష్ణ భారీ ప్లైవుడ్ కటౌట్లు పెట్టారు. అప్పట్లో ఆ పబ్లిసిటీ ఆకర్షణ టాక్ ఆఫ్ ది టౌన్! రాజకీయ ప్రత్యర్థి ఎన్టీఆర్‌పై విసుర్లు అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హీరో కృçష్ణ సహజంగానే ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద ‘సింహాస నం’లో కొన్ని విసుర్లు కూడా పెట్టారు. ‘‘థియేటర్లలో ఆ డైలాగ్స్‌కు స్పందన లభించింది. దాంతో ఎన్టీఆర్‌పై జనంలో వ్యతిరేకత మొదలైందనే అంచనాతో మేము ‘నా పిలుపే ప్రభంజనం’, తర్వాత ‘సాహసమే నా ఊపిరి’ తీశాం’’ అని ‘పద్మాలయా’ ఆదిశేషగిరిరావు గుర్తుచేసుకున్నారు. సముద్రపుటొడ్డున... అభిమాన జనసముద్రం మధ్యన... 1986 జూలై 12న మద్రాసులో సముద్రపుటొడ్డున వి.జి.పి. గార్డెన్స్‌లో వందలకొద్దీ బస్సులు, కార్లు, వ్యాన్లలో తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది అభిమానుల మధ్య ‘సింహాసనం’ వందరోజుల వేడుక సాగింది. ఆ తరువాత... ఆ సినిమాలు అరుదే! వాస్తవానికి, ‘సింహాసనం’ కన్నా ముందు తెలుగులో ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’, ‘సింహాసనం’ రిలీజైన తరువాత చిరంజీవి ‘కొండవీటి దొంగ’ లాంటి చిత్రాలు కూడా 70 ఎం.ఎం.లో తీసే ప్రయత్నాలు జరిగాయి. కారణాలేమైనా, వాటిని చివరకు ఆ టెక్నిక్‌లో తీయలేదు. ‘సింహాసనం’కే ఆ క్రెడిట్ దక్కింది. తెలుగులో వచ్చిన రెండో 70 ఎం.ఎం – ఏయన్నార్, నాగార్జున ‘అగ్నిపుత్రుడు’ (1987). కాలగతిలో డి.టి.ఎస్, డాల్బీ, డిజిటల్ లాంటి టెక్నాలజీలు వచ్చేయడంతో, 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ అనేదే ప్రధాన ఆకర్షణ అయిన 70 ఎం.ఎం సినిమాలు రావడం మన దగ్గర ఆగిపోయింది. అయితేనేం... తెలుగుతెరపై సాహసం.. సాంకేతిక ప్రయోగం రీత్యా ‘సింహాసనం’ ఇప్పటికీ ఓ సంచలనమే! చిరస్మరణీయమే! బప్పీ లహరి బాణీల మేనియా హిందీలో ‘డిస్కో డ్యాన్సర్’ (1982) బాణీలతో దేశాన్ని ఊపేసిన బప్పీలహరికి తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇదే తొలి చిత్రం. పద్మాలయాకు హిందీలో అప్పట్లో ఆయనే పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ‘ఆకాశంలో...’ బదులు ‘ఆకాసంలో...’ లాంటి అపశబ్దో చ్చారణ జరిగినా, ముప్పావు నిమిషం పైగా సుదీర్ఘమైన బి.జి.ఎంలే వినిపించినా, శ్రావ్యత కన్నా శబ్దం ఎక్కువైనా సరే – జనం బప్పీలహరి సంగీతం మాయలో పడిపోయారు. అప్పట్లో ఆ పాటలు, వాటి బి.జి.ఎంలు మారుమోగని ఊరు లేదు. శ్రీదేవి బదులు మందాకిని! ఈ భారీ సాహసం కోసం భారీ తారాగణాన్నే ఎంచుకున్నారు. రెండు వెర్షన్లలో హీరోలు వేరైనా, హీరోయిన్లు జయప్రద, రాధ, మందాకిని, అలాగే వహీదా రెహమాన్ కామన్. అప్పటికే రాజ్‌కపూర్ ‘రామ్ తేరీ గంగా మెయిలీ’లో అందాలు ఆరబోసి, జనాన్ని ఆకర్షించిన నీలికళ్ళ సుందరి మందాకినిని కూడా తెలుగుకు తీసుకువచ్చారు. ‘‘ఆ పాత్రను శ్రీదేవితో చేయిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాం. అప్పటికే, కృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ చాలా సినిమాలతో పాపులర్. అయితే, ఫ్రెష్‌గా ఉంటుందని, హిందీలో అప్పుడు సరికొత్త హాట్ మందాకినిని తీసుకున్నాం’’ అని కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు వివరించారు. కృష్ణ, మందాకిని హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డ్! సెవన్టీ ఎం.ఎం ప్రింట్లు ఆడిన అరడజను కేంద్రాలలోని సైడ్ థియేటర్లతో సహా, మిగతా అన్ని కేంద్రాలలో సర్వసాధారణమైన 35 ఎం.ఎం. ప్రింట్లతోనే ‘సింహాసనం’ ప్రదర్శితమైంది. అయితేనేం, సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిలో, ఆదరణలో మార్పు లేదు. అభిమానులేమో రికార్డులపై మోజు వీడలేదు. ఏకంగా 116 రోజులు ప్రదర్శితమైన వైజాగ్ ‘చిత్రాలయా’ లాంటి చోట్ల, సరిగ్గా ఆఖరు రోజుకు ముందు రోజు దాకా హాలు బయట హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. ‘‘మొదటివారమే ఆంధ్రప్రదేశ్, బెంగుళూరు కలిపి ఏకంగా రూ. 1.51 కోట్ల పైగా వసూలు చేసి, అప్పటికి హయ్యస్ట్ ఓపెనింగ్ గా ‘సింహాసనం’ బాక్సాఫీస్ చరిత్ర’’ సృష్టించింది. మొదటి 70 ఎం.ఎం ‘షోలే’ కాదు! తెలుగులో తొలి 70 ఎం.ఎం. ‘సింహాసనం’ చిత్రమనే మాట సరే! కానీ, దేశంలోనే ఫస్ట్ సిన్మా ఏమిటి? చాలా మంది ‘షోలే’ అనుకుంటారు. కానీ, ‘షోలే’ కన్నా ముందే వచ్చిన రాజ్‌కపూర్, రాజశ్రీ ‘ఎరౌండ్ ది వరల్డ్’ (1967) మన దేశంలోనే ఫస్ట్ 70ఎం.ఎం చిత్రం. రెండోచిత్రంగా ‘షోలే’ (1975) 70 ఎం.ఎం సిక్స్‌ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో అలరించింది. తర్వాత హిందీలో ‘షాన్’ (’80), అమితాబ్ ‘మహాన్’ (’83) లాంటి సక్సెస్‌లు వచ్చాయి. దక్షిణాదిలో తొలిసారిగా మలయాళంలో ‘పడయోట్ట మ్’ (’82)వచ్చింది. తర్వాత నాలుగేళ్ళకు కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎంగా ‘సింహాసనం’ (’86) అందించారు. ‘సింహాసనం’ చిత్రాన్ని తమిళంలో ‘సిమ్మాసన్’ పేరిట పద్మాలయా వారే అనువదించి, రిలీజ్ చేశారు. కాగా, అదే ఏడాది తమిళంలోనూ ‘తొలి తమిళ 70 ఎం.ఎం’ రజనీకాంత్ హీరోగా ‘మావీరన్’ (1986 నవంబర్ 1) వచ్చింది. ఈ తొలి తమిళ 70 ఎం.ఎం.నూ పద్మాలయా వారే నిర్మించడం విశేషం. సెట్స్‌లో దర్శకుడిగా సూపర్‌స్టార్ కృష్ణ, జితేంద్ర హిందీ ‘సింఘాసన్’ – రెంటాల జయదేవ ∙ -
ఆ మైనస్సులే నాకు ప్లస్సులు
ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద బయోపిక్ కూడా తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి జయప్రద మాట్లాడుతూ –‘‘నా జీవితంలో నేను చాలా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఈ విషయాలన్నింటినీ చెబుతూ నా బయోగ్రఫీ రాయాలనుకుంటున్నాను. ఆ తర్వాత నా బయోపిక్‌ను తెరకెక్కించే ఆలోచన కూడా ఉంది. ఇందులో నేనే నటించవచ్చు కూడా. అంకితభావం, పట్టుదల, మొండితనం.. ఈ మూడు లక్షణాలు స్త్రీకి ఉండకూడదంటారు. మైనస్ అంటారు. నాలో ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి. అవి నాకు ప్లస్సే కానీ మైనస్‌గా భావించడంలేదు. ఎందుకంటే ఈ మూడు లక్షణాలూ నన్ను స్ట్రాంగ్ ఉమెన్‌ని చేశాయి. వీటిని నాకు ప్రసాదించిన ఆ దేవుడికి ధన్యవాదాలు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ –‘‘ఇటీవలే ఓ మారాఠీ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అలాగే ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేశాను. మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను’’ అన్నారు జయప్రద. -
మళ్లీ శాకాహారం
వృత్తిని దైవంగా భావిస్తామని చాలామంది నటీనటులు చెబుతుంటారు. మరి.. దేవత, దేవుడు పాత్రలు చేసే అవకాశం వస్తే.. ఎంతో నిష్టగా ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. జయప్రద, రమ్యకృష్ణ, రోజా వంటివారు భక్తిరసాత్మక చిత్రాల్లో నటించేటప్పుడు చాలా నియమాలు పాటించేవారు. ‘అన్నమయ్య, నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించేటప్పుడు నాగార్జునతో సహా ఆ చిత్రబృందం షూటింగ్ పరిసరాల్లో పాదరక్షలు వాడలేదు. ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర చేసినప్పుడు నయనతార శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు ‘మూక్కుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రం పూర్తయ్యేవరకూ ఈ బ్యూటీ మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో నయన మామూలు అమ్మాయిగా కనిపించడంతో పాటు అమ్మవారిలా కూడా కనిపిస్తారట. అమ్మవారి పాత్ర చేసేటప్పుడు ఒకపూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారని చిత్రబృందం పేర్కొంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా మారిన బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో బాలాజీ సరసన నయనతార నటించడం లేదు. ఆమెది సినిమాకి కీలకంగా నిలిచే పాత్ర. కన్యాకుమారి అమ్మవారిని ‘మూక్కుత్తి అమ్మన్’ అని పిలుస్తారు. అందుకని కన్యాకుమారి వెళ్లి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అమ్మవారి గుడిలో జరపాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
దసరా అంటే శక్తికి ఉత్సవం. చెడును సంహరించిన మంచి శక్తి. చీకటిని చీల్చిన వెలుగు శక్తి. భావోద్వేగాలను జయించిన నిగ్రహ శక్తి. తనను తాను నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసపు శక్తి! అంటే శక్తికి ఆయుధం ఆత్మవిశ్వాసమే.. దసరా సందేశమూ అదే.. స్త్రీకి ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలని!! అలాంటి కథానాయికలను పరిచయం చేసిన కొన్ని సినిమాలు, ఆ శక్తి స్వరూపిణుల గురించి... ‘ఆయుధ పూజ’ సందర్భంగా..! అమ్మ కడుపులోంచే ఆడపిల్ల వినమ్రత, అణకువ, త్యాగం అనే పర్యాయ పదాలను జన్మనామాలుగా స్థిరపర్చుకొని ఈ భూమ్మీద పడ్తుంది. వీటన్నిటినీ ‘పరాధీన’ అనే ఒక్క ట్యాగ్‌తో కుదించేయొచ్చు. ఈ ఒక్క ఎలిమెంట్‌తో టన్నుల కొద్దీ సెంటిమెంట్‌ను పండించి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు నాడు.. నేటికి కూడా! ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ అమ్మ, భార్య, అక్క, చెల్లికి కుటుంబం తప్ప ఇంకో ప్రపంచం ఉండకూడదు.. కుటుంబ సేవలో గంధం చెక్కలా అరిగి తరించాలనే సందేశాన్నీ నూరిపోశాయి. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని అహంకారిగా చూపించాయి. సరిగ్గా అలాంటి సమయాల్లోనే ఆ మూస రీళ్లను పెట్టెలో అట్టిపెట్టే కొన్ని భిన్నమైన చిత్రాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు ఆత్మగౌరవం అని చాటే సినిమాలు. వాటిల్లో ముఖ్యమైనవి అంతులేని కథ, ఇది కథ కాదు, న్యాయం కావాలి, 47 రోజులు, కోకిలమ్మ, తలంబ్రాలు. పనికి గౌరవం గంపెడు సంతానాన్ని కని.. పోషించలేక భయంతో తండ్రి పారిపోతే , వ్యసనాలకు బానిసైన అన్న బాధ్యత మరిచిపోతే.. వారి స్థానాన్ని భర్తీ చేసి ఆ ఇంటికి పెద్దగా మారి కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంటుంది ఆత్మాభిమానం గల కూతురు సరిత.. అంతులేని కథ సినిమాలో. ఆ ఇంట్లో తనకంటూ ఓ ప్రత్యేక గది, ప్రత్యేక హోదాను ఏర్పాటు చేసుకున్న సరిత ఇంట్లో వాళ్లందరికీ అహంకారిగా కనిపిస్తూంటుంది. కాని ప్రేక్షకులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూస్తారు. కుటుంబానికి ఆర్థిక వనరుగా ఉన్న పురుషుడికి ఎలాంటి హోదానిస్తారో స్త్రీకి అలాంటి హోదానే ఇవ్వాలి అని చాటిన సినిమా. అందుకే సరిత ఓ పురుషుడిలా తనకు ఓ ప్రత్యేక గదిని, హోదాను తీసుకుంటుంది. ఆర్థిక స్వాతంత్య్రం అంటే వేణ్ణీళ్లకు చన్నీళ్లే కాదు ఇంటిని నడిపించే దిక్కు అని చెప్తుంది. ‘పని నీది ఏటీఎమ్ కార్డ్ నాది’ అనే పురుష భావనకు చెక్ పెడ్తుంది. ఆత్మగౌరవంతో ఇల్లు దాటి ఆత్మవిశ్వాసంతో బయటి ప్రపంచాన్ని నెగ్గుకొచ్చిన తీరును చూపిస్తుంది. శక్తికి ప్రతీకగా నిలబెడుతుంది. ‘అంతులేని కథ’ దర్శకుడు కె. బాలచందర్. సరితగా జయప్రద, వ్యసనపరుడైన అన్న మూర్తిగా రజనీకాంత్ నటించారు. సింగిల్ మదర్ పెళ్లికి ముందు ప్రేమ.. ఏవో కారణాల వల్ల పెళ్లిదాకా రాదు. పెద్దలు కుదిర్చిన వరుడు సుగుణాకర్ రావుతో మూడుముళ్లు వేయించుకుంటుంది సుహాసిని (జయసుధ). మూణ్ణాళ్లలోనే అతనొక శాడిస్ట్ అని రుజువవుతుంది. అప్పటికే ఓ బిడ్డ పుడ్తాడు. ఇక భరించలేక విడాకులు తీసుకొని ఒంటరి తల్లిగా కొత్త జీవితం మొదలుపెడ్తుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా! తోడుగా ఆమె అత్తగారూ వస్తుంది. కోడలిని మరో పెళ్లి చేసుకొమ్మని ప్రోత్సహిస్తుంది. సుహాసిని ఆ ప్రయత్నంలో ఉండగా మారిపోయి మంచి మనిషి అయినట్టు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు సుగుణాకర్‌రావు కేవలం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే. తర్వాత ఆ విషయం అర్థమైన సుహాసిని మళ్లీ పెళ్లి జోలికి వెళ్లకుండా బిడ్డను తీసుకొని ఆ ఊరు నుంచి వెళ్లిపోవడానికి రైలు ఎక్కుతుంది. వెంట అత్తగారూ వెళ్తుంది. కోడలి చంకలోంచి మనవడిని తన భుజమ్మీదికి తీసుకుంటుంది ఆమె బాధ్యతలో సాయపడ్డానికి. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడిని, మగ తోడు లేకుంటే మహిళకు జీవితం లేదు అన్న స్టేట్మెంట్ను వెక్కిరించిన సినిమా. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం తోడుంటే ఒంటరిగానే కాదు ఒంటరి తల్లిగా కూడా జీవనయానం చేయొచ్చు అని నిరూపించింది.. ‘ఇది కథ కాదు’. ఇవ్వాళ్టి ఎంతో మంది సింగిల్ మదర్స్‌కు స్ఫూర్తి. అత్తాకోడళ్ల అనుబంధాలకు ప్రేరణ. ‘ఇది కథ కాదు’ చిత్రం.. మహిళకు ఆత్మవిశ్వాసం అవసరాన్ని ప్రొజెక్ట్ చేసిన వాస్తవం. గుర్తింపుకోసం పోరాటం ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛ తీర్చుకొని, ఆమెను తల్లిని చేసి ఆ బిడ్డకు తనే తండ్రి అన్న రుజువేంటి అని ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచిన అతని మీద పోరాటం చేసి విజయం సాధించిన ఆమె ఆత్మవిశ్వాసం కథే ‘న్యాయం కావాలి’. ఇక్కడ విజయం అంటే నయానో భయానో తప్పు ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకోవడం కాదు. ఆత్మవిశ్వాసంతో కోర్టులో నిలబడి అన్ని రకాల పురుషాహంకార పరీక్షలను తిప్పికొట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం. చేసిన తప్పుకి అతను కుంగిపోవడం. ఆమె నా బిడ్డకు తల్లే అని అతని మనసు ఘోష పెట్టడం. పశ్చాత్తాపంతో ఆమె గడప తొక్కి ‘నాకు భార్యగా నీ చేయి అందించు’ అని ఏడ్వడం. చిరునవ్వుతో ఆమె తిరస్కరించి ఆడపిల్ల గౌరవాన్ని కాపాడ్డం. పందొమ్మిది వందల ఎనభైల్లోనే వచ్చిన ఈ చైతన్యంలో ‘ఆమె’ భారతిగా రాధిక, ‘అతను’ సురేశ్‌గా చిరంజీవి నటించారు. దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి. ‘కొత్త మలుపు’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్. తర్వాత చాన్నాళ్లకు కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘తలంబ్రాలు’ సినిమాదీ ఇంచుమించు ఇలాంటి కథే. ప్రేమించి మోసపోతే ఏడుస్తూ కూర్చోక ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతుంది. అతనికి గుణపాఠం చెప్తుంది. జీవిత, రాజశేఖర్, నందమూరి కళ్యాణచక్రవర్తి నటించారు. పెళ్లే పరమావధి కాదు ‘47 రోజులు’ సినిమా లైన్ ఇది. వైశాలి ఓ పల్లెటూరి అమ్మాయి. ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్న కుమార్ ఏరికోరి ఆ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్ తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో పై పోర్షన్లో ల్యూసీ అనే ఒక అమ్మాయి ఉంటూంటుంది. ‘‘ఆమె ఎవరు?’’ అని అడిగిన వైశాలికి ‘‘ఫ్రెండ్’’ అని చెప్తాడు. తన వేలికి కుమార్ తొడిగిన వెడ్డింగ్ రింగ్‌ను సరిచేసుకుంటూ అతణ్ణి అడుగుతుంది ల్యూసి ‘‘ఆమె ఎవరు?’’ అని వైశాలిని ఉద్దేశించి. ‘‘నా పిచ్చి చెల్లెలు’’ అని చెప్తూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు కుమార్. ల్యూసీకి చెప్పినట్టుగా వైశాలినీ తన పిచ్చి చెల్లెలుగా నటింపచేయడానికి తనలోని శాడిస్ట్‌ను బయటకు తెస్తాడు కుమార్. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్రహింసకు గురిచేస్తాడు. ఈలోపే వైశాలి గర్భవతి అవుతుంది. బండారం ల్యూసీకి తెలియొద్దని నాటు పద్ధతిలో వైశాలికి అబార్షన్ చేయించాలనుకుంటాడు. అక్కడే ఉన్న తెలుగు డాక్టర్ శంకర్ సహాయంతో తప్పించుకుని బయటపడి ఇండియా చేరుకుంటుంది వైశాలి.ఆమె కథను సినిమాగా తీసే క్రమంలో వైశాలిని కలవడానికి వస్తుంది ఆ పాత్ర పోషించనున్న సరిత. ‘‘మళ్లీ పెళ్లెందుకు చేసుకోలేదు మీరు’’ అని ప్రశ్నిస్తుంది సరిత. ‘‘పెళ్లి తప్ప ఆడదాని జీవితానికి ఇంకో అర్థం లేదా?’’ అంటూ అరిచేస్తుంది వైశాలి. అదీ ఆమె ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. అంతేకాదు ఈ సినిమా బ్రేక్ చేసిన మరో మూస.. సెంటిమెంట్. మోసకారి, శాడిస్ట్ భర్తను కాదనుకున్నాక అతని బిడ్డనూ మోయడానికి ఇష్టపడదు ఆమె. మాతృత్వం అనే సోకాల్డ్ సెంట్మెంట్ను పక్కకునెట్టి అబార్షన్ చేయించుకుంటుంది. కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైశాలిగా జయప్రద, కుమార్‌గా చిరంజీవి నటించారు. వినిపించిన ఉనికి వినికిడి శక్తిలేని కోకిలమ్మ.. ఒక డొమెస్టిక్ వర్కర్. తనకున్నదాంట్లో పదిమందికి సహాయం చేయాలనుకునే అనాథ. ఆమె ఉంటున్న దిగువ మధ్యతరగతి వాడలోకి గాయకుడవ్వాలనుకునే యాంబీషియస్ కుర్రాడు అద్దెకు వస్తాడు. వినిపించకపోయినా అతని కంఠంలోని హెచ్చుతగ్గుల కదలికల స్పర్శతో అతని పాటకు మంచి విమర్శకురాలిగా మారుతుంది. ఆమె చెప్పినట్టే అతను మంచి గాయకుడవుతాడు. పేరు, డబ్బుకు తగ్గట్టు తన ప్రవర్తననూ మార్చుకుంటాడు. ఆ వాడ వదిలి కలవారింటి అల్లుడవుతాడు. కోకిలమ్మ మనసు గాయపడుతుంది. కన్నీళ్లు రానివ్వకుండా ఆ దుఃఖాన్ని జీవితాన్ని ఈదే శక్తిగా మలచుకుంటుంది. తన పక్కింట్లోనే ఉంటున్న ఓ అవిటి స్నేహితురాలు భర్తను పోగొట్టుకుంటే ఆమెకు అండగా నిలుస్తుంది. ఆ గాయకుడు తన భార్యతో వెళ్తున్న కారు మొరాయిస్తే చేతుల్లేని తన స్నేహితురాలి సహాయంతో ఆ కారుని తోసి అతణ్ణి ముందుకు నడిపించి తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని వినిపిస్తుంది. ఇవీ.. ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో స్త్రీని శక్తి స్వరూపిణిగా చూపించిన చిత్రాలు. సినిమారంగంలోని విద్యార్థులకు సిలబస్‌గా స్థిరపడ్డ విజువల్ పుస్తకాలు. – సరస్వతి రమ -
మా కష్టం తెరపై కనపడుతుంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, రామ్, ఇంద్ర ముఖ్య తారాగణంగా దర్శకుడు ఎం.ఎస్.ఎన్ సూర్య తెరకెక్కించిన చిత్రం ‘సువర్ణసుందరి’. చరిత్ర భవిష్యత్‌ని వెంటాడుతుంది అనేది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్లో ఇంద్ర పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసిన తర్వాత ఇంద్ర మాట్లాడుతూ– ‘‘టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. ఈ టీమ్‌తో మరో సినిమా చేయాలని ఉంది. దర్శక–నిర్మాతల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. దర్శకుడు సూర్య చాలా హార్డ్‌వర్క్ చేశారు’’ అన్నారు హీరో రామ్. ‘‘టీమ్ పడిన కష్టం తెరపై తెలుస్తుంది. ఇందులో నాది మంచి పాత్ర’’ అన్నారు పూర్ణ. ‘‘నా కెరీర్లో స్పెషల్ చిత్రం ఇది. గ్లామర్, యాక్షన్, లవ్, థ్రిల్ ఇలా అన్ని అంశాలను దర్శకుడు సూర్య హైలైట్‌గా తెరకెక్కించారు’’ అన్నారు హీరోయిన్ సాక్షి. ‘‘ఇది టెక్నీషియన్స్ చిత్రం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కథ డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీతో సినిమా చేశాం. దాదాపు 45 నిమిషాల గ్రాఫిక్ వర్క్ ఉండటంతో సినిమా విడుదల లేట్ అయింది’’ అన్నారు సూర్య. ‘‘నటీనటుల కష్టం, దర్శకుడు సూర్య టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం’’ అన్నారు సంగీతదర్శకుడు సాయి కార్తీక్. -
600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
ఆరువందల సంవత్సరాల క్రితం ఒక రాజు చేసిన తప్పిదం ఏంటి? దాని వల్ల తరతరాల వాళ్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అనేది ఉపశీర్షిక. జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధాన పాత్రల్లో ఎమ్.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, కన్నడలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ప్రొడ్యూసర్‌తో కాస్త ఎక్కువ ఖర్చుపెట్టించావని చాలామంది అన్నారు. కానీ, స్టోరీ అలా డిమాండ్ చేసింది. ‘అరుంధతి, మగధీర’ టైప్‌లో మా సినిమా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయింది. అవుట్ పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. కెమెరామేన్ ఈశ్వర్ ఎల్లు మహంతి, ఫైట్‌మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
సస్పెన్స్ సుందరి
జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అయితే సినిమా ఔట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే పాటలను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. పబ్లిసిటీ కూడా విభిన్నంగా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాంకేతికంగా అద్భుతంగా మా సినిమా నిర్మించాం. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం’’ అని లక్ష్మి అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోటా శ్రీనివాసరావు, ముక్తర్‌ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటì ంచిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీ్తక్, కెమెరా: ఎల్లుమహంతి. -
మూడు జన్మల థ్రిల్
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కొంతకాలంగా తెలుగులో స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. మా సినిమాలోనూ ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడాది పట్టింది’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాంకేతికంగా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్‌కు సిద్ధమైన మా చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత లక్ష్మీ అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
రాజకీయ చవటాయలు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘వెన్ దే గో లో, వియ్ గో హై’ అని మాజీ అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామా 2016లో జాతీయ ప్రజాస్వామిక సమ్మేళనంలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన నాటి వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకోవడంతోపాటు సోషల్ మీడియాను విపరీతంగా ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఆమె ప్రసంగం పట్ల ప్రశంసలు కురిపించింది. వైరిపక్షం వారు దిగజారి మాట్లాడితే తాము మాత్రం అంతకంతకు ఉన్నతంగా మాట్లాడుతామన్నది ఆమె వ్యాఖ్యల్లోని భావం. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని చూస్తుంటే ‘మీరు దిగజారి మాట్లాడితే మేం అంతకన్నా దిగజారి మాట్లాడుతాం’ అన్నట్లు ఉంది. ఆమె ఖాకీ కట్ డ్రాయర్ వేసుకుందని బీజేపీ నాయకురాలు జయప్రదను ఉద్దేశించి ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ తనకు ఓట్లు వేయని వారిని పక్కన పెడతానని, తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు ఎలాంటి అభివద్ధి కార్యక్రమాలను అందించడంటూ బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారు. అదే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ, జాతీయ పౌరసత్వం రిజిస్ట్రీ ప్రకారం హిందు, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన మతస్థులను మినహా దేశానికి వలస వచ్చిన మిగతా వారినందరిని దేశం నుంచి వెళ్లగొడతామని బెదిరించారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఆయన మాట్లాడినట్లు స్పష్టం అవుతూనే ఉంది. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. మరి, అందుకు ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు. ఇక వ్యక్తిగతంగా ఒకరినొకరు దూసుకోవడం మరీ ఎక్కువైంది. ఒకరిని ఉద్దేశించి ‘పప్పూ’ అంటే, మరొకరిని ఉద్దేశించి ‘నామ్‌దార్’ అనడం, ‘స్పీడ్ బ్రేకర్, ఎక్స్‌పయరీ బాబు, బాటిల్ ఆఫ్ పాయిజన్’ తదితర పదాలను వాడుతూ తమ క్రియేటివిటీ పోటీపడి చాటుకుంటున్నారు. తాము పార్టీలకు సారథ్యం వహిస్తున్న రాజకీయ నాయకులమని, తాము ప్రజల దష్టిలో ఆదర్శప్రాయంగా ఉండాలన్న ధ్యాసే వారిలో కనిపించడం లేదు. వారిలో ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఆలోచనకన్నా ప్రత్యర్థులను మరింత బాగా తిట్టాలన్న ధోరణే కనిపిస్తోంది. పార్టీల సిద్ధాంతాలను, ఎన్నికల ప్రణాళికల గురించి ఎక్కువ మాట్లాడాల్సిన వారు వాటిని పూర్తిగా విస్మరించి తిట్ల దండకం అందుకుంటున్నారు. రేపు అధికారంలోకి వస్తే ప్రజలు ఎవరు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించిగానీ, ఎన్నికల ప్రణాళికల గురించిగా అడగకూడదన్నది వారి ఉద్దేశమా! ఉన్నతంగా మాట్లాడే సంస్కృతి వారికి లేదా? ఏదయితేనేం, ‘చవటాయను నేనంటే నీకంటే చవటాయను నేను’ అన్నట్లు ఉందని వారికి ఎప్పుడు అర్థం అవుతుందో!? -
‘వై ప్లస్’ కేటగిరీలో జయప్రద
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద, జానపద గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్‌కు పోలీసులు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. జయప్రద రాంపూర్ నియోజకవర్గం నుంచి, దినేశ్ ఆజంఘఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరిద్దరికీ వై ప్లస్ భద్రత కల్పించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆజంఘఢ్ లో దినేశ్.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో తలపడుతుండగా, జయప్రద.. ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌తో ఢీకొంటున్నారు. వై ప్లస్ కేటగిరీ కింద జయప్రద భద్రత కోసం 17 మంది పోలీసులను కేటాయించినట్టు రాంపూర్ ఎస్పీ శివహరి మీనా చెప్పారు. వీరిలో ఐదుగురిని జయప్రద ఇంటి దగ్గర పెడతామని, మిగతా వారు షిఫ్టుల వారీగా ఆమెకు ఎస్కార్టుగా ఉంటారని ఆయన వివరించారు. వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందన్నది మదింపు చేసి ఆ మేరకు భద్రత కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. ముప్పు స్థాయిని బట్టి నాలుగు రకాలుగా.. ఎక్స్, వై, వై ప్లస్, జెడ్, జెడ్ + భద్రత కల్పిస్తామన్నారు. జెడ్ ప్లస్ అన్నిటి కంటే ఎక్కువ కేటగిరీ అని చెప్పారు. -
రాజమండ్రి టు రామ్‌పూర్
నటి, మాజీ ఎంపీ జయప్రద, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్‌ఖాన్ మధ్య పదేళ్ల రాజకీయ వైరం రామ్‌పూర్ లోక్‌సభ స్థానంలో వారి మధ్య మరోసారి పోరుకు తెరతీసింది. ఎస్పీ అభ్యర్థిగా ఆజమ్ (70), బీజేపీ టికెట్‌పై జయప్రద (57) పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈ స్థానంలో పోటీకి దిగుతున్నారు. సగానికి పైగా ముస్లింలున్న రామ్‌పూర్ ఈ ఎన్నికల్లో దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజమండ్రిలో పుట్టిన జయప్రద.. 1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ.. నారా చంద్రబాబునాయుడు చేతుల్లోకి వచ్చాక 1996లో ఆమెను రాజ్యసభకు పంపారు. అనంతరం ఆమెను మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. అలాగే, రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీచేసే అవకాశం కూడా టీడీపీ ఇవ్వలేదు. బాలీవుడ్‌తో మంచి సంబంధాలున్న అప్పటి ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌తో ఉన్న సాన్నిహిత్యం జయప్రద మరో ప్రాంతీయ పార్టీలో చేరడానికి తోడ్పడింది. ఈ క్రమంలో 2004లో ఆమె ములాయంసింగ్ నేతృత్వంలోని ఎస్పీలో చేరారు. వెంటనే రామ్‌పూర్ లోక్‌సభ టికెట్ ఆమెకు దక్కింది. అప్పటి ఎస్పీ మంత్రి మహ్మద్ ఆజమ్‌ఖాన్ తోడ్పాటుతో జయప్రద తన కాంగ్రెస్ ప్రత్యర్థి, రామ్‌పూర్ నవాబు కుటుంబసభ్యురాలైన బేగం నూర్బానోను 85 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. ఆజమ్–అమర్ వైరంతో జయకు ఇబ్బంది సోషలిస్టు, గ్రామీణ నేపథ్యమున్న ములాయంకు బాలీవుడ్, కార్పొరేట్ ప్రపంచాన్ని అమర్‌సింగ్ పరిచయం చేశారు. అలాంటి అమర్‌కు ఆత్మీయురాలైన జయప్రదకు ఎస్పీలో కాస్త ఎక్కువ గౌరవమే లభించింది. జయ–అమర్ జోడీకి పార్టీ అధినేత ములాయం స్థాయికి మించిన విలువ ఇవ్వడం ఆజమ్‌కు నచ్చలేదు. ములాయంతో ఉన్న సన్నిహిత సంబంధాలు దెబ్బతిన్నాయి. అమర్–ఆజమ్ కీచులాటలు జయప్రదపై ప్రభావం చూపాయి. తన ఇలాఖా అయిన రామ్‌పూర్ నుంచే 2009లో రెండోసారి జయప్రదకు ఎస్పీ టికెట్ దక్కడంతో.. ఆజమ్ ఆమెను ఓడించడానికి లోపాయికారీగా ప్రయత్నించారు. యాభై శాతానికి పైగా ముస్లింలున్నప్పటికీ వారికి ములాయంపై ఉన్న అభిమానం ఫలితంగా జయప్రద వరుసగా రెండోసారి గెలుపొందారు. ఆజమ్ తెరచాటు ప్రయత్నాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థి నూర్బానోపై జయ మెజారిటీ 30 వేలకు పడిపోయింది. అఖిలేశ్‌తో వచ్చిన విభేదాల వల్ల ఎంపీలు అమర్, జయప్రదను 2010లో ఎస్పీ బహిష్కరించింది. వీరిద్దరూ బయటికి పోవడంతో ఆజమ్‌ఖాన్ మళ్లీ ములాయంకు దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో (2012) రామ్‌పూర్ నుంచి గెలిచి ఆయన అఖిలేశ్ కేబినెట్లో మంత్రి అయ్యారు. యాసిడ్ దాడికి ఆజమ్ కుట్ర: జయప్రద ఎస్పీ నుంచి బయటపడ్డాక ఆజమ్‌పై జయప్రద తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై యాసిడ్ దాడి చేయించడానికి ఆజమ్ ప్రయత్నించారని ఆమె ప్రకటించారు. మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను ఆయన ఇంటర్నెట్లో ప్రచారంలో పెట్టించారని కూడా జయప్రద ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమర్–జయప్రద ద్వయం కాంగ్రెస్‌లో చేరాలనుకుని చివరికి దాని మిత్రపక్షమైన ఆరెల్డీలో చేరారు. పశ్చిమ యూపీలోని బిజ్నోర్ నుంచి జయప్రద పోటీచేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రాజకీయపక్షాలు, ప్రముఖుల మధ్య సంధి కుదిర్చే ‘దళారి’ (వీలర్–డీలర్)గా ముద్రపడిన అమర్ తర్వాత కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు దగ్గరయ్యారు. ఈ సాన్నిహిత్యంతోనే జయప్రదను ఆయన బీజేపీలో చేర్పించడం, ఆమెకు రామ్‌పూర్ బీజేపీ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఎస్పీలో ఉన్న రోజుల్లో ఆజమ్‌తో జయప్రదకు మొదలైన శత్రుత్వం ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఒకరితో మరొకరు తలపడే పరిస్థితికి దారితీసింది. యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమిలో లేని కాంగ్రెస్ రామ్‌పూర్‌లో అభ్యర్థిని నిలపడం లేదని ప్రకటించింది. దీంతో ఆజమ్, జయప్రద మధ్య ప్రత్యక్ష పోరుకు తెరలేచింది. రాజమండ్రి నుంచి రాజ్యసభకు, అక్కడి నుంచి రామ్‌పూర్‌కు సాగిన జయప్రద రాజకీయ ప్రయాణం 2014లో బిజ్నోర్‌లో ఆగిపోయింది. తనకు రెండుసార్లు గెలుపునిచ్చిన రామ్‌పూర్‌లో ఆమె చేస్తున్న తాజా ప్రయత్నం ఏమౌతుందో?. -
బీజేపీలో చేరిన జయప్రద
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత ఉపేంద్ర యాదవ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం తన జీవితంలోనే ప్రధానమైన ఘట్టం అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నప్పుడు జయప్రద ఆ పార్టీ సీనియర్ నేత అమర్‌సింగ్ శిష్యురాలిగా ఉన్నారు. అనంతరం పార్టీ పగ్గాలు అఖిలేష్ యాదవ్ చేతికి అందడం, సొంతపార్టీకి చెందిన సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం వంటి కారణాల వల్ల కొంత కాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాంపూర్ నుంచే బరిలోకి.. తెలుగుదేశం పార్టీ నుంచి 1994లో రాజకీయ అరంగేట్రం చేసిన జయప్రద.. రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈసారి కూడా ఆమె అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ తరఫున రాంపూర్ నుంచి ఆజంఖాన్ పోటీలో ఉండటం గమనార్హం. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. -
బీజేపీలో చేరిన జయప్రద
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ సెక్రటరీ భుపేంద్ర యాదవ్, పార్టీ మీడియా హెడ్ అనిల్ బలూనీ ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. 1994లో జయప్రద రాజకీయ ప్రస్థానం తెలుగు దేశం పార్టీతో మొదలైంది, తర్వాత ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో వచ్చిన బేధాబిప్రాయాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పార్టీలో చేరారు. రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల్లో పార్టీ నుంచి 2010 సస్పెండ్ అయ్యారు. గతంలో సమాజ్‌వాది పార్టీలో రాంపూర్ నియోజకవర్గం నుంచి మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే, అయితే ఈసారి ఎస్పీ నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్‌పై పోటీ చేయనున్నారు. -
భర్త ఎలా ఉన్నా అంగీకరించాలా?
‘మన సమాజం కొన్ని శతాబ్దాలుగా అమ్మాయిలను మంచి భార్యలుగా తీర్చిదిద్దడానికే కృషి చేసింది. అబ్బాయిలను మంచి భర్తలుగా తీర్చిదిద్దాలని ఆలోచించలేదు. ఫలితంగా సమాజంలో చెడ్డ భర్తలే చాలామంది ఉన్నారు’’ అన్నారు ప్రముఖ నటి జయప్రద. ‘పర్ఫెక్ట్ పతి’ అనే హిందీ సీరియల్లో ఆమె నటించారు. ఓ వారం క్రితం ఈ సీరియల్ ముగిసింది. ఈ షోలో తన కోడలిని ఇబ్బందిపెడుతున్న కొడుకుని చంపేస్తుంది ఆమె పాత్ర. ‘‘మామూలుగా కొడుకులో తప్పులు ఉన్నా అతన్ని సమర్థించి, కోడలిని హింసించే అత్తలనే మనం సమాజంలో చూస్తుంటాం. కొడుకుని గుడ్డిగా నమ్మడం తప్పు. అతని తప్పులను ఒప్పుగా అనుకుని కోడలిని వేధించడం ఇంకా తప్పు. ‘పర్ఫెక్ట్ పతి’లాంటి మంచి సీరియల్ ద్వారా ఉత్తరాది చిన్ని తెరకు అడుగుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లిగా, అత్తగా పాజిటివ్ సైడ్‌ని చూపించే క్యారెక్టర్ని ఇందులో చేశాను. సీరియల్లో కొడుకు, కోడలి కాపురం హాయిగా సాగడంలేదని తెలుసుకున్న రాజ్యశ్రీ (జయప్రద పాత్ర పేరు) దానికి కారణం తెలుసుకుని, కొడుకుదే తప్పని గ్రహిస్తుంది. కోడలికి న్యాయం చేయడానికి తప్పు చేసిన కొడుకుని చంపేస్తుంది. సమస్యకి కారణమైనవారిని చంపా లని చెప్పడంలేదు. అయితే ఆ సీరియల్లో కొడుకుని అలా చేయడమే కరెక్ట్’’ అన్నారు జయప్రద. ఇంకా సమాజం గురించి మాట్లాడుతూ –‘‘మెట్టినింటి నుంచి పుట్టింటికి వెళ్లేటప్పుడు అమ్మాయి ఓ సంస్కారవంతమైన కోడలిగా పేరు తెచ్చుకోవాలనే తపనతో తల్లిదండ్రులు పెంచుతారు. అది తప్పు కాదు. కానీ అబ్బాయిలు మంచి అల్లుడిగా, మంచి భర్తగా ఉండాలనే ఆలోచనతో వాళ్లను పెంచరు. అలాగే భర్త ఎలా ఉన్నా ఆ భార్య అంగీకరించాలనే ఆలోచనతో ఉంటారు. అది సరి కాదు. మంచి భార్యలను ఇస్తున్న మన సమాజం మంచి భర్తలను ఇవ్వడంలో విఫలమవుతోందని నా అభిప్రాయం. అఫ్కోర్స్ మంచి భర్తలు లేరనడంలేదు. అయితే ఎక్కువగా లేరంటున్నాను’’ అన్నారు జయప్రద. -
బ్యాగ్రౌండ్ చెప్పుకోలేదు
‘‘నేను విజయవాడలో పుట్టాను. నటనపై ఉన్న ఆసక్తితో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారి కజిన్‌ని. రామదూత క్రియేషన్స్ బ్యానర్ మాదే. కానీ, నెనెప్పుడూ నా బ్యాగ్రౌండ్ చెప్పకుండానే ఆడిషన్స్‌కి వెళ్లాను. ‘వంగవీటి’ సినిమా చేస్తుండగా సూర్యగారు ‘సువర్ణసుందరి’ సినిమాకి చాన్స్ ఇచ్చారు’’ అని హీరో ఇంద్ర అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్‌వర్మగారి దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించాను. ‘సువర్ణసుందరి’లో తొలిసారి లీడ్ రోల్ చేశా. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సూర్యగారికి రుణపడి ఉంటాను. ఈ చిత్రంలో రెండు స్క్రీన్‌ప్లేలు నడుస్తుంటాయి. ఒకటి పీరియాడికల్, ఇంకోటి ప్రస్తుతం. ఈ రెండు స్క్రీన్ప్లేల మధ్య నాదొక ఫన్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్. ‘సువర్ణసుందరి’ అనే ఓ విగ్రహానికి సంబంధించిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదల తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘రామచక్కని సీత’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఓంకార్‌గారి అసిస్టెంట్ శ్రీహర్ష మండాగారితో మరో సినిమా చేశాను’’ అన్నారు. -
భవిష్యత్తుని వెంటాడుతుంది
‘‘సువర్ణసుందరి’ లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి చాలా అవసరం. దాని వల్ల కొత్త టెక్నీషియన్స్ పరిచయం అవుతారు. సూర్య రాసుకున్న కథ చాలా బాగుంది. తప్పకుండా ఇది ఓ మంచి సినిమా అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకులు బి.గోపాల్ విడుదల చేశారు. డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ నాకు చాలా సహకరించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అందుకే సినిమా విడుదల లేట్ అయింది. అయినా అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘సువర్ణసుందరి’ ఎక్స్ట్రార్డినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తె జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్’’ అని డైరెక్టర్ సాగర్ అన్నారు. ‘‘ఇది చాలా మంచి సినిమా. పాటలు. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి’’ అన్నారు సాక్షీ చౌదరి. ‘‘సహనం అంటే అది సూర్యగారి నుంచే నేర్చుకోవాలి. చాలా ఓర్పుగా మంచి నటన రాబట్టుకున్నారాయన’’ అని పూర్ణ అన్నారు. హీరోలు ఇంద్ర, రామ్, రచయిత విజయేంద్రప్రసాద్, రైటర్ ప్రదీప్, స్టంట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లుమంతి ఈశ్వర్. -
ఆత్మహత్య చేసుకోవాలనిపించింది
‘‘లైంగిక వేధింపులను ఎదుర్కొన్న బాధితులకు మాత్రమే ఆ బాధ తెలుసు. ఎందుకంటే వాళ్లు భరించారు కాబట్టి. వాళ్లందరికీ నా సానుభూతి ఉంటుంది. ధైర్యంగా బయటకు వచ్చి ఆ విషయాన్ని చెప్పడం అభినందనీయం. అదే విధంగా చాలా చోట్ల ‘మీటూ’ను తప్పుగా ఉపయోగిస్తున్నారు’’ అని జయప్రద పేర్కొన్నారు. ఇటీవల ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జయప్రద తన లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. ► ‘‘మీటూ’ ఆరోపణల నిర్ధారణకు త్రీ బెంచ్ (ముగ్గురి కంటే ఎక్కువ న్యాయ నిర్ణేతలు న్యాయ విచారాన్ని జరిపించడం) విధానాన్ని పాటించాలి. ఆ విధానం ద్వారా తప్పొప్పులను, నిజానిజాలను కనుక్కోవచ్చు. అలా చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నాను. ► మన పురుషాధిక్య సమాజంలో రాజకీయ నాయకురాలిగా నిలబడటమంటే యుద్ధం చేయడమన్నట్టే. యంపీగా ఉన్నప్పటికీ నామీద యాసిడ్ అటాక్ చేస్తామంటూ రాజకీయ నాయకులు ఆజమ్ ఖాన్ బెదిరించేవారు. బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి తిరిగొస్తానో లేదో తెలియదు. మరుసటిరోజు బతికుంటానో లేదో కూడా డౌట్‌గానే ఉండేది. ► ఆ మధ్య నావి మార్ఫింగ్ చేసిన కొన్ని ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ సమయంలో నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కుడా వచ్చాయి. నాకు బ్రతకాలని అనిపించలేదు. అలాంటి కఠినమైన సందర్భాల్లో కూడా నాకెవ్వరూ సపోర్ట్ చేయలేదు. కేవలం అమర్ సింగ్ జీ మాత్రమే నాతో నిలబడ్డారు. ఆయన్ను నా గాడ్ ఫాదర్‌లా భావిస్తాను. అలాంటి సమయంలో సహాయంగా నిలబడ్డవాళ్లను అలానే భావిస్తాం కదా. మా గురించి ఏదేదో మాట్లాడుకునేవాళ్లు ఒకవేళ ఆయనకు నేను రాఖీ కట్టినప్పటికీ ఊరుకుంటారని నేననుకోను. ► ఆటోబయోగ్రఫీ రాసేంత ధైర్యం లేదనుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా ఏదో నేర్చుకుంటూనే ఉన్నానని భావిస్తాను. ఆటోబయోగ్రఫీ రాయాలంటే ఇంకా చాలా సాధించాలి. నా అచీవ్మెంట్స్ నాకు గుర్తు లేవు. నా లైఫ్‌లో అన్ని అడ్డంకులు తొలగిపోయాయని భావించిన రోజు రాస్తాను. -
‘శరభ’ మూవీ రివ్యూ
టైటిల్ : శరభ జానర్ : సోషియో ఫాంటసీ తారాగణం : ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రధ, నెపోలియన్, పొన్వన్నన్ సంగీతం : కోటి దర్శకత్వం : ఎన్. నరసింహారావు నిర్మాత : అశ్వనీ కుమార్ సహదేవ్ ఒకప్పుడు టాలీవుడ్లో సోషియో ఫాంటసీల ట్రెండ్ బాగా కనిపించేది. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు పెద్దగా రాలేదు. దీంతో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన శరభ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జయప్రధ లాంటి సీనియర్ నటి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం కూడా శరభకు కలిసొచ్చింది. మరి ఆ అంచనాలను శరభ అందుకుందా..? ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ కుమార్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? జయప్రధ రీ ఎంట్రీలో సత్తా చాటారా..? కథ ; శరభ (ఆకాష్ కుమార్) సిరిగిరిపురంలో సరదాగా కాలం వెల్లదీసే అల్లరి కుర్రాడు. కొడుకే ప్రాణంగా బతికే పార్వతమ్మ (జయప్రధ) ఎన్ని తప్పులు చేసినా శరభను ఒక్క మాట కూడా అనదు. దివ్య (మిస్తీ చక్రవర్తి) సెంట్రల్ మినిస్టర్(షియాజీ షిండే) కూతురు. తన జాతక దోశాలకు సంబంధించిన శాంతి కోసం మినిస్టర్ తన కూతురిని సిరిగిరిపురంలోని గురువు (పొన్వన్నన్) గారి దగ్గర విడిపెట్టి వెళతాడు. గురువుగారు దివ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను శరభ, పార్వతమ్మలకు అప్పగిస్తాడు. చిన్న గొడవతో ప్రారంభమైన దివ్య, శరభల పరిచయం తరువాత ప్రేమగా మారుతుంది. అదే సమయంలో దివ్య ప్రమాదంలో ఉందని తెలుస్తోంది. 17 మంది అమ్మాయిలను బలి ఇచ్చిన ఓ రాక్షసుడు 18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే సమయంలో శరభ గతానికి సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. అసలు శరభ గతం ఏంటి..? ఆ రాక్షసుడు దివ్యను ఎందుకు బలి ఇవ్వాలనుకున్నాడు..? రాక్షసుడితో శరభ చేసే పోరాటంలో దైవ శక్తి ఎలా సహాయపడింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హీరో ఆకాష్ కుమార్ మెప్పించలేకపోయాడు. యాక్షన్ సీన్స్‌లో పరవాలేదనిపంచినా నటన పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి తన పరిధి మేరకు పరవాలేదనిపించింది. ఇక పార్వతమ్మ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చిన జయప్రధ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో తల్లిగా హుందాగా కనిపించారు. చాల కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన పునీత్ ఇస్సార్, నెపోలియన్లను తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో నాజర్, పొన్వన్నన్, చరణ్ దీప్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; చాలా కాలం తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ సోషియో ఫాంటసీ కథను తీసుకువచ్చిన దర్శకుడు ఎన్ నరసింహారావు మెప్పించలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో ప్రారంభించినా.. తొలి భాగం అంతా టైంపాస్ సన్నివేశాలతో లాగించేశారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌కొట్టిస్తాయి. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మేకప్, గ్రాఫిక్స్ కీలకం. కానీ ఆ రెండు విషయాల్లో శరభ నిరాశపరుస్తుంది. క్లైమాక్స్‌లో నరసింహా స్వామి స్వయంగా వచ్చి రాక్షసున్ని అంతం చేసే సీన్ బాగుంది. సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; జయప్రధ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ ; కథనం ఫస్ట్ హాఫ్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మొదటి సినిమా గుర్తొస్తోంది
‘‘నా మొదటి చిత్రం (‘భూమి కోసం’) రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత అసౌకర్యంగా ఫీలయ్యానో మళ్లీ ఇప్పుడు ‘శరభ’ సినిమాకీ అంతే అసౌకర్యంగా అనిపిస్తోంది. ప్రతి పాత్రకి దర్శకుడు జీవం పోశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘శరభ’ లాంటి మంచి ఫీల్ ఉన్న చిత్రంతో రావడం గర్వంగా ఉంది. ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాను. టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమా చేసారు. తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని నటి జయప్రద అన్నారు. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్. నరసింహా రావు దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం ‘శరభ’. జయప్రద, నాజర్, నెపోలియన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యన్. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘20ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకత్వశాఖలో పని చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందించా. తొలి చిత్రంలోనే గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ఆకాష్ కుమార్, సహనిర్మాత సురేష్ కపాడియా పాల్గొన్నారు. -
బాహుబలి తర్వాత శరభ
‘‘నరసింహారావు నా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘శరభ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత నాకు విజువల్ పరంగా బాగా నచ్చిన చిత్రం ‘శరభ’’ అని నటుడు–దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. డా.జయప్రద, ఆకాశ్‌కుమార్, మిస్తి చక్రవర్తి, నెపోలియన్, నాజర్, పునీత్ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, పొన్వణ్ణన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘శరభ’. యన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం మేకింగ్ వీడియోను ఆర్.నారాయణమూర్తి, ట్రైలర్‌ను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా చిత్రమిది. ‘భక్త ప్రహ్లాద’ తర్వాత అంత గొప్పగా ఆడుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా టెక్నీషియన్లందరూ కలిసి నన్ను శంకర్ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు అశ్వనీకుమార్ సహదేవ్. ‘‘సినిమా వాడిగా పుట్టడం గొప్ప విషయం. నా బ్యానర్లో తొలి సినిమాగా ఎన్టీఆర్‌గారి ‘జీవిత ఖైదు’ విడుదల చేశాను. ఏఎన్నార్గారితోనూ చేశాను. మధ్యలో చాలా సినిమాలు చేశా. ఇప్పుడు ‘శరభ’ రిలీజ్ చేస్తున్నా. నేను జయప్రదగారికి పెద్ద ఫ్యాన్’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ‘‘నేను ఫోన్ చేయగానే నా మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న చదలవాడ శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. నేను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో నటించినప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ అమ్మలాంటిది’’ అన్నారు జయప్రద. మిస్తి చక్రవర్తి పాల్గొన్నారు. -
దైవశక్తితో పోటీ
ఆకాష్ కుమార్ హీరోగా, జయప్రద ముఖ్య పాత్రలో ఎన్. నరహింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శరభ’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. నరసింహారావు మాట్లాడుతూ–‘‘దైవ శక్తికి, క్షుద్ర శక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. క్షుద్ర శక్తుల నుంచి తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి పడిన తాపత్రయం ఈ చిత్రం ముఖ్య కథాంశం. తల్లి పాత్రలో జయప్రద అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం హీరో ఆకాష్ చాలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘కథకు అనుగుణంగా సినిమాలో వచ్చే 55 నిమిషాల గ్రాఫిక్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇందులో దాదాపు 1269 గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు అశ్వనీ కుమార్. నాజర్, నెపోలియన్, ప్రవీణ్ నటించిన ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. -
‘ఎన్టీఆర్’లో జయప్రదగా మిల్కీబ్యూటీ?
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చర్రిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ స్వయంగా నిర్మించి, నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని సమం చేస్తూ ఈ రెండు భాగాలను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటిస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. శ్రీదేవి, జయప్రద లాంటి ఎంతో మంది హీరోయిన్లు ఎన్టీఆర్‌తో కలిసి నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం.. జయప్రద పాత్రలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనున్నట్లు వినికిడి. మరి ఈ విషయం అధికారికంగా తెలియాలంటే చిత్రబృందం ప్రకటించేవరకు ఎదురు చూడాల్సిందే. ఎన్టీఆర్ కథనాయుకుడు జనవరి 9న, ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 24న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
చరిత్ర వెంటాడుతోంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సాహో సార్వభౌమి’ పాటను విడుదల చేశారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సువర్ణసుందరి’ ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా సూర్య ఈ సినిమా తెరకెక్కించారు. నా సినీ కెరీర్లో ఇది ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. ఇందులోని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పాట ‘సాహో సార్వభౌమి’. మ్యూజికల్‌గా, విజువల్‌గా బాగా వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు లక్ష్మీ. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి. -
బుల్లితెరకు ఎంట్రీ!
సౌత్.. నార్త్ అనే తేడా లేకుండా హీరోయిన్గా మంచి పేరు సంపాదించారు జయప్రద. అటు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆమెకు ప్రేక్షకాదరణ తగ్గలేదు. సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన జయప్రద ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌ని ఏలడానికి రెడీ అయ్యారు. అవును.. ఆమె హిందీ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగులో ‘జయప్రదం’ పేరుతో ఆమె టీవీ షో చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం హిందీలో ‘పర్ఫెక్ట్ పతి’ అనే సీరియల్లో నటిస్తున్నారు. ఇందులో ఆయూష్ ఆనంద్‌కు తల్లిగా నటిస్తున్నారు జయప్రద. ఈ సీరియల్లో తన పాత్ర కీలకంగా ఉండటంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సీరియల్ షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఇందులో జయప్రద లుక్‌తో పాటు క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సంగతి ఇలా ఉంచితే.. దాదాపు పదేళ్ల క్రితం ‘మహారథి’ సినిమాలో నటించారు జయప్రద. ఇప్పుడు మళ్లీ ‘సువర్ణసుందరి’లో ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా తర్వలో రిలీజ్ కానుంది. -
మహర్షికి తల్లి?
ఇటీవలే మహేశ్ మహర్షిగా మారిన సంగతి తెలిసిందే. అదేనండీ తన లేటెస్ట్ సినిమా టైటిల్‌ను ‘మహర్షి’గా ఫిక్స్ చేశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో మహేశ్ పాత్ర పేరు రిషి. ఆ రిషి మహర్షిగా మారడానికి ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నింటికీ స్ఫూర్తి వాళ్ల అమ్మగారేనట. మరి అలాంటి పాత్ర పోషించడానికి జయప్రదను సంప్రదించారట ‘మహర్షి’ చిత్రబృందం. మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు తల్లి పాత్ర కోసం జయప్రదను అడిగారని, ఆమె కూడా ఈ పాత్ర పట్ల సుముఖంగా ఉన్నారని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
డాటర్ ఆఫ్ పూర్ణ
ఈ మధ్య కాలంలో తల్లి పాత్రల్లో కనిపిస్తోన్న జయప్రద ఇప్పుడు కూతురిగా కనిపించనున్నారు. అది కూడా పూర్ణకి కూతురిగా. రామ్, ఇంద్ర, జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య తారలుగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ సువర్ణ సుందరి’. ఎమ్.వి.కె. రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ‘చరిత్ర భవిష్యత్‌ను వెంటాడుతోంది’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ కూతురిగా జయప్రద నటించారు. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. దర్శకుడు సూర్య టేకింగ్, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సాయి కార్తీక్ సంగీతం, ఎలు మహంతి విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొంది చిత్రబృందం. కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్ నటించారు. -
యంగ్ హీరోయిన్ కూతురిగా జయప్రద
నాటి తరం నటీమణులంతా తల్లి, అత్త పాత్రలు పోషిస్తుంటే.. సీనియర్ నటి జయప్రద మాత్రం ఇందుకు భిన్నంగా కూతురి పాత్రలో కనిపించనున్నారు. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో ‘సువర్ణ సుందరి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయప్రదకు తల్లిగా యంగ్ హీరోయిన్ పూర్ణ నటిస్తున్నారు. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎమ్ఎస్ఎన్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. చరిత్ర భవిష్యుత్తును వెంటాడుతోంది అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. గతంలో విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. గ్రాండ్ లుక్‌తో హై టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్ఎల్ లక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్. -
చిన్నారులపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు
చిన్నారులపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటని జయప్రద అన్నారు. జమ్ము కశ్మీర్‌లోని కఠువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లలో ఇటీవల చిన్నారులపై జరిగిన అత్యాచార సంఘటనలను ఆమె ఖండించారు. న్యాయవ్యవస్థపై రాజకీయాలు ఎంతగా ప్రభావం చూపుతున్నాయంటే, ఆ ప్రభావం వల్ల దేశంలో బాధిత మహిళలకు ఎలాంటి న్యాయం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార సంఘటనలు దేశంలోని రాజకీయ వ్యవస్థకు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. చిన్నారి బాలికలకు దేశంలో భద్రత కరువైపోతోందని, ఇంటా బయటా ఎక్కడా వారికి సురక్షితమైన పరిస్థితులు లేవని జయప్రద పేర్కొన్నారు. కఠువాలో చిన్నారిపై ఏకంగా దేవాలయంలో సామూహిక అత్యాచారానికి తెగబడ్డారని, అంతకు కొన్నాళ్ల ముందు ఉన్నావ్‌లో మైనర్ బాలికపై పలుకుబడి గల అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, జరిగిన అన్యాయంపై నోరెత్తిన పాపానికి బాధితురాలి తండ్రిని హతమార్చారని అన్నారు. ఈ రెండు సంఘటనలూ దేశవ్యాప్తంగా సామాన్యుల మనసులను కలచివేశాయని ఆమె అన్నారు. -
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
-
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
‘‘అందరూ జన్మిస్తారు. జీవిస్తారు. మరణిస్తారు. కొంత మంది మరణించినా శాశ్వతంగా గుండెలో ఎప్పూడు చెరగని ముద్ర వేసి జీవిస్తారు. అలాంటి కోవకు చెందిన మనిషి శ్రీదేవి’’ అన్నారు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి. ప్రముఖ సినీతార శ్రీదేవి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీదేవితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ–‘‘ భారతదేశ చలనచిత్రరంగంలో శ్రీదేవి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. హిందీలో చాందినీగా ఆకట్టుకున్నారు. ఆవిడ మరణవార్త విని దేశం మొత్తం షాక్ అయ్యింది. ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. శ్రీదేవితో మా అమ్మాయి పింకీ రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేది. శ్రీదేవి ఎంత పెద్ద ఆర్టిస్టో అంత మంచి హ్యూమన్ బీయింగ్. ఎంత ఎత్తు ఎదిగినా రూట్స్‌ని మరిచిపోలేదు. అంత గొప్ప నటి, శక్తి స్వరూపిణి దూరమైయేసరికి కోట్లాది అభిమానులు తమ అభిమానాన్ని, దుఃఖాన్ని చూపించారు. బోనీ కపూర్, శ్రీదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడు వాళ్లు విడిగా వచ్చేవారు కాదు. శ్రీదేవి మరోజన్మలోను శ్రీదేవిలానే పుట్టాలి. తెలుగమ్మాయిగానే పుట్టాలి. మా శ్రీదేవి మళ్లీ వచ్చిందనుకోవాలి’’ అన్నారు. ప్రముఖ గాయని సుశీల మాట్లాడుతూ–‘‘ దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య శ్రీదేవి. మనల్ని మైమరపించి మళ్లీ తన లోకానికే వెళ్లిపోయింది. 8 ఏళ్ల వయసులో శ్రీదేవికి పాట పాడాను. అంతేకాదు ఆమె మొట్టమొదటి సినిమాకు కూడా పాట పాడాను. మనకు ఎన్నో తీపిగుర్తులను మిగిల్చి తను వెళ్లిపోయింది’’ అన్నారు.‘‘శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాల్లో నటించాను. ఆమె నిగర్విగా ఉండేది’’ అన్నారు నటుడు కోటశ్రీనివాసరావు. ‘‘శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నన్ను ఎప్పుడూ సార్ అని పిలిచేది. ఆమెకు పెద్దలంటే ఎంతో గౌరవం. ఇప్పుడు ఆమె లేదు అంటే నమ్మబుద్ది కావడం లేదు. దేశం గర్వించదగ్గ నటి శ్రీదేవి. ఆమె మరణించినా..సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారామె’’ అని అన్నారు కృష్ణంరాజు. ‘‘ శ్రీదేవి మరణవార్త విన్న తర్వాత ఎంతో దుఃఖించాను. తెలుగు అమ్మాయిగా ఎంతో సాధించింది. జీవితంలోని ప్రతి అడుగును ఒక లక్ష్యంగా చేసుకుని నడిచింది. ప్రతి పాత్రను ఒక సవాలుగా తీసుకునేది శ్రీదేవి. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారు శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటారు. శ్రీదేవి గొప్ప నటి మాత్రమే కాదు. మంచి మాతృమూర్తి కూడా. తనలాగే జాన్వీని కూడా తీర్చిదిద్దాలని అనుకున్నారు. జాన్వీ మంచి నటిగా రాణించాలని కోరుకుంటున్నాను’’అన్నారు నటి జయప్రద. ‘‘శ్రీదేవి మరణవార్తను జీర్ణించుకోలేకపోయాను. శ్రీదేవి కుటుంబంతో మా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మరిచిపోలేక పోతున్నాను. జాన్వీ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు నటి జయసుధ. ‘‘శ్రీదేవితో కలిసి నటించలేదు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమెతో ఓ సినిమాలో నటించే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలే. ముంబైలో జరిగిన శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లాలి అనుకున్నాను. కానీ..కుదర్లేదు. ఇప్పుడు సంస్మరణసభలో పాల్గొనే అవకాశం వచ్చింది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘‘1972లో ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవిని చూసిన మొదటి రోజే గొప్ప నటి అవుతుందని అనుకున్నాను. రామానాయుడు ఆమెను ‘దేవత’ను చేస్తే..ఎన్టీఆర్ ఆమెను ‘అనురాగదేవత’ను చేశారు’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘శ్రీదేవి సెట్లో ఎవర్ని బాధపెట్టలేదు. కానీ చనిపోయి అందర్నీ నొప్పించింది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవి నటన చూసి, గొప్ప నటి అవుతుందనుకున్నాను’’ అన్నారు నటుడు బాబుమోహన్. ‘‘శ్రీదేవితో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శ్రీదేవితో నటించే అవకాశం దక్కనందుకు బాధపడుతున్నాను. శ్రీదేవి లాంటి హీరోయిన్ కావాలని కోరుకునే వారిలో నేనూ ఉన్నాను’’ అన్నారు హీరోయిన్ నివేధా థామస్. రేలంగి నరసింహరావు, అమల, శ్రీకాంత్, అల్లు అరవింద్, జగపతిబాబు, సుమంత్, ఆలీ, శివాజీ రాజా, నరేశ్, ఉపాసన కామినేని తదితరులు పాల్గొన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీ ఎదుటివారిని నొప్పించేది కాదు
-
నేను శ్రీ అనీ పప్పీ అనీ పిలిచేదాన్ని..
జయసుధ, జయప్రద, శ్రీదేవి.. ఒకానొక సమయంలో ఈ ముగ్గురు నాయికలూ ఇండస్ట్రీని రూల్ చేశారు. ఆ రోజుల్లో మీ మధ్య బాగా పోటీ ఉండేదా? జయసుధ: శ్రీదేవి, నేను కలిసి దాదాపు 8,9 వరకూ సినిమాలు చేశాం. నాకు ఎవ్వరితో పోటీ ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎవ్వరితో కంపేర్ చేసుకోను కాబట్టి. శ్రీదేవి అంత అందంగా కనిపించాలి అనుకుంటే పోటీ ఉండేది. నేను అలా చేసేదాన్ని కాదు. నేను శ్రీదేవి అంత హైట్ కాదు. ఆమె ఫిగర్ నాకు లేదు. నేను చేయతగ్గదల్లా నా పాత్రను నేను బాగా చేయడమే. నా క్యారెక్టర్ ఏంటని మాత్రమే చూసుకునేదాన్ని. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ పెద్ద హిట్. ఆ తర్వాత ‘అనురాగ దేవత, గజదొంగ’ సినిమాలు వంటి చాలా సినిమాలు ఉన్నాయి. శ్రీదేవిగారు కాంపిటీషన్లో ఉన్న హీరోయిన్లతో బాగుండేవారా? జయసుధ:ఆమె చాలా సాఫ్ట్ అండి. నేనైనా సెట్లోకి వచ్చి అదీ ఇదీ మాట్లాడేదాన్ని. మేం కూడా సాఫ్ట్... బట్ తను అసలు మాట్లాడదు. ఇప్పుడని కాదు.. చిన్నప్పటి నుంచి చాలా సిగ్గు తనకి. నాకు తన ఆరేళ్ల వయసు అప్పటి నుంచి తెలుసు. నాకంటే ఐదారేళ్లు చిన్న అంతే. మద్రాసులో మా ఇళ్లు దగ్గర దగ్గర ఉండేవి. వాళ్ల ఇంటికి వెళ్లితే డోర్ పక్కన నుంచొని తొంగి చూసేది. వాళ్ల అమ్మగారు బాగా మాట్లాడేవారు. శ్రీదేవి కూడా అందరితో కలిసిమెలిసి ఉండేది కానీ సిగ్గు, మొహమాటం ఎక్కువ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చింది కదా. మామూలుగా అయితే అలాంటి వాళ్లు ఫుల్‌గా మాట్లాడతారు లేదా క్వైట్‌గా ఉంటారు. శ్రీదేవి రెండో రకం. శ్రీదేవిగారికి ప్రతీదీ వాళ్ల అమ్మే చూసుకునేవారు. అందుకేనేమో ఆమె రిజర్వ్‌గా ఉండేవారు..అలా అంటే షూటింగ్ సమయాల్లో మా నాన్నని దాటి నాతో ఎవ్వరూ మాట్లాడటానికి వీలు లేదు. ఆ అమ్మాయికి బిగినింగ్‌లో వాళ్ల అమ్మ చూసుకునేవారు. ఆ తర్వాత స్టార్ అయ్యాక అన్నీ తనే చూసుకునేది. కానీ ఎందుకో తక్కువ మాట్లాడేది.. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమా చేస్తున్నారంటే ఎవరెవరు ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటున్నారో, ఎవరి క్యారెక్టర్ లెంగ్త్ ఎంతో తెలుసుకుంటుంటారని ఇండస్ట్రీలో అంటుంటారు. అప్పట్లో అలా ఉండేదా? జయసుధ:అప్పుడూ ఉండేది. కానీæ క్యారెక్టర్ విషయంలో ఉండేది. ఆవిడ ఏ వేషం వేస్తుంది నేను ఏం వేస్తున్నాను అని. అంతే కానీ వేరే ఎందులోనూ ఉండేది కాదు. శ్రీదేవి తన క్యారెక్టర్ ఏంటి? తన డ్రెస్ ఏంటి? ఏం చేయాలి? అని ఆలోచించేది తప్ప వేరే ఏదీ పట్టించుకునేది కాదు. చాలా ప్రొఫెషనల్. చిన్నప్పుడు మనకు ఒక పని చేయమని అప్పజెప్పితే ఎలా చేస్తామో అలాగే ఉండేది తన మనస్తత్వం. సెట్లో తనకు ఇబ్బందిగా ఏదైనా అనిపిస్తే.. ఆ విషయాన్ని డిప్లొమాటిక్‌గా చెప్పేది. ఎదుటివారిని నొప్పించని మనస్తత్వం శ్రీదేవిది. మీరిద్దరు ఒకరినొకరు ఏమని పిలుచుకునేవాళ్లు? జయసుధ: నేను శ్రీ అనీ పప్పీ అనీ పిలిచేదాన్ని. తను మాత్రం నన్ను జయసుధగారు అనే పిలిచేది. నేను తన కంటే ముందు హీరోయిన్ అయ్యాను కాబట్టి అలా పిలిచేది. హిందీ సినిమాల్లో శ్రీదేవిగారి సక్సెస్ గురించి? జయసుధ:అప్పటికే హేమమాలినీ డ్రీమ్ గాళ్ అనిపించుకున్నారు. బట్ శ్రీదేవి ఈజ్ డిఫరెంట్. తనొక సెన్సేషన్. ఆ రోజుల్లో పెద్ద స్టార్డమ్ చూశారు. హిందీ, తమిళం, తెలుగు ఎక్కడికి వెళ్లినా సూపర్ సక్సెస్ అయ్యారు. తను హిందీలో బిజీగా ఉంటే ఆవిడ చేయాల్సిన కొన్ని తెలుగు పిక్చర్స్ నేను చేయాల్సి వచ్చింది. రామారావుగారితో శ్రీదేవి చేయాల్సిన ‘సరదా రాముడు’ నేను చేశాను. శ్రీదేవి హిందీకి వెళ్లడం వల్ల అలా జరిగింది. వాస్తవానికి శ్రీదేవి పెద్ద హీరోయిన్ అవుతుందని రామారావుగారితో తను ‘వేటగాడు’ చేసినప్పుడే ఆయన భార్య బసవ తారకమ్మగారు చెప్పారు. ‘వేటగాడు’ సినిమా రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వేశారు. ఆ సమయంలో నేను, రామారావుగారు ఏదో సినిమా షూటింగ్లో ఉన్నాం. ‘ఈ అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. చాలా ముద్దు ముద్దుగా ఉంది’ అని తారకమ్మగారు రామారావుగారితో అన్నారట. ఆ విషయాన్ని రామారావుగారు మాతో చెప్పారు. అప్పుడు కూడా మాకు ఎవరో కొత్త హీరోయిన్ వస్తున్నారు అనే ఆలోచన, అసూయ అనేదే లేదు. ఎవరి సినిమాలు వాళ్లకు ఉండేవి. ఎవరి స్టైల్ వాళ్లకు ఉంది. శ్రీదేవిగారి కూతుళ్లతో మీకు పరిచయం ఉందా? జయసుధ:ఎప్పుడో నాలుగేళ్ల ముందు కలిశాను. మహేశ్వరి వాళ్ల బ్రదర్ మార్యేజ్లో కలిశాం. ఆ తర్వాత వాళ్ల అమ్మాయి సినిమాలో యాక్ట్ చేయబోతుందనగా కలిశాం. ఆ సినిమా బాగా రావాలని డిస్కస్ చేశాం. జాన్వీ సక్సెస్ అవ్వాలని అంటుండేది. ఎంత సెలబ్రిటీ అయినా ఒక కూతురికి తల్లే కదా. వాళ్ల ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా మమ్మల్ని కచ్చితంగా పిలుస్తుంది. మేం చైన్నైలో ఉన్నప్పుడు తన ప్రతి పుట్టినరోజుకు వాళ్ల అమ్మగారు పిలిచేవారు. అసలు శ్రీదేవితో నా పరిచయమే తన బర్త్‌డేస్ వల్ల.తన కుమార్తెను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోలేకపోయారు...అవును. అది చాలా బాధపడాల్సిన విషయమే. శ్రీదేవి మరణం తీరని లోటు. -
శ్రీదేవి ఆశ నెరవేరలేదని బాధగా ఉంది
అప్పట్లో మీతో పాటు ఇండస్ట్రీని రూల్ చేసిన శ్రీదేవిగారి గురించి.. జయప్రద: ప్రతి పాత్రలోనూ జీవించాలని ఎంతో కష్టపడేది. ఆన్‌స్క్రీన్ స్టైల్‌గా కనిపించడంతో పాటు ఎమోషన్స్‌ను ఎంతో బ్యాలెన్డ్స్‌గా పలికించేది. గొప్ప నటి ఆమె. అంతేకాదు గొప్ప అమ్మ కూడా. తన జీవితంలోకి అన్ని రంగులు త్వరగానే వచ్చేసాయేమో అనిపిస్తుంది. తక్కువ వయసులోనే సక్సెస్ చూసింది. తక్కువ వయçసులోనే వెళ్లిపోయింది. అందుకే దేవుడు జీవితంలోని అన్ని కలర్స్‌ను తనకు త్వరగా చూపించాడేమో అనిపిస్తుంది. శ్రీదేవి మనతో లేరు అనేది ఒక నమ్మలేని నిజం. మళ్లీ తిరిగి రానటువంటి నిజం. చివరి క్షణాల్లోనూ ఆనందంగా ఉన్న సమయాల్లోనే కన్ను మూసింది. ఒక కల్యాణానికి వెళ్లి అక్కడ అందరితో సరదాగా ఉంటున్న సమయంలో తుది శ్వాస విడిచింది. అంటే.. ఒక మనిషి జీవితం ఎంత చిన్నదో తెలుసుకోవచ్చనిపిస్తోంది. మీరిద్దరూ ఎక్కువగా కలుస్తుండేవారా? జయప్రద:తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ మేము కలుస్తూనే ఉండేవాళ్లం. మా ఇంట్లో జరిగిన పెళ్లి (జయప్రద అక్క కుమారుడు సిద్ధార్థ్ వెడ్డింగ్) వేడుకకు భర్త బోనీ కపూర్‌తో సహా శ్రీదేవి వచ్చింది. అందర్నీ ఆప్యాయంగా పలకరించింది. సరదాగా టైమ్ స్పెండ్ చేసింది. నా లైఫ్‌లో అవి మెమొరబుల్ మూమెంట్స్లా మిగిలిపోయాయి. మీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు కదా.. విభేదాలేమైనా? జయప్రద:జయసుధ, శ్రీదేవి, నాకు మధ్యలో ఎప్పుడూ ఎలాంటి విభేదాలు లేవు. ఒక మాట అనుకోవడం కూడా లేదు. అయితే.. మీడియా ఒక ప్రొఫెషనల్ హైప్‌ను క్రియేట్ చేసింది. మా మధ్య ఎటువంటి తగువులు లేవు. ‘దేవత’లో తను నాకు చిట్టిచెల్లెలిగా చేసింది. మరో సినిమాలో సవతిగా చేసింది. డిఫరెంట్ రోల్స్ చేశాం. ఒకర్ని మించి ఒకరం బాగా చేయాలని తప్పిస్తే వేరే ఏమీ ఉండేది కాదు. శ్రీదేవి నటించినవాటిలో మీకు నచ్చిన సినిమాలు? జయప్రద:జగదేకవీరుడు అతిలోకసుందరి, దేవత సినిమాలు. తను చేసిన హిందీ సినిమాలూ ఇష్టమే. తన సినిమా కెరీర్ అద్భుతమైనది. సినిమా లైబ్రరీలో తనదో ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఆమె లాంటి ఆర్టిస్టు మళ్లీ రావడం కష్టం. జాన్వీ హీరోయిన్గా సినిమా చేస్తున్న విషయం తెలిసే ఉంటుంది.. జయప్రద:ఇన్నాళ్లూ కూతుళ్లకు తోడుగా ఉంది. ఇప్పుడు కూతురు సినిమా చేస్తున్న సమయానికి తోడుండి చూసుకోలేకపోయింది. జాన్వీ ఎంతో దుఃఖంలో ఉంటుంది. రెండో పాప ఖుషీ కూడా. జాన్వీని ఆన్‌స్క్రీన్‌పై చూసుకోవాలన్న శ్రీదేవి ఆశ నేరవేరలేదని బాధగా ఉంది. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఇది తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. -
యూనివర్శల్ పాయింట్‌తో...
పొలిటికల్‌గా బిజీ అయ్యాక నటిగా తక్కువ సినిమాలు చేస్తున్నారు జయప్రద. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నా తమిళ సినిమాల్లో జయప్రద కనిపించి, దాదాపు పదేళ్లు కావొస్తోంది. కమల్‌హాసన్‌తో చేసిన ‘దశావతారం’ తమిళంలో తన లాస్ట్ సినిమా. ఇప్పుడు ఎమ్.ఏ నిషాద్ రూపొందిస్తున్న తమిళ, మలయాళ బైలింగ్వల్ ‘కేనీ’ సినిమాలో ‘ఇందిరా’ అనే గ్రామీణ స్త్రీ పాత్ర ద్వారా తమిళ తెరకు రీ–ఎంట్రీ ఇస్తున్నారు జయప్రద. తమిళనాడు–కేరళ మధ్యలో సాగుతున్న నీటి వివాదం ‘ములైపెరియార్ డ్యామ్’ ఆధారంగా ఈ కథ సాగుతుందట. ఈ సినిమా గురించి జయప్రద మాట్లాడుతూ – ‘‘కెనీ’ కేవలం తమిళనాడు–కేరళ కాదు.. ఇది యూనివర్శల్ పాయింట్. పాలిటిక్స్‌లోకి వెళ్లాక రాజస్థాన్, గుజరాత్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో నీటి సమస్యలను చూశాను. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో ఆ పెయిన్ కనిపిస్తుంది’’ అన్నారు. రేవతి, అనూహాసన్, నాజర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జయచంద్రన్ సంగీతంలో 25 ఏళ్ల తర్వాత జె.ఏసుదాస్, బాల సుబ్రహ్మణ్యం కలిసి ఈ సినిమా కోసం ఒక పాట పాడటం విశేషం. -
రా.. వదినా రా...
కుదురితే పిన్నిలా రా.. వీలైతే అమ్మలా రా.. లేకపోతే అక్కలా రా.. లేదా అత్తలా రా.. కానీ.. రా. తెలుగు సినిమాలో హీరోయిన్లుగా నటించిన అమ్మళ్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కుమ్ముళ్లు స్పెషల్ స్టోరీ. చెక్కుచెదరని నటన చెక్కు చెదరని అందం.. అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని గురించి అందరూ అనుకునే మాట ఇది. నటన కూడా అంతే. చెక్కు చెదరలేదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆమె చేసిన రాణి గౌతమి బాలశ్రీ పాత్ర అందుకు నిదర్శనం. చాలా విరామం తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... 1965లో విడుదలైన ‘పాండవ వనవాసం’లో ఒక పాటకు నర్తించారామె. ఆ తర్వాత ఐదేళ్లకు ‘శ్రీకృష్ణ విజయం’లో ఓ గెస్ట్ రోల్లో కనిపించారు. 45 ఏళ్ల తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించారు. లేఖ తిరిగొచ్చింది లేఖ గుర్తుందా? అదేనండీ.. దర్శకుడు కృష్ణవంశీ ‘చంద్రలేఖ’లో లేఖ పాత్రలో చూపించిన ఇషా కొప్పీకర్ గుర్తుందా? ఆ సినిమా తర్వాత ఇషా హిందీ బాట పట్టారు. ఆల్మోస్ట్ పంతొమ్మిదేళ్ల తర్వాత ఆమె తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ‘కేశవ’. ‘కార్తికేయ’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారామె. శివరాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో రూపొందుతున్న ‘కవచ’ చిత్రంలో నటిస్తున్నారు ఇషా. మోడ్రన్ గ్రాండ్‌మదర్ కాంచన పేరు వినగానే, ఏదో గుడిలో సేవ చేస్తున్నారట అని మాట్లాడుకున్న మాటలు గుర్తుకొస్తాయి. నిజం అది కాదు. దాదాపు 15 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళంగా ఇచ్చారామె. వెండితెర వెలుగు జిలుగులకు దూరంగా ఉంటున్న కాంచన 32ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్‌పై కనిపించడం, అది కూడా ‘అర్జున్ రెడ్డి’లాంటి బోల్డ్ మూవీలో కనిపించడం విశేషం. 1960, 70, 80లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తిరుగు లేని నాయికగా రాణించడంతో పాటు పలు హిందీ చిత్రాలు కూడా చేశారామె. తెలుగు తెరకు దూరమైన.. ఆ మాటకొస్తే గతేడాది మలయాళంలో చేసిన ‘ఒలప్పీపీ’ మినహా 1985 తర్వాత కాంచన సినిమాలు చేయలేదు. 32 ఏళ్ల తర్వాత మోడ్రన్ గ్రాండ్మదర్గా ‘అర్జున్ రెడ్డి’లో కనిపించారు. ‘సఫరింగ్ ఈజ్ పర్సనల్ లెట్ హిమ్ సఫర్..’ అని 77 ఏళ్ల కాంచన ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఫేమస్ అయింది. 1985లో ‘శ్రీ దత్త దర్శనం’ తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇదే. జానకీ నాయకుడితో మళ్లీ... ‘ఘరానా మొగుడు’ ఫేమ్ వాణీ విశ్వనాథ్ గుర్తున్నారా? తెలుగులో దాదాపు 40 సినిమాలు చేశారు. వాటిలో ‘కొదమ సింహం’, ‘గాడ్ ఫాదర్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. పదేళ్ల తర్వాత వాణి టాలీవుడ్‌కి వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘జయ జానకి నాయక’లో జగపతిబాబు చెల్లెలిగా పవర్ఫుల్ రోల్లో కనిపించారామె. ఇక మిస్సవ్వను ఎంత ట్రెడిషనల్‌గా కనిపించగలరో అంతే గ్లామరస్‌గా కనిపించగలరు భూమిక. అందుకు ఉదాహరణ ‘ఒక్కడు’, ‘మిస్సమ్మ’. ‘ఖుషి’లో బుక్ చదివే సీన్‌ని ఎవరూ మరచిపోలేరనుకోండి. ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం వచ్చిన ‘లడ్డూబాబు’లో ఓ కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. అప్పటికే భూమిక పెళ్లవడం, ఒక బాబు కూడా పుట్టడంతో సినిమాలు తగ్గించేశారు. ఇక, భూమిక సినిమాల్లో కనిపించరు అనుకుంటున్న సమయంలో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ)తో వచ్చారు. ఈ చిత్రంలో నాని వదిన పాత్రలో భూమిక నటన సూపర్బ్. గతేడాది హిందీ చిత్రం ‘ఎం.ఎస్. ధోని’లో ధోని సిస్టర్ క్యారెక్టర్లోనూ మెరిశారు. సో.. కుర్ర హీరోలకు అక్క, వదిన అంటే భూమిక బాగుంటారని ఓ ముద్ర పడింది. అందుకు తగ్గట్టుగానే ‘సవ్యసాచి’లో నాగచైతన్యకు అక్క పాత్రకు భూమికను అడగడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక.. తెలుగు సినిమాలను మిస్సయ్యే ప్రసక్తి లేదంటున్నారు భూమిక. జయప్రదం ఫ్రమ్ సౌత్ టు నార్త్ హీరోయిన్గా సక్సెస్ అయినట్లుగానే ఫ్రమ్ తెలుగు స్టేట్ టు యూపీ పొలిటీషియన్‌గా జయప్రద సక్సెస్ అయ్యారు. ‘భూమి కోసం’తో తెలుగు తెరపై మెరిసి, ‘అంతులేని కథ’తో అంతు లేని ఫేమ్ తెచ్చేసుకున్నారు. అడవిరాముడు, సాగర సంగమం, మేఘసందేశం వంటి హిట్ మూవీస్‌తో జయప్రదంగా ఆమె కెరీర్ సాగింది. పదేళ్ల క్రితం పి. వాసు దర్శకత్వం వహించిన ‘మహారథి’లో బాలకృష్ణకు అత్తగా నటించారామె. ఆ తర్వాత మాతృభాషలో నటించలేదు. హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. మాతృభాషలో నటించడంలేదన్న కొరతను ‘శరభ’ తీర్చేసింది. ఈ చిత్రం విడుదలకు రెడీ అయింది. ఇది చేస్తున్నప్పుడే మరో తెలుగు సినిమా ‘సువర్ణ సుందరి’ కమిట్ అయ్యారామె. అన్నకు అక్క.. తమ్ముడికి పిన్ని అన్నయ్యకు అక్కగా, తమ్ముడికి పిన్నిగా నటించే చాన్స్ కొంతమంది తారలకే వస్తుంది. ఖుష్బూకి ఆ చాన్స్ వచ్చింది. పదకొండేళ్ల క్రితం ‘స్టాలిన్’లో చిరంజీవికి అక్కగా నటించారామె. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్‌కి పిన్నిగా ‘అజ్ఞాతవాసి’లో నటిస్తున్నారు. యాక్చువల్లీ తెలుగులో ఖుష్బూ కనిపించిన చివరి సినిమా రాజమౌళి ‘యమదొంగ’. అందులో మోహన్‌బాబు చేసిన యమధర్మరాజు పాత్రకు సతీమణిగా నటించారు. స్మాల్ గ్యాప్ జూనియర్ ఐశ్వర్యారాయ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో స్నేహా ఉల్లాల్‌ని చూసినప్పుడు అందరూ అలానే అన్నారు. ఆ తర్వాత కొంతకాలం తెలుగులో చురుగ్గానే సినిమాలు చేశారీ తేనెకళ్ల సుందరి. ఫోర్ ఇయర్స్ బ్యాక్ ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘యాక్షన్ 3డీ’ సినిమా తర్వాత తెలుగులో స్నేహా ఉల్లాల్ నటించలేదు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడ్డానని, అందుకే కెమెరా ముందుకి రాలేకపోయానని స్నేహా ఉల్లాల్ స్వయంగా పేర్కొన్నారు. స్మాల్ గ్యాప్ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’తో రీ–ఎంట్రీ షురూ అయింది. మమ్మీ ఫాలోస్ డాటర్ ఎక్కడైనా పిల్లలు అమ్మలను ఫాలో అవుతారు. మరి.. మమ్మీ ఫాలోస్ డాటర్ అన్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు.. టూ డేస్ బ్యాక్ ‘హలో’ అన్నారు కల్యాణి ప్రియదర్శన్ డాటరాఫ్ డైరెక్టర్ ప్రియదర్శన్ అండ్ యాక్ట్రస్ లిజి. ఈ ఏడాది కూతురు తెరపైకి వస్తే.. వచ్చే ఏడాది నితిన్ సినిమాలో ‘గుర్తుందా శీతాకాలం’ (పరిశీలనలో ఉన్న టైటిల్) తల్లి పాత్రలో కనిపించనున్నారు. అన్నట్లు లిజికి ఇది మొదటి తెలుగు సినిమా కాదు. నైన్టీస్లో ‘సాక్షి, మగాడు, 20వ శతాబ్దం’ వంటి సినిమాల్లో నటించారామె. చాలా గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో చేస్తోన్న చిత్రమిది. – ముసిమి శివాంజనేయులు -
దేవుడు మనతోనే ఉంటాడు
‘ఫైర్ ఉన్న నాలాంటి కుర్రాడితో పెట్టుకోకు..బాడీ మార్చురీలో ఉంటుంది. దేవుడికే దెయ్యం పట్టిస్తే సృష్టి సర్వనాశనం అవుతుంది. వెళ్లేదారి మంచిదైతే దేవుడు కూడా మనతో వస్తాడు. గమ్యం చేరేదాకా ఆయన మనతోనే ఉంటాడు’ వంటి డైలాగ్స్ ‘శరభ’ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘శరభ’. జయప్రద, నెపోలియన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఏ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు. అశ్వనీకుమార్ సహదేవ్ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అవుట్‌పుట్ బాగా వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ చేసిన ప్రోస్థటిక్ మేకప్, సీజీ వర్క్ ప్రత్యేక ఆకర్షణలు. చిరంజీవిగారు ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, ‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన టీజర్‌కి భారీ స్పందన లభించింది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరో కాంబినేషన్లో రూపొందిన మా చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం’’ అన్నారు. పునీత్ ఇస్సార్, తనికెళ్ల, ఎల్.బి.శ్రీరామ్, సాయాజీ షిండే, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రమణ సాల్వ. -
ఈ సువర్ణసుందరి ఎవర్నీ వదలదు
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది. అన్నది ఉపశీర్షిక. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘ఈ సువర్ణ సుందరి ఎవర్నీ వదలదు’ అంటూ సాగే టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సువర్ణ సుందరి’ టీజర్ రిలీజైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనడానికి టీజర్ చక్కటి ఉదాహరణ. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రాండ్ లుక్‌తో హై టెక్నికల్‌గా రూపొందిస్తున్నాం. త్వరలో పాటలు రిలీజ్ చేయనున్నాం. డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్. -
తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది
మహానంది: తెలుగు ప్రేక్షకులు, ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, వారి ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు బుధవారం రాత్రి మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ సురేంద్రనాధ్‌రెడ్డి ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. వినాయకనందీశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ మహానంది క్షేత్రానికి రావడం ఇదే మొదటిసారి అని, ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహానంది పుణ్యక్షేత్రం పర్యాటక స్థలంగా మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానన్నారు. నూతన దర్శకుడు నరసింహం దర్శకత్వంలో వస్తున్న ‘శరభ’ చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నానని తెలిపారు. -
చంద్రబాబును కలిసిన జయప్రద
విజయవాడ: సినీనటి జయప్రద సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. క్యాంప్ కార్యాలయంలో ఆమె...చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే తన కుమారుడు సిద్ధార్థ వివాహానికి రావాల్సిందిగా జయప్రద ఈ సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించారు. కాగా నిన్న ఆమె...రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివాహ పత్రిక అందచేశారు. కాగా హైదరాబాద్ కు చెందిన ప్రవల్లికా రెడ్డితో సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఇక సిద్ధార్ధ్ హీరోగా తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్ కాగా అందులో అతడి సరసన. హన్సిక కథానాయికగా నటించింది. -
సినీ ప్రముఖులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
హైదరాబాద్ : వీకెండ్ వచ్చిందంటే... హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45లో పోలీసులు భారీగా మోహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి తనిఖీలు చేయటం...మోతాదు మించితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాలు సీజ్ చేయటం పరిపాటే... తాజాగా శుక్రవారం అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇదే సమయంలో వచ్చిన సినీప్రముఖుల వాహనాలను సైతం ఆపి ట్రాఫిక్ పోలీసులు...బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించారు. కాగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పెద్దమ్మ గుడి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన 'ఐ సపోర్ట్ ట్రాఫిక్ పోలీస్' కార్యక్రమంలో సినీనటి మంచు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ, జయప్రదతో పాటు పలువురిని పరీక్షించారు. 'తాగి వాహనం నడవవద్దని, కుటుంబ సభ్యులు మీ కోసం ఎదురు చూస్తుంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని' మంచు లక్ష్మి అన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ స్ట్రెస్ అనేది పెరిగిపోయిందని...ఆమె అన్నారు. మరోవైపు కొందరు మందుబాబులు... ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికినా తప్పించుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. బ్రీత్ అనలైజర్‌లోకి గాలి ఊదమంటే రకరకాల డ్రామాలు ప్రదర్శించారు. అయితే ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో పరీక్షించటంతో మందుబాబులు బండారం బయటపడింది. ఎనిమిది బైకులు, ఆరు కార్లను సీజ్ చేశారు. -
సినీ ప్రముఖులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
-
జయప్రదకు అజాం ఖాన్ షాక్
అలనాటి అందాల తార, మాజీ ఎంపీ జయప్రదకు పెద్ద షాకే తగిలింది. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లుగా ఆమె పరిస్థితి తయారైంది. చేతి వరకు వచ్చిన ఎమ్మెల్సీ అవకాశం చివరి నిమిషంలో జారిపోయింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా జయప్రద పేరు ఖరారు అయినా లాస్ట్ మినిట్‌లో యూపీ మంత్రి అజాం ఖాన్ సైంధవుడిలా అడ్డుపడ్డాడు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ..గవర్నర్ కోటా కింద విధాన పరిషత్‌కు తొమ్మిదిమంది సభ్యుల జాబితాను ఖరారు చేశారు. ఆ లిస్ట్‌లో జయప్రద పేరు కూడా ఉంది. అయితే అదృష్టం తలుపు తట్టి వస్తే దురదృష్టం తలుపు తన్ని వచ్చినట్లు.. జయప్రద తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు అజాం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించటంతో ఆమెను తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది. జయప్రదను తిరిగి సమాజ్‌వాదీలోకి తీసుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా సుముఖంగా ఉన్నా... అజాం ఖాన్ మాత్రం తన మెట్టు దిగలేదు. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు వీల్లేదంటూ భీష్మించటంతో జయప్రదకు ఎదురుగాలి తగలింది. 2009లో లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద అభ్యర్థిత్వాన్ని ఆజాం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా ఆమెను అప్రదిష్ట పాల్జేసేందుకు పలుమార్లు ఆయన ప్రయత్నించాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. అప్పట్లో నటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రద ఆ తర్వాత టీడీపీలో చేరారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. అ తర్వాత జాతీయ రాజకీయాలపై ఆమె దృష్టి పెట్టారు. ఎంపీగా సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలిచి, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఆ తర్వాత జయ గాడ్ ఫాదర్ అమర్ సింగ్ ...సమాజ్‌వాదీ నుంచి విడిపోవటంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొని, ప్రస్తుతం ఆ పార్టీకి ఆమె దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్ఎల్డీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దేశ రాజకీయాల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జయప్రద తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతే కాకుండా అవకాశం ఇస్తే ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్‌పై పోటీకి సై అంటూ ఫీలర్లు వదిలినా ఆమెను బీజేపీ పట్టించుకోలేదు. దాంతో తిరిగి సమాజ్‌వాదీ చెంతకు చేరాలని జయప్రద డిసైడ్ అయినా.. వెండితెరపై విలన్లా ఆజాం ఖాన్ అడ్డు పడటం అంటే ఇదేనేమో.. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- జయప్రద
-
సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయప్రద శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిశారు. ఈ నెల 27న జరిగే తన చెల్లెలి కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు. -
కేసీఆర్‌ను కలిసిన సినీనటి జయప్రద
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీనటి జయప్రద శనివారం సచివాలయంలో కలిశారు. ఆమె తన సోదరి కుమార్తె వివాహ పత్రికను కేసీఆర్‌కు అందచేశారు. వివాహానికి రావాలని జయప్రద ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఆహ్వానించారు. అనంతరం జయప్రద మాట్లాడుతూ తన సోదరి కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకే కేసీఆర్‌ను కలిసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'మీసంలేని' నేస్తమా నీకు ...
'మీసంలేని' నేస్తమా నీకు రోషమెక్కువా కానీ మనసు మక్కువ అంటూ పాత స్నేహితుడి కోసం తాజాగా కొత్త పల్లవిని అందుకున్నాడు మరో పాత స్నేహితుడు. ఇంతకీ ఆ పాత స్నేహితులు ఎవరు ఏమా కథా అనుకుంటున్నారా ?... అయితే ఆ పాత ప్రాణ స్నేహితుల కథలోకి వద్దాం. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌లు మాంచీ జిగ్రీ దోస్తులు అన్న విషయం తెలిసిందే. ఆ దోస్తుల మధ్య కాలమో లేక ఖర్మమో కానీ వారి మధ్య మనస్పర్థలు ఉరుముల్లేని మెరుపుల్లా వచ్చి పడ్డాయి. దాంతో 2010లో పార్టీ నుంచి అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అమర్ సింగ్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. దాంతో గత నాలుగేళ్లుగా ఆ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కానీ మంగళవారం యూపీ రాజధాని లక్నోలో ఆసియాలో అతి పెద్దదైన జ్ఞనేశ్వర్ మిశ్రా పార్క్‌ను ప్రారంభ కార్యక్రమం మళ్లీ వారని కలపింది. ఆ కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తోపాటు ఆయన తండ్రి ములాయం సింగ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదే కార్యక్రమానికి హాజరైన అమర్ సింగ్ సందర్భంగా ఆ తండ్రి కొడుకులను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. తాను సమాజ్ వాదీని కాదని ములాయం వాదీనంటూ భజనలు చేశాడు. దాంతో అమర్ సింగ్ మళ్లీ ములాయం స్నేహాన్ని కోరుకుంటున్నాడని అందరికి అర్థమైంది. ఇంతకీ ములాయం సింగ్ యాదవ్ స్నేహాన్ని ఎందుకు అమర్ కోరుకుంటున్నాడు.... పార్టీలో అసమ్మతి జ్వాలలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్... అమర్ సింగ్లోపాటు ఆ పార్టీ తరఫున 2009లో రాంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన సినీ నటి జయప్రదలను సస్పెండ్ చేశారు. దాంతో నీ పార్టీకి పోటీగా పార్టీ పెడతానంటూ మంగయ్య శపథం చేశారు అమర్ సింగ్. శపథం చేసినట్లే 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ అనే పార్టీని ఆయన స్థాపించాడు. ఆ తర్వాత సంవత్సరమే అంటే 2012లో యూపీ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అమర్ సింగ్ పార్టీ 360 స్థానాల్లో పోటీ చేసింది. అయినా ఒక్క ఎమ్మెల్యే స్థానాన్నికూడా గెలుచుకోలే బొక్కబోర్లా పడిపోయింది. దాంతో అమర్ సింగ్ కొత్త పార్టీని చాపచుట్టినట్లు చుట్టేశాడు. కానీ ఆ ఎన్నికల్లో ములాయం సింగ్ పార్టీ ఎస్పీ విజయఢంకా మోగించింది. దాంతో అమర్ సింగ్ చేసేది లేక అజీత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయలోక్ దళ్ చేరారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఫతేపూర్ సీక్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఘోర పరాజయం పాలైయ్యారు. మరోవైపు అమర్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది చివర మూడు నెలల్లో ముగిసిపోనుంది. దాంతో ప్రజల ఓట్లు తనకు అచ్చిరావని సదరు నేతగారికి అర్థమైంది. అందుకే మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన పాత మిత్రుడ్ని కాకా పడుతున్నారు. ఎందుకంటే యూపీ అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీకి సగానికి పైగా సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో ములాయం స్నేహంతో మరోసారి రాజ్యసభకు ఎగిరిపోవాలని అమర్ సింగ్ తాపత్రయపడుతున్నారు.