కుదురితే పిన్నిలా రా.. వీలైతే అమ్మలా రా.. లేకపోతే అక్కలా రా.. లేదా అత్తలా రా.. కానీ.. రా. తెలుగు సినిమాలో హీరోయిన్లుగా నటించిన అమ్మళ్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కుమ్ముళ్లు స్పెషల్ స్టోరీ.
చెక్కుచెదరని నటన
చెక్కు చెదరని అందం.. అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని గురించి అందరూ అనుకునే మాట ఇది. నటన కూడా అంతే. చెక్కు చెదరలేదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆమె చేసిన రాణి గౌతమి బాలశ్రీ పాత్ర అందుకు నిదర్శనం. చాలా విరామం తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... 1965లో విడుదలైన ‘పాండవ వనవాసం’లో ఒక పాటకు నర్తించారామె. ఆ తర్వాత ఐదేళ్లకు ‘శ్రీకృష్ణ విజయం’లో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించారు. 45 ఏళ్ల తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించారు.
లేఖ తిరిగొచ్చింది
లేఖ గుర్తుందా? అదేనండీ.. దర్శకుడు కృష్ణవంశీ ‘చంద్రలేఖ’లో లేఖ పాత్రలో చూపించిన ఇషా కొప్పీకర్ గుర్తుందా? ఆ సినిమా తర్వాత ఇషా హిందీ బాట పట్టారు. ఆల్మోస్ట్ పంతొమ్మిదేళ్ల తర్వాత ఆమె తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ‘కేశవ’. ‘కార్తికేయ’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారామె. శివరాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో రూపొందుతున్న ‘కవచ’ చిత్రంలో నటిస్తున్నారు ఇషా.
మోడ్రన్ గ్రాండ్‌మదర్
కాంచన పేరు వినగానే, ఏదో గుడిలో సేవ చేస్తున్నారట అని మాట్లాడుకున్న మాటలు గుర్తుకొస్తాయి. నిజం అది కాదు. దాదాపు 15 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళంగా ఇచ్చారామె. వెండితెర వెలుగు జిలుగులకు దూరంగా ఉంటున్న కాంచన 32ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్‌పై కనిపించడం, అది కూడా ‘అర్జున్ రెడ్డి’లాంటి బోల్డ్ మూవీలో కనిపించడం విశేషం. 1960, 70, 80లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తిరుగు లేని నాయికగా రాణించడంతో పాటు పలు హిందీ చిత్రాలు కూడా చేశారామె. తెలుగు తెరకు దూరమైన.. ఆ మాటకొస్తే గతేడాది మలయాళంలో చేసిన ‘ఒలప్పీపీ’ మినహా 1985 తర్వాత కాంచన సినిమాలు చేయలేదు. 32 ఏళ్ల తర్వాత మోడ్రన్ గ్రాండ్‌మదర్‌గా ‘అర్జున్ రెడ్డి’లో కనిపించారు. ‘సఫరింగ్ ఈజ్ పర్సనల్ లెట్ హిమ్ సఫర్..’ అని 77 ఏళ్ల కాంచన ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఫేమస్ అయింది. 1985లో ‘శ్రీ దత్త దర్శనం’ తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇదే.
జానకీ నాయకుడితో మళ్లీ...
‘ఘరానా మొగుడు’ ఫేమ్ వాణీ విశ్వనాథ్ గుర్తున్నారా? తెలుగులో దాదాపు 40 సినిమాలు చేశారు. వాటిలో ‘కొదమ సింహం’, ‘గాడ్ ఫాదర్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. పదేళ్ల తర్వాత వాణి టాలీవుడ్‌కి వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘జయ జానకి నాయక’లో జగపతిబాబు చెల్లెలిగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారామె.
ఇక మిస్సవ్వను
ఎంత ట్రెడిషనల్‌గా కనిపించగలరో అంతే గ్లామరస్‌గా కనిపించగలరు భూమిక. అందుకు ఉదాహరణ ‘ఒక్కడు’, ‘మిస్సమ్మ’. ‘ఖుషి’లో బుక్ చదివే సీన్‌ని ఎవరూ మరచిపోలేరనుకోండి. ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం వచ్చిన ‘లడ్డూబాబు’లో ఓ కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. అప్పటికే భూమిక పెళ్లవడం, ఒక బాబు కూడా పుట్టడంతో సినిమాలు తగ్గించేశారు. ఇక, భూమిక సినిమాల్లో కనిపించరు అనుకుంటున్న సమయంలో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ)తో వచ్చారు. ఈ చిత్రంలో నాని వదిన పాత్రలో భూమిక నటన సూపర్బ్. గతేడాది హిందీ చిత్రం ‘ఎం.ఎస్. ధోని’లో ధోని సిస్టర్ క్యారెక్టర్‌లోనూ మెరిశారు. సో.. కుర్ర హీరోలకు అక్క, వదిన అంటే భూమిక బాగుంటారని ఓ ముద్ర పడింది. అందుకు తగ్గట్టుగానే ‘సవ్యసాచి’లో నాగచైతన్యకు అక్క పాత్రకు భూమికను అడగడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక.. తెలుగు సినిమాలను మిస్సయ్యే ప్రసక్తి లేదంటున్నారు భూమిక.
జయప్రదం
ఫ్రమ్ సౌత్ టు నార్త్ హీరోయిన్‌గా సక్సెస్ అయినట్లుగానే ఫ్రమ్ తెలుగు స్టేట్ టు యూపీ పొలిటీషియన్‌గా జయప్రద సక్సెస్ అయ్యారు. ‘భూమి కోసం’తో తెలుగు తెరపై మెరిసి, ‘అంతులేని కథ’తో అంతు లేని ఫేమ్ తెచ్చేసుకున్నారు. అడవిరాముడు, సాగర సంగమం, మేఘసందేశం వంటి హిట్ మూవీస్‌తో జయప్రదంగా ఆమె కెరీర్ సాగింది. పదేళ్ల క్రితం పి. వాసు దర్శకత్వం వహించిన ‘మహారథి’లో బాలకృష్ణకు అత్తగా నటించారామె. ఆ తర్వాత మాతృభాషలో నటించలేదు. హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. మాతృభాషలో నటించడంలేదన్న కొరతను ‘శరభ’ తీర్చేసింది. ఈ చిత్రం విడుదలకు రెడీ అయింది. ఇది చేస్తున్నప్పుడే మరో తెలుగు సినిమా ‘సువర్ణ సుందరి’ కమిట్ అయ్యారామె.
అన్నకు అక్క.. తమ్ముడికి పిన్ని
అన్నయ్యకు అక్కగా, తమ్ముడికి పిన్నిగా నటించే చాన్స్ కొంతమంది తారలకే వస్తుంది. ఖుష్బూకి ఆ చాన్స్ వచ్చింది. పదకొండేళ్ల క్రితం ‘స్టాలిన్’లో చిరంజీవికి అక్కగా నటించారామె. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్‌కి పిన్నిగా ‘అజ్ఞాతవాసి’లో నటిస్తున్నారు. యాక్చువల్లీ తెలుగులో ఖుష్బూ కనిపించిన చివరి సినిమా రాజమౌళి ‘యమదొంగ’. అందులో మోహన్‌బాబు చేసిన యమధర్మరాజు పాత్రకు సతీమణిగా నటించారు.
స్మాల్ గ్యాప్
జూనియర్ ఐశ్వర్యారాయ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో స్నేహా ఉల్లాల్‌ని చూసినప్పుడు అందరూ అలానే అన్నారు. ఆ తర్వాత కొంతకాలం తెలుగులో చురుగ్గానే సినిమాలు చేశారీ తేనెకళ్ల సుందరి. ఫోర్ ఇయర్స్ బ్యాక్ ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘యాక్షన్ 3డీ’ సినిమా తర్వాత తెలుగులో స్నేహా ఉల్లాల్ నటించలేదు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడ్డానని, అందుకే కెమెరా ముందుకి రాలేకపోయానని స్నేహా ఉల్లాల్ స్వయంగా పేర్కొన్నారు. స్మాల్ గ్యాప్ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’తో రీ–ఎంట్రీ షురూ అయింది.
మమ్మీ ఫాలోస్ డాటర్
ఎక్కడైనా పిల్లలు అమ్మలను ఫాలో అవుతారు. మరి.. మమ్మీ ఫాలోస్ డాటర్ అన్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు.. టూ డేస్ బ్యాక్ ‘హలో’ అన్నారు కల్యాణి ప్రియదర్శన్ డాటరాఫ్ డైరెక్టర్ ప్రియదర్శన్ అండ్ యాక్ట్రస్ లిజి. ఈ ఏడాది కూతురు తెరపైకి వస్తే.. వచ్చే ఏడాది నితిన్ సినిమాలో ‘గుర్తుందా శీతాకాలం’ (పరిశీలనలో ఉన్న టైటిల్) తల్లి పాత్రలో కనిపించనున్నారు. అన్నట్లు లిజికి ఇది మొదటి తెలుగు సినిమా కాదు. నైన్టీస్‌లో ‘సాక్షి, మగాడు, 20వ శతాబ్దం’ వంటి సినిమాల్లో నటించారామె. చాలా గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో చేస్తోన్న చిత్రమిది.
– ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment