'మీసంలేని' నేస్తమా నీకు ... | Story on Rajya Sabha Member AmarSingh | Sakshi
Sakshi News home page

'మీసంలేని' నేస్తమా నీకు ...

Published Sat, Aug 9 2014 12:10 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

'మీసంలేని' నేస్తమా నీకు ...

'మీసంలేని' నేస్తమా నీకు ...

'మీసంలేని' నేస్తమా నీకు రోషమెక్కువా కానీ మనసు మక్కువ అంటూ పాత స్నేహితుడి కోసం తాజాగా కొత్త పల్లవిని అందుకున్నాడు మరో పాత స్నేహితుడు. ఇంతకీ ఆ పాత స్నేహితులు ఎవరు ఏమా కథా అనుకుంటున్నారా ?... అయితే ఆ పాత ప్రాణ స్నేహితుల కథలోకి వద్దాం. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్లు మాంచీ జిగ్రీ దోస్తులు అన్న విషయం తెలిసిందే. ఆ దోస్తుల మధ్య కాలమో లేక ఖర్మమో కానీ వారి మధ్య మనస్పర్థలు ఉరుముల్లేని మెరుపుల్లా వచ్చి పడ్డాయి. దాంతో 2010లో పార్టీ నుంచి అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అమర్ సింగ్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు.

దాంతో గత నాలుగేళ్లుగా ఆ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కానీ మంగళవారం యూపీ రాజధాని లక్నోలో ఆసియాలో అతి పెద్దదైన జ్ఞనేశ్వర్ మిశ్రా పార్క్ను ప్రారంభ కార్యక్రమం మళ్లీ వారని కలపింది. ఆ కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తోపాటు ఆయన తండ్రి ములాయం సింగ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదే కార్యక్రమానికి హాజరైన అమర్ సింగ్ సందర్భంగా ఆ తండ్రి కొడుకులను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. తాను సమాజ్ వాదీని కాదని ములాయం వాదీనంటూ భజనలు చేశాడు. దాంతో అమర్ సింగ్ మళ్లీ ములాయం స్నేహాన్ని కోరుకుంటున్నాడని అందరికి అర్థమైంది. ఇంతకీ ములాయం సింగ్ యాదవ్ స్నేహాన్ని ఎందుకు అమర్ కోరుకుంటున్నాడు....

పార్టీలో అసమ్మతి జ్వాలలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్... అమర్ సింగ్లోపాటు ఆ పార్టీ తరఫున 2009లో రాంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన సినీ నటి జయప్రదలను సస్పెండ్ చేశారు. దాంతో నీ పార్టీకి పోటీగా పార్టీ పెడతానంటూ మంగయ్య శపథం చేశారు అమర్ సింగ్. శపథం చేసినట్లే 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ అనే పార్టీని ఆయన స్థాపించాడు. ఆ తర్వాత సంవత్సరమే అంటే 2012లో యూపీ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అమర్ సింగ్ పార్టీ 360 స్థానాల్లో పోటీ చేసింది. అయినా ఒక్క ఎమ్మెల్యే స్థానాన్నికూడా గెలుచుకోలే బొక్కబోర్లా పడిపోయింది. దాంతో అమర్ సింగ్ కొత్త పార్టీని చాపచుట్టినట్లు చుట్టేశాడు. కానీ ఆ ఎన్నికల్లో ములాయం సింగ్ పార్టీ ఎస్పీ విజయఢంకా మోగించింది.

దాంతో అమర్ సింగ్ చేసేది లేక అజీత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయలోక్ దళ్ చేరారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఫతేపూర్ సీక్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఘోర పరాజయం పాలైయ్యారు. మరోవైపు అమర్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది చివర మూడు నెలల్లో ముగిసిపోనుంది. దాంతో ప్రజల ఓట్లు తనకు అచ్చిరావని సదరు నేతగారికి అర్థమైంది. అందుకే మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన పాత మిత్రుడ్ని కాకా పడుతున్నారు. ఎందుకంటే యూపీ అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీకి సగానికి పైగా సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.  దాంతో ములాయం స్నేహంతో మరోసారి రాజ్యసభకు ఎగిరిపోవాలని అమర్ సింగ్ తాపత్రయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement