
సినీ ప్రముఖులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
హైదరాబాద్ : వీకెండ్ వచ్చిందంటే... హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45లో పోలీసులు భారీగా మోహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి తనిఖీలు చేయటం...మోతాదు మించితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాలు సీజ్ చేయటం పరిపాటే... తాజాగా శుక్రవారం అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇదే సమయంలో వచ్చిన సినీప్రముఖుల వాహనాలను సైతం ఆపి ట్రాఫిక్ పోలీసులు...బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించారు.
కాగా డ్రంక్ అండ్ డ్రైవ్పై పెద్దమ్మ గుడి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన 'ఐ సపోర్ట్ ట్రాఫిక్ పోలీస్' కార్యక్రమంలో సినీనటి మంచు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ, జయప్రదతో పాటు పలువురిని పరీక్షించారు. 'తాగి వాహనం నడవవద్దని, కుటుంబ సభ్యులు మీ కోసం ఎదురు చూస్తుంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని' మంచు లక్ష్మి అన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ స్ట్రెస్ అనేది పెరిగిపోయిందని...ఆమె అన్నారు.
మరోవైపు కొందరు మందుబాబులు... ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికినా తప్పించుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. బ్రీత్ అనలైజర్‌లోకి గాలి ఊదమంటే రకరకాల డ్రామాలు ప్రదర్శించారు. అయితే ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో పరీక్షించటంతో మందుబాబులు బండారం బయటపడింది. ఎనిమిది బైకులు, ఆరు కార్లను సీజ్ చేశారు.