
జయప్రదకు అజాం ఖాన్ షాక్
అలనాటి అందాల తార, మాజీ ఎంపీ జయప్రదకు పెద్ద షాకే తగిలింది. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లుగా ఆమె పరిస్థితి తయారైంది. చేతి వరకు వచ్చిన ఎమ్మెల్సీ అవకాశం చివరి నిమిషంలో జారిపోయింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా జయప్రద పేరు ఖరారు అయినా లాస్ట్ మినిట్లో యూపీ మంత్రి అజాం ఖాన్ సైంధవుడిలా అడ్డుపడ్డాడు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ..గవర్నర్ కోటా కింద విధాన పరిషత్కు తొమ్మిదిమంది సభ్యుల జాబితాను ఖరారు చేశారు. ఆ లిస్ట్లో జయప్రద పేరు కూడా ఉంది. అయితే అదృష్టం తలుపు తట్టి వస్తే దురదృష్టం తలుపు తన్ని వచ్చినట్లు.. జయప్రద తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు అజాం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించటంతో ఆమెను తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది.
జయప్రదను తిరిగి సమాజ్వాదీలోకి తీసుకునేందుకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా సుముఖంగా ఉన్నా... అజాం ఖాన్ మాత్రం తన మెట్టు దిగలేదు. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు వీల్లేదంటూ భీష్మించటంతో జయప్రదకు ఎదురుగాలి తగలింది. 2009లో లోక్సభ ఎన్నికల్లో జయప్రద అభ్యర్థిత్వాన్ని ఆజాం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా ఆమెను అప్రదిష్ట పాల్జేసేందుకు పలుమార్లు ఆయన ప్రయత్నించాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది.
అప్పట్లో నటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రద ఆ తర్వాత టీడీపీలో చేరారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. అ తర్వాత జాతీయ రాజకీయాలపై ఆమె దృష్టి పెట్టారు. ఎంపీగా సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలిచి, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఆ తర్వాత జయ గాడ్ ఫాదర్ అమర్ సింగ్ ...సమాజ్వాదీ నుంచి విడిపోవటంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొని, ప్రస్తుతం ఆ పార్టీకి ఆమె దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్‌ఎల్డీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
దేశ రాజకీయాల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జయప్రద తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతే కాకుండా అవకాశం ఇస్తే ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్పై పోటీకి సై అంటూ ఫీలర్లు వదిలినా ఆమెను బీజేపీ పట్టించుకోలేదు. దాంతో తిరిగి సమాజ్వాదీ చెంతకు చేరాలని జయప్రద డిసైడ్ అయినా.. వెండితెరపై విలన్లా ఆజాం ఖాన్ అడ్డు పడటం అంటే ఇదేనేమో..