
వృత్తిని దైవంగా భావిస్తామని చాలామంది నటీనటులు చెబుతుంటారు. మరి.. దేవత, దేవుడు పాత్రలు చేసే అవకాశం వస్తే.. ఎంతో నిష్టగా ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. జయప్రద, రమ్యకృష్ణ, రోజా వంటివారు భక్తిరసాత్మక చిత్రాల్లో నటించేటప్పుడు చాలా నియమాలు పాటించేవారు. ‘అన్నమయ్య, నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించేటప్పుడు నాగార్జునతో సహా ఆ చిత్రబృందం షూటింగ్ పరిసరాల్లో పాదరక్షలు వాడలేదు. ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర చేసినప్పుడు నయనతార శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు ‘మూక్కుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రం పూర్తయ్యేవరకూ ఈ బ్యూటీ మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో నయన మామూలు అమ్మాయిగా కనిపించడంతో పాటు అమ్మవారిలా కూడా కనిపిస్తారట. అమ్మవారి పాత్ర చేసేటప్పుడు ఒకపూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారని చిత్రబృందం పేర్కొంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా మారిన బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో బాలాజీ సరసన నయనతార నటించడం లేదు. ఆమెది సినిమాకి కీలకంగా నిలిచే పాత్ర. కన్యాకుమారి అమ్మవారిని ‘మూక్కుత్తి అమ్మన్’ అని పిలుస్తారు. అందుకని కన్యాకుమారి వెళ్లి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అమ్మవారి గుడిలో జరపాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment