ఆత్మవిశ్వాసమే ఆయుధం | Special Story On Women Empowerment Role In Telugu Movies | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసమే ఆయుధం

Published Mon, Oct 7 2019 5:11 AM | Last Updated on Mon, Oct 7 2019 10:35 AM

Special Story On Women Empowerment Role In Telugu Movies - Sakshi

దసరా అంటే శక్తికి ఉత్సవం. చెడును సంహరించిన మంచి శక్తి. చీకటిని చీల్చిన వెలుగు శక్తి. భావోద్వేగాలను జయించిన నిగ్రహ శక్తి. తనను తాను నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసపు శక్తి! అంటే శక్తికి ఆయుధం ఆత్మవిశ్వాసమే.. దసరా సందేశమూ అదే.. స్త్రీకి ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలని!! అలాంటి కథానాయికలను పరిచయం చేసిన కొన్ని సినిమాలు, ఆ శక్తి స్వరూపిణుల గురించి...  ‘ఆయుధ పూజ’ సందర్భంగా..!

అమ్మ కడుపులోంచే ఆడపిల్ల వినమ్రత, అణకువ, త్యాగం అనే పర్యాయ పదాలను జన్మనామాలుగా స్థిరపర్చుకొని ఈ భూమ్మీద పడ్తుంది. వీటన్నిటినీ ‘పరాధీన’ అనే ఒక్క ట్యాగ్‌తో కుదించేయొచ్చు. ఈ ఒక్క ఎలిమెంట్‌తో టన్నుల కొద్దీ సెంటిమెంట్‌ను పండించి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు నాడు.. నేటికి కూడా! ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ అమ్మ, భార్య, అక్క, చెల్లికి కుటుంబం తప్ప ఇంకో ప్రపంచం ఉండకూడదు.. కుటుంబ సేవలో గంధం చెక్కలా అరిగి తరించాలనే సందేశాన్నీ నూరిపోశాయి. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని అహంకారిగా చూపించాయి. సరిగ్గా అలాంటి సమయాల్లోనే ఆ మూస రీళ్లను పెట్టెలో అట్టిపెట్టే కొన్ని భిన్నమైన చిత్రాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు ఆత్మగౌరవం అని చాటే సినిమాలు. వాటిల్లో ముఖ్యమైనవి అంతులేని కథ, ఇది కథ కాదు, న్యాయం కావాలి, 47 రోజులు, కోకిలమ్మ, తలంబ్రాలు.

పనికి గౌరవం
గంపెడు సంతానాన్ని కని.. పోషించలేక  భయంతో తండ్రి పారిపోతే , వ్యసనాలకు బానిసైన అన్న బాధ్యత మరిచిపోతే.. వారి స్థానాన్ని భర్తీ చేసి ఆ ఇంటికి పెద్దగా మారి కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంటుంది ఆత్మాభిమానం గల కూతురు సరిత.. అంతులేని కథ సినిమాలో.  ఆ ఇంట్లో తనకంటూ ఓ ప్రత్యేక గది, ప్రత్యేక హోదాను ఏర్పాటు చేసుకున్న  సరిత ఇంట్లో వాళ్లందరికీ అహంకారిగా కనిపిస్తూంటుంది. కాని ప్రేక్షకులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూస్తారు. కుటుంబానికి ఆర్థిక వనరుగా ఉన్న పురుషుడికి ఎలాంటి హోదానిస్తారో స్త్రీకి అలాంటి హోదానే ఇవ్వాలి అని చాటిన సినిమా.

అందుకే సరిత ఓ పురుషుడిలా తనకు ఓ ప్రత్యేక గదిని, హోదాను తీసుకుంటుంది. ఆర్థిక స్వాతంత్య్రం అంటే వేణ్ణీళ్లకు చన్నీళ్లే కాదు ఇంటిని నడిపించే దిక్కు అని చెప్తుంది. ‘పని నీది ఏటీఎమ్‌ కార్డ్‌ నాది’ అనే పురుష భావనకు చెక్‌ పెడ్తుంది. ఆత్మగౌరవంతో ఇల్లు దాటి ఆత్మవిశ్వాసంతో బయటి ప్రపంచాన్ని నెగ్గుకొచ్చిన తీరును చూపిస్తుంది. శక్తికి ప్రతీకగా నిలబెడుతుంది. ‘అంతులేని కథ’ దర్శకుడు కె. బాలచందర్‌. సరితగా జయప్రద, వ్యసనపరుడైన అన్న మూర్తిగా రజనీకాంత్‌ నటించారు.

సింగిల్‌ మదర్‌
పెళ్లికి ముందు ప్రేమ.. ఏవో కారణాల వల్ల పెళ్లిదాకా రాదు. పెద్దలు కుదిర్చిన వరుడు సుగుణాకర్‌ రావుతో  మూడుముళ్లు వేయించుకుంటుంది సుహాసిని (జయసుధ). మూణ్ణాళ్లలోనే అతనొక శాడిస్ట్‌ అని రుజువవుతుంది. అప్పటికే ఓ బిడ్డ పుడ్తాడు. ఇక భరించలేక విడాకులు తీసుకొని ఒంటరి తల్లిగా కొత్త జీవితం మొదలుపెడ్తుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా! తోడుగా ఆమె అత్తగారూ వస్తుంది. కోడలిని మరో పెళ్లి చేసుకొమ్మని ప్రోత్సహిస్తుంది. సుహాసిని ఆ ప్రయత్నంలో ఉండగా మారిపోయి మంచి మనిషి అయినట్టు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు సుగుణాకర్‌రావు కేవలం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే. తర్వాత ఆ విషయం అర్థమైన సుహాసిని మళ్లీ పెళ్లి జోలికి వెళ్లకుండా బిడ్డను తీసుకొని ఆ ఊరు నుంచి వెళ్లిపోవడానికి రైలు ఎక్కుతుంది. వెంట అత్తగారూ వెళ్తుంది.

కోడలి చంకలోంచి మనవడిని తన భుజమ్మీదికి తీసుకుంటుంది ఆమె బాధ్యతలో సాయపడ్డానికి. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడిని, మగ తోడు లేకుంటే మహిళకు జీవితం లేదు అన్న స్టేట్‌మెంట్‌ను వెక్కిరించిన సినిమా. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం తోడుంటే ఒంటరిగానే కాదు ఒంటరి తల్లిగా కూడా జీవనయానం చేయొచ్చు అని నిరూపించింది.. ‘ఇది కథ కాదు’.  ఇవ్వాళ్టి ఎంతో మంది సింగిల్‌ మదర్స్‌కు  స్ఫూర్తి. అత్తాకోడళ్ల అనుబంధాలకు ప్రేరణ. ‘ఇది కథ కాదు’ చిత్రం.. మహిళకు ఆత్మవిశ్వాసం అవసరాన్ని  ప్రొజెక్ట్‌ చేసిన వాస్తవం.

గుర్తింపుకోసం పోరాటం
ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛ తీర్చుకొని, ఆమెను తల్లిని చేసి ఆ బిడ్డకు తనే తండ్రి అన్న రుజువేంటి అని ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచిన అతని మీద పోరాటం చేసి విజయం సాధించిన ఆమె ఆత్మవిశ్వాసం కథే ‘న్యాయం కావాలి’.  ఇక్కడ విజయం అంటే నయానో భయానో తప్పు ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకోవడం కాదు. ఆత్మవిశ్వాసంతో కోర్టులో నిలబడి అన్ని రకాల పురుషాహంకార పరీక్షలను తిప్పికొట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం. చేసిన తప్పుకి అతను కుంగిపోవడం. ఆమె నా బిడ్డకు తల్లే అని అతని మనసు ఘోష పెట్టడం. పశ్చాత్తాపంతో ఆమె గడప తొక్కి ‘నాకు భార్యగా నీ చేయి అందించు’ అని ఏడ్వడం. చిరునవ్వుతో ఆమె తిరస్కరించి ఆడపిల్ల గౌరవాన్ని కాపాడ్డం.

పందొమ్మిది వందల ఎనభైల్లోనే వచ్చిన ఈ చైతన్యంలో  ‘ఆమె’ భారతిగా రాధిక, ‘అతను’ సురేశ్‌గా చిరంజీవి నటించారు. దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి. ‘కొత్త మలుపు’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్‌. తర్వాత చాన్నాళ్లకు కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘తలంబ్రాలు’ సినిమాదీ ఇంచుమించు ఇలాంటి కథే. ప్రేమించి మోసపోతే ఏడుస్తూ కూర్చోక ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతుంది. అతనికి గుణపాఠం చెప్తుంది. జీవిత, రాజశేఖర్, నందమూరి కళ్యాణచక్రవర్తి నటించారు.

పెళ్లే పరమావధి కాదు
‘47 రోజులు’ సినిమా లైన్‌ ఇది. వైశాలి ఓ పల్లెటూరి అమ్మాయి. ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్న కుమార్‌ ఏరికోరి ఆ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్‌ తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో పై పోర్షన్‌లో ల్యూసీ అనే ఒక అమ్మాయి ఉంటూంటుంది. ‘‘ఆమె ఎవరు?’’ అని అడిగిన వైశాలికి ‘‘ఫ్రెండ్‌’’ అని చెప్తాడు. తన వేలికి కుమార్‌ తొడిగిన వెడ్డింగ్‌ రింగ్‌ను సరిచేసుకుంటూ అతణ్ణి అడుగుతుంది ల్యూసి ‘‘ఆమె ఎవరు?’’ అని వైశాలిని ఉద్దేశించి. ‘‘నా పిచ్చి చెల్లెలు’’ అని చెప్తూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు కుమార్‌.  ల్యూసీకి చెప్పినట్టుగా వైశాలినీ తన పిచ్చి చెల్లెలుగా నటింపచేయడానికి తనలోని శాడిస్ట్‌ను బయటకు తెస్తాడు కుమార్‌. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్రహింసకు గురిచేస్తాడు. ఈలోపే వైశాలి గర్భవతి అవుతుంది.

బండారం ల్యూసీకి తెలియొద్దని నాటు పద్ధతిలో వైశాలికి అబార్షన్‌ చేయించాలనుకుంటాడు. అక్కడే ఉన్న తెలుగు డాక్టర్‌ శంకర్‌ సహాయంతో తప్పించుకుని బయటపడి ఇండియా చేరుకుంటుంది వైశాలి.ఆమె కథను సినిమాగా తీసే క్రమంలో వైశాలిని కలవడానికి వస్తుంది ఆ పాత్ర పోషించనున్న సరిత. ‘‘మళ్లీ పెళ్లెందుకు చేసుకోలేదు మీరు’’ అని ప్రశ్నిస్తుంది సరిత. ‘‘పెళ్లి తప్ప ఆడదాని జీవితానికి ఇంకో అర్థం లేదా?’’ అంటూ అరిచేస్తుంది వైశాలి. అదీ ఆమె ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. అంతేకాదు ఈ సినిమా బ్రేక్‌ చేసిన మరో మూస.. సెంటిమెంట్‌. మోసకారి, శాడిస్ట్‌ భర్తను కాదనుకున్నాక అతని బిడ్డనూ మోయడానికి ఇష్టపడదు ఆమె. మాతృత్వం అనే సోకాల్డ్‌ సెంట్‌మెంట్‌ను పక్కకునెట్టి అబార్షన్‌ చేయించుకుంటుంది. కె. బాలచందర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో వైశాలిగా జయప్రద, కుమార్‌గా చిరంజీవి నటించారు.

వినిపించిన ఉనికి
వినికిడి శక్తిలేని కోకిలమ్మ.. ఒక డొమెస్టిక్‌ వర్కర్‌. తనకున్నదాంట్లో పదిమందికి సహాయం చేయాలనుకునే అనాథ. ఆమె ఉంటున్న దిగువ మధ్యతరగతి వాడలోకి గాయకుడవ్వాలనుకునే యాంబీషియస్‌ కుర్రాడు అద్దెకు వస్తాడు. వినిపించకపోయినా అతని కంఠంలోని హెచ్చుతగ్గుల కదలికల స్పర్శతో అతని పాటకు మంచి విమర్శకురాలిగా మారుతుంది. ఆమె చెప్పినట్టే అతను మంచి గాయకుడవుతాడు. పేరు, డబ్బుకు తగ్గట్టు తన ప్రవర్తననూ మార్చుకుంటాడు. ఆ వాడ వదిలి కలవారింటి అల్లుడవుతాడు. కోకిలమ్మ మనసు గాయపడుతుంది. కన్నీళ్లు రానివ్వకుండా ఆ దుఃఖాన్ని జీవితాన్ని ఈదే శక్తిగా మలచుకుంటుంది.

తన పక్కింట్లోనే ఉంటున్న ఓ అవిటి స్నేహితురాలు భర్తను పోగొట్టుకుంటే ఆమెకు అండగా నిలుస్తుంది. ఆ గాయకుడు తన భార్యతో వెళ్తున్న కారు మొరాయిస్తే చేతుల్లేని తన స్నేహితురాలి సహాయంతో ఆ కారుని తోసి అతణ్ణి ముందుకు నడిపించి తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని వినిపిస్తుంది. ఇవీ.. ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో స్త్రీని శక్తి స్వరూపిణిగా చూపించిన చిత్రాలు. సినిమారంగంలోని  విద్యార్థులకు సిలబస్‌గా స్థిరపడ్డ విజువల్‌ పుస్తకాలు.
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement