jivitha
-
తొలిసారి నెగటివ్ రోల్లో ఒకరు.. ఎమోషనల్ కేరెక్టర్లో మరొకరు.. ఇంకా
ఒకరు నెగటివ్‌గా కనిపించనున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ ఆమెను అలాంటి పాత్రలో చూడలేదు. ఇంకొకరు కన్నీళ్లు తెప్పించే పాత్రతో వచ్చారు.. అలాంటి పాత్రతో వచ్చినందుకు ఆనందభాష్పాలను ఆపుకోలేకపోయారామె. మరొకరు కథానాయికగా కనుమరుగై.. చెల్లెలిగా రిటర్న్ అవుతున్నారు. నటనకు ఒక్కసారి బ్రేక్ ఇచ్చాక మళ్లీ నటించాలంటే ఆ క్యారెక్టర్ ఎంతో బలమైనది అయ్యుంటేనే ఆ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. జయా బచ్చన్, షర్మిలా ఠాగూర్, జీవితలకు అలాంటి పాత్రలే దొరికాయి. అందుకే బ్రేక్‌లు తీశారు.. నటిగా మేకప్ వేసుకున్నారు. ఒక్కప్పటి ఈ స్టార్స్ రిటర్న్ కావడం అభిమానులకు ఆనందమే కదా. ఇక ఈ ముగ్గురి చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నెగటివ్‌గా... జయా బచ్చన్ కెరీర్ దాదాపు 60 ఏళ్లు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో నటిగా ఎన్నో అద్భుత పాత్రలు చేశారామె. కెరీర్ ఆరంభంలో ‘గుడ్డి’ (1971)లో చేసిన పాత్రతో ‘గర్ల్ నెక్ట్స్ డోర్’ ఇమేజ్ తెచ్చుకున్న జయ ఆ తర్వాత ‘జవానీ దివానీ’లో గ్లామరస్ రోల్లో మెప్పించారు. అలాగే అనామిక (1973)లో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేసి, భేష్ అనిపించుకున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో జయ పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో లేడీ విలన్‌గా కనిపించనున్నారామె. దాదాపు ఏడేళ్ల తర్వాత జయా బచ్చన్ ఒప్పుకున్న చిత్రం ఇది. కరణ్ జోహార్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయా బచ్చన్‌తో కరణ్ నెగటివ్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ‘‘నేనా? నన్నే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు?’ అని ఆమె అడిగారు... ‘మీరే చేయాలి’ అంటూ జయాని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కరణ్. ఫైనల్‌గా ‘ఓకే’ అన్నారామె. అయితే ఈ పాత్రని అర్థం చేసుకుని, ఒక క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిలా నటించడానికి జయ కొన్నాళ్లు ఇబ్బందిపడ్డారట. ఆ తర్వాత పూర్తిగా ఆ పాత్రలోకి లీనం కాగలిగారని, నెగటివ్ క్యారెక్టర్ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా రూపొందిన ఈ చిత్రం జులై 28న విడుదల కానుంది. పుష్కర కాలం తర్వాత... పుష్కర కాలం తర్వాత షర్మిలా ఠాగూర్ ఓ సినిమా చేశారు. ఈ నెల 3న విడుదలైన ‘గుల్మోహార్’లో ఆమె ఇంటి పెద్దగా లీడ్ రోల్ చేశారు. గుల్ మోహార్ అనే తమ ఇంటిని అమ్మేసి, తాను వేరే రాష్ట్రానికి వెళతానని ఇంటి పెద్ద కుసుమ్ బాత్రా (షర్మిలా ఠాగూర్ పాత్ర) చెబుతారు. అప్పుడు ఆ కుటుంబ సభ్యుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘బ్రేక్ కే బాద్’ (2010) సినిమా తర్వాత మళ్లీ మంచి పాత్రలు వచ్చేంతవరకూ బ్రేక్ తీసుకోవాలనుకున్నారు షర్మిలా. ‘గుల్మోహార్’లో తన పాత్ర కీలకం కావడంతో పాటు మంచి ఎమోషన్స్ కనబరిచే చాన్స్ ఉన్నందున ఆమె అంగీకరించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసి, షర్మిలా ఏడుపు ఆపుకోలేకపోయారు. ‘‘పన్నెండేళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో తెరపై కనిపించడంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. ఈ సినిమాని మూడుసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ ఏడ్చాను. అంతగా ఈ పాత్రతో కనెక్ట్ అయ్యాను’’ అని షర్మిలా పేర్కొన్నారు. చెల్లెలిగా... కథానాయికగా గర్ల్ నెక్ట్స్ డోర్ అనదగ్గ పాత్రల్లో కనిపించారు జీవిత. ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో మంచి నటి అనిపించుకున్నారామె. ‘మగాడు’ (1990) తర్వాత నటిగా వేరే సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’లో నటించడానికి జీవిత ఒప్పుకున్నారు. ఇందులో ఆమెది రజనీ చెల్లెలి పాత్ర. ‘‘నా కెరీర్లో రజనీ సార్‌తో సినిమా చేయలేదు. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి కొంత టైమ్ తీసుకున్నాను. ‘మీరు స్క్రీన్‌పై కనిపించి చాలా రోజులైంది కాబట్టి.. చేస్తే బాగుంటుంది’ అని ఐశ్వర్య అనడం, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఓకే చెప్పాను’’ అని పేర్కొన్నారు జీవిత. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె కనిపించనున్న చిత్రం ఇది. కాగా నటిగా ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా ‘గడ్డం గ్యాంగ్, దెయ్యం’ వంటి చిత్రాలను నిర్మించారు. గత ఏడాది ‘శేఖర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు జీవిత. -
కథా బలం ఉన్న సినిమాలు హిట్టే
‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ట్రైలర్ చూస్తుంటే మంచి సందేశాత్మక చిత్రమని తెలుస్తోంది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. అందరూ బాగా నటించారు’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. సంజయ్ ఇదామ, శ్రీనాథ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా జె.కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సినిమా పాటల విడుదల వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి దగ్గర పనిచేసిన కరుణ కుమార్ ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. యాజమాన్య పాటలు బాగున్నాయి. కథా బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో కథతో పాటు సందేశం ఉన్నందున తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో విద్యార్థుల గురించి ఒక మంచి సందేశం ఉంది. ప్రతి తల్లిదండ్రులు, విద్యార్థులు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటి జీవిత. ‘‘ఈ చిత్రం నాకు నచ్చింది.. అందుకే స్వయంగా విడుదల చేస్తున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. ‘‘తెలుగులో నేను తీసిన మూడో సినిమా ఇది. డబ్బు వస్తుందా?లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉంది’’ అన్నారు బి.ఓబుల్ సుబ్బారెడ్డి. ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
మా సంతోషం కోసం...
కలిసి కూర్చుంటే మాటలు కలుస్తాయి. కూర్చొని మాట్లాడుకుంటే అపోహలు విడిపోతాయి. కలిసి కూర్చొని, మాట్లాడుకుంటూ.. భోజనాలు చేస్తే.. అదొక ఫ్యామిలీ ఫంక్షన్ అవుతుంది. జీవిత ‘మా’ సభ్యులందరినీ కార్తీక భోజనాలకు పిలుస్తున్నారు. ఆ విశేషాలను మనతో పంచుకున్నారు. వన భోజనాల ఏర్పాట్లతో హడావుడిగా ఉన్నారని తెలిసింది... జీవిత: ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కోసం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ‘మా’ తరఫున వన భోజనాలు ఏర్పాటు చేసేవారు. అప్పుడు ఎప్పుడో చిరంజీవిగారి చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ‘మా’ నుంచి చేయలేదు. ఇప్పుడు కూడా ‘మా’లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ‘మా’ ఆధ్వర్యంలో కాకుండా మేం పర్సనల్‌గా చేస్తున్నాం. వచ్చే ఏడాది తప్పకుండా ‘మా’ నుంచి చేసే ప్రయత్నాలు చేస్తాం. అంటే.. ఇప్పుడు జరిగేది ‘మా’ తరఫున కాదు. జీవితా రాజశేఖర్ తరఫున అంటారా? అవును. మా సంతోషం కోసం చేస్తున్నాం. వేదిక ఎక్కడ? ఫీనిక్స్‌లో ప్లాన్ చేస్తున్నాం. 300 నుంచి 400 మంది వస్తారని ఊహిస్తున్నాం. ‘మా’ అంటే నటీనటుల సంఘం మాత్రమే. మరి.. మిగతా శాఖల వాళ్లని కూడా పిలుస్తున్నారా? లేదు. ‘మా’ సభ్యులనే అనుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఎవర్నీ పిలవకూడదు అనుకుంటున్నాం. ఇలా మీరు నిర్వహించడంవల్ల ఏదైనా వివాదాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఎటువంటి వివాదాలు రావనే భావిస్తున్నాం. రాబోయే నెల రోజుల్లో ‘మా’లో ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటాం. ప్రస్తుతానికి పరిష్కరించి, ఆ తర్వాత వన భోజనాలు ఏర్పాటు చేసేంత టైమ్ లేదు. కార్తీక మాసం వచ్చే వారంతో అయిపోతుంది కాబట్టి.. ఇది ప్లాన్ చేశాం. వనభోజనాలను మీరు హోస్ట్ చేయబోతున్నారని తెలిసి ‘మా’ మెంబర్స్ ఏమన్నారు? చాలామంది ఉత్సాహం చూపించారు. ఈ మధ్య కాలంలో ఎవరూ చేయలేదు. చాలా విరామం తర్వాత మీరు చేయబోతున్నారని హ్యాపీగా స్పందిస్తున్నారు. ఎటువంటి వంటకాలను ప్లాన్ చేశారు? ఇంకా ఏం అనుకోలేదు. ఆదివారం వెళ్లి వంట విభాగానికి చెందిన వారితో చేయబోయే వంటకాల గురించి చర్చించాలి. ఈ విందులో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారా? లైవ్ మ్యూజిక్ పెట్టాలనుకున్నాం. ఇంకా కొన్ని స్కిట్స్, గేమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వచ్చినవాళ్లందరూ బాగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఉంటుంది. నాలుగు వందల మంది అతిథులంటే మీకు చేతి నిండా పనే.. (నవ్వుతూ) చేస్తున్నది మేం అయినప్పటికి అందరూ సహాయం చేస్తారు. అలా అందరితో కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటున్నాం. మీ కుమార్తెల విషయానికి వస్తే.. శివానీ, శివాత్మిక అని పేర్లు పెట్టారు. మీరు శివ భక్తులా? రాజశేఖర్‌గారు శివభక్తులు. ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం. రాజశేఖర్‌గారి మెడలో శివలింగం ఉంటుంది. శివభక్తి వల్లే మా కుమార్తెలకు శివానీ, శివాత్మిక అని పేర్లు పెట్టాం. కార్తీకమాసంలో మీరు పూజలు చేస్తారా? జనరల్‌గా కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తారు. నేనూ వెలిగిస్తాను. కానీ పెద్దగా పూజలు చేయను. రాజశేఖర్, మీ కుమార్తెల సినిమాల గురించి? రాజశేఖర్‌గారు హీరోగా చేయబోతున్న సినిమా జనవరిలో మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతా. ‘పెళ్ళిగోల’ వెబ్ సిరీస్ చేసిన మల్లిక్ దర్శకత్వంలో శివానీ హీరోయిన్గా ఓ సినిమా జరుగుతోంది. చైల్డ్ ఆర్టిస్టు తేజ హీరోగా నటిస్తున్నారు. ‘అద్భుతం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రచయిత. మంచి కథ. శివానిది మంచి పాత్ర. -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
దసరా అంటే శక్తికి ఉత్సవం. చెడును సంహరించిన మంచి శక్తి. చీకటిని చీల్చిన వెలుగు శక్తి. భావోద్వేగాలను జయించిన నిగ్రహ శక్తి. తనను తాను నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసపు శక్తి! అంటే శక్తికి ఆయుధం ఆత్మవిశ్వాసమే.. దసరా సందేశమూ అదే.. స్త్రీకి ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలని!! అలాంటి కథానాయికలను పరిచయం చేసిన కొన్ని సినిమాలు, ఆ శక్తి స్వరూపిణుల గురించి... ‘ఆయుధ పూజ’ సందర్భంగా..! అమ్మ కడుపులోంచే ఆడపిల్ల వినమ్రత, అణకువ, త్యాగం అనే పర్యాయ పదాలను జన్మనామాలుగా స్థిరపర్చుకొని ఈ భూమ్మీద పడ్తుంది. వీటన్నిటినీ ‘పరాధీన’ అనే ఒక్క ట్యాగ్‌తో కుదించేయొచ్చు. ఈ ఒక్క ఎలిమెంట్‌తో టన్నుల కొద్దీ సెంటిమెంట్‌ను పండించి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు నాడు.. నేటికి కూడా! ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ అమ్మ, భార్య, అక్క, చెల్లికి కుటుంబం తప్ప ఇంకో ప్రపంచం ఉండకూడదు.. కుటుంబ సేవలో గంధం చెక్కలా అరిగి తరించాలనే సందేశాన్నీ నూరిపోశాయి. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని అహంకారిగా చూపించాయి. సరిగ్గా అలాంటి సమయాల్లోనే ఆ మూస రీళ్లను పెట్టెలో అట్టిపెట్టే కొన్ని భిన్నమైన చిత్రాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు ఆత్మగౌరవం అని చాటే సినిమాలు. వాటిల్లో ముఖ్యమైనవి అంతులేని కథ, ఇది కథ కాదు, న్యాయం కావాలి, 47 రోజులు, కోకిలమ్మ, తలంబ్రాలు. పనికి గౌరవం గంపెడు సంతానాన్ని కని.. పోషించలేక భయంతో తండ్రి పారిపోతే , వ్యసనాలకు బానిసైన అన్న బాధ్యత మరిచిపోతే.. వారి స్థానాన్ని భర్తీ చేసి ఆ ఇంటికి పెద్దగా మారి కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంటుంది ఆత్మాభిమానం గల కూతురు సరిత.. అంతులేని కథ సినిమాలో. ఆ ఇంట్లో తనకంటూ ఓ ప్రత్యేక గది, ప్రత్యేక హోదాను ఏర్పాటు చేసుకున్న సరిత ఇంట్లో వాళ్లందరికీ అహంకారిగా కనిపిస్తూంటుంది. కాని ప్రేక్షకులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూస్తారు. కుటుంబానికి ఆర్థిక వనరుగా ఉన్న పురుషుడికి ఎలాంటి హోదానిస్తారో స్త్రీకి అలాంటి హోదానే ఇవ్వాలి అని చాటిన సినిమా. అందుకే సరిత ఓ పురుషుడిలా తనకు ఓ ప్రత్యేక గదిని, హోదాను తీసుకుంటుంది. ఆర్థిక స్వాతంత్య్రం అంటే వేణ్ణీళ్లకు చన్నీళ్లే కాదు ఇంటిని నడిపించే దిక్కు అని చెప్తుంది. ‘పని నీది ఏటీఎమ్ కార్డ్ నాది’ అనే పురుష భావనకు చెక్ పెడ్తుంది. ఆత్మగౌరవంతో ఇల్లు దాటి ఆత్మవిశ్వాసంతో బయటి ప్రపంచాన్ని నెగ్గుకొచ్చిన తీరును చూపిస్తుంది. శక్తికి ప్రతీకగా నిలబెడుతుంది. ‘అంతులేని కథ’ దర్శకుడు కె. బాలచందర్. సరితగా జయప్రద, వ్యసనపరుడైన అన్న మూర్తిగా రజనీకాంత్ నటించారు. సింగిల్ మదర్ పెళ్లికి ముందు ప్రేమ.. ఏవో కారణాల వల్ల పెళ్లిదాకా రాదు. పెద్దలు కుదిర్చిన వరుడు సుగుణాకర్ రావుతో మూడుముళ్లు వేయించుకుంటుంది సుహాసిని (జయసుధ). మూణ్ణాళ్లలోనే అతనొక శాడిస్ట్ అని రుజువవుతుంది. అప్పటికే ఓ బిడ్డ పుడ్తాడు. ఇక భరించలేక విడాకులు తీసుకొని ఒంటరి తల్లిగా కొత్త జీవితం మొదలుపెడ్తుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా! తోడుగా ఆమె అత్తగారూ వస్తుంది. కోడలిని మరో పెళ్లి చేసుకొమ్మని ప్రోత్సహిస్తుంది. సుహాసిని ఆ ప్రయత్నంలో ఉండగా మారిపోయి మంచి మనిషి అయినట్టు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు సుగుణాకర్‌రావు కేవలం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే. తర్వాత ఆ విషయం అర్థమైన సుహాసిని మళ్లీ పెళ్లి జోలికి వెళ్లకుండా బిడ్డను తీసుకొని ఆ ఊరు నుంచి వెళ్లిపోవడానికి రైలు ఎక్కుతుంది. వెంట అత్తగారూ వెళ్తుంది. కోడలి చంకలోంచి మనవడిని తన భుజమ్మీదికి తీసుకుంటుంది ఆమె బాధ్యతలో సాయపడ్డానికి. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడిని, మగ తోడు లేకుంటే మహిళకు జీవితం లేదు అన్న స్టేట్మెంట్ను వెక్కిరించిన సినిమా. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం తోడుంటే ఒంటరిగానే కాదు ఒంటరి తల్లిగా కూడా జీవనయానం చేయొచ్చు అని నిరూపించింది.. ‘ఇది కథ కాదు’. ఇవ్వాళ్టి ఎంతో మంది సింగిల్ మదర్స్‌కు స్ఫూర్తి. అత్తాకోడళ్ల అనుబంధాలకు ప్రేరణ. ‘ఇది కథ కాదు’ చిత్రం.. మహిళకు ఆత్మవిశ్వాసం అవసరాన్ని ప్రొజెక్ట్ చేసిన వాస్తవం. గుర్తింపుకోసం పోరాటం ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛ తీర్చుకొని, ఆమెను తల్లిని చేసి ఆ బిడ్డకు తనే తండ్రి అన్న రుజువేంటి అని ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచిన అతని మీద పోరాటం చేసి విజయం సాధించిన ఆమె ఆత్మవిశ్వాసం కథే ‘న్యాయం కావాలి’. ఇక్కడ విజయం అంటే నయానో భయానో తప్పు ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకోవడం కాదు. ఆత్మవిశ్వాసంతో కోర్టులో నిలబడి అన్ని రకాల పురుషాహంకార పరీక్షలను తిప్పికొట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం. చేసిన తప్పుకి అతను కుంగిపోవడం. ఆమె నా బిడ్డకు తల్లే అని అతని మనసు ఘోష పెట్టడం. పశ్చాత్తాపంతో ఆమె గడప తొక్కి ‘నాకు భార్యగా నీ చేయి అందించు’ అని ఏడ్వడం. చిరునవ్వుతో ఆమె తిరస్కరించి ఆడపిల్ల గౌరవాన్ని కాపాడ్డం. పందొమ్మిది వందల ఎనభైల్లోనే వచ్చిన ఈ చైతన్యంలో ‘ఆమె’ భారతిగా రాధిక, ‘అతను’ సురేశ్‌గా చిరంజీవి నటించారు. దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి. ‘కొత్త మలుపు’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్. తర్వాత చాన్నాళ్లకు కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘తలంబ్రాలు’ సినిమాదీ ఇంచుమించు ఇలాంటి కథే. ప్రేమించి మోసపోతే ఏడుస్తూ కూర్చోక ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతుంది. అతనికి గుణపాఠం చెప్తుంది. జీవిత, రాజశేఖర్, నందమూరి కళ్యాణచక్రవర్తి నటించారు. పెళ్లే పరమావధి కాదు ‘47 రోజులు’ సినిమా లైన్ ఇది. వైశాలి ఓ పల్లెటూరి అమ్మాయి. ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్న కుమార్ ఏరికోరి ఆ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్ తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో పై పోర్షన్లో ల్యూసీ అనే ఒక అమ్మాయి ఉంటూంటుంది. ‘‘ఆమె ఎవరు?’’ అని అడిగిన వైశాలికి ‘‘ఫ్రెండ్’’ అని చెప్తాడు. తన వేలికి కుమార్ తొడిగిన వెడ్డింగ్ రింగ్‌ను సరిచేసుకుంటూ అతణ్ణి అడుగుతుంది ల్యూసి ‘‘ఆమె ఎవరు?’’ అని వైశాలిని ఉద్దేశించి. ‘‘నా పిచ్చి చెల్లెలు’’ అని చెప్తూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు కుమార్. ల్యూసీకి చెప్పినట్టుగా వైశాలినీ తన పిచ్చి చెల్లెలుగా నటింపచేయడానికి తనలోని శాడిస్ట్‌ను బయటకు తెస్తాడు కుమార్. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్రహింసకు గురిచేస్తాడు. ఈలోపే వైశాలి గర్భవతి అవుతుంది. బండారం ల్యూసీకి తెలియొద్దని నాటు పద్ధతిలో వైశాలికి అబార్షన్ చేయించాలనుకుంటాడు. అక్కడే ఉన్న తెలుగు డాక్టర్ శంకర్ సహాయంతో తప్పించుకుని బయటపడి ఇండియా చేరుకుంటుంది వైశాలి.ఆమె కథను సినిమాగా తీసే క్రమంలో వైశాలిని కలవడానికి వస్తుంది ఆ పాత్ర పోషించనున్న సరిత. ‘‘మళ్లీ పెళ్లెందుకు చేసుకోలేదు మీరు’’ అని ప్రశ్నిస్తుంది సరిత. ‘‘పెళ్లి తప్ప ఆడదాని జీవితానికి ఇంకో అర్థం లేదా?’’ అంటూ అరిచేస్తుంది వైశాలి. అదీ ఆమె ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. అంతేకాదు ఈ సినిమా బ్రేక్ చేసిన మరో మూస.. సెంటిమెంట్. మోసకారి, శాడిస్ట్ భర్తను కాదనుకున్నాక అతని బిడ్డనూ మోయడానికి ఇష్టపడదు ఆమె. మాతృత్వం అనే సోకాల్డ్ సెంట్మెంట్ను పక్కకునెట్టి అబార్షన్ చేయించుకుంటుంది. కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైశాలిగా జయప్రద, కుమార్‌గా చిరంజీవి నటించారు. వినిపించిన ఉనికి వినికిడి శక్తిలేని కోకిలమ్మ.. ఒక డొమెస్టిక్ వర్కర్. తనకున్నదాంట్లో పదిమందికి సహాయం చేయాలనుకునే అనాథ. ఆమె ఉంటున్న దిగువ మధ్యతరగతి వాడలోకి గాయకుడవ్వాలనుకునే యాంబీషియస్ కుర్రాడు అద్దెకు వస్తాడు. వినిపించకపోయినా అతని కంఠంలోని హెచ్చుతగ్గుల కదలికల స్పర్శతో అతని పాటకు మంచి విమర్శకురాలిగా మారుతుంది. ఆమె చెప్పినట్టే అతను మంచి గాయకుడవుతాడు. పేరు, డబ్బుకు తగ్గట్టు తన ప్రవర్తననూ మార్చుకుంటాడు. ఆ వాడ వదిలి కలవారింటి అల్లుడవుతాడు. కోకిలమ్మ మనసు గాయపడుతుంది. కన్నీళ్లు రానివ్వకుండా ఆ దుఃఖాన్ని జీవితాన్ని ఈదే శక్తిగా మలచుకుంటుంది. తన పక్కింట్లోనే ఉంటున్న ఓ అవిటి స్నేహితురాలు భర్తను పోగొట్టుకుంటే ఆమెకు అండగా నిలుస్తుంది. ఆ గాయకుడు తన భార్యతో వెళ్తున్న కారు మొరాయిస్తే చేతుల్లేని తన స్నేహితురాలి సహాయంతో ఆ కారుని తోసి అతణ్ణి ముందుకు నడిపించి తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని వినిపిస్తుంది. ఇవీ.. ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో స్త్రీని శక్తి స్వరూపిణిగా చూపించిన చిత్రాలు. సినిమారంగంలోని విద్యార్థులకు సిలబస్‌గా స్థిరపడ్డ విజువల్ పుస్తకాలు. – సరస్వతి రమ -
జీవిత ఇచ్చిన గిఫ్ట్ గరుడవేగ – రాజశేఖర్
‘‘గరుడవేగ’ సినిమా కథని ప్రవీణ్‌గారు ఏ ముహూర్తంలో రాశారో కానీ, నా కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ‘అంకుశం’ కంటే ఈ చిత్రం పెద్ద సక్సెస్. అందుకు ప్రవీణ్‌గారికి కృతజ్ఞతలు’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్, పూజా కుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ ఇటీవల విడుదలై హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘జీవిత వల్లనే ‘గరుడవేగ’ పూర్తయింది. తను ఈ సినిమాను నాకు గిఫ్ట్‌లా ఇచ్చారని చెప్పొచ్చు. మా సినిమాను చూసి అభినందించిన చిరంజీవిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ విడుదలైన తొలి ఆట నుంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అదే రోజు సాయంత్రానికి సక్సెస్ రేంజ్ మాకు అర్థమైపోయింది. హాలీవుడ్ సినిమాలా ఉందని కొందరు, సరికొత్త రాజశేఖర్‌ని చూశామని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు తమదిగా భావించారు. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అమెరికాలోనూ వసూళ్లు ఇక్కడిలాగా బాగున్నాయి’’ అన్నారు. ‘‘మానవత్వం చాలా తక్కువమందిలో ఉంటుంది. అటువంటి వారిలో ప్రవీణ్ ఒక్కరు. తనకు థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే. బాలకృష్ణగారు, రానా, తాప్సీ, కాజల్, మంచు లక్ష్మి ప్రమోషన్‌కి సహకరించారు. చిరంజీవిగారు, మహేశ్‌గారు, రాజమౌళిగారితో పాటు ఇండస్ట్రీ అంతా సినిమా హిట్ అయినందుకు అభినందించారు. వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు జీవిత. -
పాతనోట్ల కలకలం: నటి జీవిత స్పందన
హైదరాబాద్: నగరంలో గురువారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రీనివాసరావు తమకు సన్నిహితుడంటూ వచ్చిన వార్తలపై నటి జీవిత స్పందించారు. పాత నోట్లతో దొరికిపోయిన శ్రీనివాసరావు తన కార్యాలయంతోపాటు ఇతరుల వద్ద కూడా పనిచేస్తున్నారని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మీడియాకు తెలిపారు. ఫిలింనగర్‌లోని శ్రీనివాస ప్రొడక్షన్ కార్యాలయంలో రూ. 7 కోట్ల విలువైన పాత నోట్లు దొరికాయి. ఈ వ్యవహారంలో శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ శ్రీనివాసరావు తన తమ్ముడని మీడియాలో వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. శ్రీనివాసరావు తన తమ్ముడు కాదని, తన తమ్ముడు మురళీ శ్రీనివాస్ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె తెలిపారు. అరెస్టైన శ్రీనివాసరావు తమ ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్న మాట వాస్తవమేనని, అయితే, అతను తమ ఆఫీసుతోపాటు మరో నాలుగైదు ఆఫీసులలోనూ పనిచేస్తున్నాడని, తన వద్ద అతనితోపాటు మరో నలుగురు మేనేజర్లు పనిచేస్తున్నారని చెప్పారు. తమ కార్యాలయం ఉన్న భవనంలోనే శ్రీనివాసరావు ఆఫీసు ఉందని, అయితే, తమ కార్యాలయం పేరు జోత్స్న ప్రొడక్షన్ అని, ప్రస్తుతం ‘గరుడవేగ’ సినిమాను ఈ ప్రొడక్షనే తీస్తున్నదని చెప్పారు. పాతనోట్ల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనకు పోలీసుల నుంచి ఎలాంటి కాల్ రాలేదని చెప్పారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం ఉందని ఎవరు చెప్పారో చెప్పాలని ఆమె మీడియాను ప్రశ్నించారు. అరెస్టయిన శ్రీనివాసరావుతో తన తమ్ముడికి కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. -
హీరోయిన్గా మరో వారసురాలు..
సినీరంగానికి మరో నట వారసురాలు సిద్ధం అవుతోంది. హీరో రాజశేఖర్, జీవిత దంపతుల వారసురాలు శివానిని నాయకిగా తెరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. రాజశేఖర్, జీవిత ఇద్దరు కూతుళ్లలో శివాని పెద్దది. ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ కార్యక్రమాల్లో చూసిన దర్శక నిర్మాతలు చాలామంది హీరోయిన్గా చేయమని అడిగినా ఇప్పడే కాదు చదువు పూర్తి చేయాలంటూ వాయిదా వేస్తూ వచ్చారు ఆమె తల్లిదండ్రులు. తాజాగా రాజశేఖర్, జీవిత తమ వారసురాలిని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇటీవల శివానిని వివిధ గెటప్‌లలో ఫొటో సెషన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రాజశేఖరే స్వయంగా ఆమె కోసం కథలు వింటున్నారట. మొత్తం మీద శివాని సినీ తెరంగేట్రానికి రంగం సిద్ధం అవుతోందన్నమాట. అయితే ఈ అమ్మడు తొలి చిత్రం తెలుగు అవుతుందా? తమిళం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అదే విధంగా నట వారసురాళ్లు తెరంగేట్రం సులభమే. ఆ తరువాత నిలదొక్కుకోవడం అన్నది వారి ప్రతిభ, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. మరి శివాని అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
తాజ్‌కృష్ణాలో జీవిత సందడి
సాక్షి,హైదరాబాద్: ఆభరణాలు ధరించినవారికి రిచ్‌లుక్ తెస్తాయి. కొన్ని మాత్రం దానికి రాయల్ లుక్‌ని కూడా జోడిస్తాయి. అలాంటి రాజసాన్ని ఒలికించే ప్రత్యేకమైన ఆభరణాల ప్రదర్శన బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో శుక్రవారం ఏర్పాౖటెంది. ఈ ప్రదర్శనను సినీ ప్రముఖురాలు జీవిత సహా పలువురు నగర ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సంస్థ జైపూర్ జ్యుయల్స్ ప్రతినిధి, డిజైనర్ అపర్ణా సుంకు మాట్లాడుతూ రాజుల కాలం నాటి ఆభరణ శైలుల నుంచి స్ఫూర్తి పొంది వాటికి ఆధునికతను జోడించి అద్భుతంగా తీర్చిదిద్దిన ఆభరణాలను తాము ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ప్రదర్శన 3 రోజల పాటు కొనసాగుతుందన్నారు.