కలిసి కూర్చుంటే మాటలు కలుస్తాయి. కూర్చొని మాట్లాడుకుంటే అపోహలు విడిపోతాయి. కలిసి కూర్చొని, మాట్లాడుకుంటూ.. భోజనాలు చేస్తే.. అదొక ఫ్యామిలీ ఫంక్షన్ అవుతుంది. జీవిత ‘మా’ సభ్యులందరినీ కార్తీక భోజనాలకు పిలుస్తున్నారు. ఆ విశేషాలను మనతో పంచుకున్నారు.
వన భోజనాల ఏర్పాట్లతో హడావుడిగా ఉన్నారని తెలిసింది...
జీవిత: ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కోసం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ‘మా’ తరఫున వన భోజనాలు ఏర్పాటు చేసేవారు. అప్పుడు ఎప్పుడో చిరంజీవిగారి చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ‘మా’ నుంచి చేయలేదు. ఇప్పుడు కూడా ‘మా’లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ‘మా’ ఆధ్వర్యంలో కాకుండా మేం పర్సనల్‌గా చేస్తున్నాం. వచ్చే ఏడాది తప్పకుండా ‘మా’ నుంచి చేసే ప్రయత్నాలు చేస్తాం.
అంటే.. ఇప్పుడు జరిగేది ‘మా’ తరఫున కాదు. జీవితా రాజశేఖర్ తరఫున అంటారా?
అవును. మా సంతోషం కోసం చేస్తున్నాం.
వేదిక ఎక్కడ?
ఫీనిక్స్‌లో ప్లాన్ చేస్తున్నాం. 300 నుంచి 400 మంది వస్తారని ఊహిస్తున్నాం.
‘మా’ అంటే నటీనటుల సంఘం మాత్రమే. మరి.. మిగతా శాఖల వాళ్లని కూడా పిలుస్తున్నారా?
లేదు. ‘మా’ సభ్యులనే అనుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఎవర్నీ పిలవకూడదు అనుకుంటున్నాం.
ఇలా మీరు నిర్వహించడంవల్ల ఏదైనా వివాదాలు వచ్చే అవకాశం ఉందంటారా?
ఎటువంటి వివాదాలు రావనే భావిస్తున్నాం. రాబోయే నెల రోజుల్లో ‘మా’లో ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటాం. ప్రస్తుతానికి పరిష్కరించి, ఆ తర్వాత వన భోజనాలు ఏర్పాటు చేసేంత టైమ్ లేదు. కార్తీక మాసం వచ్చే వారంతో అయిపోతుంది కాబట్టి.. ఇది ప్లాన్ చేశాం.
వనభోజనాలను మీరు హోస్ట్ చేయబోతున్నారని తెలిసి ‘మా’ మెంబర్స్ ఏమన్నారు?
చాలామంది ఉత్సాహం చూపించారు. ఈ మధ్య కాలంలో ఎవరూ చేయలేదు. చాలా విరామం తర్వాత మీరు చేయబోతున్నారని హ్యాపీగా స్పందిస్తున్నారు.
ఎటువంటి వంటకాలను ప్లాన్ చేశారు?
ఇంకా ఏం అనుకోలేదు. ఆదివారం వెళ్లి వంట విభాగానికి చెందిన వారితో చేయబోయే వంటకాల గురించి చర్చించాలి.
ఈ విందులో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేశారా?
లైవ్ మ్యూజిక్ పెట్టాలనుకున్నాం. ఇంకా కొన్ని స్కిట్స్, గేమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వచ్చినవాళ్లందరూ బాగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఉంటుంది.
నాలుగు వందల మంది అతిథులంటే మీకు చేతి నిండా పనే..
(నవ్వుతూ) చేస్తున్నది మేం అయినప్పటికి అందరూ సహాయం చేస్తారు. అలా అందరితో కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటున్నాం.
మీ కుమార్తెల విషయానికి వస్తే.. శివానీ, శివాత్మిక అని పేర్లు పెట్టారు. మీరు శివ భక్తులా?
రాజశేఖర్‌గారు శివభక్తులు. ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం. రాజశేఖర్‌గారి మెడలో శివలింగం ఉంటుంది. శివభక్తి వల్లే మా కుమార్తెలకు శివానీ, శివాత్మిక అని పేర్లు పెట్టాం.
కార్తీకమాసంలో మీరు పూజలు చేస్తారా?
జనరల్‌గా కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తారు. నేనూ వెలిగిస్తాను. కానీ పెద్దగా పూజలు చేయను.
రాజశేఖర్, మీ కుమార్తెల సినిమాల గురించి?
రాజశేఖర్‌గారు హీరోగా చేయబోతున్న సినిమా జనవరిలో మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతా. ‘పెళ్ళిగోల’ వెబ్ సిరీస్ చేసిన మల్లిక్ దర్శకత్వంలో శివానీ హీరోయిన్‌గా ఓ సినిమా జరుగుతోంది. చైల్డ్ ఆర్టిస్టు తేజ హీరోగా నటిస్తున్నారు. ‘అద్భుతం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రచయిత. మంచి కథ. శివానిది మంచి పాత్ర.
Comments
Please login to add a commentAdd a comment