‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ట్రైలర్ చూస్తుంటే మంచి సందేశాత్మక చిత్రమని తెలుస్తోంది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. అందరూ బాగా నటించారు’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. సంజయ్ ఇదామ, శ్రీనాథ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా జె.కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సినిమా పాటల విడుదల వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి దగ్గర పనిచేసిన కరుణ కుమార్ ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. యాజమాన్య పాటలు బాగున్నాయి. కథా బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో కథతో పాటు సందేశం ఉన్నందున తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో విద్యార్థుల గురించి ఒక మంచి సందేశం ఉంది. ప్రతి తల్లిదండ్రులు, విద్యార్థులు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటి జీవిత. ‘‘ఈ చిత్రం నాకు నచ్చింది.. అందుకే స్వయంగా విడుదల చేస్తున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. ‘‘తెలుగులో నేను తీసిన మూడో సినిమా ఇది. డబ్బు వస్తుందా?లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉంది’’ అన్నారు బి.ఓబుల్ సుబ్బారెడ్డి. ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment